Menu Close
Page Title

"ధర్మోరక్షతి రక్షితః"

అన్నది ఆర్ష వాక్కు. 'ధర్మాన్ని మనం కాపు కాస్తే అది మనని అవసరమైనప్పుడు ఆదుకుంటుంద'న్నది దాని భావం. మనకు కష్టాలు రానంత కాలం మనం శ్రద్ధ పెట్టకుండానే దాని రక్షణ జరిగిపోతుంటుంది. కష్టం దాపురిస్తే దేముణ్ణి ప్రార్ధించి గట్టెక్కించమని కోరుకోవడం మనకి పరిపాటి. ఇంకా తీరకపోతే ధర్మం దారిన దాన్ని వదిలేసి మనము అడ్డదారులు తొక్కుతూ పోవడం, అప్పటికీ తీరకపోతే మనకు కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో వాటికి ఎంతో కొంత బాధ్యులనుకుంటున్న వారిని/వాటిని మనము దూషించడము పరిపాటి. దూషించడానికి ఎదురుగా వారెవరు దొరక్కపోతే ఎదురుగా కనబడని అంతవరకు ప్రార్ధించిన ఆ దేముణ్ణే మనసులో కసురుకోవడమే కాకుండా అప్పుడప్పుడు బయటికే గట్టిగా ప్రశ్నించడం, దూషించడము సహజంగా జరుగుతుంటుంది. అంత దాకా ఎందుకు, - ప్రసిద్ధ భక్త శిఖామణి, వాగ్గేయకారకుడు ‘రామదాసు’ అని పిలువబడే, కంచెర్ల గోపన్న కూడా చెరసాలలో కొరడా దెబ్బలు తింటూ, ఆబాధలు భరించలేక తాను ఆ దేమునికి చేయించిన ఆభరణాలని గుర్తుకు తెచ్చుకుంటూ ఎలుగెత్తి పాడుతూ ఆ రాముణ్ణి "ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు, ఓ రామచంద్రా .." అని దూషించిన వాడే. మన 'సనాతన ధర్మము' వివరించి నొక్కి చెప్పిన 'కర్మసిద్ధాంతం' ఆ కష్టకాలంలో బాధాగ్రస్తుడైన మానవునికి, వాడెంతటి వాడైనా గుర్తురాకపోవడం సహజం. ఎప్పుడూ మంచే చేస్తున్నాననుకుంటున్న మనం "కష్టాలు నన్నే ఎందుకు పీడించాలి?" అనిపిస్తుంది ఆ బాధలో. దీనికి పెద్ద, చిన్న అని గాని, ఆడ, మగా అని గాని, పేద, ధనవంతుడని గాని, బికారి, రాజ్యాన్ని ఏలే మహారాజని కానీ, సామాన్యుడైన కూలి అని గాని, ఏంతో పలుకు బడి గల నాయకుడని గాని బేధం ఉండదు.

Lord-Vishnuఆ మాటకొస్తే కష్టాలు రానిదెవరికి? మనము మనస్సులలో మానవ రూపాల్లోనే ఆరాధించే త్రిమూర్తులలో ఒకడైన భగవాన్ విష్ణువు, పాల సముద్రంలో శేషతల్పం పై లక్ష్మిదేవి కాలు పట్టుతుండగా హాయిగా నిద్రిస్తుంటాడని పురాణగాధలలో చదివి మనం పడుతున్న కష్టాలని తలచుకొని ఆయన అనుభవిస్తున్న సౌఖ్యానికి అసూయ పడుతూంటాము. పైకి చూడడానికి అది సుఖమైన యోగంలా కనిపించినా, అదే మనని ఒక్క ఘంట అనుభవించి చూడమంటే ఒళ్ళు జలదరిస్తుండగా ఆ కదులుతున్న పాము శరీరంపై పడుకుని, భయపెడుతూ ఎత్తి కుదేసే అలల ఊపులకి ఏక్షణాన్నైనా సముద్రంలో పడిపోతామోనని ప్రాణాలు ఉగ్గబట్టుకుని, పాము బుసలు వింటూ ఎప్పుడు దాని కాటు పడాల్సివస్తుందోనని ఒకమూల భయపడుతుంటే, అనేక జగత్తుల సమస్యలు తీర్చుతూ, అన్ని జగత్తుల గమనాన్ని సరైన పంధాలో నడపడానికి తెలియని అయోమయంలో సాక్షాత్తు మహాలక్ష్మి కాళ్లుపడుతున్నా సుఖమనిపించక ఆ మహానుభావుడు ఎట్లా భరిస్తున్నాడో గాని యోగ నిద్ర ఏమిటి, అసలు నిద్రేపట్టక అప్పుడు యెంత త్వరగా వీలయితే అంత త్వరగా పారిపోదామనిపిస్తుంది. అదే పరిస్థితి పరమ శివునిది కూడా. అతి శీతల కైలాస శిఖరంపై ఉద్ధృతముగా వీస్తున్న చల్లని గాలుల మధ్య దిగంబరుడుగా బూడిద పూసుకుని, మెడలోను, ఒంటిపైనా కదులుతున్న నాగులు గిలిగింతలు పెడుతుండగా, తలపైన కూర్చుని గంగమ్మ పోస్తున్న ఉరికురికి పడుతున్న అవిరళ జలాధారల రొదలో కూర్చుని నిశ్చింతగా మనస్సుని ఒక విషయముపై నిలపడమే దుస్సాధ్యం, అవిరామంగా తపస్సు చేయడం మనకైతే అసలే అసాధ్యం. నాట్యం చేయడమా అసంభవం. మరి బ్రహ్మదేవుని పరిస్థితికూడా మెరుగేమికాదు. అటునిటు కదలడానికి వీలులేని కమలం ‘ఆఫీసు’లో ఎడతెరిపిలేకుండా అన్నిలోకాలలోని కోటానుకోట్ల జీవరాసులన్నిటికి జన్మకల్పించి, వాటి కర్మానుసారం వాటికి విధివ్రాత వ్రాస్తూ, అవి చేసిన కర్మల ప్రకారం వాటిని తుది వరకు నడిపి, అప్పుడు లయకారుడు ఆ జీవిని కడతేర్చితే మరోజన్మకు మార్గాన్ని చూపించడం; అందరూ పడుతున్న కష్టాలకు వారి దూషణలు భరిస్తూ (సుఖమైనా జీవితాల్ని అనుభవిస్తున్నపుడెటూ గుర్తైనా పెట్టుకోడు). ఒక కాజువల్ లీవ్ గాని, ఎల్ టి సి పై శారదాదేవితో విహార యాత్రలు గాని, అనారోగ్య సెలవులు గాని లేకుండా ఆ బాధ్యతలు నిర్విరామంగా నిర్వర్తించడం సామాన్య విషయంకాదు. ఇట్లాటివి మనం కొలిచే దేవుళ్ళ కష్టాలైతే మరి ధర్మోద్ధారణకి వారు చేసిన ప్రయత్నాలు, పడ్డ బాధలు ఎన్నో! విష్ణువు ఎత్తిన అవతారాలలో ఆయన పడ్డ కష్టాలు మరెన్నో! అవతారం ఎత్తుతున్నానని ఆ దైవం తన ప్రాధమిక కర్తవ్యాన్ని సడలించ వీలులేదు. జగత్సృష్టి, స్థితి కొనసాగడం, సరైనసమయానికి లయంచేయ్యడం అటువంటి ప్రాధమిక కర్తవ్యాలు అలక్ష్యం చేయడం వారికి సాధ్యం కాదు. కొందరు స్వార్ధపరులు, పురాణ కాలంలో రాక్షసులు అనండి, ఈరోజుల్లో మానవులే అనండి- సమాజాన్ని, వృక్ష, జంతు సంపదలనీ కొల్లగొడుతూ, వారిని హింసిస్తూ, అక్రమాలకు లోబడిపోతున్నవారిని వెంటనే కాకపోయినా ఎప్పుడో అప్పుడు శిక్షించి ధర్మాన్ని నిలబెట్టి ప్రాణికోటికి న్యాయం జరిగేటట్లు చూడడం ఆ పరమాత్ముని కర్తవ్యమ్. ఆ పరమాత్ముడు ఈ దేవతా మూర్తులద్వారానే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఆ కర్తవ్య నిర్వహణలో ఆ దేవుళ్ళు ఎన్నెన్ని కష్టాలు అనుభవించారో వాటిని నేడు మనం గగ్గోలుపెట్టే కష్ట సముదాయము తో పోల్చి చూస్తే పర్వతాల వంటి వారి కష్టాల మీద ఎగిరే దూది పింజల వంటి మేఘ శకలాలనిపిస్తుంది.

విష్ణుని దశావతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, అవతారాలు మానవ అవతారాలు కావు గావున వాటి కష్టాలని మన బాధలతో పోల్చి చూడ వీలు కాదు. నరసింహ, వామన, పరశురామ అవతారాలు క్లుప్తమైయుండి, ఆయా నిర్ణయ పరిధులకు పరిమితమై అవి పూర్తైన వెంటనే తిరిగి పూర్వ స్థితికి చేరుకున్నవి కనుక, ఆ అవతారాలలోని కష్టాలు మన ప్రస్తుత స్థితులతో పోల్చ వీలవదు. కల్కి అవతారమైతే మనకి తెలిసి ఇంకా ధరించబడలేదు. బుద్ధుడు రాజై కూడా జ్ఞానార్జనకై ప్రగాఢ వాంఛతో రాజ్యాన్ని, భార్యని వదలి అడవులపాలై, జ్ఞానోదయమైన తరువాత 'అహింసా పరమోధర్మః' అని ప్రబోధిస్తూ మానవాళిని ధర్మమార్గాన్ని నడిపించ యత్నించాడు, ఆ సద్ప్రయత్నం చాలావరకు ఫలించడం మనం చూస్తూనే ఉన్నాము. ఆ విధంగా ధర్మ స్థాపనకై అతడు కష్టాలని కావాలని కొనితెచ్చుకున్నాడు. మనము కష్టాలని ఎన్నడూ కావాలని కోరుకోము గనుక, మనకి అతనితో పోలికే లేదు. మిగిలినవి రామ, కృష్ణావతారాలు. రామావతారం దైవ శక్తులని వాడుకోకుండా ధర్మానికి నిలబడ్డ ఒక అద్భుత మానవ అవతారమైతే, కృష్ణుడు కుటిలనీతిని పోషించి సమర్ధించే కాలంలో ఉన్న అవతారం గనుక తన దైవ శక్తులని అవసరమైనంత వరకు మాత్రమే వాడుతూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న అవతారం. ఈ రెండు అవతారాలగురించి మాత్రం మనం ముచ్చటిద్దాం.

శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెరసాలలో అర్ధరాత్రి హోరున వర్షం కురుస్తుండగా పుడుతూనే భయంకర వాతావరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆతడి స్థితి సన్నని నూలుపోగుతో నెత్తిమీద కత్తి వేళ్ళాడదీసినంత దారుణమైనది. ఆ పరిస్థితిని మేనమామైన కంసుని నుంచి ఎదురుకోవాల్సి వచ్చింది. ఏడు కాన్పుల తరువాత మగబిడ్డ పుట్టినా, ఆ కన్న తల్లికి తండ్రికి పుత్రుడు పుట్టాడన్న సంతోషం మాట అటుంచి ఆ క్షణాన్న కలిగిన, ఉద్వేగం, భయం, ఆందోళన, ఆవేదన చెప్పనలవికాదు. బయటికి పొక్కకుండా, కాపలా దారులకి అనుమానం రాకుండా ఆకాశవాణి మాట సలహా ప్రకారం తరువాతి కార్యక్రమం నిశ్శబ్దంగా జరిగిపోవాలి. ఆ చెరసాలలోనుంచి సంకెలలు విడదీసుకుని ఆ బిడ్డను ఏడవకుండా బుట్టలో తలపై నుంచుకొని పాపమా వసుదేవుడు సంకెలలు తెంచుకుని బయటికి తేవడం, తుఫానులో వరదలై పారుతున్న నదిని దాటడము, గోకులంలో యశోదాదేవి ప్రక్కన కృష్ణుడిని నుంచి, అక్కడున్న పిల్లను తిరిగి వచ్చినదారినే దేవకీ దేవి వద్దకు చేర్చడం వీటన్నిటికీ కొనవరకు దైవ సహాయం లభిస్తుందో లేదోనన్న భయం, డోలాయమాన ఉత్కంఠతో నిండి ప్రస్తుతపు ‘సస్పెన్సు’ చిత్రాన్ని మించి బాధించి ఉంటుంది ఆనాటి శ్రీకృష్ణ జన్మ ఘట్టం. ఈ గాధ మనకి తెలిసినా మనలో ఎంతమంది ఈ స్థితిని ఎదుర్కొనివుంటారు? దీనికి ఆతడు తన దైవ శక్తి సహాయం తీసుకోక తప్పలేదు.

పసివాడిగా పాలు తాగే వయస్సులో పూతన పాలిచ్చి చంపబోతే ఎదురించి పోరాడే శక్తిలేని ఏడాది లోపల వయస్సులో పాలు తాగుతూనే, ఆమె ప్రాణాలుకూడా తాగేసి చంపవలసి వచ్చింది. అదీ మానవ మాత్రుల చేయగలిగిన పని కాదు గనుక తన మానవాతీత శక్తులని వాడక తప్పలేదు. ప్రాణభయంతో పగబూని ఎటులైన కృష్ణుడు పెరగకుండానే అంతమొదించాలని కృత నిశ్చయంతో మేనమామ కంసుడు అనేక రాక్షసులని వరుసగా పంపి ఆ పసిబాలుని చంప ప్రయత్నించగా ప్రతి ఒక్కదాన్ని చాకచక్యంగా త్రిప్పిగొట్టి బయటపడడానికి తన దైవ శక్తుల్ని వాడుకోక తప్పలేదు. అల్లాగే గోవుల్ని, అక్కడి ప్రజల్ని దేవేంద్రుని కక్ష సాధింపులనెదుర్కోవడానికి వారం రోజులపాటు పగళ్లు రాత్రిళ్ళు గోవర్ధనగిరి నెత్తి తన చిటికెనవేలి పై నిలిపి వారిని రక్షించడానికి తన దైవ బలాన్ని వాడుకోక తప్పలేదు ఆ బాల కృష్ణునికి. గోకులానికి సమీపంలో ఉన్న యమునానదిలో కాళీయఫణి మదించి యదేచ్ఛగా విషంతో నీటిని కలుషితం చేస్తూ, ఆ నీరుమీదే ఆధారపడ్డ గోవులకు, గోకులానికి మంచినీరు లేకుండా చేస్తుంటే దాని మదమణచి అచటినుంచి తరిమేయడము తన మానవాతీత శక్తులు వాడందే జరిగుండదు. కంసునిచే పంపబడిన కేసి అనే అశ్వారూపుడైన రాక్షసుని ఎదుర్కొని పోరాడి పళ్లూడగొట్టి మోచేతిని గొంతులోదూర్చి ఊపిరాడనీయకుండా చేసి చంపడం మానవ సాధ్యంకాదు, అందునా పసివానికి దుస్సాధ్యం. దానికి తన దైవ బలాన్ని వాడుకుని సాధించినందుకే అతగాడికి కేశవుడనే పేరు లభించింది.

'అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడు చూడు' అన్న బలరాముని మాటలు బట్టుకుని యశోద మందలిస్తూ కృష్ణుని నోరు తెరిచి చూపమంటే అతగాడి నోటిలో చూసిన పదునాల్గులోకాలు ఆమెను ఆశ్చర్యపరచడమే కాక భయపెట్టాయి కూడ. పోతన పద్య శోభలో గాంచండి యశోదాదేవి మనోస్థితి,

“కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్!” అని ఆమెచే పలికించాడు.

అందుకే అతగాడు చేసిన వత్సాసుర సంహారము, బకాసుర వధ, అఘాసుర వధ గోకులంలోని ప్రజలకు ఆశ్చర్యం కలుగచేయలేదు సరిగదా ఆతడు విష్ణుని అవతారంబేనని నమ్మకము వారికి స్థిరపడింది.

కంసుడు ఇంకా ఇతగాడిని ఈవిధంగా చంపడం సాధ్యం కాదని నిర్ణయించుకుని శ్రీ కృష్ణుడిని బలరాముడిని తన రాజసభకి రమ్మని ఆహ్వానం పంపి వచ్చేవారిని దారిలోనే చంపనుద్దేశ్యంతో ‘కువలయపీడము’ అనే మదగజానికి బాగా కల్లు పట్టించి వారిమీదికి దాడి చేయిస్తాడు. దానిని కూడా దైవబలాన్ని వాడుకుని సంహరిస్తాడు. వారి బలం అప్పటికి సగానికి క్షీణించి ఉంటుందనే భావనతో వెంటనే రాజ్యంలోని పేరుమోసిన మల్లవీరులు ముష్టి, చాణూరులను వీరిపైకి మల్లయుధానికి పంపుతాడు కంసుడు. వారిని మల్ల యుద్ధంలో ఓడించి చంపినప్పుడు గాని తన అంచనా తప్పని తెలియలేదు కంసునికి. అప్పుడు కంసుని తో తలబడతాడు కృష్ణుడు. కంస వధానంతరం తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులని చెరసాల విముక్తులనిచేసి తాతగారైన ఉగ్రసేనునికి రాజ్యాన్ని అప్పగించి, అన్న బలరాముడు, తాను సాందీపుని ఆశ్రమానికి విద్యాభ్యాసానికి వెళతారు. అచట సకల విద్యలు గ్రహించి,

వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ
న్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్కవి
ద్యాదక్షత్వము రాజనీతియును శబ్దప్రక్రియం జెప్పె నా
భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్.

వారు కృతజ్ఞతగా గురు దక్షిణ నీయదలచి సాందీపుని ప్రార్ధింపగా, నాతడు సముద్రతీరాన్న ఆడుకుంటున్న తన పుత్రుని పెద్ద అల సముద్రములోనికి లాక్కొని పోయిందని, అతడిని తెప్పించుట అసాధ్యమని సాందీపుడు తెలియజెప్పగా, ఖిన్నుడై కాలము గడుపుచున్న గురువు దీన స్థితిని గ్రహించి. ఆ సముద్రుని తో యుద్ధము సేయబోవ ఆతడు తనలోపలే యున్న 'సంయని నగరం'లో దాచబడియున్న ఆ గురుపుత్రుడు ఉన్నచోటు చెప్పగా వారచ్చటికి బోయి అతడిని విడిపించి సాందీపుని కి అప్పగించి గురు ఋణం తీర్చడంలోనూ తన దైవ బలాన్ని వాడుకోవడం జరిగింది.

ఇక కురుక్షేత్ర సంగ్రామంలో మిత్రుడు, సఖుడు, బంధువు అయిన అర్జునునికి సారధిగా నిలిచిన కృష్ణుడు మహాసంగ్రామానికి మొదటిరోజునే ఇరువైపులా ఉన్న సైన్యవాహినిని, తాను యుద్ధంలో ఎదుర్కొని హతమార్చవల్సిన భీష్మ పితామహుని, గురువర్యులైన ద్రోణ, కృపాచార్యులని చూసి, తనను పెంచి విద్యాబుద్దులు చెప్పిన ఈ గౌరవాధికులనా చంపుట అని ఖిన్నుడై, అస్త్ర సన్యాసము చేయబోయిన సఖుని చూసి శ్రీ కృష్ణుడు ధర్మ పరిరక్షణకై యుద్ధం చేయవలసిన అగత్యాన్ని, తిక్కన లలిత పద సౌరభంలో ఈ విధంగా ఉద్భోదించాడు.

కం.
సమరంబు రాజులకును
త్తమకర్మంబది యపావృత స్వర్గద్వా
రాము సుమ్ము లెమ్ము దగా గ
య్యముసేయుము దీనికేల అనుమానింపన్.
కం.
ఫలములయెడ బ్రహ్మార్పణ
కలన పరుండగుచు గార్య కర్మము నడపన్
వలయుం దత్వజ్ఞానము
తలకొనినం గర్మ శమము దానై కలుగున్.

అని ఆ పరంధాముడు తెలియజెప్పి

కం.
వైరమున నిలిచి త్రెమ్పక,
కారకులు డుల్లినట్లు కర్మములెల్లం
దార పెడబాయవలయుట
సారకృపం దెలియ జెప్పె శౌరి యతనికిన్

అపుడు అర్జునుడు

మ.
అతిగుహ్యంబిది నీవు భూరికృప నీ యధ్యాత్మముం గానఁజే
సితి నాకిమ్మెయి విన్కి గొంత భ్రమ వాసెన్ యోగిహ్రధ్యేయమై
యతులైశ్వర్య విభూతి నొప్పు భవదీయంబైన రూపంబు సూ
చుతలం పె త్తెడు బోలునేని దయ జక్షు ప్రీతి గావింపవే.

అనగా ఆ పరమాత్ముడు అర్జునికి దివ్యచక్షువులనొసంగి యోగేశ్వరేశ్వరుడైన యాలక్ష్మీశ్వరుండు విశ్వరూపంబు దర్శింపజేయ ధనంజయుడు విస్మయరోమ హర్షణ ప్రహర్షోత్కర్షంబులతో దండ ప్రణామంబులు సేసి నిలిచి కేలుమోడ్చ “అక్కడున్నవారందరు తమ తమ కర్మానుసారులై సాగిపోయి వారిజీవితము ముగుస్తుంద”నే గీతను బోధించి యుద్ధోన్ముఖుని జేసి ధర్మ స్థాపన కావించాడు. ఆవిధంగా కృష్ణావతారంలో తాను ఎన్ని కష్టాలు అనుభవించినా,

"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "

అంటూ ధర్మసంరక్షణే ధ్యేయంగా నిలిచాడు, ఆ పరమాత్మ.

శ్రీ కృష్ణావతారం ద్వాపరయుగ లో సంభవించినదైతే, శ్రీ రామావాతారము త్రేతాయుగ సంపత్తి. వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణ మహా కావ్యం అరణ్య కాండలో 37 వ సర్గలో పదమూడవ శ్లోకంలో వివరించినట్లు

"రామో విగ్రహాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః |
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ ||"

'రామో విగ్రహాన్ ధర్మః ' అన్న నానుడి లోక ప్రసిద్థి చెందినది. రాముని ధర్మ నిరతునిగా రామాయణం నిరూపిస్తుంది. ఆ అవతారంలో పరంధాముడు మానవాతీత శక్తులని వినియోగించకుండా సాధారణ మానవుడు అనుభవించే స్థితిగతులను, ఎదుర్కొనే కష్టాలను అనుభవించి మానవులందరికీ మానసికంగా చేరువై, అత్యంత పూజనీయడైనాడు. రాణి కైకేయి కోరికని తండ్రి దశరధుని ఆజ్ఞగా భావించి, (తరువాత ఆయన స్వయంగా వెళ్లవద్దని బ్రతిమాలినా) సీతా, లక్ష్మణుల సమేతంగా పదునాలుగేండ్ల వనవాసం చెయ్యడం గొప్ప స్వయం కృత శిక్షగా భావించవచ్చు. అయినా సుకుమారంగా పెరిగిన ఆ రాకుమారులు, రాకుమారి కారడవులలో కఠిన జీవితాలని గడపడము సామాన్యులకైనా కఠిన పరీక్షే. సీతాపహరణం జరిగిన తరువాత, సామాన్య మానవుని లాగానే మానసిక వేదన ననుభవించి జటాయువు, సుగ్రీవుడు మొదలైనవారందరి సహాయం అర్ధించి దానిని పొంది, రావణునితో తలబడ్డాడు. భరతుణ్ణి అడిగి వుంటే సైనిక సహాయం అంది ఉండునేమో కాని అటుల చేయక (సీత లంకలో పెట్టిన జీవన కాలపు గడువు ముగిసే లోపల సహాయము అంత దూరము నుండి అందే వీలు లేదని కావచ్చు), సుగ్రీవుని వానర సైన్య సహాయంతో సముద్రం పై వారధిని నిర్మించి లంకను చేరి యుద్ధము ప్రకటించాడు. కోతి క్రమశిక్షణకు సులభంగా లోనుకాదని మనకందరికీ తెలుసు. అటువంటి కోతిమూకని సైన్యంగా చేసుకుని రావణుని సుశిక్షులైన మాయారాక్షస విశాల సైన్యాన్ని ఎదుర్కొనుట గొప్ప సాహసమే.

-o0o-

Posted in October 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!