Menu Close
ఉప్పలూరి మధుపత్ర శైలజ
“శ్రమయేవ జయతే” (కథ)
-- మధుపత్ర శైలజ --

“లచ్చవ్వా! ఎంతసేపయ్యింది వచ్చి? అందరికన్నా ముందొచ్చేస్తావు! ఇంటి దగ్గర పనులేం ఉండవా?” అంటూ పలకరించింది గౌరి.

“రాత్రంతా నిద్రపట్టలేదమ్మా! నిన్న సాయంత్రం మేస్త్రీగారు వచ్చి, “కొత్త కలెక్టరుగారు ఈ రోడ్డుగుండా ఏదో మీటింగ్‌కి వెడతారని, అందరిలోకి పెద్దదానివి, అనుభవం ఉన్నదానివి కాబట్టి కాస్త తొందరగా వచ్చి పనులు మొదలెట్టమన్నారు. అందుకే టీ నీళ్ళు తాగినా కూడా టైం వృధా అవుతుందని తాక్కుండా బేగె వచ్చేసాను” అంది లచ్చవ్వ.

“నువ్వు ఊడుస్తూండు, నేనెళ్ళి నీకు టీ పట్టుకొస్తా. టీ తాగాక మంచి ఉషారొచ్చి ఇంకా బాగా పని చేస్తావు” అంటూ గౌరి గబగబా వెళ్ళింది.

ఐదు నిముషాలలో ఇద్దరూ టీ త్రాగి రోడ్ల ఊడ్పు మొదలెట్టారు. ఈలోగా కమల, రమణ వచ్చి వారితో కలిశారు.

“ఆడుతుపాడుతు పనిచేస్తుంటే…” అన్న చందాన ఊసులాడుకుంటూ రోడ్లను శుభ్రపరుస్తున్నారు.

“లచ్చవ్వ వయస్సులో మనకంటే చాలా పెద్దది. అయినా ఎంత ఓపికో, తెల్లారేసరికి పన్లో కొచ్చేసింది” అంది గౌరి తన తోటి స్నేహితులతో.

“ఔను! ముగ్గురు కొడుకులకు చక్కగా పెద్ద చదువులు చదివించింది. పిల్లల చిన్నతనానే భర్త పోయినా ఏం భయపడక ఈ పనిలో కుదురుకొని, అప్పులు చేసి, చీటీలు కట్టి నిరాటంకంగా వారి చదువు సాగేలా చూసింది. తల్లి కష్టం, ఆ పిల్లగాళ్ళ తెలివితేటలు కలసి వాళ్ళు మంచిగా పైకి వచ్చారు. పెద్ద కొడుకులిద్దరు ప్రేమ వివాహాలు చేసుకుని ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. కడపటి కొడుకు ఈమెను అంటిపెట్టుకుని ఉంటున్నాడు. రేపు ఆ అబ్బాయికి ఉద్యోగమనే రెక్కలొస్తే తుర్రుమని ఎక్కడికో ఎగిరిపోతాడు. అందుకే తనకి చాలా ఇష్టమైన ఈ పనిని, కష్టాన్ని నమ్ముకుని బతుకుతోంది” అంది రమణ.

“ఏంటా కబుర్లు? పని తక్కువ ఊసులెక్కువ! ఓ సారి తల్లెత్తి ఆ ప్రక్కకు చూడండి. తను ఈ ప్రక్కనంతా శుభ్రం చేసేసి రోడ్డుకవతల ప్రక్కన పనిచేస్తోంది లచ్చవ్వ” అంటూ వీళ్ళను కేకలేసి లచ్చవ్వ దగ్గరకొచ్చి సైకిల్ ఆపాడు మేస్త్రి.

“ఏమ్మా! పెందరాళే వచ్చేసారు. అయినా ఇంకా మీకెందుకమ్మా ఈ దుమ్ము పనులు? ఇద్దరు కొడుకులు స్థిరపడ్డారుగా! ఎవరిదగ్గరో ఒకరిదగ్గర ఉంటూ, వాళ్ళు పెట్టింది తింటూ హాయిగా ఉండక ఈ హైరానా ఎందుకు చెప్పండి?” అన్నాడు.

“మేస్త్రీ బాబూ! మీ అబ్బాయికి కూడా ఉద్యోగం వచ్చేసింది కదా! మరి మీరు అబ్బాయి దగ్గరకెళ్ళక ఈ చాకిరీ ఎందుకుచెప్పండి?” అంది లచ్చవ్వ.

“అమ్మా! నా సంగతివేరు. నాకింకో కూతురుంది. ఆ బాధ్యత తీరేదాకా ఈ తిప్పలు తప్పవు కదా” అన్నాడు మేస్త్రీ.

“మరి నాకు కూడా ఇంకో కొడుకు బాధ్యత మిగిలే ఉంది కదా” అంటూ నవ్వుతూ ఊడుస్తూ ముందుకు సాగింది లచ్చవ్వ.

“అవును తల్లీ! నువ్వీ కొలువులో ఉండబట్టే కదా నా కొడుక్కి మీ పెద్దబ్బాయిగారి ఆఫీసులో నౌకరీ ఇప్పించారు. మీరు మాలక్ష్మిలా రోజూ మా కళ్ళముందు తిరుగుతూనే ఉండాలి” అన్నాడు మేస్త్రీ.

ఇంతలో మేస్త్రీగారి సెల్‌ఫోన్ మోగింది. “సార్! ఆ! ఇప్పుడే పంపిస్తానండి" అంటూ “పని పూర్తయ్యాకనా? పనిదేముందండి? అదెప్పుడూ ఉండేదే.” అని “సరే సార్! అమ్మకు చెప్తాను” అని ఫోను ఆఫ్ చేశాడు.

“లచ్చవ్వా! మీ అబ్బాయి గిరిధర్ బాబు ఫోన్ చేసాడమ్మా. నిన్నేదో మీటింగ్‌కు తీసుకెడతాడుట. త్వరగా ఇంటికెళ్ళి నిన్ను తయారై ఉండమన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు కారులో నిన్ను ఎక్కించుకుని వెడతారుట” అన్నాడు మేస్త్రి.

“మేస్త్రీ గారూ! నా గిరిధర్ ఉత్త అమాయకుడు. ఎలా బ్రతుకుతాడో ఏమో? తాను కలెక్టరయినందులకు పౌర సన్మానం జరుగుతూంటే, పనులు మధ్యలో మానేసి నన్ను రమ్మంటాడేమిటి? నా పని పూర్తి కానిదే నేను ఎక్కడకు వెళ్ళనుగాక వెళ్ళను. అయినా పనులు పూర్తి అవ్వకుండా వాడు రమ్మనడే” అంది లచ్చవ్వ.

మేస్త్రీ షాకయ్యాడు. ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన గొంతుతో “ఏంటమ్మా? మీరు చెప్పేది. మన గిరిధర్ కలక్టరయి మన ఊరికే వచ్చాడా? మన బాబుకా సన్మానం? ఇది కలా?నిజమా?” మాటలు తడబడుతున్నాయి మేస్త్రీగారికి.

మేస్త్రీగారు తన కొడుకును ”కలెక్టరుగారు” అని సంభోదిస్తూంటే మనస్సంతా ఆనందంతో నిండిపోయింది లచ్చవ్వకు.

“ముమ్మాటికి నిజం. నా బాబు అంటే ఏమనుకున్నారు? నిన్న మీరు చెప్పారుకదా. కొత్త కలక్టరుగారు ఈ రోడ్డునుండే వెడతారని. మన శుభ్రతను చూసి మెచ్చుకోవాలని. అదే నేను కోరుకునేది. ఆ సభకోసం ఈ రోడ్లను అనాధల్లా వదిలేసి వెళ్ళనా? నా పని అయ్యాకే వెడతాను. నా గిరిధర్‌కు తన తల్లి రోడ్లు ఊడ్చే కార్మికురాలని చెప్పుకోవటం నామర్దా కాదు. ఎందుకంటే ఈ పనిచేత సంపాదించిన డబ్బుతోనే వాడు ఈ స్థాయికి ఎదిగాడు. వాడికి ఈ అమ్మ ఆశీస్సులు కావాలంటే తానే సపరివారంగా వచ్చి నన్ను ఇక్కడే కలుస్తాడు చూడండి” అంది.

“ఇక ఈ అమ్మ నా మాట వినదు” అనుకొని మేస్త్రీగారు మిగిలిన పనివారినందరిని పిలిచి “లచ్చవ్వ ఆఖరి అబ్బాయి గిరిధర్‌బాబు మన ఊరికి కొత్త కలక్టర్‌గా వస్తున్నారు. ఈ తల్లికి మీరంతా చప్పట్లతో శుభాకాంక్షలను చెప్పండి” అన్నాడు. అంతా ఆనందంతో ఆమెను మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు.

“మీరు నా కోసం కొట్టిన చప్పట్ల కంటే, మీ పిల్లలు కూడా ప్రయోజకులైన రోజున నేను కొట్టే చప్పట్లు నాకు ఎక్కువ సంతోషానిస్తాయి గుర్తుంచుకోండి” అంది లచ్చవ్వ.

ఇంతలో మేస్త్రీగారి సెల్‌ఫోను మోగింది. అటువైపు నుండి వచ్చిన సమాచారాన్ని విన్న మేస్త్రీగారు కంగారుగారు “అమ్మా కలక్టర్‌గారు, తన సిబ్బందితో వస్తున్నారట. మీరిక్కడే ఉన్నారని చెప్పాను. వాళ్ళందరు మిమ్మల్ని ఇప్పుడే కలసి వెడతారని చెప్పారు” అన్నాడు.

అయిదు నిముషాలలో కార్లన్నీ వరుసగా ఆగాయి. అన్నలు కొనిచ్చిన సూటు, బూటుతో నీటుగా తయారై కారుదిగి వచ్చిన కలెక్టర్ గిరిధర్ లచ్చవ్వకు పాదాభివందనం చేసి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. మీడియా, పేపర్ల కెమెరాలు ఆ సుందర దృశ్యాన్ని క్లిక్ మనిపించాయి.

లచ్చవ్వ “కలక్టర్‌బాబు మేము ఈ రోడ్లన్నింటిని చక్కగా శుభ్రం చేసామో లేదో ఓ సారి చూడండి. మీరు పేదోళ్ళ పక్షాన, మాబోటి వారి పక్షాన పని చేయాలి. మా అందరి తరుఫునా నమస్కారం” అంది

“అమ్మా! నీ పని పూర్తయ్యాక ఆటోలో సభకు రా అమ్మా. అన్నయ్యలు, వదినలు కూడా వచ్చారు” అంటూ కార్లో కదలి వెళ్ళాడు గిరిధర్.

మేస్త్రీ, మిగిలిన పనివారు, “లచ్చవ్వా! మా కళ్ళతో కలపి వేయికళ్ళతో అంత గొప్ప సభలో నీ కొడుకుని దీవించిరావాలి. వెళ్ళు” అంటూ పంపించారు.

మేస్త్రీ, ఆమె వెడుతున్న వైపు చూస్తూ “ఏమిటీ మనిషి? ‘జాతిరత్నం’ అని ఇలాంటి వారినే అంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ‘చేసే పనిని దైవంలా భావిస్తూ, తాను కర్మ మాత్రమే చేస్తూ ఫలితాన్ని ఆశించక ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలచేలా’ పని కోసం ఎంత తాపత్రయపడుతోందీ తల్లి”.

క్రిందటి నెలలో నా కొడుకు ఉద్యోగంలో జేరటానికి వెడుతూ ఈ లచ్చవ్వ దగ్గరకెళ్ళి దండం పెడితే బంగారం లాంటి మాట చెప్పిందీ తల్లి. “జీవితంలో పై కెదగాలి అంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి” అని చెప్పిన మాటను ఇప్పుడు తాను ఆచరించి చూపించింది అనుకున్నాడు.

లచ్చవ్వ సభాస్థలికి జేరుకునేసరికి, ముగ్గురు కొడుకులు ఎదురెళ్ళి ఆమెను ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇంతలో నగర పెద్దలంతా ఒకరి తరువాత ఒకరిగా వచ్చి వేదిక నలంకరించారు. గిరిధర్ కోరికపై లచ్చవ్వను కూడా వేదికపైకి పిలిచారు. పెద్దల ప్రసంగాలు కొనసాగుతున్నాయి.

జెడ్.పి. ఛైర్మన్‌గారు మాట్లాడుతూ “లచ్చవ్వ క్రిందటి సంవత్సరం ‘ఉత్తమ సేవికా’ పురస్కారాన్ని అందుకొని, ఈ సంవత్సరం తన కొడుకునే కలెక్టర్‌గా మనకు బహుమతిగా ఇచ్చింది. పారిశుధ్య కార్మికురాలిగా ఆమె ఒక్క వీధులనే కాక, తనకు తెలిసిన, పరిచయమైన ప్రతి వ్యక్తి జీవితాన్ని తన మాటలతో, చేతలతో ప్రభావితం చేస్తోంది. తనతోటి పనివారి పిల్లల భవిష్యత్తు కొరకు తనకు చేతనైన సహాయం అందిస్తోంది. తన కొడుకులతో పేద పిల్లలందరికి ఉచితంగా ట్యూషన్లు చెప్పిస్తోంది. ఆమె పాలనలో పెరిగిన మన కలక్టర్‌గారు పేదల పాలిట పెన్నిధి కావాలి. వారి అభ్యున్నతికి కృషిచేయాలి. తన సేవాపటిమతో తల్లికి తగ్గ తనయుడని పేరు తెచ్చుకోవాలి" అంటూ చివరగా సన్మాన గ్రహీత గిరిధర్‌సార్ మాట్లాడతారు అని ప్రకటించారు.

గిరిధర్ తన తల్లి పాదాలకు నమస్కరించి “ఈమె నా పాలిట దేవత. నన్ను నవమాసాలు మోసి కన్నతల్లి ఎవరో నాకు తెలియదు. ఒకవేళ నేనా కన్నతల్లి పెంపకంలో పెరిగినా ఇంతటివాణ్ణి అయ్యేవాడినో కాదో కూడా నాకు తెలియదు.

25ఏళ్ళ క్రితం ఈ తల్లి ఉదయం రోడ్లను శుభ్రపరిచే పనులలో మునిగితేలుతున్న వేళ ఓ పసిబిడ్డ ఏడుపు వినిపించింది. చుట్టుప్రక్కల పరిశీలించి చూసిన ఈ అమ్మకు ఓ టవల్‌లో చుట్టబడి చెత్తకుండీ పక్కన పడివున్న శిశువు కనిపించింది. తనదారిన తాను వెళ్ళక, ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్ళి పాలుపట్టి, బువ్వపెట్టి, జోలలుపాడి, చదువులు చెప్పించింది.

నా కన్నతల్లి ఎవరో నాకు తెలియదు. ఈతల్లి చెంత చేరేలోపు ఆ రోడ్డున ఎందరో తిరిగి ఉంటారు. కానీ నా ఏడుపు ఈ తల్లినే ఎందుకు కదిలించింది? భర్త పోయిన తరువాత ఆ రోజుల బిడ్డను తన బిడ్డగా చెప్పి పెంచటంతో అనేక విపరీత అర్ధాలను వెతికారు జనం. తలో చెయ్యివేసి ఆబిడ్డ పెంపకంలో సాయమందిద్దామనికాక, తలో రాయిని వేసి ఏడిపించారు.

ఆ తల్లి నిర్భయంగా జనం విసిరిన ఆ రాళ్ళతోనే ఆబిడ్డ చుట్టూ ఆత్మీయ, మమతల కోటను నిర్మించి, సమాజానికి ముఖ్యంగా పేదలకు సాయం చేయమని ఉన్నత పదవిలోకి వచ్చేలా తీర్చిదిద్దింది. ఆ బిడ్డ మరెవరో కాదు ఈరోజు కలక్టర్‌గా మీ ముందు నిలబడిన ఈ గిరిధరే.

అందుకే నా అన్నావదినల సంగతమోగానీ నేను మాత్రం నా తల్లి పారిశుధ్య కార్మికురాలని చెప్పుకోవటానికి గర్వపడతాను. వృత్తినే దైవంలా నమ్మి, చేస్తున్న పనిని ఆ దేవుని పూజలా భావించే అమ్మ స్వేచ్ఛకు నేను అడ్డు రాను. అలాగే అమ్మ చేతిని ఎప్పటికి విడిచిపెట్టను. నా తుది శ్వాసవరకు అమ్మే నా జీవితం.

ఈ సభకొచ్చిన వారందరికి నేను చెప్పేదొక్కటే, “అన్నీ ఉన్నాయన్న అహంకారం పనికిరాదు. రాత్రంతా కష్టపడి సూర్యోదయమైన తరువాత విరిసే పువ్వుకు తెలియదు, తాను కోవెల చేరి భగవంతుని సేవలో భాగమౌతుందో? లేక మృతకళేబరానికి అలంకారమై శ్మశానానికే చేరుతుందో? అటూకాక గాలివాటున రహదారిపైపడి పాదచారుల పదఘట్టనలో నలిగిపోతుందో? మన జీవితం కూడా అంతే” అన్న మా అమ్మమాట.

అదృష్టవశాత్తు చెత్తకుండీ దగ్గర ఎవరో వదిలిన ఈ పువ్వు, ఈ దేవత పాదాల చెంత చేరింది. నా బ్రతుకు ధన్యమయ్యింది. ఈ అమ్మ తన కిష్టమైనంత కాలం పని చేస్తుంది. పదిమందికి వెలుగవుతుంది” అంటూ గిరిధర్ తన దగ్గర వున్న గులాబీ మాలను లచ్చవ్వ మెడలో వేసాడు.

“ఇది కలక్టరుగారి అభినందన సభలా లేదు ఆ తల్లీకొడుకుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని, మంచిబాటన నడవమని అన్యోపదేశంగా మనకు చెప్పినట్లుంది” అనుకున్నారు సభికులు.

********

Posted in October 2023, కథలు

1 Comment

  1. Sreeni

    చాలా బాగుంది మీ కథ. చదువుతుంటే, కొంచెం భావోద్వేగానికి గురయ్యాను.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!