Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
ఉపనిషత్తులు: (తాత్వికఆలోచనలు)

గత సంచికలో 54 ఉపనిషత్తుల పేర్లను ప్రస్తావించాను. మిగిలిన 54 ఉపనిషత్తుల పేర్లను ఈ సంచికలో ప్రస్తావిస్తాను.

55-60
౫౫.  ముద్గలోపనిషత్, ౫౬. శాండిల్యోపనిషత్, ౫౭. పైంగలోపనిషత్, ౫౮. భిక్షుకోపనిషత్, ౫౯. మహోపనిషత్, ౬౦. శారీరకోపనిషత్.

61-70
౬౧. యోగశిఖ ఉపనిషత్, ౬౨. తురీయావ తీతావధూత ఉపనిషత్, ౬౩. సన్యాసోపనిషత్, ౬౪. పరమహంస పరివ్రాజికోపనిషత్, ౬౫. అక్షమాలికోపనిషత్, ౬౬. అవ్యక్తోపనిషత్, ౬౭. ఏకాక్షరోపనిషత్, ౬౮.అన్నపూర్ణోపనిషత్, ౬౯. సూర్యోపనిషత్, ౭౦. అక్ష్యుపనిషత్.

71-80
౭౧. ఆధ్యాత్మోపనిషత్, ౭౨.కుండికోపనిషత్, ౭౩.సావిత్యుపనిషత్, ౭౪. పాశుపత బ్రహ్మోపనిషత్, ౭౫. పరబ్రహ్మోపనిషత్, ౭౬. అవధూతోపనిషత్, ౭౭. త్రిపురతాపస్యుపనిషత్, ౭౮.దేవ్యుపనిషత్, ౭౯. కఠోపనిషత్,  ౮౦. భావోపనిషత్.

81-90
౮౧. శ్రీచక్రం ఉపనిషత్, ౮౨. శ్రీచక్రవిన్యాస ఉపనిషత్, ౮౩. శ్రీచక్ర బీజాక్షరన్యాస ఉపనిషత్, ౮౪.రుద్రహృదయోపనిషత్, ౮౫. యోగకుండల్యుపనిషత్, ౮౬. భాస్మజాబాలోపనిషత్, ౮౭. రుద్రక్షజాబాలోపనిషత్, ౮౮.గణపత్యుపనిషత్, ౮౯. దర్శనోపనిషత్, ౯౦. తారసారోపనిషత్.

91-108
౯౧. మహావాక్యోపనిషత్, ౯౨. పంచాబ్రహ్మోపనిషత్, ౯౩. ప్రాణాగ్నిహోతో పనిషత్, ౯౪. గోపాలతాపన్యుపనిషత్, ౯౫. ఉత్తర తాపనీ ఉపనిషత్, ౯౬. కృష్ణోపనిషత్, ౯౭. యాజ్ఞవల్క్యో పనిషత్, ౯౮. వరాహోపనిషత్, 99. హయగ్రీవోపనిషత్, ౧౦౦. దత్తాత్రేయోపనిషత్. ౧౦౧. గారుడోపనిషత్, ౧౦౨. కలిసంతారణోపనిషత్, ౧౦౩. జాబాల్యు ఉపనిషత్, ౧౦౪. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్, ౧౦౫. సరస్వతీ రహస్యోపనిషత్, ౧౦౬. బృహ్వాబోపనిషత్, ౧౦౭. ముక్తికోపనిషత్, ౧౦౮. శాట్యాయనీ ఉపనిషత్.

*****

ఉపనిషత్తులలో అత్యంత ముఖ్యమైనది ‘ఈశోపనిషత్తు’. ఈ ఉపనిషత్తు గురించి, అందులోని 18 శ్లోకాలను అర్థ తాత్పర్య సహితంగా ఇప్పుడు అందిస్తున్నాను.

శ్రీ ఈశోపనిషత్తు

ఉపనిషత్తులలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ ఈశోపనిషత్తు గురించి ఎందరో మహానుభావులు గొప్పగా వివరించారు.

ఈ ఉపనిషత్తులో మొత్తం 18 శ్లోకాలు అంటే 18 మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు ముఖ్యంగా భక్తుడు భగవంతుడిని తనను సరిదిద్దమని, సరైన మార్గంలో పెట్టమని చెబుతూ, దేవుని గొప్పతనాన్ని, జీవుడు తాను ఎలా జీవించాలో, ఆత్మ గురించి, చీకటి ఆవల ఉండే వెలుగు గురించి, నవజీవన మార్గంలో జీవించడానికి సూర్యదేవుని ప్రణమిల్లుతూ వేడుకుంటాడు.

మొదటగా ఈ ఉపనిషత్తులో శాంతి మంత్రం ఉంటుంది అంటే మంగళాచరణ ఉంటుంది. అలాగే వేదమంత్రాలన్నీ చివర ఓం శాంతి శాంతి అంటూ మూడుసార్లు శాంతిని తెలియజేస్తాయి. శాంతి అంటే ప్రశాంతత అని అర్థం. మూడు విధాలైన ఆటంకాలు నుండి మనము బయటపడడానికి శాంతిని మూడుసార్లు ఉచ్చరించాలి. ఆ మూడు విధాలైన ఆటంకాలు ఏవంటే...

  1. ఆధ్యాత్మిక ఆటంకాలు
    శరీరం వలన, మనసు వలన ఏర్పడే ఆటంకాలు. అవి శారీరక రుగ్మత, మానసిక రుగ్మత, అనారోగ్యము, రోగాలు.
  2. ఆధిభౌతిక ఆటంకాలు
    ఇతర జీవరాశుల వాటిల్లే ఆటంకాలు. జంతువులు, పాములు, తేళ్లు వాటి వలన జరిగే హానికరాలు.
  3. ఆధిదైవిక ఆటంకాలు
    ప్రకృతి శక్తుల వలన జరిగే ఆటంకాలు. వర్షము, పిడుగు ,అగ్ని, గాలి వలన జరిగే హానికరాలు.

మూడుసార్లు శాంతిః అని ఉచ్చరించడం వలన మూడు రకాల ఆటంకాల నుండి విడివడి మానవుడు ప్రశాంతంగా ఉండాలని ఈ ఉపనిషత్తు ఉద్దేశం.

ఆది... అంటే  మొదలు, మొదటి అని అర్థము

ఆధి... మనసుకు చెందిన.. మనోవ్యధకు చెందిన అని అర్థము.

ఏ పని చేస్తున్నప్పటికీ, అందుకు అనుకూలమైన మానసిక స్థితి ఉండటం తప్పనిసరి. ఏ పని చేయబోతున్నా, అందుకు తగిన మానసిక స్థితిని పెంపొందించుకొని, ఆ తరువాతనే ఆ పనికి ఉపక్రమిస్తే చక్కని ఫలితాన్ని పొందవచ్చు. అందుకే ఉపనిషత్తులు పఠించడానికి ముందు శాంతి మంత్రాలను ఉచ్చరిస్తారు. ఉపనిషత్తు శాంతి మంత్రం ఇదిగో...

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే:
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే

.... తెల్లము (అర్థము)

భగవంతుడు పరిపూర్ణుడు. ఈ లోకం పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడు నుండి పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. పరిపూర్ణము నుండి పరిపూర్ణతను తీసివేసిన, కూడిన తరువాత కూడా పరిపూర్ణత మిగిలి ఉంటుంది.

అంటే ఒక దీపం నుండి అనేక దీపాలు వెలిగించవచ్చు. ఇందువలన మొదటి దీపపు పరిపూర్ణతకు ఎలాంటి లోటు ఉండదు. దాని నుండి వెలిగించబడిన దీపాలు కూడా పరిపూర్ణ సంపూర్ణంగానే వెలుగుని ఇచ్చేవిగా ఉంటాయి.

అంటే చెట్టుకు అనేక పుష్పాలు ఉంటాయి. ప్రతి పుష్పము సంపూర్ణంగానే ఉంటుంది. ఆ చెట్టు పరిపూర్ణత కూడా తగ్గదు. ఎందుకంటే చెట్టు పరిపూర్ణత వేరు పుష్పం పరిపూర్ణత వేరు. అదేవిధంగా భగవంతుని నుండి ఎన్నెన్నో పరిపూర్ణమైన లోకాలు పిండాండ బ్రహ్మాండాలు ఉద్భవించవచ్చు. అందువలన ఆయన పరిపూర్ణతకు ఏ విధమైన లోటు ఉండదు.

... ఇంకా సులభంగా అర్థం కావాలంటే శూన్యం నుండి శూన్యాన్ని తీసివేసిన, శూన్యాన్ని కూడిన శూన్యమే ఉంటుంది. అంటే సున్నా విలువకు సున్నాను కలిపిన సున్నాను తీసివేసిన సున్నాయే మిగులుతుంది.

పూర్ణమనగా సున్నా ఏమీ లేనిది. అది నీవు గాని, నేను గాని కావచ్చు. ఆత్మ గాని, పరమాత్మ గాని కావచ్చు. అది ఇది అంటే నీవు, నీ అహం, నీ ఆత్మ, నీ పరమాత్మ, అన్నింటికీ మూలమైన ఈ సృష్టి. ఈ విశ్వం నుండి ఏదీ క్రొత్తగా పుట్టదు. నశించదు. పదార్ధ రూపాలు మారుతాయి అంతే. ఈ విశ్వం నుండి ఏది తీసిన, ఏది కూడిన ఆ విశ్వ భావన అలాగే ఉంటుంది. నీ జీవితానికి ఎన్ని ఆస్తిపాస్తులు,ఎన్ని సుఖదుఃఖాలు కలిపిన, తీసివేసిన చివరకు శూన్యమై అది పరిపూర్ణమై విశ్వంలో కలిసిపోతుంది. అంటే చివరికి నీకు పరిపూర్ణమైన సున్నాయే మిగులుతుంది. ఇది వివిధ తాత్వికుల వివిధ భాష్యాల సారాంశం. మన వేద ఋషుల వివేచన. ఎంత చక్కని తాత్విక ఆలోచనో చూడండి..

ఓం శాంతి శాంతి శాంతిః (వచ్చే సంచిక నుంచి ఈశాఉపనిషత్తు మంత్రాలను తెలుసుకుందాం)

**** సశేషం ****

Posted in October 2023, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!