Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్

కబీర్ దాసు - 03

Kabir Das
Photo Credit: Wikimedia Commons

కబీరు రచనలు సాఖీ, సబద్, రమైనీ యని మూడు భాగాలుగా విభజించబడి ఉంటాయి. ఈ మూడు భాగాలు బీజక్ లో సంగ్రహ సంపుటిగా కనబడతాయి. ఈ వరుస క్రమంలో సాఖీలో సుమారు 59 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయం లో 25 నుండి 35 దోహాలు వున్నాయి. ఈ అధ్యాయాల్లో ప్రతి అధ్యాయం చివర కో అంగ్ అనే పదం వస్తుంది. ఉదాహరణకు గురుదేవ్ కొ అంగ్ అనే అధ్యాయంలో గురువుని గురించి కబీరు చెప్పిన మాటలు, సత్సంగ్ కొ అంగ్, సాంచ్ కొ అంగ్ అనే అధ్యాయాలలో సత్సంగతి, సత్య మహిమను చూడవచ్చు. “ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారు మంచి వారు? మనస్సును ఎలా నిర్మలంగా ఉంచుకోవాల”ని కబీరు చెబుతారు. అదేలా “సాధుకో అంగ్” లో నిజమైన సజ్జనుని స్వభావాన్ని గురించి చెప్తారు. సాఖీ అంటే సాక్షి. దీనిలో మానవుల జీవిత విలువలు, సజ్జనుల స్వభావము, మనసుతో చేసే సంబోధనలు, జ్ఞానం గురించి విస్తారంగా వర్ణిస్తారు కబీరు. గురు కో అంగ్ లో దైవ స్వరూపుడు గురువని ఆయనకు సమానమైన వారు ఎవరూ లేరని చెబుతూ, మనసును గురువు యొక్క పాద పద్మములకు అంకితం చేయాలని చెబుతారు.” సద్గురువు యొక్క మహిమలు అనంతము, ఆయన చేసిన ఉపకారాలు అనంతము, ఆయన ఇచ్చిన జ్ఞానం అనంతం, ఆ జ్ఞానంతో ఆలోచనలతో అనంత జీవిత సత్యాలను చూస్తాము అని కబీరు చెప్పారు. అంటే గురువు వ్యక్తి యొక్క జ్ఞాన చక్షువులు తెరిపించి ఈ లోకమంతా వ్యాప్తి చెందిన జ్ఞానాలను చూపిస్తాడని భావము. గురువు యొక్క కృప వల్ల జ్ఞాన మనే దీపము ప్రేమ అనే నూనెలో మునిగి ఆత్మ అనే వృత్తితో వెలిగించబడి ఈ జగత్తు అనే బజారనే మసిలో బూడిదయ్యింది. అంటే భగవంతుని ప్రేమలో మునిగి ఈ కర్మ బంధాల నుండి ఆత్మ విముక్తి పొంది ప్రారబ్ద కర్మలన్నీ గురువుల ఉపదేశాలవల్ల తొలగిపోయాయని కబీరు చెప్పారు. ఈ అధ్యాయము నిండా 35 దోహాలలో గురువుయొక్క మహిమలను కబీరు వివరంగా చెప్పారు. ఐదవ అధ్యాయము సుమరిన్ కొ అంగ్. ఇందులో భగవంతుని పదే పదే భజించమని వేడుకుంటున్నాడు కబీరు.

భగవంతుని నామాన్ని ఎల్లప్పుడూ స్వీకరించడమే ఈ జీవితపు సారము. మిగిలిన మాటలన్నీ సంసార బంధంలో చిక్కుకునే మాటలేనని నేను చాలా బాగా తెలుసుకున్నాను, ప్రభు స్మరణ తప్ప వేరే గతి లేదు అని అంటున్నాడు కవి కబీరు. భక్తితో నిండిన కబీరు హృదయం నిర్గుణ స్వరూపుడైన రాముని భజన చేసి చేసి రామ నామాన్ని జపించి జపించి ఎవరిని నమస్కరించాలి? ఎవరితో మాట్లాడాలి? అని తెలియక తికమక పడుతుంది. అందరూ ఆయన కంటికి పరమాత్మ లాగే కనబడుతున్నారు అంటూ భగవద్గీత గీతలోని సమ దర్శనాన్ని ఇందులో కబీర్ చాటి చెబుతున్నారు. “నాది, నీది అంటూ అహంకారానికి గురియై జీవితమంతా గడిపాను, ఇప్పుడు లోతుగా ఆలోచించి ఓ విషయం గ్రహించాను. ఎక్కడ చూస్తే అక్కడ నీవే కనబడుతున్నావు ఓ పరమాత్మా! ఈ జగత్తంతా బ్రహ్మమయంగా కనబడుతున్నది నాకు అని చెబుతూ వ్యర్థంగా జీవితమంతా నిద్రపోతూ గడిపాను. ఈ గర్భాన జనించిన మాయయనే నిద్రనుండి లేచి ఆ భగవంతుని పాదాల మీద మోకరిల్లి ప్రాధేయపడు! ముక్తి లభిస్తుంది! బతికి ఉన్నప్పుడే భగవంతుని నామాన్ని జపించు ఎందుకంటే నీ తలపై కాలుడు నిలబడి ఉన్నాడు. అతను పాశం వేయక ముందే భగవంతుని వేడుకుని సుఖంగా ఉండు..” అని మనస్సును సంబోధించి రాసిన దోహాలెన్నో.

సాఖీ లోని దోహాలను వర్ణించాలంటే ఒక పీ.హెచ్.డీ కు అవసరమైన విషయాలు దొరుకుతాయి. తన వ్యక్తిత్వ వికాసానికి గురువే కారణం చెబుతూ ఆయన అనుగ్రహం వల్లనే జీవించడానికి దైర్యం లభించింది, ఆయన తన చైతన్య సంపదతో జ్ఞానాన్ని అందించాడని కబీరు గురువును పొగుడుతున్నారు. తన అంతర్ముఖ సాధనకు గురువే తోడుగా నిలబడ్డారు అని చెప్తున్నారు. ఇక సాఖీ లోని రెండవ అధ్యాయము “సుమరిన్ కొ సంగ్” లో దేవుని స్మరించాలని స్మరణ మహిమ గురించి వివరంగా చెబుతూ భగవన్నామాన్ని పదేపదే ఉచ్ఛరించమని చెబుతున్నాడు కబీరు. తన నిర్గుణుడు అయిన రాముని జపిస్తూ “మూడు లోకాల్లో నేను నేర్చుకున్నది నా రాముడు శ్రేష్టుడు పరబ్రహ్మని, ఈ జీవితంలోని సారమే ఆయన నామ జపం. ఆయన పేరు నేను శిరోధార్యంగా అనుకరిస్తాను. ఎప్పుడూ ఆయనను స్మరిస్తూ ఆయన నామాన్ని తాను తిలకంగా స్వీకరిస్తానని చెబుతున్నాడు కబీరు. ఇక్కడ తిలకం అనబడే శబ్దము శ్రేష్టము, శిరోధార్యం అన్న అర్థంలో తీసుకోవాలి. “నేను సదా హరి నామాన్ని మాత్రమే జపిస్తాను. దాన్ని ఉచ్చరిస్తూ ఆయనతో ప్రేమతో ముడివడి ఆయన ధ్యానంలో మునుగుతాను. ఇతర విషయాలు గురించి ఆలోచించను. ఇతర విషయాల గురించి ఆలోచిస్తే యముడు తన పాశంతో మృత్యుకూపంలో నన్ను పడవేస్తాడు. అంటే భగవంతుని నామస్మరణ చేత మృత్యు భయం లేకుండా మోక్షానికి అర్హులం అవుతాము” అన్నారు కబీరు.

ఆ కాలపు విదేశీ ముసల్మానులకు (మొహమ్మద్ లోధీ) లొంగకుండా తిరస్కార భావంతో ధైర్యంగా భగవంతుని నామాన్ని స్మరించిన వ్యక్తి కబీరు. “నా మనసు రామ నామాన్ని స్మరించి స్మరించి రామమయం అయిపోయింది. అలాంటి సమయంలో నేను ఎవరికి నమస్కరించవలెను రాముడికి తప్ప. జీవుడు పరమాత్మలో ఐక్యమైనపుడు జీవుడు పరమాత్మ తప్ప ఎవరినీ పొగడ లేడు. ఎలాంటి నవాబులకు నమస్కరించలేడు. ఉన్న ఒక్క ప్రభువు భగవంతుడు మాత్రమే. ఇక్కడున్న నవాబు అనే శబ్దానికి ప్రభువు, పెద్దలు, అధికారులు అనే అర్థములో తీసుకోవాలి.

ఈ ‘నామస్మరణ్ కొ అంగ్’ లో మొత్తము 31 దోహాలున్నాయి. ఈ అధ్యాయం మంత్ర భగవంతుని నామస్మరణకు అంకితం చేయబడింది. “దేవుని ఎప్పుడూ భజిస్తూ ఉండాలి.  ఏకాగ్రతతో ఏకాంత సమయాన్నివృధా చేయకుండా ధ్యానం చేయాలి. ఎన్నిసార్లు భగవంతుని స్మరిస్తారో అన్నిసార్లు భగవంతుడు దగ్గరే ఉండి నీకు సహాయ పడతాడు. నీ నాలుక సదా రామనామాన్ని జపిస్తూ ఉండాలి. నిండు మనసు తో జపిస్తే మనసులో ఉన్న భగవానుడు దాన్ని స్వీకరిస్తాడు. మనస్సులో ఉన్న సర్వవ్యాపి భగవంతుడు నీకు సహాయపడతాడు” అని సంపూర్ణ భక్తి తత్వాన్ని మాండలిక భాషలో చాటి చెప్పిన వ్యక్తి. నిర్గుణ భక్తులందరి ద్వారా చెప్పబడిన భక్తి భజనతో గూడిన నామ స్మరణ. ఆ భజనంటే గట్టిగా పాటలు పాడుతూ మంత్రాలతో అరుస్తూ చేసే భజన కాదు. పెదవి విప్పకుండా మనసారా ఈ బ్రహ్మాండంలో నిండి ఉన్న ఆ పరమాత్మను అణువణువునా మానసికంగా దర్శించి మనసారా ఆయనతో మౌనభాష యైన ఆత్మ భాషలో మాట్లాడడమే. ఇంకొక చోట కబీరు గారు “మానవ జన్మ దుర్లభం. ఏ జన్మలో ఏ యోనిలోకి పోతామో ఎక్కడనుండి వచ్చామో మనకే తెలియదు. ఈ జన్మను వృధా చేయకుండా ఆ భగవంతుని మహిమను మనసారా స్మరించుకో” అంటున్నారు. “నీకు నచ్చిన ప్రియమైన పరమాత్మను వదిలి ఎవరెవరో దేవతలను స్మరించకు. అది వేశ్య పుత్రుడికి సమానంగా భావింపబడుతుంది. అతనికి తన తండ్రి ఎవరో తెలియదు అదెలా మనం నమ్మిన భగవంతుని మనస్సులో స్మరించుకో. ఏ పేరులో పిలిచినా పలుకుతాడు ఎందుకంటే ఆయన కంటూ పేరు లేదు. రూపం లేదు. నీవు నిర్మల మనస్సుతో ప్రేమతో పిలువు. నీ దగ్గరకి తానుగా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయ పడుతాడు. పరమాత్మ తప్ప ఎవరు మనకు తోడు రారు అని అంటున్న కబీర్ భక్తిని అన్ని మతాల వారు అన్ని జాతుల వారు స్వేచ్ఛగా స్వీకరించవచ్చు. అందరినీ ప్రేమించే మనస్సు మాత్రమే కావాలి.

ఇక మూడవ అధ్యాయము ‘విరహ్ కొ అంగ్’. కబీర్ యొక్క ఆత్మ అనే విరహిణి నాయిక ఆ పరమాత్మ కోసం దారి తెన్నులు కాచి చూస్తుంది. ఆత్మ అనే నాయక పరమాత్మయనే పురుషునితో కలవడానికి ప్రతిక్షణం ఎదురుచూచ్తుంది. ఈ అధ్యాయం అంతా కబీర్ యొక్క తాత్వికత (mysticism) తో నిండి ఉంటుంది. ఎన్నో ప్రకారాలుగా ఎన్నో విధాలుగా కబీర్ యొక్క విరహ విదగ్ధ నాయిక తన ప్రియుడైన పరమాత్మ కోసం ఆరాట పడుతుంది.

యా తన్ కా దివలా కరూన్ బాతీ మేలో జీవ్
లోహుం సీన్ఛూ తేల్ యోన్ కబ్ ముఖ్ దేఖౌ పీవ్

ప్రియుణ్ని దర్శించడానికి ఒక దీపం కావాలి. దీపానికి ఒక వత్తి నూనె కావాలి. నా ప్రియుని దర్శించడానికై నా శరీరాన్ని దీపంగా మార్చి నా ఆత్మను వత్తి  లాగా చేసి నా రక్తాన్ని నూనెగా చేసి వెలిగిస్తాను. నా ఆత్మ అనే వత్తి నా రక్తంలో భక్తిని ప్రవహింప జేసి నా స్వామిని దర్శిస్తాను.

ఈ అధ్యాయంలో వున్న దోహాలో రాత్రంతా పరమాత్మను చేరాలన్న ఉత్కంఠతో నాయిక పిల్లలను కోల్పోయిన క్రౌంచపక్షి లాగా రోదిస్తూ రాత్రంతా వెదుకుతూ ఏడుస్తూ గడుపుతుంది. ఈ అధ్యాయంలో మొత్తం 34 దోహాలు ఉన్నాయి. అన్నింటిలోనూ నాయిక విరహాన్ని గురించి విస్తృతంగా చెప్పబడింది. శంఖాన్ని చూస్తూ దానిని సవ్వడి చేయవద్దని నాయిక ప్రార్థిస్తుంది “ఓ శంఖమా! నీవు నీ ప్రియుడైన సముద్రంతో కలవక విడిగా ఉన్నావు. ధైర్యంగా ఉండు. తెల్లవారిన వెంటనే దేవాలయాల్లో నీ ధ్వని వినిపిస్తుంది. సముద్రపు అలలు నిన్ను చేరుతాయి. ఇక్కడ కవి గారు శంఖాన్ని జీవాత్మతో రాత్రిని అజ్ఞానంతో సూర్యుని జ్ఞానం తో పోల్చారు.

“నైన్ హమారే బావ రే చిన్ చిన్ లూరై తుజ్జ
నా తూ మిలై  నా  మై సుఖీ  ఐసీ వేదన్ ముజ్జ”

అన్నదోహా లో కబీర్ ఇలా చెప్తారు “నా పిచ్చి కళ్ళు రెండూ క్షణక్షణం పరమాత్మా! మీకోసం చూసి చూసి రెప్పలాడిస్తున్నాయి. కానీ నీవు దర్శనం ఇవ్వలేదు. నీ దర్శన భాగ్యం పొందకుండా ఇంకా నా ఆవేదన  తీవ్రమవుతున్నది. కబీర్ యొక్క నాయిక తీవ్ర విరహంతో ఇలా అంటున్నది.

“విరహి జలాయి మైన్ జలౌ, జలతీ జలహరి జావూం
మొ దేఖా జలహరి జలై సంతోన్ కహాన్ బుఝాఉం”

“నేను తీవ్ర విరహంతో విరహాగ్నిని పోగొట్టుకోవాలని జలాశయానికి వెళితే ఆ జలాశయమే నా విరాహాన్ని చూసి స్వయంగా మండిపోయింది. సాధువులారా! మీరన్నా నా విరహ వ్యథను చల్లార్చేందుకు దారి చెప్పండి” అని అంటున్న కబీర్ దాస్, “ఆ భక్తుని విరహం లౌకికం కాదు మంటలను చల్లార్చేందుకై నీళ్ళు పోస్తే ఆరిపోతుందని చెప్పడానికి. అది అలౌకికం. భక్తుని ఆరాటం. భగవంతుని దర్శనానికై ఆత్మ అనుభవిస్తున్న క్షోభ. ఆత్మ పోరాటం.” అని సెలవిచ్చారు. ఇదే అధ్యాయములో తనలో ప్రియుని దర్శించుకున్న ఆత్మ అతన్ని చూసి ప్రగాఢ ఆలింగనం చేసుకుని కూడా తృప్తి చెంద లేదు. ఎందుకంటే ఇద్దరూ వేరుగా వుంటేనే రెండు శరీరాలు కలుస్తాయి కానీ అందులో తృప్తి ఉండదు, ద్వైతంలో సుఖం లేదు అద్వైతం లో సుఖం ఉందని భావము. అంటే ప్రభువు పరిచయం అయినప్పటికీ నుండి దేహపుభావం ఉంది. కాబట్టి అందులో ఏకత్వము ఉండదు. దేహ భావన విడిపోయి ఇంద్రియ నిగ్రహంతో విషయ వికారాలు పోతే ఆత్మకు పరమాత్మకు తేడా ఉండదు. అదే ఆత్మ పరమాత్మల కలయిక అద్వైతం. ఆత్మ పరమాత్మలోని అంశం దాన్ని గురించి చెబుతూ కబీరు ఇలా అంటున్నారు. హృదయాంతరాలలో వెలసి వున్న ప్రభువు తో కలిసినప్పుడు మోహ మాయలు దూరమయి నిరంతరమైన ఆనంద సుఖాన్ని ఇస్తుంది.

ఇక ఆరవ అధ్యాయము 'రస్ కో అంగ్'. దీనిలో మొత్తం ఎనిమిది దోహాలు ఉన్నాయి. భగవంతుడి ప్రేమ రసం గురించి అందులో మునిగి పోయిన ఆత్మ గురించి ఇందులో వివరింపబడినది. భగవంతుని ప్రేమలో మునిగిన వారు ఇంకే ప్రేమలో మునుగలేరు. కుమ్మరి వాడు కుండలను కాల్చిన తర్వాత తిరిగి చట్రంలో వుంచి తిప్పలేడు. ప్రభువు యొక్క ప్రేమ ఒక రసాయన దివ్యౌషధము. భగవంతుని మీద మనముంచిన ప్రేమ రసాన్ని అమృతరసం గా భావిస్తున్న కబీరుదాసు ఇలా అంటున్నారు

“హరి రస పియా జానియే జె కబహూ న జాయి ఖుమార్
మై మంతా ఘూమత్ ఫిరై నాహీ తన్  కీ సార్”

“భగవంతుడి పై చూపే అనురాగము, ప్రేమ అన్నీ ఒక విశేష ప్రకారమైన మత్తు మందు వంటిది. ఒక్కసారి తాగితే ఆ మత్తు వదలదు. మదం పట్టిన ఏనుగులు దేవుని ప్రేమ రసాన్ని తాగిన జీవులు తమ శరీర స్పృహ లేకుండా మత్తులో మునిగి ఉంటారు. భగవంతుని మీద మన ముంచే ప్రేమ అలాంటిదే అయి ఉండాలి, ఆ సర్వజ్ఞుడి మీద మనము ఎప్పుడు ఎల్లలు లేని ప్రేమ ఉంచాలి, అందులో మునిగిన వాడు తిరిగి దేన్ని ఆశించడు.

ఆ హరి మీద వుంచిన అనురాగంలో ఓ సారి మునిగితే బయటకు రాలేం. అది మూగ మధురాస్వాదనం. మూగవాడు మాధురాన్ని తింటే చెప్పలేడు. ఆనందంతో అనుభవిస్తాడు. అదేలా భగవంతుని ఆత్మతో ప్రేమించేవారు ఆ ప్రేమలో మునిగి పోతారు, ఆ ప్రేమతోనే అందరినీ చూస్తారు. వాళ్ళకు తన, పర భేదం వుండదు. ఆ స్వామిని సకల బ్రహ్మాండంలో చూస్తారు. ఇలా కబీరు యొక్క సాఖీ భగవంతుని ప్రేమలో భక్తులను ముంచి వేస్తుంది.

****సశేషం****

Posted in October 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!