Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్

కబీర్ దాసు - 02

Kabir Das
Photo Credit: Wikimedia Commons

కబీర్ లోని రచన బీజక్ ను పరిశీలిస్తే దిగువ ఇవ్వబడ్డ విశేషాలు కనబడతాయి. నిర్గుణ పరమాత్ముని పై నమ్మకం: ఈయన కొలిచే  భగవంతుడికి రంగు లేదు ఆయన రూపం, రంగు నామాలకు అతీతుడు. స్వయంగా దాన్ని గూర్చి ప్రస్తావిస్తూ కబీరు “నేను కొలుస్తున్న రాముడు దశరథుని సుతుడు కాడు, నేను కొలిచే నిర్గుణ పర బ్రహ్మ అలౌకిక సర్వ వ్యాపి భగవంతుని పేరు” అన్నారు. కబీరు దోహాలలో హరి, విఠల్, రామ్, మురారి, గోవింద్ అన్న శబ్దాలు కనబడతాయి. అవన్నీ ఆయన వాడిన నామ వర్ణ రూపాతీతుడైన సర్వవ్యాపి అణువు అణువునా నిండిన అలౌకిక పర బ్రహ్మ సూచక శబ్దాలు.

కబీర్ ద్వారా ఆరాధింపబడే భగవంతుడు నిర్గుణ బ్రహ్మ స్వరూపుడైన జ్ఞాన సంపన్నుడు. ఆది, అంతము లేనివాడు. “నిర్గుణ జపహు రే భాయి, అవిగత కీ  గతి లఖి న జాయి” అంటున్నాడు కవి కబీర్. అతడు జననం మరణం లేని వాడు, ఆ అక్షయ పురుషుడు సర్వత్ర వ్యాపించి వున్న మహా వట వృక్షం. అందులోని ఆకులన్నీ (మనమందరం) ఆత్మలే. పరమాత్మలో ఆత్మలన్నీ నిండినవే. ప్రతి అణువు లోనూ వ్యాపించి ఉన్నాడు.

కబీర్ తన ఈశ్వరుని ఇలా కొలుస్తున్నాడు “కస్తూరి జింక తన దగ్గర నుండి వెదజల్లుతున్న పరిమళాన్ని (సువాసనలను) గుర్తించక దానికై వెదుకుతూ, వెదుకుతూ వనమంతా తిరుగుతుంది. అదే లాగా ఆత్మలో దాగి ఉన్న రాముని (భగవంతుని) గుర్తించకుండా మనమందరమూ గుడులు గోపురాలు అంటూ తిరుగుతున్నాము. విశ్వమంతా నిండి ఉన్న నామరూపాలు లేని ఆ పరమాత్ముని భక్తితో భజన చేసి నామస్మరణతో ఆయనలో లీనమై ప్రతి ఒక్కరిలో ఆయనను సందర్శిస్తే ముక్తి తనకు తానుగా లభిస్తుంది. అవతార వాదాన్ని ఖండించడం హిందీ సాహిత్యంలోని నిర్గుణకవుల లక్షణం. ఈ  కవులందరూ కబీర్ దాస్ తో సహా దీన్ని స్వీకరించారు. భగవంతుని అవతారాలను నమ్మలేదు కబీర్. కబీరు దాసుపై  ఆది శంకరాచార్యుల వారి అద్వైత ప్రభావము స్పష్టంగా కనబడుతుంది. అవతార వాదము జనన మరణం తో ముడిపడి ఉంటుంది. కానీ నిర్గుణ సాదువుల ద్వారా పూజింపబడే భగవంతుడు జనన మరణాలకు అతీతుడని వాళ్ళ నమ్మకం. కబీర్ గురువును గోవిందుడి కంటే గొప్పని నమ్మాడు. అంటే గురువు భగవంతుడు కంటే గొప్ప ఎందుకంటే ఆయన మార్గదర్శి. గురువు జ్ఞాన దాత. గురువు వల్లనే మనము భగవంతుని చేరగలమని ఈయన ప్రగాఢ నమ్మకం. గురువు వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, తద్వారా మనకు భగవద్దర్శనం కలుగుతుంది. అందుకే గురువు దేవుడి కంటే గొప్ప అని కబీర్ గారు నమ్మారు. జాతి, మతం పేరున, సంప్రదాయ వ్రతాల పేర్లతో గొడవపడే సమాజపు వ్యక్తులను కబీర్ తూలనాడాడు. భగవంతుని కొలవడానికి స్త్రీ, పురుష, షావుకారు పేదవాడు, కుల మత వర్గ భేదాలు ఉండరాదని కబీరు చెప్పారు.

“జాతీపాంతీ పూచే న కోయి
హరి కొ భజే సొ హారి కా హోయ్”

----- కులాల గురించి అడుగకు, హరిని కొలిస్తే హరికి చెందినవాడివి అవుతావు” అంటే భగవంతుని తలుస్తే ఆయన వాడివి అయిపోతావు. వృత్తి రీత్యా సాలెవాడైన కబీరు గారు ధ్యానం తో అఖండ పండితుడయ్యారు. కబీరు తన సమాజంలో రగులుతున్న హిందూ-ముస్లిం విద్వేషాలను చూసి వాటిని ఎదిరించి సామాజిక ఐక్యతకు కృషి చేసిన కొత్త సమాజ సంస్కర్త, విప్లవవాది.  హిందువులను ముస్లింలను వారి వారి మతం పేరిట జరుగుతున్న మూఢాచారాలను పూజల పేరిట జరుగుతున్నఅన్యాయాలను కబీర్ దాస్ తీవ్రంగా ఖండించారు. మానవత్వం లేని ఇతరులను హింసించి చేసే పూజలన్నీ వ్యర్థమని చెప్పారు. ప్రతిమ పూజ చేయడం, మతం పేరిట జరిగే హింసలు, తీర్థాల, ఉపవాసాల, నమాజుల హజ్ యాత్రల పేరిట జరుగుతున్న అన్యాయాలను అన్నింటినీ కబీరు నిర్భయంగా ఎదిరించిన విప్లవవాది.

“కంకర రాళ్ళతో నిర్మించిన మసీదు నుండి బిగ్గరగా అరిచి అరిచి కోడిలాగా కూయడం ఎందుకు? నీ ఖుదా అంటే దేవుడు నీలోనే ఉన్నాడు కదా! అతను చెవుడు కాదు కదా అని ముస్లింలను పరిహసించాడు. అదేలా, శిలలను దైవమని నమ్మి దాన్ని పూజిస్తున్నారు. దానికంటే పిండిని విసిరే విసుర్రాయి పర్వాలేదు. పదిమందికి అన్నం పెడుతుంది అని హిందువులను కూడా ఎదిరించాడు.

కబీర్ యొక్క తాత్వికత: క్రిందటి సంచికలో దీని గురించి వివరంగా చెప్పబడింది ఆయన తాత్వికత లో ప్రేమాసక్తి తో కూడిన బాధ, ప్రణయానుభూతి తీవ్రంగా కనబడి అది విపరీత విరహ బాధగా మారి అద్వైతవాదం లో కలిసిపోతుంది. కానీ ఈ విరహ వర్ణనలో ఒక విధమైన ఆధ్యాత్మిక అనుభూతి గోచరిస్తుంది. అది వర్ణనాతీతము. అది దేహంతో గాక ఆత్మతో ముడిపడి వుంటుంది. అలవిగాని ఆత్మానుబంధం. ప్రసిద్ధ సాహితీ విమర్శకులు పండిత రామచంద్ర శుక్లా గారు దీని గురించి అభివర్ణిస్తూ “సాధనరంగములో దీన్ని బ్రహ్మంగా భావిస్తాము అంటే సాధన క్షేత్రంలో ఏదైతే బ్రహ్మో సాహిత్యరంగంలో అదే తాత్వికత అనబడుతుంది” అన్నారు. తాత్వికత (హిందీలో రహస్యవాద్) ఇంగ్లీషులోని mysticism అనే శబ్దానికి పర్యాయ పదం. అందుకే కబీరు హిందీ సాహిత్యపు ఆది తాత్విక కవి అయ్యారు. ఆయన తాత్వికతలో ఆది శంకరుని అద్వైత వాదం ఇమిడి ఉన్నది.

“జల్  మేన్  కుంభ్, కుంభ్ మేన్ జల్ హై బీతర్ బాహార్ పానీ
ఫూటా కుంభ్ జల్ జల్ హి సమానా యహ  తత్  కతౌ గయానీ

నీళ్లలోకుండ (కడవ), కుండలో నీళ్లు బయట లోపల నీళ్లే. కుండ పగిలితే ఈ నీరు ఆ నీటిలో కలిసిపోతుంది. అదే జీవిత సత్యము అని కడవ తో దేహాన్ని పోలుస్తాడు కవి కబీర్. అదేలా ఆయన ఇంకో దోహాలో “నీలో నేను చేరలేను. నేను పిలిచినా నీవు రాలేదు. ఇలానే నా జీవితం విరహంతో రగిలి రగిలి అంతం అవుతుంది” అంటారు కబీరు. తన ఆత్మను నాయిక గా తన పరమాత్మను నాయకునిగా వూహించుకొని కబీరు రచించిన దోహాలు కోకొల్లలు. వాటిపై పరిశోధనలు అన్నీ భారతీయ భాషలలో జరగాలి.

దేవుడిని బాహాటంగా పూజించే దేవాలయ పద్దతులు, మసీదులో అరుస్తూ చేసే నమాజులను  విగ్రహారాధనలను నిషేధించిన కబీరు, ‘దేవ నామస్మరణ భజనలను మాత్రం వదలకు’ అంటున్నారు. ఏ పేరైనా పెట్టి పిలుచుకో, ఆ దేవుని కానీ ఆయనను ఎల్లప్పుడూ స్మరించుకో అంటున్నారు. మనసు లోపల దాగి ఉన్న భగవంతుని హృదయంలోనే స్మరించు. ఆయనను మౌనంగా ఏకాగ్రతతో ఆరాధించు. పెదవులను కూడా కదపకు, మనసులో ఆయన నామాన్ని స్మరించు, భజించు. విడువకు ఆయనే నీకు ఆత్మ బంధువు. లేగ దూడ ఎలా ఆవును చూసి గెంతులేస్తూ వస్తుందో నీ మనస్సు అలా ఆ భగవంతునికై తహ తహ లాడాలి అంటున్నారు కబీరు.

ప్రేమకు విలువ ఇచ్చే కబీరు ఈశ్వరుని ప్రేమ స్వరూపుడిగా అభివర్ణిస్తున్నారు

“పోథీ పఢి పఢి జగ్ మువా, పండిత్ భయా న కోయీ
ఢాయి అక్షర్  ప్రేమ్ కా పడేసు పండిత్ హోయ్”

అన్న దోహాలో శాస్త్ర గ్రంథాలను చదివినంత మాత్రాన పండితులం (జ్ఞానులు) కాలేం. “ప్రేమ” అనే రెండున్నర అక్షరాన్ని హృదయాన చదివిన వాడే నిజమైన పండితుడు. ప్రేమ లేనివాడు మనిషే కాదు అన్న భావన కబీరు లో దాగి వుంది. ఇదే విషయాన్ని ఇంకోచోట ప్రస్తావిస్తూ కబీరు, “ప్రేమ లేని హృదయం శ్మశానం తో సమానము” అని చెబుతున్నారు.

కబీర్ దోహాలలో పదిమందికి సహాయపడే సామాజిక భావన, పరోపకారం దయార్ద హృదయం, అందరినీ సమానంగా ప్రేమతో చూసే విశ్వ బంధుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. కబీర్ భక్తిలో దేవుని పొందాలన్న తృష్ణ తపన మాత్రమే ఉంటుంది. “నాకు సంపదలన్నీ ఇచ్చి నన్ను షావుకారుని చెయ్యి” అని కబీరు ఎప్పుడూ అడగలేదు. సంతృప్త మనసుతో సాదా జీవనంతో జీవితాన్ని నెట్టుకు వచ్చే వ్యక్తిత్వం కలవారు మహాత్మ కబీరు.

“సాయీ ఇత్ నా దీజియే జామే కుటుంబ సమాయ్” అన్న దోహాలో కబీరు “భగవంతుడా! నా కుటుంబానికి తగినంత ఆహారం ఇవ్వు. మేము ఆకలితో మద్య కూడదు, నా ఇంటికి వచ్చే అతిథులు ఆకలితో వెళ్ళకూడదు. దానికి సరిపడే ఆహారాన్ని సమకూర్చే శక్తిని మాకు ప్రసాదించు అన్న మహానుభావుడు. మహిళలపై కబీరు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ కబీరు “కనక కామినీలతో దూరంగా ఉండాలని” చెప్పారు. అగ్నిలో పడిన దూదిలా నారీ వలలో పడిన పురుషులను పోల్చాడు కబీరు. ‘మహిళల వల్ల మాయ కలిగి భ్రమలో చిక్కుకు పోతారు’ అన్నారు. మరో ప్రక్క పతివ్రత అయిన స్త్రీలకు చేతులెత్తి దండం పెడుతున్నాడు.

“పతివ్రతా  మైలీ భలీ ..” అన్న దోహాలో కురూపి మురికిగా కనబడుతున్న పతివ్రత నారి, కోటి సౌందర్య రాశుల కంటే మిన్న యని ప్రశంసించారు.

ఆదిశంకరాచార్యుల అద్వైతవాదాన్ని నమ్మిన కబీరు ఈ జగత్తు మాయలో పడవద్దని హెచ్చరించాడు. కబీర్ భాషను సధుక్కడీ లేదా కిచడి అంటారు. అందులో రాజస్థానీ, భోజ్ పురి, బ్రజ్, అవధి, అరబీ మొదలకు వాడుక భాషలెన్నో కలిసిన మిశ్రిత భాష కలగాపులగంగా కనిపిస్తుంది. దాని గురించి చెబుతూ కబీర్ గారు “కాగద్ మసి ఛూయో నహీ కలం గహ్యో న హాథ్ అన్నారు (నేను కలము గాని సిరా గాని కాగితం గాని చేతితో తాక లేదు). ఈయన భాష ఆడంబరము లేని లౌకిక సామాన్య జన భాష. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రియ భాష. అందులో ఎన్నో వాడుక భాషలోని శబ్దాలు, మాండలిక శబ్దాలు కలగాపులగంగా కనిపిస్తాయి.

****సశేషం****

Posted in September 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!