Menu Close
విక్రమేణాంకము*
* విక్రమ్ (Lander) + ఏణాంకము (చంద్రునకు సంబంధించినది)
-- అయ్యగారి సూర్యనారాయణమూర్తి --
ఉ.
భారతమాత తమ్ముఁ డయి బాలల, పెద్దల కెల్ల మామగా
పేరు గడించు బంధువుని ‘విక్రమ’సార్థకనామధేయుఁడై
చేరిన ముద్దుబాలకునిఁ జేతులఁ గైకొని హత్తుకొన్న యీ
తీరు చరిత్రలో నిలిచె దేశవిదేశము లెల్ల మెచ్చఁగన్
పంచచామరము
అనుక్షణంబు శ్రద్ధతోడ నాత్మధైర్య మొప్పఁగా
కనన్ వినన్ భయంబు మాని కష్టసాధ్యకార్యసు
స్వనంబు, దృష్టి యేకమౌచు సల్పినట్టి యజ్ఞమే
ఘనంబుగా ఫలించె దేశగర్వకారణంబుగా
ఉ.
మాటలు చాల వీ విజయమాధురిఁ దెల్పఁగఁ ‘జంద్రయానమే’
చాటెను గాదె ధీగరిమఁ? జక్కని సంస్కృతి కూఁత(1) నిచ్చి యీ
పూటను భారతీయులను ముందుగఁ బేర్కొనఁజేసి ‘యిస్రొ’ యే
ర్పా టొనరించె దక్షిణధ్రువంబున శాశ్వతముద్ర వేయఁగా
ఉ.
మాతఋణంబుఁ దీర్చుకొన మానవసాధ్యము గాదు భారత
క్ష్మాతలజన్ములై వివిధశాస్త్రవిశారదులైన ధీయుతుల్
మాతఋణంబుఁ దీర్చుకొను మాన్యులుగా నిలువంగ లోకమే
జోతలు(2) సేయునట్టి మనజోదుల(3) కెల్ల నమస్కరించెదన్
తే.గీ.
రత్నగర్భగఁ బేర్గాంచె నాఁడు, నేఁడు
క్షమయు, జ్ఞానంబు గల్గ విశ్వమున నెందు
కాలు పెట్టిన నెదురగుఁ గాదె స్వాగ
తంబు స్రష్టయె పల్కఁగఁ దరతరాల(4)
............(1) ఊత = ఆసరా (2) నమస్కారములు
............(3) సమర్థులకు (4) భావికాలములో
కం.
భువి జన్మించి శశాంకుని
‘శివశక్తి’యె మూల మగుచుఁ జేరిన ‘ప్రజ్ఞే’
వివిధపరిశోధనాంకము
లవిరళముగఁ బంపు భారతాంబిక మెచ్చన్
......-.శివజటాజూటములో అలంకారమైన చంద్రుని శక్తియుతుడైన
...........శివుని మూలముగా చేరుకొన్న భారతప్రజ్ఞ ఎన్నో విజయాలను
...........సాధించడం గమనార్హం. అదే సౌందర్యలహరికి ప్రారంభం.
Posted in September 2023, సాహిత్యం, సిరిమల్లె

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!