Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

పుట్టినరోజు – పండుగరోజు

కృష్ణానంద ఒకరోజు తన స్నేహితుడు బంటీ పుట్టినరోజు వేడుకకు వెళ్లి వచ్చాడు. ఇంటికి రాగానే కృష్ణానందను, "వేడుక ఎలా జరిగిందిరా?", అడిగింది ప్రసూనాంబ.

"ఓ! చాలా బాగా చేశారు బామ్మా! మా స్నేహితులందరూ వచ్చారు. బంటీ వాళ్ళ ఇంటిని రంగురంగుల కాగితాలతో అలంకరించారు. బంటీ కొవ్వొత్తులు ఊది కేకును కోశాడు. మా అందరికీ ఆడుకునేందుకు చిన్న చిన్న బుడగలిచ్చారు. ఊదడానికి బూరాలు కూడా ఇచ్చారు. కొన్ని చిరుతిళ్ళు పెట్టారు. కానీ వాటిలో నూనె, కారం ఎక్కువగా ఉండేసరికి మాలో కొందరికి దగ్గు వచ్చింది. వేడుక పూర్తి అవ్వగానే ఆ బుడగల్ని మేము పేల్చేశాం!", అన్నాడు కృష్ణానంద.

"సరే. కాళ్ళూ, చేతులూ కడుక్కుని రా! నీకోసం అమ్మ పులిహోర చేసింది. తిందువుగాని!", అంది ప్రసూనాంబ. మీనాక్షి కృష్ణానందకు పులిహోర పెట్టింది.

అది తింటున్న కృష్ణానంద, "అమ్మా! ఈసారి బంటీ పుట్టినరోజులాగా నా పుట్టినరోజు వేడుక కూడా ఘనంగా చెయ్యాలి. మా స్నేహితులందరినీ పిలిచి నేను కూడా కొవ్వొత్తులూది కేకును కోస్తా!", అన్నాడు కృష్ణానంద.

"మనం పుట్టినరోజును జరుపుకునే పధ్ధతి వేరు కదా!", అంది మీనాక్షి.

"అదేమీ కుదరదు. నా పుట్టినరోజు వేడుక నేను చెప్పినట్లు ఘనంగా చెయ్యాల్సిందే!", అంటూ మారాం చేశాడు కృష్ణానంద.

మీనాక్షి కృష్ణానందను ఊరుకోపెట్టేందుకు ప్రయత్నించి అది కుదరక, "అత్తయ్యగారూ! మనం పుట్టినరోజు జరుపుకునే పద్దతి గురించి వీడికి మీరే చెప్పాలి!", అంది.

అప్పుడు ప్రసూనాంబ కృష్ణానందను దగ్గరకు పిలిచి, "ఒరేయ్ కృష్ణా! ఈసారి నీ పుట్టినరోజు ఎప్పటికన్నా ఘనంగా జరుపుతాం. అలా జరిపే పూచీ నాది!", అంది.

ప్రసూనాంబ సమాధానంతో కృష్ణానంద తృప్తి చెంది చదువుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొద్దినెలలు గడిచాయి. కృష్ణానంద పుట్టినరోజు వచ్చింది.

ఆ రోజు తెల్లవారుతూనే, "బామ్మా! మనం వెళ్లి కేకును కొనుక్కొద్దాం. రా!", అన్నాడు కృష్ణానంద.

"ఓ! అలాగే!  కేకు సిద్ధంగా ఉంచమని నేను షాపువాడికి నిన్ననే చెప్పాను. కానీ వాడు కేకులు సాయంత్రం చేస్తాడట. ముందే చేస్తే బాగుండదని చెప్పాడు. కాబట్టి కేకు తెచ్చుకోవడానికి మనం సాయంత్రం వెడదాం. ఇప్పుడు నువ్వు త్వరగా తలస్నానం చెయ్యి. సాయంత్రంలోపు పనులన్నీ గబగబా పూర్తి చేసేసుకుందాం", అంటూ కృష్ణానందకు తలంటు పోసింది ప్రసూనాంబ.

ఆ తర్వాత మీనాక్షి, ప్రసూనాంబలు కృష్ణానందకు హారతినిచ్చి సుందరం, సదాశివలతో కలిసి వాడిని ఆశీర్వదించారు. కృష్ణానంద కొత్తబట్టలు వేసుకుని సుందరం, ప్రసూనాంబలతో వారి ఊళ్లోని శివాలయానికి వెళ్ళాడు. శివార్చన తర్వాత కృష్ణానంద చేత ఆ గుళ్లోని పురోహితులవారికి దక్షిణ ఇప్పించి ఆయనకు దణ్ణం పెట్టించింది ప్రసూనాంబ. కృష్ణానంద ఇంటికొచ్చేసరికి మీనాక్షి కృష్ణానందకు ఇష్టమైన చక్రపొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి భోజనాలు వడ్డించింది. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగాడు కృష్ణానంద. అంతలో కృష్ణానంద ఇంట్లో పని చేసే వాళ్ళందరూ వచ్చారు. వారికి కృష్ణానంద చేత బట్టలూ, కానుకలూ ఇప్పించింది ప్రసూనాంబ. వాళ్లంతా వాటిని ఎంతో సంతోషంగా తీసుకుని కృష్ణానందను మనస్ఫూర్తిగా దీవించి వెళ్లారు. కేకు తీసుకురావడానికి మరికాస్త సమయముందని ప్రసూనాంబ చెప్పడంతో వాకిట్లో ఆడుకోవడానికి వెళ్ళాడు కృష్ణానంద. అప్పుడు ఒక బిచ్చగాడు ఇంటి ముందుకు వచ్చి, తనకు ఆకలేస్తోందంటూ తినడానికి ఏదైనా ఇవ్వమని కృష్ణానందను బతిమలాడుతున్నట్లుగా అడిగాడు. చిరిగిన బట్టలు వేసుకుని దీనంగా, నీరసంగా కనపడుతున్న ఆ బిచ్చగాడిని చూసేసరికి కృష్ణానందకు అతడిపై జాలి వేసింది.

వెంటనే కృష్ణానంద ప్రసూనాంబ దగ్గరకు వెళ్లి, "బామ్మా! మన భోజనాలయ్యాక అన్నం మిగిలిందా?", అని అడిగాడు.

"మిగిలిందిరా! ఎందుకూ?", అడిగింది ప్రసూనాంబ.

"బయట ఒక బిచ్చగాడు వచ్చాడు. అతనికి ఆకలి వేస్తోందట. అన్నం పెడదాం!", అన్నాడు కృష్ణానంద.

"సరే. అతడిని పెరట్లోకి  రమ్మను!", అంది ప్రసూనాంబ. మీనాక్షి విస్తరి వేసి బిచ్చగాడికి భోజనం వడ్డించింది. బిచ్చగాడు మంచి ఆకలిమీద ఉన్నాడేమో క్షణంలో వడ్డించినవన్నీ తినేశాడు.

"బామ్మా! అతనికి మంచి బట్టలు ఇద్దామా?", గుసగుసలాడుతూ అడిగాడు కృష్ణానంద.

"ఓ! తప్పకుండా", అంది ప్రసూనాంబ. విషయం తెలుసుకున్న సుందరం మంచి బట్టలతోపాటూ కొంత డబ్బును కూడా బిచ్చగాడికి ఇచ్చి అతడికి తగిన పని ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పాడు.

బిచ్చగాడికి చాలా ఆనందం కలిగింది. అతడు చెమర్చిన తన కళ్ళను తుడుచుకుంటూ కృష్ణానంద వంక చూసి, "నువ్వు వెయ్యేళ్ళు చల్లగా వర్ధిల్లు బాబూ! నీ మంచి మనసు ఎప్పటికీ ఇలాగే ఉండాలి!", అన్నాడు.

కృష్ణానందకు ఒక మంచి పని చేశానన్న తృప్తి కలిగింది. సాయంత్రం సుందరం, సదాశివలు వెళ్లి కేకును, మిఠాయిలనూ పట్టుకొచ్చారు. కృష్ణానంద స్నేహితులందరూ వచ్చారు.

"బామ్మా! మరి కొవ్వొత్తులూ?", ప్రసూనాంబను అడిగాడు కృష్ణానంద.

"అయ్యో! అవి తీసుకురాలేదు!", అంది ప్రసూనాంబ.

కేకు చూసి పిల్లలందరికీ నోరూరుతూ ఉండటంతో వాళ్ళు ముందు కేకును కొయ్యమని కృష్ణానందను తొందర పెట్టారు. కృష్ణానంద కేకును కోసి, దానిని మిఠాయిలతో సహా తన స్నేహితులతో పంచుకున్నాడు. వేడుకకు వచ్చినవారంతా కేకును, మిఠాయిలనూ ఎంతో ఇష్టంగా తిని వెళ్లిపోయారు.

ఆ రాత్రి కృష్ణానంద ప్రసూనాంబతో, “బామ్మా! ఇవాళ నా పుట్టినరోజు బాగా జరిగింది కదూ? ఏదో పండుగ వచ్చినట్లుగా అనిపించింది. నువ్వు కొవ్వొత్తులు కూడా తెస్తే ఇంకా బాగుండేది", అన్నాడు.

అందుకు ప్రసూనాంబ,"కృష్ణా! నేను కొవ్వొత్తులను కావాలనే తీసుకుని రాలేదురా. ఎందుకంటే, పుట్టినరోజు నిజంగా మనకు పండుగ రోజే! పండుగనాడు మనకు శుభం కలగాలని కోరుతూ మనం దేవుడి సన్నిధిలో దీపాలను వెలిగిస్తాము. అంతేకానీ వాటిని ఊది ఆర్పమురా! అలా ఆర్పకూడదు కూడా! ఎవరికీ ఉపయోగపడని అలంకరణలకు డబ్బు ఖర్చు చేసే బదులు అవసరంలో ఉన్నవారికి కావలసినవి దానం చేయడంవల్ల మనకు మంచి జరుగుతుంది. బంటీగాడి వేడుకలో పిల్లలందరూ ఆ కాసేపూ సరదాగా గడిపారు. ఆ తర్వాత ఎవరో కొద్దిమంది మాత్రమే అక్కడ జరిగినవన్నీ గుర్తుపెట్టుకుని ఉంటారు. ఇవాళ నువ్వు పిలిచి భోజనం పెట్టిన బిచ్చగాడు ఆ విషయం తన జీవితాంతం గుర్తుపెట్టుకున్నా ఆశ్చర్యం లేదు! అతడికి తాతయ్య చెప్పిన చోట పని దొరికితే మనకు అంతకన్నా ఆనందం ఏముంటుందీ? మన పుట్టినరోజును పది మంది పండుగరోజుగా జరుపుకుంటేనే కదా మన జన్మకు సార్ధకత!", అంది.

"నిజమే బామ్మా! ఇకనుండీ నా పుట్టినరోజునాడు ఇలాగే ఎవరికైనా సహాయం చేసి ఒక మంచి పని చేస్తా!", అన్నాడు కృష్ణానంద.

"నా బంగారు కొండ!", అంటూ కృష్ణానంద నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుంది ప్రసూనాంబ.

****సశేషం****

Posted in September 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!