Menu Close
తెలుగు పద్య రత్నాలు 27
-- ఆర్. శర్మ దంతుర్తి --

పురాణ కధలు కానీ, మనని తెలుసున్న భక్తుల కధలు కానీ చదివితే మనకి అర్ధమయ్యే విషయం ఒకటుంది. భగవంతుడు కనిపించాలంటే నిరంతరం ఏ కష్టం ఎదురైనా ఆయన మనసులో మెదులుతూ ఉండాలి. కంసుడికీ, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులకీ జరిగినది అదే. ఏ క్షణం లో శ్రీహరి వచ్చి చంపుతాడో అనుకుంటూ ఆయన్నే నిరంతరం గుర్తు చేసుకోవడం వల్ల వాళ్ళు చివరకి భవవంతుణ్ణి చేరుకుంటారు. ఆ గుర్తు చేసుకునేది సంతోషంగా స్నేహపూరితంగానా లేక శతృత్వంతోనా అనేది అంత ముఖ్యం కాదు. ఈ విషయం కృష్ణుడు గోపికలతో చెప్తున్నదే ఈ నెల పోతన భాగవతం, దశమ స్కంధం లోని పద్యం.

మ.
నను సేవించుచునున్నవారలకు నే నా రూపముం జూపఁ జూ
చినఁ జాలించి మదించి వారు మది నన్ సేవింపరో యంచు ని
ర్ధనికుం డాత్మధనంబు చెడ్డ నెపుడుం దత్పారవశ్యంబుఁ దా
ల్చి
న భంగిన్ ననుఁ బాసి మత్ప్రియుఁడు దాఁ జింతించు నా రూపమున్ [10.1.1079]

రోజూ తననే తలుచుకునేవారికి భగవంతుడు తన రూపం చూపించడుట. అదేమిటి, ఎన్నో ఏళ్ళు కంసుడికీ, హిరణ్యకశిపుడికీ భగవంతుడు మనసులో అనుక్షణం మెదుల్తున్నా ఎదురుగా కనిపించలేదేమిటి అనేదానికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. ప్రత్యక్షంగా కనిపిస్తే – ఓహో నాకు భగవంతుడు నిజంగా కనిపించాడు ఇంక నేను ఏమీ చేయక్కర్లేదు, నేను గొప్పవాణ్ణి సుమా అనే గర్వం మనసులో మెదుల్తుంది. అందువల్ల నన్ను సేవించడం మానేస్తారు (మదించి వారు మది నన్ సేవింపరో యంచు). అయితే దరిద్రుడు (నిర్ధనికుండు, డబ్బు లేనివాడు) తన దగ్గిర ఉన్న కొంచెం డబ్బు పోయినా దాని గురించి అంతులేని చింత తో (ధనంబు చెడ్డ నెపుడుం దత్పారవశ్యంబుఁ దాల్చి న భంగిన్) నిరంతరం దాని గురించే ఆలోచిస్తాడు కదా; అదే విధంగా నేను కనిపించీ కనిపించనట్టు ఉంటే భక్తుడు వదలకుండా నన్నే చింతిస్తూ ఉంటాడు (ననుఁ బాసి మత్ప్రియుఁడు దాఁ జింతించు నా రూపమున్). అందుకే తన రూపం చూపించడుట. దీనికి అర్ధం మరో కోణంలోంచి చూడవచ్చు.

మానవజీవితంలో మనం అందరం గమనించినది ఒకటుంది. ఏది మన దగ్గిర ఉందో దాని మీద వ్యామోహం తీరిపోతుంది అతి తొందర్లోనే. అప్పట్నుంచి మనకి లేని దానిమీదా, దాదాపు అందని ద్రాక్షలమీదా మనసు పరుగెడుతూ ఉంటుంది. డబ్బు సంపాదన, సినిమా తారల మీద వ్యామోహం ఇటువంటివే. మొదట్లో నాకు సరిపడా ధనం వస్తే చాలు అనుకోవడం. తర్వాత ఇది చాలదు రోజూ నడవడానికి కష్టం, సైకిల్ ఉంటే బావుణ్ణు. మోటార్ సైకిల్ ఉంటే అనేది తర్వాత. ఆ పైన కారు కొనుక్కోడానికి డబ్బుంటే? ఇంకా పైకెళ్ళాక కారులో మరో రకం; అదృష్టం కొద్దీ బాగా డబ్బొస్తే కారుకి డ్రైవరూ, ఇంట్లో నౌకర్లూ చాకర్లూ వగైరా. సంతోషం ఉందా అప్పుడైనా? ఈ విషయంలో కొంచెం లోతుగా ఆలోచిస్తే ఎంత డబ్బు వస్తే ‘ఇంక చాలు’ అనుకునే స్థితి వస్తుంది? దానికి సమాధానం అందరికీ తెల్సినదే. కానీ ఉన్న డబ్బు అంతా పోతే? దాని గురించి ప్రతి క్షణం ఏడుస్తూ కూచోడం మనకి తెల్సినదే కదా? ఇక్కడ చిన్న సరదా కధ చెప్పుకుందాం – అత్యాశ అనే దానిమీద. అయితే ఈ అత్యాశ పనికి వచ్చేది ఒకే ఒక విషయంలో – భగవంతుణ్ణి చూడడానికి మాత్రమే - పనికివస్తుంది/రావొచ్చు.

ఒకాయనకి ఎవరో చెప్పారు ఈ కొండ మహత్తరమైనది. ఎక్కుతూ ఉంటే అనేక కోరికలు తీరి డబ్బులొస్తాయి అని. ఆయన ఎక్కడం మొదలుపెట్టాడు. మొదట్లో వెండి కనిపించింది. సరే దాన్ని వదిలేసి ముందుకి వెళ్ళాడు మరో విలువైనది కనిపిస్తుందేమో అని. బంగారం కనిపించింది. ముందు వెండి, ఇప్పుడు బంగారం; అంటే పైన వజ్రాలో మరో విలువైనదో ఉండొచ్చు అనుకుని పైకి వెళ్ళాడు. నిజంగానే వజ్రాలు కనిపించాయి. అప్పుడే వదిలేస్తే ఎలా? ఇప్పటికే వెండి, బంగారం వజ్రాలు అయితే ముందు ఉన్నది మరింత విలువైనది కాబోలు. పైకి ఇంకా వెళ్ళగానే ఒకాయన నెత్తిమీద ఓ కిరీటంతో కూర్చుని ఉన్నాడు. వచ్చిన ఈయన్ని చూడాగానే ఆయన చెప్పాడు – ‘హమ్మయ్య ఇన్నాళ్లకి నువ్వొచ్చి నా బాధ తీర్చావు తీసుకో ఈ కిరీటం.’ అలా అనగానే ఆయన కిరీటం ఈయనకి వచ్చింది. ఆ కిరీటం ముళ్ళతో చేసినది. తలలో రక్తాన్ని నిరంతరం మధిస్తూ ఉంటుండి. ఈయన ‘ఇది నాకొద్దు బాబోయ్ నేను కిందకి వెళ్ళిపోతాను’ అన్నాడు. “అలా కుదరదు; నువ్వొచ్చే దాకా నేను వేచి చూసాను కదా, అలాగే మరొకరు వచ్చేదాకా నువ్వు ఇక్కడ కూర్చోవాలి; అది ఈ కొండ మీద రహశ్యం” అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అంటే కోరిక ఎక్కువయ్యే కొద్దో అందులో ఉండే దరిద్రం ఎక్కువౌతూ ఉంటుంది. ఆ కోరిక తీరితే వెంఠనే మరోటి పుట్టుకు రావడం లేదా అది తీరినందుకు ఆ వస్తువంటే వెగటు పుట్టడం సర్వసాధారణం. అదే కోరిక తీరకపోతే? దాని గురించే నిరంతరం ఆలోచిస్తాం కదా? అదే కృష్ణుడు చెప్పిన విషయం ఈ పోతన పద్యంలో. నేను కనిపిస్తే మర్చిపోతారు, లేదా గర్వం ఎక్కువౌతుంది (మదించి) అందువల్లే కనిపించీ కనిపించనట్టూ ఉంటాడు భగవంతుడు. అయితే అసలు ఈ భగవంతుణ్ణి చూడడం కుదురుతుందా, కుదిరితే ఎలా? దానికి సమాధానం “హరి మయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పనిలేదా….” అనే పద్యంలో చూడవచ్చు. సర్వం విష్ణుమయం జగత్ అనేదానికి అర్ధం ఇదే.

ఎప్పుడైతే అలా ‘సర్వం విష్ణుమయం’ గా చూడడం అలవాటు అయిందో అప్పుడు భగవంతుడు లేని చోటు లేదనీ, తాను, తన ఎదురుగా ఉండే శతృమితృలు అందరూ కూడా భగవత్స్వరూపాలే అని తెలిసి వస్తుంది. ఈ విషయం భగవద్గీత భక్తియోగం లో “సమ శత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో, శీతోష్ణ సుఖ దుఃఖేసు సమః సంగ వివర్జితః“ అనే శ్లోకంలో కూడా చూడవచ్చు. దీన్నే శివానందులు చెప్పడం ప్రకారం, ‘ఎప్పుడైతే నీలో భగవంతుడి గురించి అలజడి మొదలైందో అది భగవతుండి అనుగ్రహానికి చిహ్నం. దాన్ని వదిలెపెట్టకుండా సాధన జీవితాంతం చేస్తూ ఉండవల్సిందే.” అయితే భగవంతుడు నిజంగా ఎప్పుడు కనిపిస్తాడు? క్రితం నెల వ్యాసంలో చెప్పినట్టూ అది భగవంతుడికి తప్ప మరెవరికీ తెలియదు.

****సశేషం****

Posted in September 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!