Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

ఆధునిక తెలుగు సాహిత్యపు పోకడలు

(వచన కవిత పేరులోని వైరుధ్యం)

వచన కవిత అన్న పేరు గురించి సాహితీ విమర్శకులు అంతగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది. నిజానికి వచన కవిత అన్న పేరే వైరుధ్యంతో కూడినది. సాహిత్యాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా చెయ్యొచ్చు. అవి, నాటకం, కవిత్వం, వచనం. మొదటిదైన నాటకం తక్కిన లలితకళలైన నటన, నట్టువ, సంగీతాలను, ఇంకా వీలైతే శిల్పాన్ని కలుపుకుని రాణిస్తుంది.

కవిత్వానికి, వచనానికి లక్షణ బేధం స్పష్టంగా ఉన్నది. ఒక విషయాన్ని కేవలం అలంకారికంగానే కాకుండా లయాత్మకంగా కూడా చెప్పినప్పుడే అది కవిత్వమవుతుంది. అలంకారం, లయల్లో ఏది లోపించినా అది కవిత్వమనిపించుకోదు.

ఆధునిక తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్య పంథాను అనుసరించింది. ఆంగ్ల సాహిత్య ప్రక్రియైన Short Story ని కథానికగాను, Novel ను నవలగాను, Free Verse ను వచనకవిత గాను తెలుగులోకి దిగుమతి చేసుకుని అనుసృజన చేసుకుంటున్నాము.

వచనాన్ని అలంకారికంగా చెప్పినపుడు అది కవితాత్మకంగా ఉంటుంది. దాన్నే ఆంగ్లంలో Poetic Prose అంటారు. వచన కవిత అన్న పేరును యధాతధంగా ఆంగ్లంలోకి అనువదిస్తే Prose Poem అనబడుతుంది. నిజానికి Prose Poem అన్నది ఉండదు. అయితే గీతే అది Free Verse Poem అన్నా అవ్వాలి లేదా Poetic Prose అన్నా అవ్వాలి. Free Verse Poem కవిత్వ విభాగానికి, Poetic Prose వచన విభాగానికి చెందుతాయి. నిజానికి తెలుగులో మనం వచన కవిత అంటున్నామని అనుకుంటున్నది చంధోబద్ధం కాని పద్యాన్ని. వ్యావహారికంలో మటుకు Poetic Proseని కూడా వచన కవితనే అంటున్నాము. కవిత్వానికి స్థూల రూపాలే పాటలు, పద్యాలు. అవి పాడుకోవడానికి అనువుగా ఉంటాయి. పాటకు స్వర కల్పన కావాలి, పద్యానికి అవసరం లేదు. పద్యానికి గణ, యతి, పాద, ప్రాస నియమాలుంటాయి. అవి లేనప్పుడు అది అనిబద్ధ పద్యమవుతుందే కాని వచన కవిత అవ్వదు.

ఇటీవలే రవూఫ్ గారు గద్య కవితను విడిగా గుర్తించామా? అనే విమర్శను ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాశారు. అందులో రవూఫ్ గద్య కవిత అన్న పేరే ఉపయోగించినప్పటికీ అనిబద్ధ పద్యానికి, కవితాత్మక వచనానికి ఉన్న తేడాలపై దృష్టి ప్రసరింపజేశారు. రవూఫ్ సూచించిన అనిబద్ధ పద్యం అన్న పేరును వచన కవిత స్థానంలో ఉపయోగించడం సమంజసమనిపిస్తుంది. అలానే రవూఫ్ వ్యాస శీర్షిక కవితాత్మకంగా రాసిన వచనాలను స్వతంత్ర సాహితీ ప్రక్రియగా గుర్తించామా? అన్న ప్రశ్నను సంధిస్తున్నట్లున్నది..

కవితాత్మక వచనం ఒక స్వతంత్ర సాహితీ ప్రక్రియగా ఎదిగేందుకు అన్ని విధాలా అవకాశాలు ఉన్నవి. ఆంగ్ల రచయిత ఖలీల్ జిబ్రాన్ రచనలైన ది ప్రోఫెట్, ది మ్యాడ్మాన్, ది ఫోర్రన్నర్ వంటివన్నీ కవితాత్మక వచనాలే, సమగ్రమైన స్వతంత్ర గ్రంథాలే. ఆ రచనల స్పూర్తితో గూఢత కన్నా గాఢతకు, సుందరతతో పాటు సరళతకు ప్రాధాన్యం ఇస్తూ కథల పరిణామంలో తెలుగులో కవితాత్మక వచనాలను అందిస్తే పాఠకులు ఆదరించవచ్చు.

- ఓం తత్ సత్ -

Posted in September 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!