Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

సంధ్యావందనం వగైరా నిత్యానుష్టానాలన్నీ పూర్తి చేసుకుని యాజులుగారు బయటికి వచ్చేసరికి, నిద్ర లేక వాడిపోయివున్న ముఖంతో సూట్కేసుని చేత్తోపట్టుకుని, చీడీలెక్కి లోనికి వస్తున్న జీవన్ కనిపించాడు. అతని వెనకే ఆటో డ్రైవర్, గోనెమూట తెచ్చి గుమ్మంలో ఉంచి, డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు.

"వచ్చేశావా, భేష్! ప్రయాణం బాగా సాగిందా? కరణంగారింట్లో అంతా బాగున్నారా" అంటూ కుశల ప్రశ్నలు వేశారు యాజులుగారు.

"ఆ అంతా బాగున్నారు. మిమ్మల్నందరినీ అడిగినట్లు చెప్పమన్నారు. వెళ్ళిన పని చక్కగా పూర్తయ్యింది తాతయ్యా!. డబ్బు తెచ్చాను" అంటూ జీవన్ అక్కడున్న బల్లమీద నీరసంగా కూలబడ్డాడు.

"అమ్మా, మీనాక్షీ! ఎవరొచ్చారో చూడు" అంటూ కేకపెట్టారు యాజులుగారు.

ఆ కేక విని వచ్చిన మీనాక్షికి కొడుకు కనిపించేసరికి మహదానందమయ్యింది.

"ప్రయాణం బాగా సాగిందా? ఎంతసేపయ్యింది వచ్చి? వెళ్ళినపని సవ్యంగా పూర్తయ్యిందా" అంటూ రకరకాల ప్రశ్నలు గుప్పిస్తున్న మీనాక్షిని ఆపి అన్నారు యాజులుగారు...

"ఉత్తుత్తిమాటలు వద్దు, రాత్రంతా నిద్రలేక బాగా అలసివున్నాడు. కాస్త కాఫీ ఇచ్చి, తినడానికి ఏదైనా పెట్టు. ముందు సంరక్షణ చూడు" అని, ఆపై జీవన్ వైపుకి తిరిగి, "ముందుపని ముందు కానియ్యరా అబ్బాయీ! వ్యవహారం తరవాత మాటాడుకోవచ్చు. ఈలోగా నేను తులసికోటలో నీళ్ళు పోసి వస్తాను" అని చెప్పి నిత్యానుష్టానవిధిని పూర్తిచెయ్యడానికి వెళ్ళిపోయారు ఆయన.

మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి జీవన్ కాఫీ టిఫిన్లు పూర్తి చేసుకునివచ్చి, బల్లమీద విశ్రాంతిగా కూర్చుని డెయిలీ న్యూస్ పేపరు చదువుతున్న వాడల్లా, ఆయన్ని చూడగానే పేపరు మడిచి పక్కనపెట్టి లేచాడు. పెట్టి తెరిచి నోట్లకట్టలు యాజులుగారి ముందుంచాడు.

*     *     *

యాజులుగారి అమెరికా ప్రయాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. పాస్పోర్టు రాగానే అమెరికానుండి స్పాన్సర్ పేపర్లు పంపించాడు యాజులుగారి కుమారుడు. ఆ తరువాత పెద్ద కష్టమేమీ లేకుండానే వీసాలుకూడా వచ్చేశాయి వాళ్ళ నలుగురికీ. ప్రతి విషయంలోనూ యాజులు తాతయ్యకి జీవన్ సాయపడుతూనే ఉన్నాడు. పెద్దాయనకు సాయపడడం కోసమని తన బిజినెస్ ప్లానుకి కూడా వాయిదావేశాడు జీవన్. ప్రయాణానికి తగిన ముహూర్తం చూసి టిక్కెట్లు బుక్ చెయ్యడం కూడా అయిపోయింది.

ఇక సామాను సద్దుకోడంలో మీనాక్షి రాజ్యలక్ష్మి గారికి అడుగడుగునా సహాయపడుతూ వెంటవుంటోంది. కానీ ఆమె మనసంతా దిగులుతో నిండివుంది. కొడుకు చెప్పకపోయినా యాజులుగారు వెళ్ళిపోయాక తమ పరిస్థితి ఏమిటో ఆమెకు బాగానే అర్థమయ్యింది. కొడుకు బిజినెస్, బిజినెస్ అంటున్నది తమ అవసరాలకు ఎంతవరకు సహాయపడగలదన్నది ఆమె అంచనాలకు దొరకడంలేదు. మనసంతా గుబులుతో నిండివున్నా, పైకి తేలకుండా పైపైన సంతోషం నటిస్తూ దిగులుని మనసులోనే దాచుకుని గుంభనంగా మసులుకుంటోంది ఆమె.

చూస్తూండగా ప్రయాణం రోజు రానేవచ్చింది. విమానాన్ని తలుచుకుని పిల్లలు కేరింతలు కొడుతున్నారు. జీవితకాలంలో వాళ్ళనలుగురికీ కూడా విమానమెక్కడమన్నది ఇదే తొలిసారి కావడంతో ఎవరిమట్టుకు వారు ఏవేవో ఆలోచించుకుంటున్నారు. యాజులుగారికి విమానమెక్కి గాలిలో తేలుతూ ఏ ఆధారం లేకుండా అంత దూరం ప్రయాణం చెయ్యాలంటే గుండెల్లో గుబులుగా ఉంది. రాజ్యలక్ష్మి ఆలోచనలు మరోరకంగా ఉన్నాయి - చాలారోజులకు మళ్ళీ కొడుకూ కూతుళ్ళను కలుసుకోబోతున్నందుకు ఆనందంగానే ఉన్నా, ఇంటికి తాళంపెట్టి, ఊరు విడిచి దూరాభారం, మాటా పలుకూ తెలియని పరాయి దేశానికి వెళ్ళడమన్నది ఆమెకూ దిగులు పుట్టిస్తూనేవుంది.

ప్రయాణమై వెళ్ళవలసిన సమయం వచ్చింది. వేన్ వచ్చి గుమ్మంలో ఆగింది. మీనాక్షికి జాగ్రత్తలు చెప్పి ఇంటిని అప్పగించి, ఇంటి తాళంచెవులతోపాటుగా ఒక అయిదువేల రూపాయలు కూడా ఆమె చేతిలో ఉంచి, ఆమెకు “వెళ్ళొస్తానని” చెప్పి, వెళ్ళి వేన్ ఎక్కింది రాజ్యలక్ష్మి. ఆమె తరవాత యాజులుగారు ఎక్కారు. ఇక పిల్లలైతే - వేన్ రాగానే పరుగున వెళ్ళి ఎక్కికూర్చున్నారు. సామానంతా జాగ్రత్తగా వేనులో పెట్టించి, తానూ వేన్ ఎక్కాడు జీవన్, హైదరాబాదు లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుదాకా తాతయ్య కుటుంబాన్ని క్షేమంగా సాగనంపి విమానమెక్కించి రావడానికి.

వేన్ వెళ్ళిపోగానే అంతా శూన్యంలా వెలవెలబోతూ కనిపించింది మీనాక్షికి. కళ్ళు చెమర్చడంతో, పైట కొంగు తీసి కళ్ళు తుడుచుకుంది. ఇంటి తలుపులన్నీ సరిగా వేసి ఉన్నాయో లేవో సరిజూసి, కిటికీ రెక్కలు మూసి, వీధిగుమ్మానికి తాళం పెట్టి డబ్బూ, తాళంచెవులూ కొంగున గట్టిగా కట్టుకుని, దిగులునిండిన మనసుతో తను అద్దెకుంటున్న ఇంటికి వెళ్ళిపోయింది మీనాక్షి.

*      *       *

యాజులుగారిని సాగనంపి తిరిగి రాగానే జీవన్ “హెల్పులైన్” పని మొదలుపెట్టాడు. కోనసీమ వెళ్ళి పని సక్రమంగా జరిపించి వచ్చినందుకు యాజులుగారు ఇచ్చిన బహుమానం వెయ్యి రూపాయిలూ పెట్టుబడిగా “హెల్పులైన్” ప్రచారం కోసం కరపత్రాలు అచ్చువేయించి ఊరిలో పంచి పెట్టాడు. అంతే కాదు, పెద్దపెద్ద కాగితాలపై తీరైన అక్షరాలతో అదే విషయం రాయబడిన వాల్ పోస్టర్లు స్వయంగా తయారుచేసి, ఊరిలోని కీలకస్థానాలలో ఉన్న గోడలకి రాత్రికి రాత్రి వెళ్లి అంటించాడు. అలా ఒక్కరోజులో ఊరంతా “హెల్పులైన్” అన్నది తమ బిజీలైఫ్ కు సహాయం చెయ్యడానికే ఉద్భవించిందన్న విషయం ఊరందరికీ తెలిసిపొయింది. ఆ రోజంతా జనం ఆ విషయమే మాట్లాడుకున్నారు.

*హెల్పులైన్*

===========

ఈ “హెల్పు లైన్“ అన్నది, ఉన్నది మీ కోసమే!

నేడే సభ్యులుకండి, సహాయం పొందండి.

అన్నివేళలా మీకు ఆసరాగా ఉంటుంది ఈ హెల్పులైన్.

మీ ఇంటికి కావలసిన వస్తువులు నమ్మకంగా కొనితేవాలన్నా,

మీ ప్రయాణానికి క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకోవాలన్నా,

సమయానికి సరైన మందులు కొని తెచ్చి మీకు అందించాలన్నా,

ఇంకా, మీకు ఏ ఇతర సహాయం కావాలన్నా కూడా,

ఎల్లవేళలా ఈ హెల్పు లైన్ మీకు అండగా ఉంటుంది.

మాకు కమీషనుగా నూటికి ఒక్క ఐదు రూపాయిలు చాలు.

మీరు ఖర్చుపెట్టిన ప్రతి వందనోటుకి అయిదురూపాయలు

ఇస్తే సరిపోతుంది. మేము అలుపెరుగని సేవలు అందించగలము.

సభ్యత్వరుసుము కూడా తక్కువే - ఒక్క పది రూపాయిలు మాత్రమే!

ఇట్లు,

సదామీ సేవలో –

హెల్పులైన్ ,

ఫోన్ : -----

(కిరణ్ STD బూత్ నంబర్ ని,  జీవన్ తన ఫోన్ నంబరుగా వాడుకోడానికి స్నేహితునితో ఒప్పందం చేసుకున్నాడు.)

అసలే ఆంధ్రులకు ఆరంభశూరులనే బిరుదు ఉంది. “కొత్తొక వింత – పాతొక రోత” అన్నదొక లోకోక్తి! ప్రకటించిన మరునాడే హెల్పులైన్లో చాలామంది సభ్యులయ్యారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, "బిజీ లైఫ్" లీడ్ చేస్తూన్నవాళ్ళు, కడుపున కన్న పిల్లలకు దూరంగా నిప్పచ్చరపు బ్రతుకు బ్రతుకుతున్న వృద్ధులు, అనారోగ్యం వల్ల అశక్తులైనవారు, బద్ధకస్తులు – అందరికీ హెల్పులైన్ ఒక వరంగా తోచింది. మొదటిరోజునే చాలా మంది సభ్యులుగా చేరారు. ఆర్డర్లు కూడా చాలానే వచ్చాయి.

కిరణ్ టెలిఫోన్ బూత్ నంబరే తన నంబర్ గా జనానికి ఇచ్చి, రిసీవ్ చేసుకున్న ప్రతి వందకాల్సుకి ఇరవై అయిదురూపాయిలు కమిషన్ చొప్పున ఇస్తానని కిరణ్ ని ఒప్పించాడు జీవన్. హెల్పులైన్ నుండి సహాయం ఆశించినవారు కిరణ్ కి ఫోన్ చేస్తే, కిరణ్ వారి అడ్రస్సు, వాళ్ళ అవసరం ఒక పుస్తకంలో రాసుకుని, జీవన్కి చూపించేవాడు.

చేతినిండా పని, జేబునిండా డబ్బు కనిపించేసరికి జీవన్ కి చాలా సంతోషమయ్యింది. దూరం వెళ్ళవలసివచ్చినా, ఎక్కువ బరువు తేవాల్సివచ్చినా సైకిలు అద్దెకు తీసుకునేవాడు. బియ్యం బస్తాల్లాంటివి తేవలసివస్తే రాఘవ ఆటోని బాడుగకు వాడేవాడు. అలా జీవన్ తన మిత్రులిద్దరికీ కూడా హెల్పులైన్ ద్వారా కొద్దో గొప్పో రాబడి పెరిగేలా చేశాడు.

మీనాక్షికి మిఠాయికొట్లో తప్ప మరో పనేదీ లేదు. ఆమెకిప్పుడు బోలెడంత విశ్రాంతి, కానీ మనసంతా అశాంతి! లెక్కలతో డిగ్రీ చదివి, మంచి మార్కులు తెచ్చుకుని, స్కూల్ ఫస్టు వచ్చి, గోల్డు మెడల్ సంపాదించిన తన కొడుకు, ప్రస్తుతం చేస్తున్న పని ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. కానీ మరోదారి లేదు. ఆమెను వంటపనికి పెట్టుకోడానికి సందేహిస్తున్నారు జనం. కొద్దిరోజులు పనిచేసి, యాజులుగారు తిరిగి రాగానే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో, ఆమెను వంటపనికి పెట్టుకోడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అది ఆమెకు చాలా దుఃఖాన్ని తెప్పించింది. కానీ కొడుకుని చిన్నబుచ్చలేక తన మనసులోని బాధను బయట పడనీయకుండా గుంభనంగా ఉండిపోయింది.

ఇదివరకు యాజులుగారి ఇంటి వంటలోనే చాలావరకూ ఆ తల్లీ కొడుకుల భోజనాలు అయిపోయేవి. వేరే పెద్దగా వండవలసిన పని ఉండేది కాదు. ఇప్పుడు, ఉప్పుతో సహా తొమ్మిదీ కొనితెచ్చి, ఇద్దరికీ సరిపడా రెండుపూటలా తమ ఇంట్లోనే వంట చేసుకుని తినవలసి వస్తోంది. దానివల్ల ఖర్చు బాగా పెరిగింది. ఇంటద్దె, కరెంట్ బిల్లు, పొయ్యి మీదకీ, పొయ్యి క్రిందకీ కావలసినవి కొనడమే కాకుండా, రోజు గడవాలంటే ఇoకా చిన్నా చితకా ఎన్నోరకరకాల వస్తువులు కొనవలసి ఉంటుంది కదా! ప్రతినెలా, నెలాఖరు వచ్చేసరికి చేతిలోని డబ్బు సరిపోక, రాజ్యలక్ష్మి గారు ఇచ్చిన డబ్బులోనుండి కూడా కొంచెం కొంచెం  తియ్యవలసి వస్తోంది. అలా తియ్యడం మొదలుపెడితే ఆ డబ్బు ఎన్నాళ్ళు వస్తుందిట! చీమలు తిన్నా కొండలు తరుగుతాయి - అంటారు. ఆ కాస్తా కూడా అయిపోయాక ఇక బతికేది ఎలా - అని భయపడసాగింది మీనాక్షి. మళ్ళీ అంతలోనే, నారోసిన వాడు నీరు పొయ్యకుండా ఉంటాడా ఏమిటి, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు - అని మనసు సరిపెట్టుకునే ప్రయత్నం చేసింది.

జీవన్ “హెల్పులైన్” ద్వారా వచ్చిన తొలి సంపాదన తీసుకువచ్చి తల్లి చేతిలో పెట్టి, “అమ్మా! కొంచెమే అయినా ఇది “నేను” అన్నపదానికి ఒక విలువ కల్పించిన సొమ్మమ్మా. లక్ష్మీదేవి అంటే ఇదేనమ్మా! ఇది నా కష్టార్జిత విత్తం” అన్నాడు మురిసిపోతూ. ఇకనేమీ మాటాడలేక, మనసు సరిపెట్టుకుని తనకు నమస్కరిస్తున్న కొడుకుని ఆశీర్వదించింది మీనాక్షి.

చివరకు, "ఇంతకన్నా పెద్దపెద్ద కష్టాలనుండే కాపాడిన ఆ భవంతుడు ఇప్పుడిలా మమ్మల్ని అగాధంలో వదిలేస్తాడా ఏమిటి? సమయానికి ఏదో ఒక దారి చూపించకపోడులే” అనుకుంది మనసునిండా నిర్లిప్తత నింపుకుని. జీవన్ మాత్రం చాలా సంతోషించాడు తన తొలి సంపాదన చూసుకుని.

*       *       *

చూస్తూండగా హెల్పులైన్ మొదలుపెట్టి నాల్గు నెలలయింది. మొదటిలో సభ్యత్వం తీసుకున్నవారిలో కొందరు పక్కకి తప్పుకున్నా, ఇంకా ఓమాదిరిగా బాగానే వస్తోంది ఆదాయం. అది నెలలో తొలిరోజులు కావడంతో చాలామంది, నెలకి సరిపడా వెచ్చాలు తెమ్మని జీవన్ కి డబ్బు ఇచ్చారు. ఒక్కొక్కరికీ  సరుకులు కొనితెచ్చి ఇస్తూ, ఆ పనిలోనే ఉన్నాడు జీవన్. బజారు వీధిలో నడుస్తున్న జీవన్ కి అల్లంత దూరంలో ఒక ముసలాయన ఎంతో కష్టంమీద కర్ర సాయంతో నడుస్తూ, రోడ్డు దాటే ప్రయత్నంలో ఉండడం కనిపించింది. అటే చూస్తున్న జీవన్ కి పక్కరోడ్డు నుండి మలుపు తిరిగిన సిటీబస్సు స్పీడు తగ్గించకుండా సూటిగా ఆయనవైపే వస్తూండడం తెలిసింది. ముసలాయన బస్సుని చూడలేదు, ఎత్తున ఉన్న బస్సు డ్రైవరుకి వంగినడుస్తున్న ముసలాయన కనిపించలేదు గావును, పెద్దాయన రోడ్డు మధ్యకి వచ్చేశాడు. బస్సు ఆయనని సమీపించింది. ఇంకొక్క క్షణంలో అది ఆయనని సూటిగా “ఢీ” కొనేదేగాని, ఒక్క పరుగున వెళ్ళి సరిగా సమయానికి అందుకున్న జీవన్, ఆయనని జెబ్బ పట్టుకుని పక్కకు లాగేశాడు. బస్సు వేగంగా ముందుకి వెళ్ళిపోయింది.

ఏం జరిగిందో తెలియక ముసలాయన కంగారుపడ్డాడు. పట్టు విడిపించుకోడానికై పెనుగులాడి, క్రిందపడిపోయాడు. పేవుమెంట్ బలంగా తలకి కొట్టుకోడంతో తలకు దెబ్బతగిలి, గాయమై రక్తం కారడం మొదలెట్టింది. ధారకట్టిన రక్తాన్ని చూడడంతో భయం విపరీతమై ఆ పెద్దాయనకి వెంటనే స్పృహ తప్పిపోయింది. ఆయన చేతిసంచీ క్రిండపడిపోడంతో దానిలోని సరుకులన్నీ చెల్లాచెదరై ఆ ప్రదేశమంతా విరజిమ్మినట్లుగా పడ్డాయి. అన్నీ తినుబండారపు వస్తువులే కావడం చూసి జీవన్ మనసు బాధపడింది. కొంతలో కొంత ఆ ముసలాయన పరిస్థితి అర్థమైనట్లయ్యింది.

అటుపక్కనుండి ఆటో నడుపుకునిపోతున్న రాఘవ, పేవ్ మెంట్ మీద మూగిన జనం మధ్య జీవన్ ని చూసి, ఏం జరిగిందో తెలుసుకోడం కోసం ఆగాడు.

రాఘవని చూసి చాలా సంతోషించాడు జీవన్. “సమయానికి వచ్చావు, సంతోషం! పెద్దాయనకు దెబ్బతగిలింది, స్పృహ లేదు. ఆసుపత్రికి తీసుకెడదాము, సాయంచేస్తావా” అని అడిగాడు రాఘవని.

ఆటో ఖాళీ గానే ఉండడంతో వెంటనే దాన్ని దగ్గరగా తీసుకువచ్చాడు రాఘవ. ఇద్దరూ కలిసి ఆయన్ని ఆటోలో ఎక్కించారు. పెద్దాయనకి ఆసరాగా సీట్లో జీవన్ కూర్చున్నాడు.

అక్కడ చేరినవారిలో ఒకతను అభ్యంతరపెట్టాడు, ”ఇది పోలీసుకేసు ఔతుంది! మీరలా తీసుకెళ్ళిపోకూడదు” అంటూ. వెంటనే, తడుముకోకుండా జవాబు చెప్పాడు జీవన్, “ఈయన మా తాతయ్య. ఈయనని నేను అర్జంటుగా ఆసుపత్రికి తీసుకెళ్ళి, వైద్యం చేయించాలి. ఒద్దనే హక్కు, అధికారం ఎవరికీ లేవు” అన్నాడు ధాష్టీకంగా.

ఆపై మరెవరూ మాటాడలేదు. ఆటో కదిలింది. ముసలాయన తల గుండెలకు హత్తుకుని, నడుము చుట్టూ చెయ్యేసి పడిపోకుండా పట్టుకుని, పక్కనే కూర్చున్నాడు జీవన్.

కొంత దూరం వెళ్ళిన తరువాత అన్నాడు రాఘవ, “రిస్కేమోరా...”

“అలా అనుకుని ఆలస్యం చేస్తే ఈలోగా తాతయ్య “షాక్”తో చచ్చిపోవచ్చు. “ఆలస్యం అమృతం విషం” అన్నారు. వేగంగా పోనియ్ ఆటోని” అన్నాడు జీవన్.

ముసలాయన గాయం నుండి కారుతున్న రక్తం తన షర్టుని తడుపుతున్నా పట్టించుకోకుండా ఆయన క్షేమాన్ని గురించే ఆలోచిస్తున్న జీవన్ వైపు ఆశ్చర్యంగా చూశాడు రాఘవ. “ఏమిట్రా జీవన్! ఆయనేదో నీకు నిజంగానే తాతయ్యన్నట్లు తెగ ఇదైపోతున్నావేమిటి!”

“ఒరే రాఘవా! చూడగానే తెలుస్తోంది కదురా... ఆయనను చూసుకునే వాళ్ళెవరూ లేరని! ఉంటే, ఈ వయసులో తినుబండారాలు సైతం తనే కొనుక్కోవలసిన దురవస్థ ఆయనకు ఎందుకు పడుతుంది? ఆయననలా వదిలి పోడానికి నాకు మనసు ఒప్పదురా. ఈ రోజు కాపోయినా కొన్నేళ్ల తరవాతైనా మనకీ ఈ దశ రాసిపెట్టే ఉoదికదా!“

రాఘవ మరేమీ మాట్లాడ లేకపోయాడు. మౌనంగా ఆటో నడుపుకుoటూపోయాడు. ఆటో గమ్యాన్ని చేరింది. వాళ్ళు ఆయన్ని దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు.

అది “పాలీ క్లినిక్“! సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ ప్రదేశం వచ్చీపోయే జనంతో అట్టహాసంగా ఉంది. యూనిఫారంలో ఉన్న సిబ్బంది హడావిడిగా అటూ ఇటూ పరుగులాంటి నడకతో తిరుగుతున్నారు. పెద్దాయనని ఆటో వెనక సీటులో పడుకోబెట్టి, రాఘవకి అప్పగించి, తను ఆసుపత్రిలోకి వెళ్ళాడు జీవన్.

జీవన్ రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి “మా తాతయ్య పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. స్పృహ పోయింది, వెంటనే వైద్యానికని తీసుకువచ్చాను” అని చెప్పగానే ఆసుపత్రి సిబ్బంది “స్ట్రెచర్” తీసుకుని పరుగున వచ్చారు ఆటో దగ్గరకు. స్పృహలో లేని ఎనభై ఏళ్లకు పైబడ్డ ఆ వృద్ధుని స్ట్రెచర్ పైకి చేర్చారు. ఈలోగా ఆ హాస్పిటల్కి సంబంధించిన యూనిఫారంలో ఉన్న ఉద్యోగి ఒకడు, “ఈ ముసలాయన తాలూకు వారెవరు” అంటూ వచ్చాడు అక్కడికి.

“నేను ఆయన మనుమడిని” అంటూ ముందుకు వచ్చాడు జీవన్.

స్పృహలో లేని పెద్దాయనవైపు చూసి, “ఇదేదో యమర్జన్సీ కేసులా ఉంది. మీరు వెళ్లి కౌంటర్ దగ్గర డబ్బుకట్టి ఫారాలు తీసుకురండి. వెంటనే ట్రీట్మెంట్ మొదలౌతుంది” అన్నాడు.

రాఘవ జీవన్ వైపు చూశాడు భావ గర్భితంగా. జీవన్ వెంటనే కౌంటర్ దగ్గరకు పరుగెత్తాడు డబ్బు కట్టేందుకు. తన జేబులో ఉన్న హెల్పులైన్ తాలూకు డబ్బు తీసి లెక్కించడం మొదలుపెట్టాడు.

డబ్బు కట్టి రిసీట్ తీసుకోగానే, ఆపరేషన్ ధియేటర్లోకి స్ట్రెచర్ని తోసుకుపోయారు. ముసలాయనకి వెంటనే వైద్యం మొదలయ్యింది.

“ఈ సమయంలో మనల్ని ఎలాగా ఆయన దగ్గర ఉండనీయరు. ఇక్కడికి మా ఇల్లు దగ్గర. మా ఇంటికి వెడదాంరా... స్నానం చేసి, ఈ బట్టలు మార్చుకుందువుగాని. భయంకరంగా ఉన్నావు, నిన్నిలా చూడలేకుండా ఉన్నాను” అంటూ బలవంతపెట్టి స్నేహితుని తనింటికి తీసుకెళ్ళాడు రాఘవ.

****సశేషం****

Posted in September 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!