Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --

సీత

కం.
‘సీతాయాశ్చరిత’మ్మని
ఖ్యాతి గడించినది రామకథకద సతమున్
చేతములన్ జనపదముల(1)
వ్రాఁతలఁ జేతలను నిలుచు ప్రణవము తానే.....81
......(1)  జనుల మాటలలో/పల్లెప్రాంతములలో
మ.కో.
పుట్టఁ బుట్టినవాని కెన్నడు ముందు గోచరమౌ శశే(1)
చిట్టచీకటినైన రాముఁడు చెంతఁ గాంచు సుధాంశువున్(2)
చెట్టఁబట్టిన రావణుండు నిశీథమే కను నబ్జమే(3)
పుట్టె సీతగఁ దచ్చరిత్రమె పుణ్యకావ్యము గా నిలన్.....82
......(1) వాల్మీకికి ఎప్పుడూ కనిపించే చంద్రుఁడే సీత
......(2) రామునికి కనిపించే సినీవాలియే (అమావాస్యనాఁడు సన్నని రేఖామాత్రంగా కొంతమందికి మాత్రమే దర్శన మిచ్చే చంద్రుఁడే) సీత
......(3) రావణాసురునకు కనిపించని అబ్జమే (చంద్రుఁడే) సీత

అంజనేయుఁడు

కం.
సంతతరఘుకులకాంతని
శాంతస్వాంతా(1)! నితాంతసద్గుణవిద్యా
వంతా! బలవంతా! హను
మంతా! రవికోటికాంతిమంత! యనంతా!.....83
......(1) ఎల్లప్పుడూ రఘునాయకుడైన శ్రీరామునకు నిలయమైన
............మనస్సు కలవాడా
గంభీరసింహికావి
స్రంభారంభా(1)! శివాంశసంభవబలవి
ష్కంభా(2)! రాఘవకృతపరి
రంభా! గతభీమపత్రిరాడ్ఘనదంభా(3)!.....84
......(1) గంభీరమైన సింహిక అనే రాక్షసిని వధించడంలో త్వరపడినవాడా
......(2) శివాంశచేత సంభవించిన విరివియైన బలము కలవాడా
......(3) భీమునకు, గరుత్మంతునకు కల గొప్ప గర్వమును పోగొట్టినవాడా
అక్షయకృతలక్షణరా
మాక్షరజపలక్ష్య(1)! దశశతాక్షవిపక్షా
ధ్యక్షపురీరక్షణక
ర్మక్షమయమ(2)! క్షోణిసూనురక్షాపేక్షా(3)!.....85
......(1) అక్షయమైన సద్గుణములుకల రామ అను అక్షరముల జపము
............చేయుట లక్ష్యముగా కలవాడా
......(2) సహస్రాక్షుడైన ఇంద్రుని శత్రురాజు (రావణుని) పురమైన లంకా
...........నగరమును రక్షించుట విధిగా కల లంకిణికి యముడైనవాడా
...... (3) భూపుత్రియైన సీతాదేవిని రక్షించుటలో ఆసక్తికలవాడా
బృందారకకృతవందన
సందోహ(1)! కృపావిముక్తసప్తతురంగ
స్యందననందనబంధన(2)!
సందీప్తశుభాంగ! భక్తజనసత్సంగా!.....86
......(1) దేవతలచేత నమస్కారములు చేయబడినవాడా
......(2) ఏడుగుఱ్ఱాల రథము కలవాని (సూర్యుని) పుత్రుడైన శనిని
............[ఇంద్రజిత్తు పుట్టే సమయంలో రావణుడు శాసించిన స్థానము నుండి
............కాలు ప్రక్కకు జరిపి ఆజ్ఞను ఉల్లంఘించినందుకు రావణుడు దండనగా
............తలక్రిందులుగా వ్రేలాడదీసినప్పటి] కట్లనుండి విముక్తుని చేసినవాడా
ఫాలాక్షనాట్యశాలా
మూలోన్మూలనవిలోలభుజగర్వహర
స్థూలామితవాలావృత
కీలాహుతసాలశాల(1)! కీర్తివిశాలా!.....87
......(1) ముక్కంటి నాట్యశాల అయిన కైలాసగిరిని ఆమూలంగా పెకలించడంలో
............చూపించిన (రావణుని) భుజగర్వమును హరించిన బలమైన, మితిలేని,
............తోకకు చుట్టుకొన్న మంటలచే చెట్లను, ఇండ్లను ఆహుతి చేసినవాడా
పురహరనుతనరవరహిత
కరకరధృతశైలసహిత(1)! ఘనఘనలజ్జా
కరరవధుతదిగ్గజనుత(2)!
హరిసుతహిత(3)! విజయవైజయంతీస్ఫురితా(4)!.....88
......(1) శివునిచే స్తుతింపబడిన మానవశ్రేష్ఠుడైన రామునకు హితము
............కూర్చుటకు చేతిలో సంజీవినీపర్వతమును ధరించినవాడా
......(2) గొప్పమేఘములను సిగ్గుపరచే (మేఘగర్జనను మించిన, స్వామి చేసిన)
............ధ్వనిచేత కంపింపబడిన దిక్కుల చివరలలో ఉండు దిగ్గజములచేత
............స్తుతింపబడినవాడా
......(3) సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవునకు హితుడైనవాడా
......(4) అర్జునుని జెండామీద స్ఫురించేవాడా
అహిరావణమహిరావణ
బహుమాయాగహనకుహరపాతాళపురీ
నిహితరఘూద్వహకుశలా
వహ(1)! దుస్సహకహకహారవాహితనివహా(2)!.....89
......(1) అహిరావణుని, మహిరావణుని చాలామాయలతోకూడి చొరరాని గుహయైన
............పాతాళపురంలో ఉంచబడిన రామలక్ష్మణులకు క్షేమము కలిగించినవాడా
......(2) కహకహ అనే అహితమైన శబ్దములను కలిగించువాడా (రాక్షసులు చచ్చిపోయే టప్పుడు కహకహ అని అరుస్తారు)
సీతావరదూతా! పరి
పూతా! వాతాత్మజాత! భువనాతీత
ప్రేతాసురభూతాకర
జేతా(1)! కపినేత! శరణు శ్రితవరదాతా!.....90
......(1) లోకమును అధిగమించిన ప్రేత, రాక్షస,భూతసమూహాలను జయించినవాడా
Posted in September 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!