Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

పంచ సహస్రావధాని "బ్ర వే శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు"

Jandhyala-Subramanya-Sastry

జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు  ప్రఖ్యాత అవధాని. ఆయన అనేకమైన శతావధానాలు, సహస్రావధానాలు, ఒక పంచ సహస్రావధానము చేశాడు. ఆయన కృష్ణా జిల్లా, గుడివాడ సమీపంలోని కలవపాముల గ్రామంలో 1892 మార్చి 1, వ తేదీన జన్మించారు. తలితండ్రులు సావిత్రమ్మ-హరి కామేశ్వర సోమయాజులు. మచిలీపట్నంలో విద్యాభ్యాసం. అతడు బందరులో చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద లఘు కౌముది, అవధాన విద్య అధ్యయనం చేశారు. కొంతకాలం అతడు గురజాల హైస్కూల్ లో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. తర్వాత గద్వాల్ రాణీ ఆదిలక్ష్మీ దేవమ్మ సంస్థానంలో చేరి మూడు దశాబ్దాలు ఆస్థానకవిగా విలసిల్లాడు. గద్వాల ఆస్థాన పదవీ విరమణ తర్వాత భాగ్యనగరంలో నల్లకుంటలో స్థిర నివాసం ఏర్పరచుకొని నివసించిన ఈ మహానుభావుడు 1980, అక్టోబరు 24 న పరమపదించారు.

స్వర్గీయులైన ఈ మహాపండితుని ప్రజ్ఙా విశేషాలు తెలుసుకుందాం. అసలు అవధానం చేయడమే గొప్ప. అసాధారణమైన ధారణాశక్తి ఉంటే గాని అది సాధ్యపడదు. దానికితోడు కావ్యశాస్త్రాదులలో పాండిత్యం, భాషపై పట్టు, ఆశువుగా చెప్పగలగటం, నానార్ధ నిఘంటువు పరిచయం. ఇన్నిఉంటే గానీ అవధానం సాధ్యం కాదు. మనము అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, ద్విసహస్రావాధాన వంటి సాహిత్య ప్రక్రియలను వింటూ ఉంటాము. ఎందుకంటే తెలుగు సాహిత్యములో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అవధానాలు చేసే వారికి గుర్తింపు ఉంది. కానీ పంచ సహస్రావధానం గురించి తక్కువగా వింటాము. ఎందుకంటే ఇటువంటి అవధానాలు చేసే పండితులు బహు కొద్ది మంది ఈ అవధానాలు పృచ్ఛకులు గా వ్యవహరించేవారు (ప్రశ్నలు అడిగేవారు) దొరకడం కూడా కష్టం.

సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మొదట సహస్రావధానము కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో నిర్వహించారు. తరువాత వరంగల్ లో దిగ్విజయంగా నిర్వహించారు. 1954 నవంబర్ 20, 21, తేదీల్లో శ్రీమాన్ చెలమచెర్ల రంగాచార్యులు గారు అధ్యక్షుడుగా నిర్వహింప బడిన ఈ సభ శాస్త్రి గారికి గొప్ప అనుభూతి మిగిల్చింది. సభలో ఆయన ధారణను చూసిన ప్రముఖ పండితులు జానపాటి పట్టాభి రామ శాస్త్రి గారు ‘ఇంతటి ధారణామూర్తి నభూతో భవిష్యతి’యని ప్రశంసించినారట. మంతెన, చెన్నూరు, లింగాపురం, వేములవాడ, కమాన్‌పురం, కరీంనగర్‌లలో శతావధానాలు, యాదగిరిగుట్ట, నల్లగొండ, సింగవరం, దైవము దిన్నె, ఇల్లెందు, గురజాల, హనుమకొండ, మంథెన, కొల్లాపురము, గద్వాల, నూజివీడు, మిర్యాలగూడ, నారాయణపేట, బళ్లారి, జగిత్యాల, గోపాల్‌పేట, శ్రీశైలము, చల్లపల్లి, కరీంనగర్, కూనవరము, భీమవరం మొదలైన చోట్ల సహస్రావధానాలు చేశారు. హన్మకొండలో 1954లో పంచ సహస్రావధానాన్ని నిర్వహించారు శ్రీ శాస్త్రిగారు.

పేరెన్నికగన్న గద్వాల సంస్థానంలో ప్రధాన పండిత పదవి నలంకరించిన మహా పండితులు, అసామాన్యమైన ధారణతో, ఆశుధార తో వీరు సహస్రావధానాలు నిర్వహించారట. వీరికి అవధాన గురువులు తిరుపతి వేంకటకవులు. అవధానాలలో వీరు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎప్పటివలె సమస్య, దత్తపది, ఇత్యాదులకు భిన్నంగా వీరి ఆవధానం విచిత్రంగా సాగేది. శాస్త్రిగారు ఒక కార్డుపై నెంబరు, (ఏదో ఒక సంఖ్య 5000 వరకు పరిమితం), దాని క్రింద రెండు పద్యాలు, వాటి కింద రెండు బొమ్మలు, ఇలా 5000 కార్డులు తయారు చేసి పృఛ్ఛకులకు అందజేసేవారు. వారు కార్డు లోని బొమ్మను సూచిస్తే చాలు. దాని నెంబర్, అందులోని పద్యములను పొల్లు పోకుండా చెప్పేవారట. ఆశ్చర్యంతో అందరికి దిగ్భ్రాంతి కలిగేది. ఆశువుగా యెడనెడ సందర్భోచితంగా పద్యములను చెప్పేవారట. మధ్య మధ్య ప్రేక్షక మహాశయుల సమస్యలకు సమాధానం. ఈ విధంగా 5000 మంది పృఛ్ఛకులను ధారణతో సమాధాన పరిచేవారు.

ఈయన ఆంధ్ర దేశ చరిత్ర (బృహత్ పద్య కావ్యము) కేశవేంద్ర విలాస శతకము, సాలంకార కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుని కథలు వంటి 32 కు పైగా గ్రంథాలను రచించారు. వీరిని కవి మణి, కవి కేసరి కిశోర, బాల సరస్వతి, అభినవ సరస్వతి, శతావధాన కుశల, విద్వద్బాల శతావధాని, సహస్రావధాన ఫణీంద్ర, సహస్రావధాన వాచస్పతి, సహస్రావధాన చతురానన, సహస్రావధాన పంచానన మొదలైన బిరుదులు వరించాయి. వీరికి 1959లో గుడివాడలో కనకాభిషేకం చేశారు. మహా ధారణ శిల్పి , శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్మృత్యంజలులు.

ఆయన అవధానాలలో మచ్చుకు కొన్ని పూరణలు::

సమస్య: "పచ్చి మాంసంబు దినువాడు బ్రాహ్మణుండు"
పూరణ :: బ్రహ్మ విజ్ఞాన హేతు భావప్రబోధి
             నిత్యకర్మ భి నిరతుడే ద్విజుడు కానీ
             యగునె కలుద్రావ జందెమ్ము లవల ద్రోసి
             పచ్చి మాంసంబు దినువాడు బ్రాహ్మణుండు

మహనీయులైన వీరి ప్రజ్ఙ పాటవానికి నిదర్శనంగా వీరు పూరించిన సమస్య మరొక దానిని చూద్దాము.
సమస్య:"శ్రీనాధుండు రచించె భారతము మాశ్రీనాధుఁడౌరాయనన్"
గుడివాడ శతావధాన సభలో నడిగిన ఈ సమస్యను శాస్త్రిగారు-
"మహా పాండిత్యంతో కీర్తికి శ్రీనాధుఁడైన నన్నయ భట్టారకుడు భారతాన్ని ఆగామి శ్రీనాధకవి యౌ రాయనున్నట్లు రచించినాడు" – అని పూరించారు. ఆపద్యం మీకోసం!

శా:
నానా శబ్ద కళాను శాసన విధాన ప్రజ్ఙ నార్జించి, మే
ధా నైపుణ్య మహాంబురాశి, విబుధోత్తంసుండు వేదోక్త ధ
ర్మానీక ప్రతిబోధ నార్హమతి, నన్నయాభిధాంచ ద్యశ
శ్రీ నాధుండు రచించె భారతం మా శ్రీనాధుఁ డౌరాయనన్!

********

Posted in September 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!