Menu Close
దేవుడే దిగివస్తే? (కథ)
-- యిరువంటి శ్రీనివాస రావు --

ఏడుకొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా మారు మ్రోగిపోతుంది తిరుమల కొండ.

నారాయణ నారాయణ ... నారదుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువులోకి ప్రవేశించారు.

నారద మునీంద్రులకు స్వాగతం.

ధన్యోస్మి స్వామి ... స్వామి వారెందుకో కొంచెం పరాకుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

నారదా, ప్రతిరోజు నా దర్శనానికి వేలమంది భక్తులు వస్తున్నారు. కానీ ఈ కలియుగంలో ఈ మానవుల జీవన విధానం, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో వినాలని, ప్రత్యక్షంగా చూడాలని వుంది. త్రిలోక సంచారులు కదా. ఏమిటి భూలోక విశేషాలు?

స్వామి వారు తమ భక్తుల గురించి తెలుసుకోవాలని ఆ మాత్రం కుతూహలపడటం లో ఆశ్చర్య మేముంది. ఇప్పటి వరకు భగవంతుని దగ్గరకు భక్తులు, ఇక నుంచి భక్తుల దగ్గరికి భగవంతుడన్న మాట.

నారదా ... ఊరక రారు మహానుభావులు విషయం చెప్పవయ్యా.

స్వామి వారు మన్నించాలి మీరెలాగూ ప్రత్యక్షంగా చూడాలంటున్నారు కాబట్టి, అలా గగన విహారానికి వెళదామంటే నేనూ వస్తా తోడు. మీరెలాగూ వీసాల స్వామి కాబట్టి, మనవాళ్ళు ఎక్కువ సంఖ్యలో వుండే అగ్రరాజ్యం అమెరికా అయితే చక్కగా ఉంటుంది విహారానికి.

బహు బాగా చెప్పారు తక్షణమే మన పయనం బయల్దేరండి.

ఆలా ఇద్దరూ అమెరికాకి పయనమయ్యారు.

దృశ్యం (సన్నివేశం)– 1

స్వామి, ఇక్కడేదో వివాహమహోత్సవం జరుగుతున్నట్లుంది, చూసి వద్దాం రండి.

నారదా ఇది ఏమి ఇక్కడ వధువు ఒక్కతే కనపడుతున్నది, వరుడు కానరాడు. మరియు ఆ అమ్మాయి ముందు ఆ చిన్నపెట్టె ఏమిటది? అందులో చూస్తూ ఆ చిన్నది తెగ సిగ్గు పడుతున్నది.

స్వామి, ఆ పెట్టె పేరు కంప్యూటర్. పెళ్లి కూతురు ఇక్కడ అమెరికా దేశంలో. పెళ్ళికొడుకు అక్కడ భారతదేశంలో. ఆ పెట్టెలో ఒకరికి ఒకరు చూసుకుంటూ పెళ్లి చేసుకుంటున్నారు.

ఇది ఏమి విచిత్రం నారదా? అది ఎలా సాధ్యం?

ఇందులో అంత విచిత్రం ఏమి లేదు స్వామి. మీరు ఒకప్పటి మాయాబజార్ చిత్రం వీక్షించారు కదా! అందులో ప్రియదర్శిని పేటిక మీకు గుర్తుండేవుంటుంది. ఎవరు దాన్ని తెరిచి చూస్తే వాళ్ళకి ప్రియమైనది అందులో కనబడుతుంది.

ఎందుకు గుర్తులేదు బహు చక్కటి చిత్రం. ఇప్పటికీ నా కనులముందు ఆ చిత్ర దృశ్యములన్ని కదలాడుతున్నవి.

ఆ మాయాబజార్ ప్రియదర్శిని పేటిక రూపాంతరం చెంది ఇప్పుడు ఇలా తయారయ్యింది. దీని ద్వారా ఈ భూప్రపంచంలో ఏ మూలాన ఏమి జరుగుతున్నది క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి కూడా అలానే చేసుకుంటున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఈ పెళ్లి తంతు ప్రత్యక్షప్రసారాన్ని కనులవిందుగా చూడవచ్చు. వాళ్ళని దీవించవచ్చు, శుభాకాంక్షలు పంపవచ్చు, బహుమతులు, కానుకలు బదిలీ చేయవచ్చు.

ఔరా! ఏమీ ఈ సాంకేతికత విప్లవం.

అవును స్వామి ఇప్పుడు చూడండి. వధూవరులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని చూస్తూ సెల్ఫీ అంటే స్వీయ చిత్రం తీసుకుంటున్నారు.

ఓరి మానవా నువ్వు అసామాన్యుడివి.

ఏమో స్వామి నాకు మాత్రం సాంకేతికత ముసుగులో వేలం వెర్రితలలు వేస్తునట్లుంది. సరే ఆలా దయచేయండి మరొక సన్నివేశం చూద్దురు గాని.

దృశ్యం (సన్నివేశం)– 2

ఇది ఏమి నారదా, ఏమి జరుగుతున్నది ఇక్కడ? ఈ దంపతులు ఏమి చేస్తున్నారు?

స్వామి, వీరు ఆ చరవాణి దగ్గర పెట్టుకొని, ఆన్లైన్ లో పూజ చేయుచున్నారు.

ఈ చరవాణి, ఆన్లైన్ ఏమిటి నారదా. నాకంత అయోమయంగా వున్నది. వివరించి చెప్పుము, లేనిచో ఇప్పుడే నా కొండకి నేను తిరిగి వెళ్లెదను.

తొందర పడకండీ స్వామి. చరవాణి అనగా ఇంతకుమునుపు మనం చూసిన పెట్టె లాంటిదే. కాకపోతే ఇది అరచేతిలో ఇమిడి పోయే యంత్రం.

అయినచో ఏమి దేవుడెక్కడ? అలంకరణ ఎక్కడ? పూజ సామగ్రి ఎక్కడ? పురోహితుడెక్కడ? నైవేద్యం ఎక్కడ?

శాంతం శాంతం అక్కడికే వస్తున్నాను స్వామి. అవేమి లేకుండా చేసే ఈ పూజ విధానమే ఆన్లైన్ పూజ అంటారు స్వామి.

అదెలా సాధ్యం నారదా? అవేమి లేకుండా పూజ ఎలా చేస్తారు?

ఈ మానవులకి సాధ్యం కానిదేముంది స్వామి. అదిగో చూడండి అక్కడ మీ చిత్రపటం, ఆ మీట నొక్కితే పురోహితుల వారి మంత్రాలు, ఈ మీట నొక్కితే అక్షింతలు, పూలు. ఆ మూల నున్న ఆ మీట నొక్కితే నైవేద్యం. ఇలా అన్ని సౌకర్యాలు వున్నాయి స్వామి. అప్పుడే చూడండి ఎన్ని ఇష్టాలు (లైక్స్) వచ్చాయో. అందరూ ఆన్లైన్ లో వాళ్ళ వాళ్ళ కోరికలు వెలిబుచ్చుతూ నమస్కారాలు పెట్టేస్తున్నారు చూసారా?

అవునవును ఆ చరవాణి చుట్టూ ప్రదక్షిణం చేసి పూజ కూడా ముగించేశారు.

అవును స్వామి, మీ అభిప్రాయమేమిటో తెలుసుకోవచ్చా? ఈ ఆధునిక పూజావిధానం మీద.

నారదా, ఎవరి కుట్ర కుతంత్రం లేదు కదా ఇలాంటివి అమలు చేయడంలో. నాకెందుకో నీమీద కొంచెం అనుమానం గా వుంది మరి.

నారాయణ నారాయణ ఎంత మాట ఎంత మాట స్వామి వారు నన్నే అనుమానిస్తున్నారా? ఎన్ని ఆధునిక పోకడలు వచ్చినా, స్వామి వారు భక్తులని అయస్కాంతం లాగ ఆకర్షించక మానరు. ఆ భక్తులు మిమ్మల్ని ప్రత్యక్షం గా దర్శించక మానరు, కానుకలు ఇవ్వకా మానరు. మీరు కుబేరుడికి కట్టవలసిన వడ్డీకి ఏమి ఢోకా ఉండదు సుమా!

చాలు మీ పరిహాసాలు నారదా ఇక బయలుదేరండి కొండకి.

(అలా స్వామి వారు, నారదుల వారు విహారం ముగించుకొని తిరిగి ఏడుకొండలపైకి వస్తారు)

స్వామి వారు ఏమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఈ మానవులను మార్చటం ఎలా అనేనా స్వామి.

లేదు నారదా వీళ్ళని మార్చటం ఎవరి తరమూ కాదు. మనమే మారాలి నారదా.

అదెలా స్వామి?

వీరి ఆధునిక సాంకేతికత నన్నెంతో ఆకట్టుకుంది. ఆ... నారదా! మనలో మాట అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇవిగో కొన్ని చరవాణిలను కొనుగోలు చేసి తెచ్చాను. ఇవి శ్రీదేవి, భూదేవి లకు, మన పరివారానికి పంపిణి చెయ్యండి. అలానే ఆ శివ పార్వతి, బ్రహ్మ సరస్వతులని మరిచిపోకండి. ఇంద్రాది దేవతలకు మా ఆజ్ఞ గా చెప్పండి సమాచార మార్పిడి కి వీటినే వాడాలని. ఇదంతా సక్రమంగా జరిగేలా చూసే భాద్యత మీదే నారదా! ఆ ... పనిలో పని మా కుటుంబం వరకు మాత్రం ఒక ప్రత్యేక సమూహం తయారు చెయ్యండి.

నారాయణ నారాయణ ఎంత మాట. ఓరి మానవా! ఎంత పని చేసావురా? అరచేతిలో ప్రపంచాన్ని చూపి, ఈ భగవంతుణ్ణే మార్చి వేసావే. నారాయణ నారాయణ.

********

Posted in September 2023, కథలు

6 Comments

  1. డాక్టర్ రావ్ ఎస్ ఉమ్మెత్తాల

    చాలా సరదాగా బావుంది.👍🌷🙏

  2. Mamatha Yeleswaram

    చాల చాల బాగుంది . మన తెలుగు భాషా పదాలు అర్థవంతంగా సులువుగా చక్కగా రాసారు అన్న.

  3. Jyothirmayi kousika

    కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారో బలే చెప్పారు. కథ చాలా చాలా బాగుంది.🙏🙏🙏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!