Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

"ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అన్నారు పెద్దలు. అనుభవాల్లో నుంచే సామెతలు సహజంగా వస్తాయి. వీటిని మన పూర్వుల అనుభవసారాన్ని తెలియజేసే అమృత రస గుళికలుగా మనం భావించవచ్చు. ఆధునిక కాలంలో కొత్తగా కట్టిన ఇల్లు కొనుక్కోవడం, విరివిగా జరుగుతున్న ప్రేమ వివాహాల నేపథ్యంలో పెద్దగా కష్టపడకుండా కొత్త ఇల్లు, కొత్త అల్లుడు తక్షణం అందుబాటులో వచ్చే రోజులివి. కానీ పాత రోజుల్లో ఇంట్లో పిల్ల పెళ్లి గూర్చి తగిన వరుడి కోసం పది ఊర్లు కాలికి బలపాలు కట్టుకొని తిరిగిన వారిని, పునాదుల నుండి ఒక్కో ఇటుక పేర్చి స్వంత ఇల్లు కట్టిన వారిని అడిగితే తెలుస్తుంది వారి అనుభవాలేమిటో - బహుశా ఆ అనుభవసారం నుండే పుట్టుకొచ్చి ఉంటుంది "ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" సామెత. బాగా ఇల్లు కట్టిన వారి గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం - అబ్బా ఎంత బాగా కట్టాడండి ఈయన అని, మరి అంతకంటే కొన్ని వందల-వేల రెట్ల కష్టం తో నిర్మించిన పెద్ద జలాశయాలు, కర్మాగారాలు, ఇతర ఇంజనీరింగ్ నిర్మాణాలు కట్టిన వారి ఘనత గురించి కూడా చెప్పుకోవాలి కదా?

"తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు" అంటారుగా, కానీ ఈ నెల రచ్చబండ చర్చ కార్యక్రమంలో కథ ముందే చెప్పేస్తే పస ఉండదు, కానీ కథా మకుటం లేదా కథా శీర్షిక గూర్చి చెప్పడంలో ఇబ్బంది లేదు, ఈ నెల చర్చ "మోక్ష గుండం విశ్వేశ్వరయ్య" పై, ఆయనను గూర్చి, ఆయన నిర్మించిన జలాశయాల గూర్చి ఇతర నిర్మాణాల గూర్చి, ఆయన పాటించిన విలువల గూర్చి కూడా కొంత తెలుసుకుందాం.

ఆధునిక మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజినీరింగ్‌ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆనకట్టలు, డ్యాంలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు, రహదారులు ఇలా ఎన్నింటినో ఇంజినీరింగ్‌ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించగలిగారు. ఇవిలేని ఆధునిక ప్రపంచాన్ని ఊహించడం కష్టం. తన అసాధారణ ప్రతిభతో ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు - భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ ప్రముఖ ఇంజినీరింగ్‌ నిపుణుడు - మోక్ష గుండం విశ్వేశ్వరయ్య. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆయన ఆవిష్కరించారు. ఆయన మార్గదర్శకత్వంలో చేయబడిన వంద ఏండ్లనాటి నిర్మాణాలు నేటికీ అవి చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబరు 15, 1861న కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ సమీపంలోని ముద్దెనహళ్ళిలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ - ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. సందర్భం వచ్చింది కాబట్టి మోక్షగుండం గ్రామం గూర్చి, ఈ గ్రామం నుండి ఎందుకు ఎలా వీరి పూర్వీకులు వలసవెళ్లారో తెలుసుకుందాం. రచ్చబండ చర్చ కాబట్టి - కాదేది చర్చకు అనర్హం! మోక్షగుండం గ్రామానికి రెండు కిలోమీటర్లు తూర్పున ఒక చిన్న కొండపై ముక్తేశ్వరము అను శివాలయము ఉంది. ప్రతి యేటా మాఘ మాసములో (ఫిబ్రవరి) జరిగే ముక్తేశ్వర స్వామి జాతరకు అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రదేశముల నుండి విచ్చేస్తారు. ఈ గుడి దగ్గర ఉన్న పవిత్ర గుండములో స్నానము చేసిన వారికి మోక్షము కలుగునని స్థానికులు భావిస్తారు. అందుకే ఈ ఊరికి మోక్షగుండo అని పేరు వచ్చింది. 16వ శతాబ్దంలో మోక్షగుండం గ్రామంలో మోక్షగుండం లక్ష్మీపతి భట్టు నివసించేవారు. అయితే చదువు నేర్చుకోమని తండ్రి దండించడంతో లక్ష్మీపతి భట్టు శ్రీశైలం వెళ్లిపోయారు. అక్కడ గురుకులంలో చేరి పెద్ద పండితుడిగా పేరుగాంచారు. అనంతరం ఆయన తిరిగి మోక్షగుండం గ్రామానికి చేరుకుని దక్షిణ భారతదేశ యాత్రకు బయలుదేరారు. అలా కర్ణాటక చేరి అక్కడ హావు హత్తి అనే గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకొని నివసించారట. ఇలా లక్ష్మీపతి భట్టు కుమారుడు తిప్పాశాస్త్రి, తిప్పాశాస్త్రి కుమారుడు తిమ్మప్ప శాస్త్రి, తిమ్మప్ప శాస్త్రి కుమారుడు తిప్పాశాస్త్రి, తిప్పా శాస్త్రి కుమారుడు శ్రీనివాస శాస్త్రి, శ్రీనివాస శాస్త్రి కుమారుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గా జన్మించారు. తండ్రి శ్రీనివాస శాస్త్రి, తల్లి వెంకట లక్ష్మమ్మ కాశి యాత్ర చేసి వచ్చిన అనంతరం విశ్వేశ్వరయ్య జన్మించడంతో కాశీ విశ్వేశ్వర స్వామి పేరు మీదుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు ఊహిస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తండ్రి సంస్కృత పండితుడు, అయితే 12 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు విశ్వేశ్వరయ్య. ఆ దు:ఖాన్ని దిగమింగుతూనే బెంగళూరులో హైస్కూల్ విద్య, 1881లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పుణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరారు. అక్కడ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. బొంబాయి‌లోనే కొన్నాళ్లు పనిచేసి ఆ తర్వాత ఆయన ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లో చేరారు. అప్పుడే భారతదేశానికి ఓ మేధావి గురించి తెలిసింది. 20వ శతాబ్దంలో దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జలాశయాల నిర్మాతగా, ఆర్థికవేత్తగా శాశ్వత కీర్తిని గడించారు. ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.

ఉపకార వేతనంతో పుణేలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య, బొంబాయి రాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఏడాది వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. విశ్వేశ్వరయ్య పనితీరు అద్భుతంగా ఉండటంతో, సుక్నూర్‌ బ్యారేజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమితులయ్యారు. సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేయడంలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాంతం దేశ విభజన కాలంలో పాకిస్తాన్ కు వెళ్ళిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం 1906-1907 మధ్యకాలంలో యెమెన్ దేశం లోని ఆడెన్ కి ఆయనను పంపించింది. అక్కడి నీటిపారుదల వ్యవస్థను మరియు మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. నిర్దేశించిన పథకం ప్రకారం ఆయన అప్పగించిన ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేశారు. 1909లో మైసూర్‌ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను చీఫ్‌ ఇంజనీర్‌‌గా నియమించింది. 1912 నుండి 1918 వరకు ఏడు సంవత్సరాలు మైసూర్ దివాన్‌గా పనిచేసిన విశ్వేశ్వరయ్య, మైసూర్‌లోని కృష్ణరాజసాగర్ (కె.ఆర్.ఎస్) జలాశయం నిర్మించారు. కావేరీ నది పై నిర్మించిన కృష్ణరాజసాగర్ జలాశయం మొత్తం కూడా అయన పర్యవేక్షణలో నిర్మించబడింది. ఆ రోజుల్లో ఈ డ్యామ్ ఆసియా లోనే అతిపెద్ద డ్యామ్. అప్పట్లోనే మైసూర్ 'ఆదర్శ నగరం' గా మారడంలో ఆయన పాత్ర ఎనలేనిది. హైదరాబాద్, ముంబయి నగరాలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రూపకల్పన, విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.  భారతీయులలో ప్రబలంగా ఉన్న 'అంతా తలరాత' అన్న అలసత్వ భావం (సోమరితనం) రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, ప్రజలలో కర్తవ్య పాలనను రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం -  మైసూర్ దివాన్‌గా బాధ్యతలు చేపడుతూ విశ్వేశ్వరయ్య చేసిన తొలి ప్రసంగం ఇది.

1900ల్లో మూసీ నదికి వచ్చిన వరదల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యేది. మూసీ వరదల బారి నుంచి భాగ్యనగరాన్ని రక్షించే బాధ్యతలను నిజాం నవాబు అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. విశ్వేశ్వరయ్య ఆలోచనల ప్రకారమే.. మూసీపై ఎగువన రిజర్వాయర్లు నిర్మించారు. ఈ జలాశయాల నిర్మాణంతో భాగ్యనగరికి అప్పుడు వరద ముప్పు తప్పింది. ఆయన హయాంలో నిర్మించిన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్‌లు ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నిజాం నవాబు విన్నపం మేరకు హైదరాబాద్‌కు మురుగునీటి పారుదల వ్యవస్థను కూడా ఆయనే రూపొందించారు. ఇప్పుడు కొద్దిపాటి వర్షాలకే నదులను తలపిస్తున్న రోడ్ల పరిస్థితి చూసి గత్యంతరం లేక హైదరాబాద్‌కు సెలవులు ప్రకటిస్తుంది ఇప్పటి ప్రభుత్వం. కాలువలు, గట్లు, చివరికి చెరువులతో సహా అన్నింటిని రాత్రికి రాత్రి పూడ్చివేసి, వాటిని ఆక్రమించిన అక్రమార్కుల మూలంగా తలెత్తిన పరిస్థితి ఇది.  దీనికి తోడు, నిర్వహణ లోపంతో సతమతమవుతున్న హైదరాబాద్‌ మురుగునీటి పారుదల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలంటే మరో "మోక్షగుండం విశ్వేశ్వరయ్య" దిగి రావాలేమో?

విశాఖపట్నం ఓడ రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు. అప్పట్లో విశాఖ రేవు నిర్మాణ సమయంలో అలల పోటు ఎక్కువగా ఉండేది. అలల తీవ్రతను తగ్గించడం కోసం అప్పట్లో ఆయన ఓ సలహా ఇచ్చారు. పెద్దవైన రెండు పాత నౌకల్లో బండరాళ్లు వేసి సాగర తీరానికి చేరువగా అలలు వచ్చే మార్గంలో ముంచేయాలని సూచించారు. అలా చేయడం వల్ల అలల తీవ్రత తగ్గింది. కొన్నాళ్ల తర్వాత కాంక్రీటుతో బ్రేక్ వాటర్స్ నిర్మించారు.

ఒకసారి డాక్టర్ విశ్వేశ్వరయ్య బ్రిటిష్ ఇండియాలో రైలులో ప్రయాణిస్తున్నారు. చాలా మంది బ్రిటిష్ వారు ఈ రైలులో ఉన్నారు. బ్రిటిష్ వారు అతడిని నిరక్షరాస్యుడు అని ఎగతాళి చేశారు. ఈ సమయంలో, డాక్టర్ విశ్వేశ్వరయ్య అకస్మాత్తుగా రైలు గొలుసును లాగారు. కాసేపటి తర్వాత గార్డు వచ్చి గొలుసు ఎవరు లాగారు అని అడిగారు? అప్పుడు డాక్టర్ విశ్వేశ్వరయ్య నేను గొలుసు లాగాను, ఎందుకంటే ఇక్కడి నుండి కొంత దూరంలో రైల్వే ట్రాక్ సరిగ్గాలేదని ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని తనకు అనిపిస్తోందని చెప్పారు. దీనిపై గార్డు మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు విశ్వేశ్వరయ్య 'రైలు సహజ వేగంలో వ్యత్యాసం ఉంది మరియు ధ్వనిలో కూడా కాస్త వ్యత్యాసం ఉన్నట్లు తనకు తడుతోందని" చెప్పారు. దీని తరువాత, ట్రాక్‌ను పరిశీలించినప్పుడు, దగ్గరలో ఉన్న ఒక వంతెన ఉన్న ప్రదేశంలోని రైల్వే ట్రాక్ యొక్క బోల్టులు తెరిచి ఉన్నాయి. రైలు పట్టాల నట్లు బోల్టులు కలిపి ఉంచే ఇనుప ప్లేట్లు అక్కడ విరిగిపడి ఉన్నాయి. ముందు చూపుతో రైలు ప్రమాదాన్ని తప్పించిన విశ్వేశ్వరయ్య మేధోశక్తిని చూసిన బ్రిటీష్ వారు అతన్ని ప్రశంసించారు. 1955లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవించింది. బ్రిటిష్ నైట్‌హుడ్ కూడా లభించింది. భారత దేశంలోని 8 విశ్వవిద్యాలయాలు గౌరవ పూర్వంగా డాక్టరేట్ పట్టాతో ఆయనను సత్కరించాయి

జీవితంలో ఒకసారైనా మైసూరు శాండల్  సబ్బుతో స్నానం చేయని తెలుగు వారు ఉండరు. గంధంతో కూడిన సువాసనతో దాని ప్రత్యేకత దానిదే. ఈ మైసూరు శాండల్ సబ్బుల తయారీలో విశ్వేశ్వరయ్య పాత్ర ఉంది. 1914లో తొలి ప్రపంచయుద్ధం మొదలు కావడంతో సముద్ర మార్గాల్లో ఇబ్బందుల వల్ల మైసూరు నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసే గంధం చెక్కల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. యుద్ధంతో మొదలైన అనిస్థితి కారణంగా దాంతో చాలా దేశాలు దిగుమతులను ఆపివేయడం వల్ల మైసూరు గంధపు చెక్కలకు డిమాండ్ పడిపోయింది. యుద్ధ సమయంలో నిత్యావసర వస్తువులు దొరికితే చాలనుకునే రోజులవి, గంధం చెక్కలు దిగుమతి చేసుకొని ఇతర దేశాలవారు ఏంచేసుకుంటారు? దానితో మైసూరు ప్రాంతంలో ఎగుమతికి సిద్ధం చేసిన గంధం చెక్కల నిల్వలు పేరుకు పోయాయి. నాడు మైసూర్ రాజ్యాన్ని కృష్ణరాజ వడియార్-4 పాలిస్తున్నారు. ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నాడు మైసూరు దివాన్‌గా ఉన్నారు. పేరుకుపోయిన గంధపు చెక్కల నుంచి ఆయిల్ తీసే మార్గాలను ఆలోచించమని విశ్వేశ్వరయ్యను రాజు అడిగారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సహాయంతో గంధపు చెక్కల నుంచి నూనెను తీసే యంత్రాన్ని తయారు చేయించారు విశ్వేశ్వరయ్య. అలా 1916లో మైసూరులో తొలి శాండల్‌వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అప్పటి నుండి 107 సంవత్సరాలకు పైగా విజయవంతంగా సాగుతున్న మైసూర్ శాండల్ సబ్బుల కంపెనీ, నేటికీ ఇది ప్రజలకు అత్యుత్తమ ఎంపికగా కొనసాగుతుంది. ఇలా విశ్వేశ్వరయ్య పనిచేసిన అన్ని ప్రాజెక్టులు విజయవంతం కావటం వల్ల అతి తక్కువ కాలంలో ఒక సెలబ్రిటీ గా అయ్యారు.

పుణే నగర నీటి సరఫరా పథకాన్ని రూపొందించి ఆ కాలంలో ఆటోమేటిక్ స్లూయిస్‌గేట్లకు రూపకల్పన చేసి అందరినీ ఆయన ఆశ్చర్యపరిచారు. ఈ కొత్త పరిశోధనకు పేటెంట్ కోసం దరఖాస్తు చేయాలని మిత్రులు కోరినా.. ఆయన ఆ సలహా ను సున్నితంగా తోసిపుచ్చారు. విధి నిర్వహణాలో భాగంగా తాను చేసిన పనికి పేటెంట్ తీసుకోవటం సముచితం కాదన్నారు. దేశంలోనే తొలి ఉక్కు కర్మాగారం మైసూరు సంస్థానం భద్రావతిలో నిర్మించింది. అయితే, తొలినాళ్లలో మైసూరు మహారాజాతో విబేధాలు తలెత్తి విశ్వేశ్వరయ్య రాజీనామా చేసి నేరుగా బొంబాయికి వెళ్లిపోయారు. విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో తదుపరి కొనసాగిన భద్రావతి కర్మాగార నిర్మాణ కార్యక్రమం దెబ్బతినడంతో మైసూర్ మహారాజా దిగివచ్చారు. గత్యంతరం లేక బొంబాయిలోని విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానించి ‘ఈ కర్మాగార పథకం మీదే.. దురదృష్టవశాత్తు అది ఇప్పుడు రోగ గ్రస్తమైంది. మీరు ప్రారంభించిన ఈ కర్మాగారాన్ని ప్రజాప్రతినిధి సభ సభ్యులు దీనిని తెల్ల ఏనుగంటూ ఎగతాళి చేస్తున్నారు.. మీరు వచ్చి దీనిని పునరుద్ధరించాలి’ అని లేఖ రాశారు. ఆయన విన్నపాన్ని మన్నించి విశ్వేశ్వరయ్య కర్మాగార బాధ్యతలు చేపట్టి కార్మికులను ప్రోత్సహిస్తూ రెండేళ్లలో లాభాల్లోకి తీసుకొచ్చారు. పెద్ద కర్మాగారాల్లో సుశిక్షితులైన భారతీయులనే నియమించాలని అందుకు శిక్షణావకాశాలు పెంచాలని ఆయన అప్పటి  ప్రభుత్వాన్ని కోరారు. భద్రావతి కర్మాగారం పర్యవేక్షకులుగా మహారాజా నుంచి తనకు లభించిన రూ.1.50 లక్షలు తిప్పి పంపి, ఆ పైకంతో పారిశ్రామిక శిక్షణ సంస్థను నెలకొల్పాలని సూచించారు. ఆ సంస్థకు తన పేరు పెట్టడానికి సమ్మతించలేదు. ఆ విధంగా ఏర్పాటయ్యిందే ప్రస్తుత జయ చామ రాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్‌స్టిట్యూట్. విశ్వేశ్వరయ్య తదనంతరం 1975లో భద్రావతి కర్మాగారం  విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్‌గా పేరు మార్చబడింది.

తిరుమల మొదటి ఘాట్ రోడ్ ఏర్పాటు కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి చేశారు. విశ్వేశ్వరయ్య వేసిన తిరుమల ఘాట్‌ రోడ్లకు వచ్చే ఏప్రిల్ 2024 వ సంవత్సరానికి 80 వసంతాలు నిండుతాయి. ఒక ఘాట్‌ రోడ్డు తిరుమలకు వెళ్లడానికి, మరో ఘాట్‌ రోడ్డు తిరుమల నుంచి కిందికి రావడానికి. తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్‌ రోడ్డులో వెళ్ళాలంటే కనీసం 30 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. అదే తిరుమల నుంచి తిరుపతికి రావాలంటే 45 నిమిషాల సమయం. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్‌ రోడ్డు విశ్వేశ్వరయ్య వేసినది. 1944లో ఇప్పుడు ఉన్నన్ని భారీ యంత్రాలు లేని రోజుల్లో కొండలపై ఘాట్‌ రోడ్లు వెయ్యడం మామూలు విషయం కాదు. ఎన్నో మలుపులు కూడి ఉండి, శేషాచలం అడవుల్లో నుంచి వేసిన రోడ్లు ఇవి. 1944వ సంవత్సరం ఏప్రిల్‌ 10లో నాటి ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ మొదటి ఘాట్‌ రోడ్డును వేశారు. మొదటగా ఘాట్‌ రోడ్డును అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ ఆర్తూర్‌ హోప్‌ ప్రారంభించారు. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు మీద ప్రజలు తిరుమలకి చేరుకునేవారు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం సందర్శకుల కోసం తిరుపతి-తిరుమల రెండు బస్సులు ప్రారంభించింది. మొదట్లో ఈ ఘాట్‌రోడ్డులో చిన్నపాటి బస్సులు వెళ్లేవి. అవి క్రమేపి పెద్దదిగా మారాయి. రెండవ ఘాట్‌ రోడ్డు వేసే వరకు మొదటి ఘాట్‌ రోడ్డు ద్వారానే కొండ పైకి క్రిందకు బస్సులు తిరిగేవట. 1944లో తిరుపతి నుండి తిరుమల బస్సు ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ధర రూ.2. రెండవ క్లాస్‌ ధర రూ.ఒక రూపాయి నాలుగు అణాలు (రూపాయి పావలా). ఇప్పుడు అదే టిక్కెట్టు ధర 90 రూపాయిలు. 1973లో రెండో ఘాట్ రోడ్డు (తిరుపతి నుంచి తిరుమలకు)ను నిర్మించారు. మొదటి ఘాట్ లో కొండలు చరియలు కూలే అవకాశాలు తక్కువ. కానీ 16 కిలోమీటర్లు నిడివిగల రెండో ఘాట్ రోడ్డులో మాత్రం 7వ కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు రాళ్లు కూలే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దాంతో ప్రమాద కారణాలతో రెండో ఘాట్ రోడ్డు మొరాయించినప్పుడు విశ్వేశ్వరయ్య వేసిన మొదటి ఘాట్ రోడ్ నే రెండు వైపులా ప్రయాణానికి వాడవలసి వస్తుంది. టెక్నాలజీ లేని రోజుల్లో ఏర్పాటు చేసిన ఈ మొదటి  ఘాట్ రోడ్డు మార్గం నేటికీ చాలా పటిష్టంగా ఉంది, దీన్నిబట్టి విశ్వేశ్వరయ్య  పనితనాన్ని మనం అంచనా వెయ్యవచ్చు. ఇప్పుడు అన్నమయ్య మార్గం ద్వారా మూడవ ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కడప జిల్లా మామండూరు నుంచి అటవీ మార్గం లో అన్నమయ్య కాలి బాట మార్గం ఉంది. ఈ మార్గం గుండా నడిచే వెళితే తిరుమల కొండ మీదున్న పారువేట మందిరం దగ్గరకు చేరుకుంటాం. అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడిచి శ్రీవారి ఆలయాన్ని చేరుకోవచ్చు. ఆరు శతాబ్దాల కిందట పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య ఈ మార్గం నుంచే శ్రీవారి ఆలయానికి వచ్చారు అని చరిత్రకారులు చెబుతారు. అయితే ఈ  కాలి బాటలో స్థానే రోడ్డు ఏర్పాటుచేయాలంటే పర్యావరణ అనుమతులు అవసరం. దీనికి బదులుగా రెండో ఘాట్ రోడ్డులో మాత్రం 7వ కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు రాళ్లు కూలే పరిస్థితులు ఉన్న దృష్ట్యా అక్కడే ఒక బైపాస్ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని ఆధునిక ఇంజనీర్లు తలపోస్తున్నారు, చూద్దాం వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో! విశ్వేశ్వరయ్య తో చర్చను మొదలు పెట్టి, అనక తిరుమల ఘాట్ రోడ్, చివరికి అన్నమయ్య కాలి బాట వద్దకు చర్చను లాక్కు వచ్చాము, రచ్చబండ చర్చలంటే ఇలాగే ఉంటాయి, కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాం, తెలిసిన విషయాల సింహావలోకనం కూడా కొంత జరుగుతుంది.

దేశాభివృద్ధిలో  విశ్వేశ్వరయ్య సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను 1955లో 'భారత రత్న' పురస్కారంతో గౌరవించింది. అంతకు మునుపు బ్రిటిష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారమైన 'బ్రిటిష్ నైట్‌హుడ్'ను కూడా విశ్వేశ్వరయ్య పొందారు. దీంతో ఆయన పేరుకు ముందు 'సర్' వచ్చి చేరింది. ప్రతి వ్యక్తీ జీవితాంతం విద్యార్థిగానే ఉండాలని కాంక్షించే ఆయన ఎక్కడ ఏ కొత్త సమాచారం తెలిసినా నోట్‌ చేసుకునేవారు. విశ్వేశ్వరయ్య నిజాయితీకి ఒక్క మచ్చుతునక - ఒకసారి విదేశీ పర్యటనకు డబ్బులు అవసరం కాగా మైసూర్‌ బ్యాంక్‌లో తనవద్ద ఉన్న ప్రభుత్వ రుణపత్రాలను ఆయన తాకట్టుపెట్టారు. సదరు బ్యాంక్‌ సిబ్బంది, ఆయన స్నేహితులు విశ్వేశ్వరయ్య నిజాయితీని అప్పుడు మెచ్చుకున్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ గా పేరుగాంచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య చివరి క్షణం వరకు.. కంటిఅద్దాలను కూడా ఉపయోగించ లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన చిన్నప్పటి నుండి చివరి రోజుల్లో తీసినటువంటి ఫోటోలలో ఎక్కడా కూడా మనకు ఆయన కంటి అద్దాలు ఉపయోగించినట్లు కనబడదు. కఠినమైన ఆహార నియమాలు చివరి వరకు ఆయన పాటించడమే ఇందుకు కారణంగా చెబుతారు. భారత్‌లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన ఆయన జయంతి (సెప్టెంబరు 15)ని దేశవ్యాప్తంగా 'ఇంజినీర్స్ డే' జరుపుకుంటారు. ఈ సెప్టెంబర్ 15 న  మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహ ఆవిష్కరణ, నివాళుల కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా యధావిధిగా జరుగుతాయి. అయితే ఈ సందర్భంగా ఆయన పాటించిన విలువలు, గంధపు చెక్క వలే సేవలో అరిగిపో గానీ ఇనుములా తుప్పుపట్టవద్దనే - ఆయన జీవితలక్ష్యం ను మనమందరం అవగతం చేసుకోవాల్సిన ఆవసరం ఉంది.

దురదృష్టవశాత్తు ‘ఇంజనీర్స్‌ డే’ రాను రాను మొక్కుబడి కార్యక్రమంగా మారడంతో పాటూ ఇంజనీరింగ్‌ రంగంలో ఉండాల్సిన నైతిక విలువలు వేగంగా పతనమవుతున్నాయి. విశ్వేశ్వరయ్య ఆశయాలు, ఆదర్శాలు మార్గదర్శకత్వం గాలిలో కొట్టుకుపోయాయి. బీహార్‌లో ప్రారంభానికి ముందే కూలిన వంతెన, హైదరాబాద్‌లో నడిబొడ్డున కూలిన ఫ్లై ఓవర్‌, ఏసీబీ, సీబిఐలకు చిక్కుకున్న అవినీతి బాగోతాలతో ఇంజనీరింగ్‌ రంగం అప్రతిష్ట పాలవుతున్నది. ఈ నిర్మాణాల వైఫల్యాలకు సాంకేతిక కారణాల కంటే మానవ తప్పిదాలే మూలం అని తెలుస్తుంది. నాటి రోజుల్లో ఇంజనీరింగ్‌ రంగంలో ఉన్న వ్యక్తుల పట్టుదల, కార్యదీక్ష, నిజాయితీ, తపన నేటి రోజుల్లో ఏమి అయ్యాయన్నది ఇపుడు పెద్ద ప్రశ్న, అందుకు కారణం ఎవరన్నది, దానికి విరుగుడు ఏమిటో లోతుగా ఆలోచించాలి.

పలు పుస్తకాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్రను రాయగా.. వాటిలో ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామానికి సైతం చోటు దక్కింది. విశ్వేశ్వరయ్య పూర్వీకులు ప్రకాశం జిల్లా వారు కావడం తెలుగువారందరికీ గర్వకారణం. దేశం వ్యాప్తంగా గాంధీ, నెహ్రు ల పేరుతొ విశ్వవిద్యాలయాలు ముమ్మరంగా స్థాపించడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 నుండి 6 విశ్వవిద్యాలయాలు గాంధీ నెహ్రు పేర్లపై నెలకొల్పడం జరిగింది. చివరివరకు దేశ సేవ లో తరించిన విశ్వేశ్వరయ్య పేరుమీద మోక్షగుండం గ్రామ ప్రాంతంలో ఒక సెంట్రల్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పితే తెలుగువారిగా మనం కూడా ఆయనకు, ఆయన పూర్వీకుల గ్రామానికి సముచిత గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయాత్మక అడుగులు వేస్తుంది అని ఆశిద్దాం. చివరిగా 1861 లో జన్మించిన విశ్వేశ్వరయ్య ఏప్రిల్ 12.1962న మరణించారు. చివరిగా... ఆయన 90 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ ఆహ్వానం మేరకు పాట్నా వద్ద గంగానదిపై బ్రిడ్జిని విశ్వేశ్వరయ్య తన బృందంతో నిర్మించారు అన్న వార్త విస్మయం కలిగిస్తుంది. ఆరంభం నుండి చివరి వరకు నైతికత, నిబద్ధత కలిగిన విశ్వేశ్వరయ్య జీవితాన్ని భావి ఇంజనీర్లు మార్గదర్శిగా స్వీకరించాలి. ఆయన విలువలను వ్యక్తిగతంగా, సామాజికంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. ఇది జరిగినప్పుడే భావిభారతం ప్రపపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది. కాబట్టి సిరిమల్లె పాఠకులు ఈ సెప్టెంబర్ 15 న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162వ జయంతి  సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటారని, ఆయన చేసిన దేశ సేవ, పాటించిన విలువల స్పూర్తితో ఉత్తేజితులవుతారని  ఆశిస్తూ...  యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయండి. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in September 2023, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!