Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
కొలిమి (ధారావాహిక)
-- ఘాలి లలిత ప్రవల్లిక --

ఓ రోజు తెల్లవారేసరికి ఆంజనేయులు గారి ఇంటిముందు ఎవరో ఓ వ్యక్తి తచ్చట్లాడుతూ కనపడ్డాడు. చూడటానికి సన్నగా పొడవుగా ఉన్నాడు. మాసిన గుడ్డలూ....పెరిగిన గెడ్డం..నీరసించిన మొహం చూస్తేనే తెలుస్తుంది. అతని మానసిక స్థితి.

ఇంటి వంకే చూస్తూ ఉన్నాడు అతను. అతను ఏమన్నా తమ బంధువేమోనని తలుపు సందులోంచి పరిశీలనగా చూసిన గిరిజ బంధువు కాదని తీర్మానించేసింది.

"మరైతే ఎవరైఉంటారు..? ఇక్కడ అతనికి ఏం పని?"అనుమానం అలుముకుంది.

"దొంగేమో! పెళ్ళిల్లుకదా అనూ పానూ చూసుకొంటున్నట్లున్నాడు." అని మనసులో నిర్ధారణ చేసుకుని భర్తను పిలిచి' ఎవరో? ఏంటో? ఒకసారి చూసిరండి' అని చెప్పింది గిరిజ.

ఆంజనేయులు గారు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళారు. కాసేపు ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు.

"రండి సార్ "అంటూ అతన్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోమన్నారు ఆంజనేయులు.

"లేదండి ఒక్కసారి పాపను పిలవండి ...మాట్లాడి వెళ్ళిపోతాను" అన్నారావ్యక్తి.

"తప్పకుండా మాట్లాడుదురు గాని మీరు ముందు కూర్చోండి. కాఫీ తాగుతారా? టీ తాగుతారా?" అంటూ అడిగారు ఆంజనేయులు.

"నో థ్యాంక్స్ అలాంటివి ఏమి వద్దు. నాకు అర్జెంటు పనులు ఉన్నాయి. మళ్లీ తీరిక చేసుకుని వస్తా మీ ఇంటికి. పని మీద వెళుతూ ప్రణవిని చూసి పోదామని వచ్చాను. ఒకసారి పలకరించి వెళతా." చెప్పాడు ఆవ్యక్తి.

"అమ్మా ప్రణవి వీరు తెలుసా నీకు" అని అడిగారు ఆంజనేయులు.

"తెలియదు నాన్నగారు ఎవరు? అడిగింది ప్రణవి.

“నీ ఫ్రెండ్ నూర్జహాన్ వాళ్ళ ఫాదర్". చెప్పారు ఆంజనేయులు.

ఆయన మొహం పాలిపోయి ఉంది. మాసిన బట్టలు, చింపిరి జుట్టు..వాలకం చూస్తే ఓ బిచ్చగాడి లా ఉన్నాడు.

నాకు తెలిసీ నూర్జహాన్ ఫాదర్ ఓ పెద్ద ఉద్యోగి. గజిటెడ్ ఆఫీసర్ కేడర్. మరి ....ఈయనేంటి ఇలా ఉన్నారు.

నిజంగా ఈయన నూరూ ఫాదరేనా...అనుమానం తనలో ఓ మూల ఉదయించింది. అనుమానాన్ని ఆదిలోనే అణిచేసి మొహాన్న నవ్వు పులుముకుని...'

"నమస్తే అంకుల్ నేను మిమ్మల్ని ఇదే చూడటం. నూరి ఏది? "అంటూ అటూ ఇటూ చూసింది ప్రణవి.

"నమస్తే అమ్మా. నీది షాదీ అని మీ ఫాదర్ చెప్పారు. నీకు శుభాకాంక్షలు తల్లి." అని ఏదో అడగబోయి ఆగిపోయారు.

"ధన్యవాదములు అంకుల్. ఏదో అడగబోయి ఆగారు" అంటూ అడిగా...

"అది...అదీ..."చుట్టూ చూస్తూ సంశయిస్తున్నారు చెప్పడానికి.

"ఏంటంకుల్ నూర్జహాన్ ఎలా ఉంది?" ఆయన వాలకానికి ఏదో భయం ప్రణవిలో చోటుచేసుకోవడంతో హీనస్వరంతో అడిగింది.

ఆయన తల వంచుకొన్నారు. జవాబు చెప్పలేదు. ఏదో అడగబోయి ఆగిపోతున్నారు. అందరూ ఉండటం వలన అడుగుదామనుకున్న విషయాన్ని అడగలేక పోతున్నారేమో ననిపించింది ప్రణవికి. ఎందుకో ఏమో మొదట్లో ఆయనపై ఏర్పడిన దురభిప్రాయం పోయిందేమో. ఆయన కళ్ళల్లో ఏదో బేలతనం కనబడుటంతో...

"అంకుల్ మా పెరటి తోట చూద్దురు గాని రండి "అని పిలిచింది ప్రణవి.

ఇద్దరం కలిసి తోటలోకి వెళ్ళారు. దగ్గరలో ఎవరూ లేకపోవడం చూసి

"ఇప్పుడు చెప్పండి అంకుల్ ఏమైంది." అని అడిగింది ప్రణవి.

"అమ్మా మా నూరి ఏమన్నా వచ్చిందా ఇక్కడకు." ఇంచుమించు ఏడుస్తున్నట్లు అడిగారు.

"లేదంకుల్ .రాలేదే....ఎప్పుడు బయలుదేరింది." కంగారుగా అడిగింది ప్రణవి.

“రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు తల్లీ. నీకేమైనా చెప్పిందా?" దీనంగా అడిగారు.

"నాతో ఏమి చెప్పలేదంకుల్. మీరు ఏమైనా అన్నారా?"అడిగింది.

"లేదమ్మా ఇంట్లో ఎటువంటి గొడవలు జరగలేదు. మామూలుగా కాలేజీ కనే బయలు దేరివెళ్ళింది. సాయంత్రం ఇంటికి రాలేదు. ఏదో లేటు అయ్యిందేమో అనుకున్నాం...ఆ రాత్రి రాలేదుఆడపిల్ల కదా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పరువు పోతుందని.... ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇళ్ళకు వెళ్తున్నాను అమ్మా. అందరి ఇళ్ళూ అయిపోయాయి. నువ్వే లాస్ట్..." అంటూ ఏడుస్తూ  ..... క్షీణస్వరంతో తాను తాను ఎవరినైనా ప్రేమించిందా... నీకేమైనా తెలిస్తే చెప్పమ్మా.....నీ కాళ్ళు పుచ్చుకుంటా" అంటూ కాళ్ళ మీద పడబోయారు.

"అయ్యో... అంకుల్ మీరు నా కాళ్ళ మీద పడటంఏమిటి. అలాంటిదేం లేదు. ఉంటే మాకు చెప్పేది కదా! ఏ బంధువుల ఇంటికోవెళ్లి ఉంటుంది లెండి. కంగారు పడకండి. వచ్చేస్తుంది." అంటూ ఆయనకు ధైర్యం చెప్పింది ప్రణవి.

ధైర్యం అయితే చెప్పింది గాని "దీనిని ఎవరన్నా ఏమన్నా చేశారేమో!" అనే భయం ప్రణవి మనసును పట్టుకుంది.

ప్రణవి మొహాన్ని గమనించిన నూర్జహాన్ ను ఫాదర్

"పెళ్లి కూతురు వి.... ఎటువంటి దిగులూ పెట్టుకోకమ్మా... దానికేం కాదులే.‌.. నా బాధ కొద్దీ అడిగాను. వాళ్ళ మేనత్త దగ్గరికి వెళ్లి ఉంటుందేమో...కనుక్కుంటా అమ్మా శుభాకాంక్షలు తల్లి...ఇక నేను వెళతాను" అన్నారాయన.

ఆమాటలు ప్రణవికి ధైర్యం చెప్పటానికి అన్నవే గాని వారి మనస్సులో ఓ మూల ఆ భయమూ లేకపోలేదు.

ఆయన తిన్నారో లేదోనన్న ఉద్దేశ్యంతో

"అంకుల్ కాస్త టిఫిన్ తిని కాఫీ తాగివెళ్ళండి" అంది ప్రణవి.

"వద్దులేమ్మా మరోమారు వస్తాను." అంటూ వడివడిగా వెళ్ళిపోయారు.

"అదేంటే వచ్చినాయనకు కాఫీ నీళ్లు అన్నా ఇవ్వకుండా అలా పంపించేసావు." అంటూ అడిగింది అమ్మ.

ఈ విషయం చెప్పాలో చెప్పకూడదో తెలియలేదు ప్రణవికి. ఆమె వాళ్ళ అమ్మ దగ్గర ఏ విషయమూ దాచేదికాదు. తనకు సంబంధించిన అన్ని విషయాలు వాళ్ళ అమ్మతో షేర్ చేసుకునేది. అందుకేనేమో దాయాలనిపించక. వాళ్ళఅమ్మ గిరిజకు తగ్గు స్వరంతో విషయం చెప్పింది.

ఎలా వినిందో ప్రణవి బామ్మ వినేసింది.

"ఇంకెక్కడ దొరుకుతుందది. ఎవడితోనోలే... ది. అయినా ఆయనకు బుద్ధి ఉండక్కర్లేదూ.... పెళ్లి ఇంటికి వచ్చి ఇలాంటి విషయాలు అడిగేది ఏమిటి. ఈ విషయం మగపెళ్లి వారికి తెలిసిందంటే ఎంత అప్రతిష్ట ... దీని స్నేహితురాలు ఇలాంటిది అంటే.....ఇది ఎలాంటిదో అంటారు". అంటూ మొదలు పెట్టింది ప్రణవి బామ్మ తాయారు.

స్నేహితురాలి గురించి బామ్మ అలా మాట్లాడుతూ ఉంటే ప్రణవికి కోపం వచ్చి,

“తను అలాంటిది కాదు బామ్మ. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. తన పని తను చూసుకుంటుంది. క్లాసు రూములో కూడా బుర్కా తీసేది కాదు. చాలా పద్ధతిగా ఉంటుంది." అంటూ చెప్పింది.

"అలా కాక ఇంకెలా చెబుతావులే.... అంత పద్దతులు తెలిసిన పిల్లే అయితే తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లినట్లో...మరి రెండు రోజులైనా తెలియనివ్వలేదు ఎందుకో...?" అంది దీర్ఘాలు తీస్తూ...తాయారు.

"ఎందుకు బామ్మా ఈ సమాజంలో ఆడపిల్ల కనిపించకపోతేనే ఆ రకంగానే మాట్లాడతారు. మగపిల్లవాడు కనపడకపోతే అలా ఏమీ అనరు". అంటూ ధైర్యం చేసి అడిగింది ప్రణవి.

తాయారు ఏదో చెప్పబోయేంతలో గిరిజ వచ్చి,

"అలా పెద్ద వాళ్లకి ఎదురు నిలబడి మాట్లాడొద్దని చెప్పానా... ఎందుకలా మాట్లాడుతున్నావ్ లోపలికి పద" అంటూ ప్రణవిని మందలించి అక్కడినుంచి తీసుకెళ్ళి పోయింది.

"ఎందుకో నా మనస్సు మనస్సులో లేదు. నూరీ చుట్టూనే తిరుగుతోంది. ఏమైంది? ఎర్రగా బుర్రగా ఉందని ...ఎవరన్నా ఏమన్నా చేసారా? లొంగదీసుకొని చంపేసారా?" ఏవేవో పిచ్చిపిచ్చి ఆలోచనలతో ఆ రాత్రి కలత నిద్రపోయింది ప్రణవి.

తర్వాత ఆ విషయం...పెళ్ళి వేడుకల్లో చోటు లేక ప్రణవి మెదడులో ఓ మూల ఒదిగి దాక్కుంది.

మగ పెళ్ళి వారి నుంచి ఫోన్ వచ్చిందంటే పరుగు పరుగున వెళ్ళింది...జంబేష్ ఏమన్నా తనతో ఏమైనా మాట్లాడతాడేమోననే ఉద్దేశ్యంతో ప్రణవి. వాళ్ళూ వాళ్ళూ ఒకరి పద్దతులు ఒకరు తెలుసుకోవడం కొరకు మాట్లాడుకునే వారు. ఉసూరు మంటూ వెనుతిరిగేది ప్రణవి.

ఓ రోజు రోజూ ప్రణవి రావడం కనిపెట్టిన గిరిజ జంబేష్ అన్నగారితో... "అల్లుడు గారు ఉంటే ఓ సారి ఇవ్వండి అంది." తప్పదన్నట్లు గా ఆయన ఫోన్ తమ్ముడికిచ్చినట్లున్నారు.

ఫోన్ అందుకుంటూ నే... జంబేష్

"మీరేమైనా మాట్లాడదలుచుకుంటే అన్నయ్యతోనే మాట్లాడండి నాతో కాదు." అంటూ ఫోన్ పెట్టబోయాడు.

"ఈయన ఏంటి ఇలా? ఎందుకో? ఏమిటో? తెలుసుకోకుండా ఇలా అంటున్నాడేంటి" అని మనసులో అనుకొని,

"అది కాదండి పాపతో మీరేమైనా మాట్లాడతారేమోనని" అంటూ నసిగింది గిరిజ.

"ఇప్పుడు తనతో ఏం మాటలు ఉంటాయిలెండి? నేనేం మాట్లాడను." అంటూ ఫోన్ పెట్టేసాడు.

ఆ మాటలు ప్రణవీకి వినబడ్డాయి.ఎందుకో ఆమె మనస్సు చివుక్కుమంది.

"నాలాగా ఆయన కూడా పెద్దలచాటున పెరిగాడేమోలే "అని తనకు తాను సర్ది చెప్పుకుంది.

"పెళ్ళి అంటే కన్నె కలల పంట అంటారు. పెళ్ళి కొడుకుని నేను సరిగ్గా చూస్తే కదా! కలలన్నా కనడానికి. పెళ్ళిచూపుల్లో ఏదో భయం. తలెత్తి చూడాలంటే...తలవంచుకు కూర్చున్న నాకు అతని కాళ్ళు మాత్రమే కనబడ్డాయి.నేనేం కలలు కనగలను?" అనుకుంది ప్రణవి మనస్సులో.  తర్వాత ఫొటో ఎవరికంటా పడకుండా దొంగ చాటుగా చూసింది.

పెళ్లి రోజు దగ్గరలోకి వచ్చేసింది... ఇల్లంతా బంధుమిత్రులతో కళకళ లాడుతూ ఉంది. పెళ్ళిరాట వేసారు. పచ్చని తాటాకు పందిరి వేసారు. మామిడి తోరణాలు కట్టారు. యూత్ మెహందీ ఫంక్షన్ చేయాలన్నారు.

"ఏంటీ గోరింటాకు పెట్టుకోవడానికి కూడా పండగలా చేయాలా? పెట్టటానికి పట్నం నుంచి మనిషిని రప్పించాలా? మా కాలంలో ఇలాంటి నాజూకు వేషాలు లేవమ్మా...! గోరింటాకు బుట్టలతో తెస్తే .....అదే మహద్బాగ్యముగా రోలు ముందేసుకొని .... ముక్కాలి పీటమీద కూర్చొని పోటీలు పడి రుబ్బే వాళ్ళం. ఆనక ఎవరి చేయి ఎర్రగా పండిందా! అని చూసుకునే వాళ్ళం. తర్వాత కరెంట్ మిషన్ లలో తిప్పేసి పెట్టుకొనే వారు. ఇప్పుడేంటో ఈ నిల్వ పొట్లాలు తెచ్చి పెట్టుకొంటున్నారు. పట్టుమని పన్నెండు గంటలు కూడా ఉండదు." అంటూ అరిచింది తాయారు.

"పోనీలే అమ్మా పిల్లలు ముచ్చట పడుతున్నారు గా కాలంతో పాటు మనం కూడా మారాలి. ఈ వేడుకలు మళ్లీ మళ్లీ రావుగా....అంటూ అలాగే పిల్లలూ మీకేది  ఇష్టం అయితే అదే...అలాగే కానిద్దాం". అన్నారు ఆంజనేయులు.

బ్యూటిషన్ వచ్చి అందరికీ కోన్లతో గోరింటాకు పెట్టేసింది. పెద్దవాళ్లు గొణుక్కుంటూ టోపీలు చుక్కలు పెట్టిం చుకున్నారు. పిల్లలు రకరకాల డిజైన్లు పెట్టిం చుకున్నారు. ప్రణవికి రెండు చేతుల నిండా వెనక ముందు మోచేతి వరకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మలతో డిజైన్లు పెట్టేసింది. కాళ్ళకి కూడా పారాణి లాగా డిజైన్లు పెట్టేసింది.ఆ బ్వూటీషియన్.

ఓ 20 వేల పైనే ఆంజనేయులు గారు ఆమెకు సమర్పించుకున్నారు. తాయరమ్మకు తెలియనీయకుండా. తెలిస్తే రచ్చ చేస్తుందని.

తాయారుకు ఈ విధానం నచ్చలేదు. నిజానికి ప్రణవికి కూడా నచ్చలేదు.

"ఆరోగ్యాన్ని కలిగించే ఆకులను వదిలేసి ఈ కెమికల్స్ కలిపిన వీటిని పూసుకోవడం ఏంటి? అనే భావన ఆమెది.

ప్రణవిని తోటి వారంతా పాత చింతకాయ అని, అమ్మమ్మ అని ఎద్దేవా చేయటంతో జరుగుతున్న తంతులకు వేటిల్లో తను కలుగజేసుకోలేదు ప్రణవి. ఎందుకో ఈ కాలం పిల్లల మనస్తత్వం ఆమెకు రాలేదు.

పెళ్లి పనులు జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు నూర్జహాన్ ను గుర్తు చేసుకొంటూ ఉండేది ప్రణవి.

"నూరీ ఏమైందో ఏమో ....తనకు ఫోన్ చేస్తుంటే ఎవరూ ఎత్తడం లేదు.ఆమె మనస్సును క్రమేపీ ఆక్రమించే ఆవేదన ఓ పక్క, మరోపక్క తన వివాహ వేడుకలు. అన్య మనస్కంగా కాలక్షేపం చేస్తోంది ప్రణవి.

"నీ పెళ్లి... ఎందుకు అంత ఉదాసీనంగా ఉంటావు. ఉత్సాహం గా ఉండాలి కానీ... అలా ఉంటే ఏడుపుగొట్టు జీవితం అవుతుంది. జీవితంలో మరిచిపోలేని రోజులివి. ప్రస్తుతం ఎవరి గురించి ఏమీ ఆలోచించకు. నీ వైవాహిక జీవితం గురించే నువ్వు ఆలోచించు." అంటూ గిరిజ కూతురుకి నచ్చ చెప్పింది.

****సశేషం****

Posted in September 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!