Menu Close
తీరిన కోరిక (కథ)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం --

గతసంచిక తరువాయి »

దయానిధికి అక్క వరసయిన సావిత్రమ్మ, సాలూరులో నివసిస్తోంది. ఆవిడ భర్త భద్రయ్య చింతపండు వ్యాపారి. పెద్దగా కాకపోయినా బాగానే ఆర్జిస్తున్నాడు. ఆ దంపతుల కుమార్తె నీలమ్మ చదువు పదవ తరగతి దగ్గర శాశ్వతంగా ఆగిపోయింది. అక్కడితో చదువుకు చరమగీతం పాడింది. నీలమ్మకు అయిదారు సంవత్సరాలుగా పెళ్ళిసంబంధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదీ ఫలించడం లేదు. దయానిధి కొడుకు రమణ బొంబాయిలో ఏదో పెద్ద ఉద్యోగంలో ఉన్నట్లు సావిత్రమ్మకు తెలిసింది. వరసకి మేనమామ కొడుకు; అన్నీ బాగున్నాయి అనుకొంది. భర్తతో చెప్పింది. మంచిరోజు చూసుకొని నీలమ్మతోబాటు చిన్నరాయడుపురం వెళదామని ప్రస్తావించింది. "వాడేదో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడంటున్నావ్. నీ కూతురు చదువు నీకు తెలుసనుకొంటాను. ఇది జరిగే వ్యవహారం కాదు. వెళితే నువ్వు వెళ్ళు. నేను రాను, డబ్బు దండగ." అని బల్ల గుద్దినట్లు చెప్పి వీధిలోకి వెళ్లిపోయేడు. మంచిరోజు చూసుకొని; 5 కేజీల చింతపండు పట్టుకొని; సావిత్రమ్మ నీలమ్మతో బాటు బాలాజీ ఇంట తొలిసారిగా అడుగు పెట్టింది. వచ్చిన దగ్గరనుండి వరసలు కలుపుతూ, 'బాబాయి', 'తమ్ముడూ', 'మరదలమ్మా' అంటూ చొరవ తీసుకొని ఆప్యాయం ఒలకబోస్తూ మాట్లాడ్డం ప్రారంభించింది. ముందుగానే శిక్షణ పొందిన నీలమ్మ కూడా వరసలు కలుపుతూ మాట్లాడుతోంది. దయానిధి పెళ్ళికి ఆహ్వానం పంపినా రాని సావిత్రమ్మ ఎందుకు అలా ప్రవర్తిస్తోందో ఇంట్లో ఉన్న ముగ్గురికి బోధపడలేదు. “తమ్ముడి పెళ్ళికి వద్దామని అందరం బట్టలు కూడా సద్దుకొన్నాం బాబాయి. ఆ టైములో మా పినమామగారు పోయారని టెలిగ్రాం వచ్చింది. అంచేత రాలేకపోయాం బాబాయి." అని, ముందుగా అనుకొని వచ్చిన సంజాయిషీ వినయంగా చెప్పుకొంది సావిత్రమ్మ.

ఆ మరునాడు 'సాలూరు రహస్యం' బయటబడ్డాది. బాలాజీ స్నానం చేసి వరండాలో కుర్చీలో కూర్చొని ఉన్నాడు. సావిత్రమ్మ అతనికి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు అందుకొంది. తరువాత నీలమ్మచేత సాష్టాంగనమస్కారం చేయించింది. "భగవంతుని దయతో నీకు వేగిరం పెళ్లి కావాలి." అని దీవించేడు బాలాజీ.

"నువ్వే మాకు భగవంతుడివి బాబాయి. నువ్వే దాన్ని ఓ ఇంటిదాన్ని చెయ్యాలి." అని, సావిత్రి సినిమా డయలాగు వేసింది.

"నేనేమిటి చెయ్యగలనమ్మా. నా మనవడి పెళ్లి విషయాలే నేను చూడడం లేదు. వాళ్లిద్దరు చూస్తున్నారు."

"రమణకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా బాబాయి." ఆ విషయం తెలియనట్లు అడిగింది సావిత్రి.

"చూస్తున్నామమ్మా. సరైనది ఇంకా కుదరలేదు."

"ముక్కూ మొహం తెలియని వాళ్లని చేసుకొంటే; పెళ్లయిన తరువాత ఆ పిల్ల ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలీదు బాబాయి. కుటుంబంలో పిల్ల అయితే మనలో కలిసిపోతుంది. పెద్దవాళ్ళ చెప్పుచేతల్లో నడుస్తుంది." తన నిగూఢమయిన ప్రయత్నానికి తెర లేపింది సావిత్రమ్మ.

"అది కొంతవరకు నిజమనుకో. కాని భగవంతుడు ఎవరికి ఎవరిని రాసిపెట్టేడో మనకు తెలీదు కదా." అని తత్త్వం చెబుతూ, కొద్దిపాటి దూరంలో టేబిలు మీద ఉన్న నోటు బుక్కూ  పెన్సిలు తెమ్మనమని నీలమ్మకు చెప్పేడు. అవి తేగానే నీలమ్మతో, “మూడు నెలలయింది; నా అడ్రసులు పుస్తకం కనిపించడం లేదు. ఇందులో మీ నాన్న పేరు అడ్రసు రాసిపెట్టమ్మా." అని చెప్పేడు. నీలమ్మ తెలుగులో అడ్రసు రాసింది. ముసలాయన అది చూసుకొని, ఆ పుస్తకాన్ని తిరిగి టేబిలు మీద పెట్టమని నీలమ్మకు చెప్పేడు.

సావిత్రమ్మ ఏమనుకొందో; సంభాషణ అక్కడకు ఆపేసింది.

సావిత్రమ్మ ఫోకస్ వంటింట్లోని శాంతిమీద పడ్డాది. వంటలో పనికి సాయం చేస్తూ మాట కదిపింది.

"మరదలమ్మా మన రమణకు సంబంధాలు చూస్తున్నారా. ఇంకా ఆలస్యం చెయ్యకండి." అని, ఒక ఉచిత సలహా పారేసింది.

"చూస్తున్నామండి. సరైనది ఏదీ కుదరలేదు. వాడిలాగే బాగా చదువుకొన్న పిల్లని చేసుకోవాలని వాడికుంది."

"చిన్నవాడు; వాడికి తెలీదమ్మా. వంటపని ఇంటిపని చూసుకొంటూ పిల్లలిని పెంచుకోగలిగిన పిల్లని చేసుకొంటే సుఖపడతాడు. చదువుకొన్న పిల్లలు అవేవీ పట్టించుకోరు. పెద్దవాళ్ళు; మీరు బోధపరచండి. పట్నవాసం పిల్లలయితే, పెద్దవాళ్ల మాట వింటారో వినరో. చిన్న ఊళ్ళో పెరిగిన పిల్లలు అణిగి మణిగి ఉంటారు." అని, హితోపదేశం చేసింది సావిత్రమ్మ.

ఆ హితోపదేశంలో దాగి ఉన్న రాజకీయ తంత్రం శాంతి కొంతవరకు పసిగట్టింది.

"పెద్ద ఉద్యోగంలో ఉన్నాను; పెద్దపెద్దవాళ్లతో పరిచయాలుంటాయి; వాళ్ళెవరైనా ఇంటికి వస్తే వాళ్లతో ఇంగ్లీషులో మాట్లాడగలిగిన పిల్లను చేసుకోవాలంటున్నాడు." అని నర్మగర్భంగా స్పందించింది, శాంతి.

సావిత్రమ్మ సంభాషణ ముందుకు సాగించలేదు.

ఆ సమయంలో జోగమ్మ ఏదో శరణాలయం పనిమీద దయానిధిని కలుసుకోడానికి వచ్చింది. అది సావిత్రమ్మ కంటబడింది. "ఎవరావిడ" అని శాంతిని నెమ్మదిగా అడిగింది. "శరణాలయం మేనేజరు." అని, శాంతి ముక్తసరిగా జవాబిచ్చింది. జోగమ్మ దయానిధిని సంప్రదించేక వంటింట్లోకి వచ్చి శాంతి, ముత్యాలమ్మలను కలుసుకొంది. ముత్యాలమ్మ; జోగమ్మను, సావిత్రమ్మను ఒకరికొకరిని పరిచయం చేసింది. కొంత సమయం తరువాత జోగమ్మ శరణాలయానికి వెళిపోయింది.

"పిన్నీ ఆవిడ చాలా మంచి ఆవిడలా ఉంది." అని, జోగమ్మకు ఓ కితాబు పారేసింది, సావిత్రమ్మ.

"చాలా మంచి పిల్ల. పాపం దేముడు తీరని అన్యాయం చేసేడు." అని, జోగమ్మ విషాధ గాధని పూసగుచ్చినట్లు చెప్పింది.

"దేముడు మంచి వాళ్లకి అన్యాయం ఎందుకు చేస్తాడో." అని ఓ మొసలి కన్నీరు రాల్చింది సావిత్రమ్మ.

దయానిధి గదిలో ఒంటరిగా ఉండడం సావిత్రమ్మ గమనించింది. నెమ్మదిగా గదిలో ప్రవేశించి,

"తమ్ముడూ ఏం చేస్తున్నావిక్కడ."

" ఏమీ లేదు; మరో ఘడీ పోతే ట్యూషను పిల్లలొస్తారు."

"నీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చేను."

" ఏమిటది."

"నీ మేనకోడలు...పెళ్లి విషయం." ఆప్యాయంగా అంది, సావిత్రమ్మ.

"సంబంధాలు చూస్తున్నారా." ముక్తసరిగా స్పందించేడు దయానిధి.

"చూస్తున్నాం. ఏదీ సరైనది కుదరడం లేదు తమ్ముడూ. ఏమీ తెలియని వాళ్ళ కుటుంబంలో పిల్లని ఇచ్చేయలేం కదా."

దయానిధి మౌనంగా తల ఊపేడు.

'చల్లకొచ్చి ముంత దాచకూడదు' , అనుకొంది, సావిత్రమ్మ.

"తమ్ముడూ, నీ మీద గంపెడాశతో వచ్చేను. ఒక్కగానొక్క ఆడపిల్ల. ముక్కూ మొహం తెలియని వాళ్ళ చేతిలో పెట్టీలేను. నీ పేరులోనే ఉంది దయ. దయతో నీ మేనకోడలిని నీ ఇంటి కోడలుగా చేసుకో తమ్ముడూ. మీ ఇంట్లో అణిగి మణిగి ఉంటుంది. మీకు కావలసిన అన్ని పనులు చేస్తుంది."

"మా కోడలు, మా ఇంట్లో కాదు; బొంబాయిలో మా అబ్బాయి దగ్గర ఉండాలి. సరే, నీ కూతురు ఏమిటి చదువుకొంది." ముభావంగా అడిగేడు, దయానిధి.

"పది, మంచి మార్కులతోనే పాసయింది. ఆడపిల్లని ఇంకా చదివించడం మీ బావగారికి ఇష్టం లేక మాన్పించేసేరు తమ్ముడూ.”

"మా వాడు, చాలా పెద్ద చదువులు చదువుకున్నాడు. వాడిలాగే పెద్ద చదువులు చదువుకొన్న అమ్మాయిని చేసుకొందామనుకొంటున్నాడు."

"చిన్నవాడు; కుటుంబంలో పిల్ల అని, పెద్దవాళ్ళు మీరు బోధపరిస్తే వింటాడు. అంతా నీ చేతిలో ఉంది తమ్ముడూ."

"డిగ్రీ చేసిన సంబంధాలు కొన్ని వచ్చేయి. వాడు ఆ చదువు చాలదు అన్నాడు. అంచేత నేనేమీ చేయలేను." అని సావిత్రమ్మ గంపెడాశమీద దయానిధి చన్నీళ్ళు జల్లేడు.

సావిత్రమ్మ తెచ్చిన 5 కేజీల చింతపండూ వృధా అయింది. నిరాశతో తల్లి  కూతురు సాలూరు చేరుకున్నారు.

దయానిధి కొడుకు రమణకు పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి శారద; ఢిల్లీ యూనివర్సిటీలో కేమిస్ట్రీలో Ph. D. చేస్తోంది. తండ్రి అదే యూనివర్సిటీలో ప్రొఫెసరుగా ఉన్నాడు. దయానిధి బంధుమిత్రులకు శుభలేఖలు పంపడంలో హడావిడిగా ఉన్నాడు. ఆ  సమయంలో ఒకరోజు ఎవరెవరికి శుభలేఖలు వెళ్ళేయో తెలుసుకొంటూ బాలాజీ , "నాయనా దయా, సాలూరులో మన బంధువులు భద్రయ్యగారికి శుభలేఖ పంపేవా." అని వాకబు చేసేడు. "నా పెళ్ళికే వాళ్ళు రాలేదు నాన్నా; నా కొడుకు పెళ్ళికి వాళ్ళు వస్తారా." అని కొద్దిపాటి వ్యంగ్యంతో దయానిధి తండ్రికి జవాబిచ్చేడు.

"నాయనా, పెళ్ళికి వచ్చేవాళ్లకే శుభలేఖలు పంపం గదా. బంధువులందరికి పంపడం ఆనవాయితీ. వాళ్లు వచ్చినా రాకపోయినా; భద్రయ్యగారికి కూడా శుభలేఖ పంపించు." అని ముసలాయన పెద్దరికంతో సలహా ఇచ్చేడు.

"సరేలే నాన్నా. కాని వాళ్ళ ఎడ్రసు నా దగ్గర లేదు. ఎడ్రసుల పుస్తకం లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అందరికీ ఫోన్లు చేసి ఎడ్రసులు కనుక్కొంటున్నాను. భద్రయ్యగారి ఫోను నంబరు నాకు తెలీదు." అని దయానిధి తన నిస్సహాయతను తెలియజేసేడు.

"భద్రయ్యగారి ఎడ్రసు నా దగ్గర ఉంది నాన్నా. ఈ మధ్య సావిత్రమ్మ వచ్చినప్పుడు దాని కూతురు నా పుస్తకంలో రాసిపెట్టింది." అని చెప్పి ఆ ఎడ్రసు దయానిధికి అందజేసేడు.

రమణ పెళ్లి శుభలేఖ సాలూరులోని భద్రయ్యకు అందింది. సావిత్రమ్మకు విషయం తెలిసింది. పెళ్ళికి పిల్లతోబాటు వెళదామని భర్తను కోరింది. అక్కడకు వచ్చే నలుగురు బంధువులతో పరిచయమయితే పిల్లకి ఓ మంచి సంబంధం చూడవచ్చునని తన అభిప్రాయం చెప్పింది. అంతేగాక పెళ్లి తిరుపతిలో అవుతుంది గనక స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చని మరో ప్లస్ పాయింటు జోడించింది.

"ఆ పెళ్ళికి పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు బాగా చదువుకొన్నవాళ్లు వస్తారు. వాళ్లలో మన అమ్మాయి చదువుని నచ్చే సంబంధం ఏదీ ఉండదు. అంచేత మనం వెళ్లడం దండగ. నీ ఇష్టం; నువ్వు వెళితే వెళ్ళు." అని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి భద్రయ్య దుకాణానికి వెళిపోయేడు.

రమణ పెళ్ళికి అమెరికానుండి వివేక్, నీరజ, నాలుగు రోజులు ముందరే వచ్చేరు. జంషెడ్పూర్ నుండి రామారావు పెళ్లి రెండు రోజులు ఉందనగా వచ్చేడు. తను వెళితే శరణాలయం పనులు చూడడానికి ఎవరూ ఉండరని తలచి జోగులమ్మ పెళ్ళికి బయలుదేరలేదు. పెళ్ళివారందరూ ఉత్సాహంతో తిరుపతి చేరుకొన్నారు. బాలాజీ బంధువులు ఓ పాతికమంది వరకు పెళ్లికి హాజరయ్యేరు. సాలూరునుండి సావిత్రమ్మ కూతురు నీలమ్మతో బాటు తిరుపతి చేరుకొంది. వచ్చినప్పటినుండి పెళ్ళికి వచ్చిన వారందరితో పరిచయం చేసుకొని మాటలు కలపడం ప్రారంభించింది. వాళ్ళ ఎడ్రసులు సేకరించింది. వివేక్ రమణలతో అతి చనువుగా ప్రవర్తిస్తున్న రామారావు ఎవరా అని ఆరా తీసింది. వాడి ఎడ్రసు కూడా తీసుకొంది. పెళ్ళికి విచ్చేసిన బంధుమిత్రులకు బాలాజీ తగురీతిలో సన్మానించేడు. రమణ పెళ్లి వైభవంగా జరిగింది.

సుమారు రెండు మూడు వారాలు గడిచేయి. ఒక రోజు జోగమ్మకు ఒక ఉత్తరం అందింది. దిగ్భ్రాంతితో దానిలోని విషయాలు పదే పదే చదువుకొంది. ఒక్కమారుగా తన గదిలో గోడకు వ్రేలాడుచున్న వేంకటేశ్వరస్వామి పటం కింద గోడకేసి తల బాదుకొంటూ, “స్వామీ, ఆయనతో బాటు నన్ను కూడా ఎందుకు తీసుకుపోలేదు. నేను ఏ పాపం చేసేనని నాకీ శిక్ష వేసేవు." అని భరించలేని దుఃఖంతో భోరుమని ఏడ్వ సాగింది. దగ్గరలోనే పని చేస్తున్న పనిమనిషి చెవిలో ఆ రోదన పడింది. గాభరాతో వెంటనే పని ఆపి జోగమ్మ గదిలో ప్రవేశించింది. జోగమ్మను ఓదార్చ ప్రయత్నించింది. దాని చేత కాలేదు. పిల్లలను ఆడిస్తున్న ఆయాకు విషయం చెప్పి సహాయం కోరింది. ఆ ఇద్దరూ అతి కష్టం మీద జోగమ్మను మంచం మీద పరుండబెట్టేరు. జోగమ్మ ఏడ్పును ఆపలేకపోయేరు. ఏమి జరిగిందో తెలుసుకోడానికి వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. దిక్కు తోచక వెంటనే గణపతికి ఫోను చేసేరు. పరిస్థితి తెలియబరిచేరు. గణపతి వెనువెంటనే ఉద్యోగరీత్యా నవరంగపట్నంలో ఉన్న దయానిధికి ఫోనులో విషయం చేరవేసేడు. ఆలస్యం చేయక కుసుమతో బాటు శరణాలయం చేరుకొన్నాడు. వారిరువురు చేరుకునేసరికి జోగమ్మ గదిలోను, గది ముందు శరణాలయంలోని జనం గుమికూడి ఉన్నారు. దంపతులిద్దరూ మర్యాదగా ఆ జనాన్ని బయటకు పంపేరు. జోగమ్మను కొంతవరకు ఓదార్చ గలిగేరు.

జోగమ్మ సంతాపానికి కారణమేమిటో తెలుసుకోడానికి ప్రయత్నించేరు. జోగమ్మ పైట కొంగు నోటికి అడ్డము పెట్టుకొని పొంగి పొరలి వస్తున్న ఏడ్పును ఆపుకొంటూ తన కొడుకునుండి అందుకొన్న ఉత్తరాన్ని కుసుమకు అందజేసింది. కుసుమ, గణపతి, ఒకరి ముఖానికి ఒకరి ముఖం చేరువ జేసుకొని, ఉత్తరం మనసులో చదవ సాగేరు. ఉత్తరంలోని విషయం తెలుసుకొని ఇద్దరూ దిగ్భ్రాంతులయ్యేరు. అది ఆకాశరామన్న ఉత్తరం. ఆ ఉత్తరంలోని అంశాలు దయానిధి జోగమ్మల శీలాలపై బురద జల్లుతూ ఉన్నాయి. రామారావు తండ్రి, స్వర్గస్తుడయిన సుధాకర్ కాదని; నిజానికి దయానిధికి జన్మించిన వాడని ఆ ఉత్తరంలో ఉంది. దయానిధి రామారావును అంత ఆప్యాయంగా చూడడానికి అదే కారణమని, అలా దానిని సమర్థిస్తూ మరికొన్ని కల్పిత ఆధారాలు ఆ ఉత్తరంలో ఉన్నాయి.

"ఎవరో కిట్టని వాళ్ళు రాసిన ఉత్తరం. దానిని పట్టించుకోకండి." అని భార్యాభర్తలిద్దరూ జోగమ్మకు సలహా ఇచ్చేరు.

జోగమ్మ తను అందుకొన్న కవరులో కొడుకు రాసిపెట్టిన కాగితం కుసుమకు అందించింది. ఆ కాగితం మీద రమణ, 'ఇందులోని నిజానిజాలు ఆ భగవంతునికే తెలియాలి' అని రాసేడు.

"నా బాధంతా ఎవరో రాసిన దాని కోసం కాదు. నా స్వంత కొడుకే నన్ను అనుమానిస్తున్నాడు." అని జోగమ్మ కంట తడి పెట్టుకొంది.

"వాడు మిమ్మల్ని అనుమానిస్తున్నాడనుకోను. తెలిసీ తెలియక ఏవో రెండు ముక్కలు రాసినట్టుంది." అని గణపతి జోగమ్మను సమాధానపరచడానికి ప్రయత్నించేడు.

కుసుమ కూడా అదే రీతిలో జోగమ్మను సముదాయించింది.

భార్యాభర్తలు ఆలోచించుకొని ప్రస్తుతానికి జోగమ్మను వారింటికి గొనిపోవడం సముచితమనుకొన్నారు.

కుసుమ జోగమ్మతో వారింటికి  బయలుదేరింది.

గణపతి; జోగమ్మ అందుకొన్న ఉత్తరం, రామారావు రాసిన చీటీ, కవరులో భద్రపరచి దయానిధి రాకకై ఎదురు చూస్తున్నాడు.

పది పదిహేను నిమిషాలలో దయానిధి శరణాలయం చేరుకొన్నాడు. శరణాలయం గుమ్మం దగ్గరే తన కోసం ఎదురు చూస్తున్న గణపతిని సమీపించి, ఆత్రుతతో, "గణపతీ, ఏమిటయింది జోగమ్మగారికి; ఆవిడ ఎలా ఉంది." అని ప్రశ్నించేడు.

"ఆవిడ కొంచం డిస్టర్బుడుగా ఉంది. కుసుమ ఆవిడను ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి పద. అక్కడ మాట్లాడుకొందాం." అని గణపతి పరిస్థితి క్లుప్తంగా చెప్పి, దయానిధితో ఇంటికి వెళ్ళేడు.

గణపతి ఇంట్లో కుసుమ, శాంతి; జోగమ్మకు  ఓదార్పు మాటలు చెబుతున్నారు. దయానిధిని చూడగానే జోగమ్మకు దుఃఖం ఆగలేదు. తనను స్వంత అన్నలా చేరదీసిన వానిపై పడ్డ నీలాపనిందలు తలచుకొని, పైటకొంగు నోటికి అడ్డము పెట్టుకొని పొరలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ కంట తడిపెట్టుకొంది. దయానిధికి ఏమీ బోధపడలేదు. గణపతి అది గమనించి దయానిధిని వేరే గదిలోనికి తీసుకుపోయి చేతిలో తన దగ్గర ఉన్న కవరు పెట్టేడు. దయానిధి కవరు తెరచి ఉత్తరం చదువుకున్నాడు. ఒక్కమారు ఆవేశంతో, "Damn it. చెత్త వెధవ; ఎవరు రాసేరో ; చేతులు నరికేయాలి." అని ఉత్తరం నేలకేసి కొట్టేడు. దయానిధిని శాంతబరుస్తూ, "ఆవిడ దీనికన్నా ఎక్కువగా; రాముడు రాసినది, ఇది చూసి బాధపడుతోంది." అని, కవరులో ఉన్న చీటీ దయానిధికి అందించేడు.

ఆ చీటీ లోనిది చూసి, "That fellow is an idiot." అని రాముడిని దూషించేడు.

"దయా, ఈ ఉత్తరంలో ఎన్ని తప్పులున్నాయో చూడు. హేండ్ రయిటింగు కూడా చూడు. ఎవరయినా చిన్న పిల్లడు రాసేడేమో అనిపిస్తోంది." అని గణపతి తన అనుమానం వ్యక్తబరచేడు.

"ఏదీ, ఆ ఉత్తరం ఇలా ఇయ్యి." అని తనూ మరోమారు గణపతి ఆలోచించిన కోణంలో దీక్షగా చూడసాగేడు .

ఆ లోగా గణపతి కవరు పరీక్షగా చూసి, "దయా, ఈ ఉత్తరం సాలూరులో పోస్టయింది." అని అనడంతో, దయానిధి గణపతి చేతిలోని కవరు ఒక్కమారుగా తీసుకొని, సాలూరు పోస్టాఫీసు స్టాంపు చూసి ,

"ఓ మై గాడ్, This is definitely that dirty woman's job." అని ఉద్రేకంతో అనగానే,

"ఎవర్రా ఆ డర్టీ వుమన్." అని ఆతృతగా అడిగేడు, గణపతి.

"సావిత్రమ్మ అని మా నాన్నగారి డిస్టెంట్ కజిన్స్ డాటర్ . ఈ మధ్యనే తన కూతురుతో బాటు వచ్చింది." అని చెబుతూ, ఏదో జ్ఞాపకం వచ్చి,

"గణపతీ ఇప్పుడే వస్తాను." అంటూ తొందరగా తన గదికి వెళ్ళేడు.

దయానిధి సగం మాట్లాడుతూ ఎందుకు వెళ్లిపోయేడో గణపతికి అర్థం కాలేదు.

అయిదు నిమిషాలలో దయానిధి ఒక పుస్తకం పట్టుకు వచ్చేడు. అందులో ఒక పేజీ విప్పి, తాము పరిశీలిస్తున్న ఉత్తరానికి చేరువుగా ఉంచి, "ఈ రెండు హేండ్ రైటింగులూ చూడు. ఒకే లాగున్నాయి కదూ." అని, కొద్దిగా ఆవేశంతో గణపతితో అన్నాడు.

"అవును; ఆల్మోస్ట్ సిమిలర్." గణపతి ఏకీభవించేడు.

దయానిధి, చాలా రోజులై తమ ఎడ్రసుల పుస్తకం కనిపించక పోవడం, ఈ మధ్య సావిత్రమ్మ వచ్చినప్పుడు దయానిధి తండ్రి, వారి సాలూరు ఎడ్రసు సావిత్రమ్మ కూతురు చేత ఆ పుస్తకంలో రాయించుకోడం; ఆ వివరాలన్నీ దయానిధి గణపతికి చెప్పేడు.

ఇద్దరూ ఉత్తరాన్ని, సావిత్రమ్మ కూతురు రాసిన ఎడ్రసును, పరీక్షగా చూసేరు.

ఆ ఉత్తరం, కూతురు చేత సావిత్రమ్మ రాయించినదేనని ఇద్దరు మిత్రులు ఏకాభిప్రాయానికి వచ్చేరు. ఏమి చేయాలో ఆలోచనలో పడ్డారు. దయానిధి మనసు తీవ్రంగా గాయపడింది. అది గ్రహించిన గణపతి, "దయా, ఈ విషయం ఎక్కువగా ఆలోచించకు. నేను మన శరణాలయం మెంబరు; లాయరు విశ్వనాథం గారితో మాట్లాడి, ఏమి చెయ్యాలో కనుక్కొంటాను." అని చెప్పి లాయరుగారి ఇంటికి వెళ్ళేడు. దయానిధి ఆంజనేయ ఆలయానికి దారి తీసేడు.

కథ ప్రారంభంలో ఆంజనేయాలయంలో ఏకాంతంగా మనసులో బాధపడుతూ హనుమాన్ చాలీసా నెమరు వేసుకొంటున్న వ్యక్తే ఈ  దయానిధి. సావిత్రమ్మ రాయించిన ఉత్తరం అతని మనసును తీవ్రంగా కలవరబరిచింది. తను ప్రేమానురాగాలతో పెంచిన రాముడు (రామారావు ) తనను శంకించడం, దయానిధి మనోవ్యధను రెట్టింపు చేసింది.

గణపతి లాయరుగారిని సంప్రదించేడు. కార్య ప్రణాళిక తయారయింది. కార్యాచరణ ప్రారంభమయింది.

సాలూరులోని సావిత్రమ్మకు లాయరు నోటీసు అందింది. దానిలోని వివరాలలోనికి వెళితే -

దయానిధి, జోగమ్మల వ్యక్తిత్వంపై బురదజల్లుతూ జంషెడ్పూరులోని రామారావుకు అందిన ఆకాశరామన్న ఉత్తరం, సావిత్రమ్మ తన కూతురు చేత రాయించినదని; దానికి లిఖిత పూర్వకమయిన ఆధారం తమ క్లయింటు దయానిధి దగ్గర ఉందని; ఆ ఉత్తరం తన క్లయింటు పరువు ప్రతిష్టలకు నష్టం కలిగించిందని; అందుచేత తల్లీకూతుళ్లపై క్రిమినల్ కేసు కోర్టులో వేస్తున్నామని, ఆ నోటీసులో ఉంది.

తల్లి, కూతురు, ఆలోచనలో పడ్డారు. ఆ ఉత్తరం నీలమ్మ రాసినదని దయానిధి వద్ద ఏ ఆధారం ఉందని తల్లి కూతుళ్లు ఆలోచించసాగేరు. కొంతసేపటికి జ్ఞాపకం వచ్చింది. గతంలో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు దయానిధి తండ్రి అడగడంతో, అతని పుస్తకంలో నీలమ్మ తమ సాలూరు ఎడ్రసు రాసి ఇచ్చింది. కొంప మునిగిందనుకొన్నారు. కోర్టు కేసయితే ఇద్దరికీ శిక్ష తప్పదని గ్రహించేరు. సావిత్రమ్మకు కాళ్ళూ చేతులూ వణికేయి. విషయం భర్తతో చెబితే చీవాట్లు పడతాయి తప్ప ప్రయోజనం ఉండదని సావిత్రమ్మకు తెలుసు. నీలమ్మ తల్లి మీద పడి ఏడవసాగింది. తనకు తెలీకుండా ఇందులో ఇరికించేవని తల్లిని నిందించింది. ఏదో దారి చూస్తానని; ఏమీ కాదని; కూతురుకు హామీ ఇచ్చింది; సావిత్రమ్మ. వెంటనే వాళ్ళ ఊరు వెళ్లి దయానిధి తండ్రితో మాట్లాడి, విషయం చక్కపెడతానని కూతురుకు ధైర్యం ఇచ్చింది. తల్లి, కూతురు, దయానిధి ఉన్న ఊరుకు పయనమయ్యేరు.

అటు జంషెడ్పూరులో ఉన్న రామారావుకు గణపతి ఫోను చేసి, వెంటనే రావలిసినదని చెప్పేడు. రామారావు కారణం అడిగితే; విషయం ఫోనులో చర్చించేది కాదని కటువుగా చెప్పేడు. రామారావు తల్లికి ఫోను చేసి అడిగేడు. జోగమ్మ తనకు ఏమీ తెలియదని చెప్పి ఫోను పెట్టీసింది. విషయమేదో విషమించిందని అనుకొన్నాడు. సత్వరం బయలుదేరి మూడో రోజు  ఉదయం చిన్నరాయడుపురం చేరుకొన్నాడు. ఆ ముందురోజు సాయంత్రమే సావిత్రమ్మ, నీలమ్మలు కూడా చేరుకొన్నారు. దయానిధి, గణపతిల కుటుంబాలు వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రామారావు చేరుకొనేదాకా వారితో ఎవ్వరూ మాట్లాడలేదు. రామారావు చేరుకొన్నతరువాత గణపతి ఇంట్లో రెండు కుటుంబాల సమావేశం ఏర్పాటయింది. సమావేశానికి జోగమ్మ, రామారావులు కూడా హాజరయ్యేరు. గణపతి ప్రధాన పాత్ర పోషించేడు.

గణపతి నీలమ్మను ఉద్దేశించి, "ఈ ఉత్తరం నువ్వు రాసినదేనా." అని ఉత్తరం చూపిస్తూ నిలదీసి అడిగేడు.

నీలమ్మ ఏడుపు ముఖంతో, "మా అమ్మ రాయమంటే రాసేను. నాకేమీ తెలీదు." అని ఏడుపు మొదలుపెట్టింది.

"ఆ ఏడుపు ఆపు." అని గణపతి గర్జించడంతో నోరు మూసుకొని తల వంచుకొని కూర్చొంది.

"సావిత్రమ్మా, ఈ ఉత్తరం నువ్వు రాయించినదేనా." అని గణపతి గట్టిగా అడిగేడు.

"తప్పయిపోయింది బాబూ క్షమించండి. మా నీలమ్మను దయానిధి తన కొడుకుకు చేసుకోలేదని కోపంతో, బుద్ధి గడ్డి తిని ఈ తప్పు చేసేను. మరెప్పుడూ ఇటువంటి పొరపాటు చెయ్యను. క్షమించండి." అని గణపతి కాళ్లమీద పడ్డాది.

"నా కాళ్ళ మీద కాదు. దయానిధి, జోగమ్మగారి కాళ్ళమీద పడి క్షమాపణ కోరుకో.' అని గణపతి కటువుగా చెప్పేడు.

సావిత్రమ్మ ఆ ఇరువురి కాళ్ళమీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ క్షమాపణలు చెప్పుకొంది.

సభలోని పెద్దలు చెప్పడంతో సావిత్రమ్మకు క్షమాబిక్ష లభించింది.

బ్రతుకు జీవుడా అని, సావిత్రమ్మ వెంటనే కూతురుతోబాటు సాలూరు పయనమయింది.

ఆ తరువాత రామారావుకు చీవాట్లు పడ్డాయి. రామారావు; తల్లి, దయానిధిల కాళ్ళపైబడి క్షమాపణలు చెప్పుకొన్నాడు.

చాలా రోజులనుండి రామారావు మనసులో తల్లిని తనవద్దకు శాశ్వతంగా తీసుకు వెళదామని ఆలోచన ఉంది. ఆ పరిస్థితులలో ఆ విషయం లేవనెత్తడానికి ధైర్యం చాలలేదు. రెండు మూడు నెలలు గడిచేక స్వయంగా వచ్చి తల్లిని ఆహ్వానించేడు. తన శేషజీవితం అనాధుల సేవ చేస్తూ గడపాలని నిర్ణయించుకొన్నట్లు జోగమ్మ సున్నితంగా చెప్పి కొడుకు ఆహ్వానాన్ని అందుకోలేదు.

మరో ఏడాదిలో దయానిధి, గణపతి నిర్ణయించిన అమ్మాయి మెడలో రాముడు తాళి కట్టేడు.

సుధాకర్ ఫోటోకు పూలమాల కడుతూ, "మీరు కోరినట్లు మన రాముడు ఇంజినీరు అయ్యేడు. ఒక ఇంటివాడయ్యేడు. జీవితంలో నాకు కావలిసినది మరేదీ లేదు. నన్ను మీ దగ్గరకు చేర్చుకోండి." అని తలవంచి జోగమ్మ నమస్కరించింది.

జోగమ్మ అనాధశరణాలయానికి అంకితమయిపోయింది.

****సమాప్తం****

Posted in September 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!