Menu Close
తెలుగు దోహాలు
-- దినవహి సత్యవతి --
  1. మంచి సహనం కోల్పోయిన, చెడుకు తప్పదు నాశనము,
    నీతి త్రినేత్రము తెరిచెనా, మిగులు అవినీతి భస్మము!
  2. కోర్కెలు శ్రుతిమించినపుడే, బ్రతుకు గతి తప్పుతుంది,
    పనిలో అలసత్వముంటే, గమ్యము ఎడమవుతుంది!
  3. చక్కని నాయకత్వంలో, రాష్ట్రమగును సుభిక్షము,
    యోచన లేనట్టి పనులే, ప్రగతికి అవరోధకము!
  4. పగ ప్రతీకారాలెపుడూ, స్వీయ ప్రగతి అడ్డేను,
    దుష్టులతో స్నేహమెపుడూ, కడగండ్లను తెచ్చేను!
  5. నేనే ముఖ్యమనుకుంటే, వృద్ధి వెనుకబడుతుంది,
    పదుగురితో నడిచినపుడే, ప్రగతి సాధ్యమౌతుంది!
  6. మానవత్వం మరిచేవా, బ్రతుకుకుండదు అర్థము,
    చేసిన మేలు మరిచేవా, మనిషివనుటే వ్యర్థము!
  7. అవినీతిని తరిమినపుడే, నైజముతో  మనగలవు,
    సన్మార్గములో నడిస్తే, కీర్తిని గడించగలవు!
  8. సొమ్ము విసిరి కొన్న డిగ్రీ, విలువలేని నోటు,
    సర్కారుతో పని ఉందా, చేత పెట్టు ఓ నోటు!
  9. శాంతి సుఖము కోరుకుంటే, వీడు అసూయ ద్వేషము!
    ఆరోగ్యం విస్మరిస్తే, కబళించేను రోగము!
  10. నిప్పులలో కాలితేనే, ఇనుముకి రూపు వచ్చును,
    బాధ అనుభవించితేనే, సుఖము విలువ తెలియును.

**** సశేషం ****

Posted in October 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!