Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ

Lakkoju-Sanjeevaraya-Sharma
Photo Credit: Wikimedia Commons

డా. లక్కోజు సంజీవరాయశర్మ “అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి. ప్రపంచంలోని ఆరుగురు ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుల్లో ఈయన ఒకరు. గణిత బ్రహ్మ గా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ గారు 1907 నవంబర్ 22న వై ఎస్ ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం లోని కల్లూరు గ్రామంలో, నాగమాంబ, పెద్ద పుల్లయ్య దంపతులకు జన్మించారు. ఈయనను ఒక రకంగా మృత్యుంజయుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే పుట్టుకతో అంధుడు. ఈయనకు పురుడు పోసిన మంత్రసాని గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమైంది, కొంతమంది బంధువులు నోట్లో వడ్ల గింజ వేశారు కూడా అయినా మరణము ఆయన దరిదాపులకు రాలేకపోయింది. ఆ విధంగా పుట్టిన వెంటనే చంపాలని ఇతరులు ప్రయత్నించినా అన్ని దాటుకొని గణిత మేధావిగా రూపు దిద్దుకున్న మేధావి లక్కోజు సంజీవరాయ శర్మ గారు.

ఆ రోజుల్లో బ్రెయిలీ లిపి, లేదా అంధులను ఆదరించి చేరదీసే వ్యవస్థ అంటే ప్రత్యేకమైన పాఠశాలలు ఏవి లేవు. శర్మగారి అక్క స్కూల్లో చదివినవి ఇంటి దగ్గర గట్టిగా మననం చేసుకుంటూ ఉంటే అవి విని గుర్తు పెట్టుకొని గణితములో అపార జ్ఞానం సంపాదించిన అపర మేధావి సంజీవరాయశర్మ. చిన్నతనంలో తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. కల్లూరులో రైతులకు భూమి కొలతలు ధాన్యం ధరల లెక్కలు చెబుతూ ఉంటే రైతులు ఆయనకు ఎంతో కొంత ఇస్తుండేవారు.

సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించాడు. 1928 నవంబర్ 15న నంద్యాల అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు, సంజీవరాయశర్మ గారి గణితావధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా, గణితావధానం లో పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారం అయిందో చెపుతారు కానీ శర్మ గారు ఆ పుట్టిన తేదీ ఏ వారం అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగం చెప్పేవాడు. అంటే, పుట్టిన తేదీ, సమయం, ప్రదేశం చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారం, నక్షత్రం, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి, కొంతవరకు జాతకం కూడా చెప్పేవాడు.ఈ విధమైన ప్రత్యేకత మరెవరూ (మానవ గణన యంత్రం గా పేరొందిన శకుంతలాదేవి తో సహా) చూపలేకపోయారు. ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత. 1928 నుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లలోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే అతను వయొలిన్ పట్ల ఆకర్షితులై నేర్చుకొన్నాడు.

పుట్టుకతో అంధుడైన శర్మ గారు గణనం ఏ విధంగా చేసేవాడో తెలుసుకోవాలి అన్న వారికి నిరాశే ఎదురైంది. పుట్టు గుడ్డి అవడం వల్ల ఆయనకు అంకెల భావన తప్ప రూపం తెలియదు. మరి ఎలా గణనము చేస్తున్నారని అడిగితే తనకు చీకటి, అందులో వెలుగు తప్ప మరేమీ తెలియదనీ, అందులో సమాధానం తట్టుతుందనీ చెప్పారు. కనుక, అతనికి దైవదత్తమైన వరమే కాని మరొకటి కాదు. శ్రీనివాస రామానుజన్ కు మరో గణిత మేధావి హార్డీ దొరికినట్లు, అతనికి కూడా ఎవరైనా దొరికి ఉంటే శర్మ గారికి కూడా ప్రపంచ ప్రఖ్యాతి వచ్చేది. ఇది తెలుగు వారి దురదృష్టము. ప్రపంచంలో 6వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి శర్మ గారే కాబట్టి ఆయనను నిస్సందేహముగా గణిత బ్రహ్మ అని సంభోధించవచ్చు.

చాలా మంది బాల్యములో శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన చదివే ఉంటారు. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా…

మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడు. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం ”ఒక కోటి 84 లక్షల,46 వేల 74 కోట్ల 40 లక్షల,73 వేల,70 కోట్ల,95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజల అన్నమాట (1,84,46,74,40,73,70,95,51,615) ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్లు బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యునికి మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు. అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు ఇదంతా అబ్బుర అనిపించవచ్చు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ అదంతా ఒకటి, రెండు, మూడు అంకెలు  ఎలా ఉంటాయో తెలియకుండానే గణిత బ్రహ్మ అయ్యారు.

ఈయన చేసిన గణితావధానాలలో కొన్నింటిని తెలుసుకుందాము. 1966 డిసెంబరు ఏడో తేదీన హైదరాబాద్ లో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వేదిక పై 2 power 103 ఎంత? అని అడిగితే దానికి సమాధానంగా ముప్పై రెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. ‘క’ నుండి ‘క్ష’ వరకు ఉన్న అక్షరాలు వరుసగా నంబర్లు వేస్తే, ‘స, రి, గ, మ, ప, ద, ని” అక్షరాల లబ్దం ఎంత? అని అడిగితే దానికి జవాబుగా యాభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు అని చెప్పారు కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్ది సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏ మాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు ఈయన అవధానాల్లో ఒక చిన్న వైఫల్యం కూడా ఉంది.

అది విశాఖపట్నంలో గణితావధానం చేస్తున్నప్పుడు అడిగిన ఒక ప్రశ్న: 61 x2+1 = y 2  అనే సమీకరణానికి x, y లు ధన పూర్ణాంకాలు అయేటట్లు సాధన చెప్పండి అని  కోరగా, తనకు సాధన తట్టడం లేదని, కాని ఆ సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయని చెప్పారు. సాధన చెప్పలేకపోవడం ఒక చిన్న వైఫల్యంగా తీసుకున్న, సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయన్నది నిజం. సాధన : x = 226153980, y = 1766319049 ఇలాంటి సమీకరణాలను, పెల్ సమీకరణాలు అంటారు. ఇవి డియో ఫాంటైన్ సమీకరణాలలో ఒక ప్రత్యేకమైన తరగతి సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు గంటలు, నిమిషాలు, సెకన్లు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించి నాలుగు వేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ సైతం తయారు చేశారు.

ఆనాటి బ్రిటిష్ వైస్రాయ్ ”ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం” అని శర్మనుద్దేశించి అన్నారు. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధులను ఉత్తేజితుల్ని చేశారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయ శర్మ ని రక్షించుకోలేక పోయింది. ఇంకా దురదృష్టం ఏమిటి అంటే వివిధ విశ్వవిద్యాలయాలు ఆయన్ని సత్కరించి ఇచ్చిన బంగారు పతకాలతో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు 1964 అక్టోబర్ పదో తేదీన రేణిగుంట నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నప్పుడు ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయనను అక్కడ తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేధావి ఇల్లు కదలలేక పోయారు. అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్, శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం.

ఈయనకు పందొమ్మిదవ యేట వివాహమైంది. భార్య పేరు ఆదిలక్ష్మమ్మ. పెళ్లి నాటికి ఆమె వయస్సు తొమ్మిదేళ్లు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. భార్య ఆదిలక్ష్మమ్మ 1994 జనవరి 5 న శ్రీకాళహస్తిలో చనిపోయింది. ఆ తర్వాత ఆయన మకాం హైదరాబాదులో ఉన్న కుమారుని వద్దకు మారింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామిని అర్చిస్తూ వయొలిన్ మీటుతూ గడిపారు. 1997 డిసెంబరు 2 న హైదరాబాదులో పరమపదించాడు. నిజానికి ఆయన ప్రతిభ ముందు ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు అవార్డులు అన్నీ చిన్నవనే చెప్పాలి.

********

Posted in October 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!