Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 14
సత్యం మందపాటి

స్పందన

ఒక్కొక్కప్పుడు నాకు అనిపించేది అర్ధం లేని మన మూఢనమ్మకాలు మనుష్యులని ఎంతో బాధ పెడతాయనీ, ముందుకు పోనీయవని. అయినా ఆ విషవలయంలోనించి బయటికి రావటానికి, ఆ విషవలయంలోనే చిక్కుకున్న సమాజం, కాలానుగుణంగా రావలసిన ఆ మార్పుని నిరాకరిస్తుంది. ఏనాడో బాల్య వివాహాలనూ, విధవా వివాహాలనూ, కన్యాశుల్కాన్నీ నిరసించిన గురజాడ అప్పారావుగారిని ఆనాటి సమాజమే బహిష్కరించింది. అలాగే వీరేశలింగంగారితో పాటు ఎందరో గొప్ప సంఘసంస్కర్తలకు, ఆనాటినించీ ఈనాటిదాకా ఆ సమాజమే వారికి అడ్డం వచ్చింది. వస్తున్నది. 1970 దశకంలో నా ఎదురుగా జరిగిన, మనసు వికలమైపోయిన, రెండు జరిగిన సంఘటనల ఆధారంగా ఆవేదనతో వ్రాసినదే ఈ కథ. కాకపోతే ముగింపు మాత్రం పూర్తిగా నాదే. ‘మరి మీరిచ్చిన బొమ్మలో ‘విమలా గౌతమ్’ వ్రాసినట్టు ఉందే, ఆవిడెవరు?’ అంటారని తెలుసు. పెళ్ళైన తర్వాత కొన్నేళ్ళు అడపాదడపా నా శ్రీమతిగారి పేరు, మా గోత్రంగారి పేరు కలపి ఈ కలంగారి పేరుతో కొన్ని కథలు వ్రాశాను. అందులో ఇదొకటి. అంతకన్నా మరేం లేదు! ఇంకొక విషయం. ఈరోజు ఎవరైనా నేను వ్రాసిన ఎన్నో కథల్లో, నాకెంతో ఇష్టమైన కథలు చెప్పమని అడిగితే, ఈ “పసుపు-కుంకుమ” కథ మాత్రం తప్పకుండా ముందు సీట్లో ఉంటుంది. చదివి ఎలా ఉందో చెబుతారు కదూ! ధన్యవాదాలు.

పసుపు - కుంకుమ

(ఈ కథ ‘ఆంధ్ర సచిత్రవారపత్రిక’ ఆగస్టు 13, 1976 సంచికలో ప్రచురింపబడింది.)

Pasupu Kumkuma story image

తల అంతా దిమ్ముగా ఏదో పోట్లు పొడుస్తున్నట్టుగా ఉంది సారథికి. బలవంతంగా కళ్ళు తెరవటానికి ప్ర్రయత్నం చేశాడు.

“సారథికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరుస్తున్నాడు” అంటున్నారెవరో.

సారథికి అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. అన్న భానుమూర్తి, తనూ గోదావరిలో స్నానం చేసి వద్దామని బయల్డేరారు. మద్రాసులో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న సారథి రాజమండ్రికి వచ్చినప్పుడల్లా అన్నతో కలిసి గోదావరిలో ఈత కొట్టటం కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఈసారి పెళ్ళిచూపులకని వచ్చిన సారథి అలవాటు ప్రకారం అన్నతో కలిసి గోదావరిలో ఈత కొట్టటానికి బయల్దేరాడు.

“మన జీవితం కూడా ఇలాటిదే సారథీ. ఒక్కొక్క సీజన్లో నది ఇలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక్కొక్క సీజన్లో చాలా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటుంది, జీవిత ప్రవాహం ఎలా ఉన్నా నేర్పుగా సంసారాన్ని ఈదగలవాడే జీవితాన్ని సుఖమయం చేసుకోగలడు, ఇతరుల జీవితాలని సుఖమయం చేయగలడు” అన్నాడు భానుమూర్తి నీళ్ళల్లో దిగుతూ.

అన్నయ్య తనకన్నా రెండేళ్లే పెద్దయినా, అప్పుడప్పుడూ అతను చెప్పే ఇలాటి జీవిత సత్యాలంటే సారథికెంతో ఇష్టం. అతని చెవులకి అవి భగవద్గీతలా ఉంటాయి. దాదాపు గంటసేపు గోదావరిలో ఈత కొట్టారు భానుమూర్తీ, సారథీ. సారథి ఇంకా లోతుకి వెళ్ళటం చూసి వారించాడు భానుమూర్తి.

“సారథీ, ఇంకా ముందుకు వెళ్ళకు, అక్కడ సుడిగుండాలుంటాయి” అని అరిఛాడు.

భానుమూర్తి మాటలు పూర్తయేలోగానే, సారథి అక్కడికి వెళ్ళటమేకాక అక్కడే బాలన్సు తప్పిపోయి గిరగిరా తిరగసాగాడు. చేతులు పైకెత్తి, “హెల్ప్… హెల్ప్” అని అరిచాడు.

“సారథీ!” పెద్దగా అరిచాడు, తనూ ముందుకు ఈదుతూ.

సారథి నీళ్ళ లోపలకు పూర్తిగా ముణిగిపోయి మళ్ళీ పైకి తేలాడు. ప్రక్కనే బట్టలు ఉతుకుతున్న ఇద్దరు చాకలి వాళ్ళు కూడా ఇది చూసి గబగబా ముందుకి ఈదుకు వచ్చారు.

“సారథీ, నేను వస్తున్నా. మళ్ళీ ముణగకుందా ప్రయత్నం చేయి” అరుస్తూ ముందుకు వచ్చాడు భానుమూర్తి.

తమ్ముడికి చేయి అందిస్తున్నాడు. నీళ్ళల్లో మళ్ళీ పూర్తిగా ముణిగిపోయాడు సారథి. తర్వాత ఏం జరిగిందో కూడా అతనికి తెలియదు. కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉన్నాడు.

“సారథీ, ఎలా ఉంది?” అడుగుతున్నాడు తండ్రి సోమయాజులు.

“నాయనా, ఇటు చూడు బాబూ!” అంటున్నది తల్లి రాజ్యలక్ష్మి.

“ఇక ఏమీ ఫరవాలేదు” అంటున్నాడు డాక్టర్ తన బాగ్ సర్దుకుంటూ.

నీరసంగా అటూ, ఇటూ చూశాడు సారథి. కానీ అతను వెతుకుతున్న భానుమూర్తి మాత్రం కనపడలేదు.

“భాను… భాను ఏడీ?” అడిగాడు సారథి.

“ఇంకెక్కడి భానురా నాయనా… “ తల్లి సారథి మీద పడి బావురుమన్నది.

తండ్రి పక్కకు తిరిగి నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకుంటున్నాడు.

“అన్నయ్య…” సారథికి నోట మాట రాలేదు.

“సారథీ. భానుమూర్తి ఇక లేడు. గోదావరిలో ముణిగి చనిపోయాడు. నువ్వుమాత్రం అదృష్టవశాత్తూ…” డాక్టర్ ఇక ఏమీ అనలేక, భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు.

సారథికి కళ్ళు తిరిగినట్టయింది. ఒక్కసారిగా షాక్ తిన్నాడు. దిండులో తల దూర్చి వెక్కివెక్కి ఏడ్చాడు. తను అసలు ఆ నీళ్ళలో ముణిగిపోయి చనిపోవలసింది. భానుమూర్తి తనను రక్షించటానికి ముందుకు రావటం, చేయి అందించటం గుర్తుకు వచ్చింది.

కానీ అతని వెనకే వచ్చిన చాకలి వాళ్ళు సారథిని బయటకు లాగటం, భానుమూర్తి ఆ సుడిగుండంలో ఎవరికీ అందకుండా ముణిగిపోవటం మాత్రం అప్పటికే స్పృహ కోల్పోయిన సారథికి తెలియదు.

తన ప్రాణాలు కూడా లెఖ్క చేయకుండా తమ్ముడికి ప్రాణం పోశాడు భానుమూర్తి.

“భానూ… “ పెద్దగా విలపించాడు సారథి చేతుల్లో ముఖం దాచుకుని.

ఎవరో సారథి భుజం మీద చేయి వేసి ఓదార్చుతున్నారు. “ఊరుకో బాబూ. నువ్వే ఇలా బాధపడితే ఎలా? చూడు మీ అమ్మా, నాన్నా ఎలా డీలా పడిపోయారో. మీ వదిన అసలే నెలలు నిండిన మనిషి, ఆవిడ బాధ అర్ధం చేసుకో. లే… లేచి వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పు.

సారథికి అప్పుడు అనిపించింది. తనే ఇంత బాధపడుతుంటే, నిండు గర్భిణిగావున్న తన వదిన ఇంకెంత బాధపడుతుంది? లేచి మంచం మీద కూర్చున్నాడు. గుండె నిబ్బరం చేసుకున్నాడు.

ఇంతలో పెరటిలో పెద్దగా గోల, అరుపులూ వినపడ్డాయి. “ఎంత పనికి ఒడిగట్టావే! ఒక్క క్షణం ఆలస్యమైతే అనవసరంగా రెండు ప్రాణాలు పోయి ఉండేవి” అంటున్నారెవరో.

“శ్యామలా! ఏం పనమ్మా ఇది? నువ్వు ప్రాణం తీసుకుంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగివస్తారా?” అంటున్నాడు సోమయాజులు.

సారథి చటుక్కున లేచి రెండు అడుగుల్లో పెరట్లోకి వచ్చాడు.

అక్కడ సన్నివేశం చూసి దిగ్భ్రమ చెందాడు. తన తల్లీ, ఇంకో ఇద్దరు ఆడవారు కలసి నూతి దగ్గర పూరిగా తడిసిపోయిన శ్యామలను బలవంతంగా తీసుకువస్తున్నారు. శ్యామల వాళ్ళ చేతుల్లో గింజుకుంటున్నది. ఆమె ఎర్రటి కళ్ళల్లోనించీ నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి.

“అసలే నెలలు నిండిన మనిషివి. ఇలా చేయటం తప్పు కాదా అమ్మాయి. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడాలిగానీ…“ అలా ఏవేవో అంటూ లోపలకు తెస్తున్నారు శ్యామలను.

సారథి ఆ సన్నివేశం చూశాక అక్కడ నిలబడలేకపోయాడు. డాబా మీదకు వెళ్ళి అక్కడ చతికిలబడ్డాడు. మోకాళ్ళ మీద తల ఉంచి కదలకుండా కూర్చున్నాడు. మధ్యాహ్నపు మండుటెండలో, నేల మీద పడుతున్న అతని కన్నీళ్ళు వెంటనే ఇంకిపోతున్నాయి. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియలేదు. క్రింద ఒక్కసారిగా గోల వినపడితే, గబగబా మెట్లు దిగి క్రిందకు వచ్చాడు.

“భానుమూర్తి శవం దొరికింది. రెండు మైళ్ళ అవతల తేలింది”

పరుగెత్తినంత వేగంగా వాకిట్లోకి వచ్చాడు సారథి. ఎద్దు బండిలో గడ్డి మీద దుప్పటి కప్పి ఉంది భానుమూర్తి శరీరం. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు సారథి. తల దగ్గర దుప్పటి తొలగించాడు. నీళ్ళల్లో బాగా నానివుందేమో, తెల్లగా బాగా ఉబ్బివుంది భానుమూర్తి శరీరం.

నెమ్మదిగా అన్నయ్య తల మీద వెంట్రుకలను ప్రేమగా సవరించాడు. ఒక్కసారిగా మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకుంది. దుప్పటి ముసుగు వేసి ఒక్క క్షణం బండికే ఆనుకుని నిలబడి బావురుమన్నాడు.

శవాన్ని ఇంటి ముందు పడుకోబెట్టారు. కావలసిన వారందరూ చుట్టూ చేరి ఏడుస్తూనే ఉన్నారు.

తల్లి భానుమూర్తి శవం మీద పడి విలపిస్తున్నది, ‘అప్పుడే నీకు నూరేళ్ళూ నిండాయా బాబూ’ అంటూ.

తండ్రి పైకి పెద్దగా ఏడవకపోయినా, పక్కకు తిరిగి కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు. మేనత్త తన తల్లిని ఓదారుస్తూ, మధ్యమధ్యలో తనూ ముక్కు చీదుకుంటూనే ఉంది. కానీ వదిన మాత్రం కనపడలేదు. సారథి శ్యామల కోసం అటూ ఇటూ చూశాడు కానీ, ఆమె ఎక్కడా లేదు.

“వదినా… వదినా..,” అంటూ పిలిచాడు నెమ్మదిగా.

“వదినకి నొప్పులు వస్తుంటే సరస్వతమ్మగారు ప్రక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ చేర్పించింది. అదీకాక ఇప్పుడీ శవాన్నిలా చూసిందంటే ఆమె ఆరోగ్యానికే ప్రమాదం. నిండు చూలాలు. తట్టుకోలేదు” అంది మేనత్త.

సారథి హృదయం మొద్దుబారిపోయింది. ఒక్కసారిగా అన్నీ ఒకదాని మీదొకటి ముంచుకొస్తున్నాయేమిటా అనుకున్నాడు. ఇంకాసేపట్లో భానుమూర్తికి అంత్యక్రియలు జరుగుతాయి. అంటే భానుమూర్తి భౌతికంగా కూడా ఇక ఈ లోకంలో ఉండడన్నమాట. మరి వదినకు తన భర్త శవాన్నయినా చివరిసారిగా చూసే అవకాశం లేదే. ఎలా? పోనీ తనే వెళ్ళి ఆవిడను ఒక్క క్షణం తీసుకు వస్తే? తనకు తెలుసు వదినకు భానుమూర్తంటే ఎంత ప్రేమో. ఎక్కడనుంచీ అయినా రావటం ఒక్క క్షణం ఆలస్యం అయితే వేయికళ్ళతో ఎదురు చూసేది. అలాటిదిప్పుడు… ఎలా భరించగలదు? ఒక విధంగా ఆవిడిప్పుడు రాకపోవటమే మంచిదేమో. కనీసం ఆవిడ ప్రాణమన్నా దక్కుతుంది. మరి తండ్రిని చూడలేని ఆ బుజ్జి పాపాయో?

భానుమూర్తి అంత్యక్రియలన్నీ సోమయాజులే దగ్గరుండి జరిపించాడు.

అక్కడ ఆసుపత్రిలో శ్యామల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

శ్యామలకు ఉన్నది ఒకే ఒక మేనమామ రాఘవయ్య, ఆయన భార్య జానకమ్మ. అంతకుమించి ఆదుకునే వాళ్ళెవరూ లేకపోవటం వల్ల, వాళ్ళే వచ్చి ధైర్యం చెబుతూ పక్కనే నిలబడ్డారు.

“సారథీ, ఆయన ఆడపిల్లే కావాలని ఎంత కలవరించేవారో తెలుసా. ఆయన ఇష్ట ప్రకారమే ఆడపిల్లనే కన్నాను. కానీ ఈ పసిదాన్ని చూడటానికి ఆయన ఏరీ” విలవిల్లాడింది శ్యామల.

వస్తున్న దుఃఖాన్ని గుండెల్లో బిగపట్టి అన్నాడు సారథి. “బాధ పడకు వదినా. పాపను పెద్దచేసి సుఖపడేటట్టు చేస్తేనే అన్నయ్య ఆత్మకు శాంతి”. అలా అన్నాడే కానీ సారథికి తెలుసు అది ఎంతటి బృహత్కార్యమో.

శ్యామల కూడా ఏమాలోచించిందో ఏమో, పసిగుడ్డునొకసారి హృదయానికి హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది. పాపనే చూస్తూ మళ్ళీ బావురుమంది.

సారథి ఇంటికి వచ్చాక, అతని మేనత్త సోమయాజులుతో అంటున్నది. “రేపు రాత్రి గోదావరి ఒడ్డుకి శ్యామలను తీసుకువెళ్ళాలి. మన చాకలి రత్తమ్మని రమ్మన్నాను. అక్కడే గాజులు పగలగొట్టి, ముండనం చేయాలిగదా” అని.

సోమయాజులు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.

రాజ్యలక్ష్మి అన్నది “అసలే పచ్చి బాలింతరాలు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏమో”

“బండిలోనే తీసుకు వెడతాం కదా. తోడుగా నేనూ వెడతానులే” అన్నది మేనత్త, తన తల మీద ముసుగు సర్దుకుంటూ. ఆవిడకు పన్నెండో ఏటే పెళ్ళయింది. పదమూడో ఏట భర్త చనిపోయాడు. ఆవిడ తన భర్త చనిపోయిన ఆరు నెలలకు రజస్వలయింది. వేరే ఏమీ దిక్కు లేకపోవటం వల్ల, భర్త పోయినప్పటినించీ తన అన్న సోమయాజులు దగ్గరే ఉంటున్నది. అలాగే విధవగా తన అరవై ఏళ్ళ జీవితం, చాకిరీ చేస్తూ అన్న సోమయాజులు దగ్గరే ఉంటున్నది.

“శ్యామలకు జుట్టు తీయించవద్దా వదినగారూ” జానకమ్మతో అన్నది సారథి మేనత్త.

“ఈ కాలంలో అలాంటివేం చేయటం లేదు కదా. వద్దులెండి, వదినగారూ. చిన్నపిల్ల, అసలే బాలింతరాలు” జాలి పడింది జానకమ్మ.

“అలా అంటే ఎలా? మన ఆచారం ప్రకారం మేమంతా అప్పుడు చేయించుకోలేదా?” అంది మేనత్త.

“అత్తయ్యా!” గట్టిగా అన్నాడు సారథి.

“ఏమిట్రా నీ అరుపులు. మెల్లగా చెప్పలేవూ” మందలించింది మేనత్త.

“జుట్టు తీసే ప్రసక్తే లేదు. ఎందుకు అలా మాట్లాడతావ్?”

“నేను కొత్తగా ఏమన్నాను. పద్ధతి ప్రకారం…”

“ఏమిటి నీ పద్ధతి? అటువంటివేమీ వద్దు. అసలే చెట్టంత మనిషిని పోగొట్టుకుని వదిన బాధపడుతున్నది. అదీకాక కాన్పుతో నీరసించిపోయింది. ఇంకా ఎందుకీ పాడు ఆచారాలు” అన్నాడు సారథి.

సోమయాజులు కలుగజేసుకుని “జుట్టు తీయించవద్దులే. కాలం ఎప్పుడో మారిపోయింది” అన్నాడు.

“అయితే రేపు రాత్రి శ్యామలను గోదావరి ఒడ్డుకు తీసుకువెళ్ళి, మిగతా తతంగం కానీయండి” అన్నది మేనత్త.

“ఏం? అర్ధరాత్రి ఆ చలిగాలిలో గోదావరి ఒడ్డుకు పోయి ఏం చేయాలి? అలాటి కార్యక్రమాలు జరగనందువల్ల కొంపలంటుకుపోవు. అన్నయ్య ఎలాగూ పోయాడు. ఇలాటి మూఢ నమ్మకాలతో, వదినను కూడా పోగొట్టుకోవాలా? చలిగాలిలో అక్కడికి వదిన్ని తీసుకుపోతే న్యుమోనియా వస్తుంది. అయినా అసలు వదిన ప్రస్తుతం కదిలే స్థితిలో ఉన్నదా” కోపంగా అన్నాడు సారథి.

“నువ్వూరుకో సారథీ. నువ్వింకా చిన్న పిల్లాడివి. ఇలాంటి వ్యవహారాలు నీకు అర్థం కావు” మేనత్త అంది.

ఇంతలో సోమయాజులు మళ్ళీ కలుగుజేసుకున్నాడు. “ఫరవాలేదులే. అన్నీ మనింట్లోనే చేసుకుందాం. ఎలాగూ ఎల్లుండి పసుపు నీళ్ళు చల్లి పుణ్యవచనం అవీ చేయాలి కదా. సారథీ. బజారు పని చాల ఉంది. ముందు ఆ పని చూడు నాయనా” అన్నాడు.

అమ్మ దగ్గర కావల్సిన సామాన్ల లిస్టూ, కొన్ని సంచులు తీసుకుని బజారుకి వెళ్ళాడు సారథి. చాల క్రమశిక్షణలో ఒద్దికగా పెరగటం వల్ల తండ్రితో మాట్లాడటానికి కూడా అతనికి ఒక విధమైన జంకు ఉంది. అందుకే తర్వాత తల్లి ఒంటరిగా కనపడినప్పుడు అడిగాడు, “గాజులు పగలకొట్టి, బొట్టు చెరిపేయక పోతే ఏమవుతుంది. అవి వదినకి అన్నయ్యతో పెళ్ళవక ముందునించీ ఉన్నాయిగా మరి. అన్నయ్యతో పాటు అవీ వెళ్ళటం ఎందుకు?”

“నోరు మూసుకుని అవతలికి పోరా” అంది తల్లి మందలిస్తూ.

తర్వాత మేనత్తని అడిగాడు, “వదినను కూడా నీలాగా తయారుజేస్తే కానీ నీకు తృప్తిగా ఉండదా” అని.

ఆవిడ ముందు బిత్తరపోయినా, తేరుకుని అదోరకంగా నవ్వి, “పిచ్చి నాగన్నా, అవేం మాటలురా. ఆ దేవుడు నాలాగానే దాన్నీ చిన్న చూపు చూశాడు. మానవమాత్రులం, మనమేం చేయగలం చెప్పు” అంటూ వెళ్ళిపోయింది.

సారథికి ఏం చేయాలో తెలియక పళ్ళు కొరుక్కున్నాడు.

సారథి మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాక రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి చలిలో రోడ్డు మీద పచ్చి బాలింతరాలు శ్యామలను బలవంతంగా కూర్చోబెట్టి, చాకలి చేత గాజులు పగులగొట్టించారు. బొట్టు చెరిపేశారు. జడ విప్పేసి జుట్టు ముడి వేశారు. చేతులకీ, కాళ్ళకీ, మెళ్ళోనూ ఉన్న బంగారు నగలు తీసేశారు. మంగళసూత్రం తీసేశారు. తెల్లటి రవిక తొడిగారు. అర్ధరాత్రి చీకటిలో శ్యామల నీరసంగా వెక్కివెక్కి ఏడుస్తుంటే, ఆ వెక్కిళ్ళు కన్నీళ్ళతో తడిసి చీకటిలో కలిసిపోయాయి.

సారథి హృదయంలో ఆ బాధాతరంగాలు గోదావరిలోని సుడిగుండమంత ఉధృతంగా పైకి లేచాయి. తనకి ప్రాణభిక్ష పెట్టి, తన ప్రాణాలనే త్యాగం చేసిన అన్నయ్య. మరతను ముణిగిపోతున్న ఆక్షణంలో తన గురించిగానీ, తను ఎంతగానో ప్రేమించే భార్య గురించిగానీ, పుట్టబోయే పాప గురించిగానీ ఏమాత్రం ఆలోచించలేదు. తనమీద ఉన్న ప్రేమా, వాత్సల్యం, వాటిని మించి అతను గౌరవించే మానవతా వాదం, అతన్ని ముందుకు దూకించాయి. కానీ ఇప్పుడు, ఆ త్యాగమూర్తి భార్య, రెండురోజుల పసిపాపకి తల్లి, అర్ధరాత్రి చలిలో నిస్సహాయంగా, నిస్పృహతో, నిరాశతో విలపిస్తున్నది. ఆమె గుండెల్లో మంటలు రేపే ఈ మూఢనమ్మకపు ఆచారాలకు అడ్డు చేప్పే వారెవరూ లేరు. సారథి మంచం మీద లేచి కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియక పిడికిళ్ళు బిగించి కోపంతో ఊగిపోతున్నాడు.

శ్యామలకి పుట్టిన రెండు రోజుల పాప, తల్లి పాల కోసం ఏడుస్తున్నది.

“స్నానం చేయించి లోపలికి తీసుకువచ్చి మూలగదిలో కూర్చోపెట్టండి. ఎవరూ చూడకూడదు” అంది మేనత్త.

“పిల్ల పాలకు ఏడుస్తున్నది. పాలు పట్టనీయండి. తర్వాత స్నానం చేయించవచ్చు”

పాపకు పాలు దొరికాయి. ఆకలి తీరింది. పాప ఏడుపు ఆపేసింది.

కానీ శ్యామల? ఆమె ఏడుపు ఆగేదెప్పుడు? ఎలా? ఆలోచనలతో అలసిపోయాడు సారథి.

మర్నాడు స్మశానంలో పని పూర్తిచేసుకుని వచ్చాక, ఒక్కొక్కళ్ళూ శ్యామల కూర్చున్న ఆ మూల చీకటి గదిలోకి వెడుతున్నారు. ఆ గదిలో ఒక చిన్న గుడ్డి దీపం మాత్రం వెలిగించి వుంది. అక్కడ ఒక అక్షింతల పళ్ళెం ఉంది. లోపలికి వెళ్ళి, చీకటిలో ఆమె ముఖం చూసి, అక్షింతలు వేసి బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ కొన్ని సానుభూతి వాక్యాలు చెప్పి అక్కడే పెద్దగా ఏడుస్తున్నారు. దానితో ఆమె ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నది. శ్యామలకు కావలసింది ఎవరి సానుభూతీ కాదు. ఆ పరిస్థితిలో మనోధైర్యం! అందుకేనేమో లోపలినించీ శ్యామల మూలుగు వినపడుతూనే ఉంది. (ఇప్పుడు ఏడుపులా లేదు, ఏడిచీ ఏడిచీ అలసిపోయిందేమో)

ఒక ఇరుగింటావిడ ఇంకో పొరుగింటావిడతో అంటున్నది. “ఆవిడ ముఖం చూసి రండి పిన్నిగారూ. ఆ ముఖం చూసేసి, నాలగు అక్షింతలు వేసేస్తే, ఆ దోషం పోతుంది. ఇక ఎప్పుడైనా ఈవిడ్నీ, ఈ ఇంట్లో దీపాన్నీ చూడవచ్చు”

“లేకపోతే ఏమవుతుంది?” ఆవిడ దగ్గరకు వెళ్ళి సూటిగా అడిగాడు సారథి.

ఆవిడ బిత్తరపోయింది. మాట్లాడలేదు.

“వయసు వస్తే కాదు. మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకాలి. ఇక చాలుగానీ ముందు బయటికి నడవండి” పెద్దగా అరిచాడు సారథి. అక్కడున్నవాళ్ళందరూ ఆ హఠాత్సంఘటనకు నిశ్చేష్టులయారు.

“అందరూ బయటకు పదండి. మీరేం ఆవిడ ముఖం చూడనఖ్కరలేదు. మీకు దోషం వస్తే అది మీ ఖర్మ. మా వదినకేమీ సంబంధం లేదు” అక్కడ చేరిన అమ్మలక్కల్నందరినీ బయటకు తోసి తలుపువేశాడు సారథి. అతను కోపంతో వణికిపోతున్నాడు.

“ఏమిట్రా అది, పెద్దా చిన్నా లేకుండా?” సోమయాజులు ఏదో అనబోయాడు.

సారథి ముఖం ఎర్రబడింది. అయినా తమాయించుకుని, “మీరు కూడా ఏమిటి నాన్నా! అసలే వదిన అంత బాధలో వుంటే ఈ పశువుల సంత ఏమిటి? వీళ్ళా చీకటి గదిలో ఆవిడ ముఖం చూడకపోతే ఏమవుతుంది? ఏమిటి ఈ పాడు సంప్రదాయం? దీనివల్ల ఎవరైనా ఏమిటి బావుకునేది? అసలే అన్నయ్య వెళ్ళిపోయాడు. ఇలా కఠినమైన ఆచారాలతో బాలింతరాలు వదినను కూడా పైకి పంపించేస్తారా? తోటి మనుష్యుల్ని మనుష్యులుగా చూడలేని వాళ్ళు పశువులతో సమానం. ఆ పశువుల సంప్రదాయాలు మనకొద్దు” విసురుగా అన్నాడు.

తల్లి అంటున్నది, “సారథీ, మనకీ కొన్ని ఆచారాలు, సంప్రదాయాలూ…”

“ఎందుకమ్మా, ఈ అర్థంలేని సనాతన సంప్రదాయాలు. ఇంకో మనిషిని లోపలకు వెళ్ళమను. చంపి పారేస్తాను” సారథి కోపంతో ఊగిపోతున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

సోమయాజులు ఏమీ మాట్లాడలేదు.

తర్వాత రోజు “ఇక శ్యామల భవిష్యత్తు ఏమిటి?” అనే చర్చ వచ్చింది సోమయాజులు, రాఘవయ్యల మధ్య.

“మేమెలాగో సారథికి పెళ్ళవగానే, వాడితో మెడ్రాస్ వెళ్ళిపోతాం కదా. ఇక మాకు మిగిలిన కొడుకు వాడొక్కటే, వాడి దగ్గరే ఉంటాం. రెండు ఊళ్ళల్లో ఇళ్ళు గడుపుకునే స్థోమత మాకు లేదు. శ్యామలనూ, పిల్లనూ మీరే తీసుకువెళ్ళండి” అన్నాడు సోమయాజులు.

“అదెలాగ? నాకు సంపాదనంటూ ఏమీలేదు. నేనింకా ముగ్గురు కూతుళ్ళకి పెళ్ళి చేయటం ఎలాగా అని బాధ పడుతున్నాను. చెల్లెలి కూతురనే అభిమానంతోనే చిన్నప్పటినించీ పెంచి పెద్ద చేసి, ఇల్లు సగభాగం అమ్మి పెళ్ళి చేశాను. ఇక నావల్ల కాదు” అని దులిపేసుకున్నాడు రాఘవయ్య.

వారి మాటలు ఈ గదిలో ఉన్న సారథికి, ఆ గదిలో ఉన్న శ్యామలకూ వినపడుతూనే ఉన్నాయి. అయినా వాళ్ళ మధ్య చర్చలు ఎటూ తెగకుండా తీవ్రంగా కొనసాగుతూనే ఉన్నాయి.

సారథి ఆలోచిస్తున్నాడు. అతను ఆలోచిస్తున్నది శ్యామల ఎక్కడుండాలి అని కాదు. ఎక్కడ ఉన్నా ఎలా జీవించాలి అని. ఆమె పెద్దగా చదువుకోలేదు. ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడలేదు. ధనవంతురాలైన స్త్రీ అయితే, రెండో వివాహనికి అవకాశాలుంటాయి. ఏమీలేని శ్యామలను చేసుకునేదెవరు? అందులోనూ పసిపాప తల్లి! మొదటిసారి వివాహానికే కట్నాలు, పెళ్ళి ఖర్చులు ఇచ్చుకోలేక మధ్య తరగతి ఆడపిల్లల తండ్రులు నానా ఇబ్బందులు పడుతుంటే, ఈ పరిస్థితిలో ఇలాటి స్త్రీలను ఉద్ధరించే సంస్కారవంతుడు నిజజీవితంలో తారసపడటం సంభవమా?

తన వదిన. శ్యామల. ఒక స్త్రీ. పాతిక సంవత్సరాలు దాటని స్త్రీ. జీవించటం మరచిపొమ్మని ఆమెకు సమాజం చెబుతున్న స్త్రీ. సంఘం కట్టుబాటల్లో, ఆచారాల్లో కాలిపొమ్మని సమాజం చెబుతున్న స్త్రీ.

ఏమిటిది, తనకి అమె మీద సానుభూతా! తనకి సానుభూతులంటే ఇష్టం లేదు. ఆచరణే కావాలి.

ఇది సానుభూతి కాదు, ఇలాంటి వారి జీవితాల గురించి తన హృదయం చేసే ఘోష.

అలాటివారికి చేయిని అందించి, ఆప్యాయత, అనురాగం పంచి ఇవ్వాలనే తహతహ.

బయట సోమయాజులుకీ, రాఘవయ్యకూ రాజీ కుదరలేదు. ఇంకా ఘర్షణ పడుతూనే ఉన్నారు.

సారథి సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.

“ఈ విషయంలో మీరిక ఘర్షణ పడటం అనవసరం. శ్యామల విషయం నాకు వదిలేయండి” అన్నాడు.

౦                            ౦                            ౦

వేణుగోపాలస్వామివారి గుడిలో శాస్త్రిగారు పురాణం చెబుతున్నారు.

“తల్లి కోరిక ప్రకారం, పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెళ్ళాడటానికి ఒప్పుకున్నారు. అలా ధ్రౌపది ఐదుగురు అన్నదమ్ములకూ భార్య అయి, వారితోనే జీవితం పంచుకుని, మహా పతివ్రత అనిపించుకుంది” పురాణం పూర్తయింది.

శాస్త్రిగారు వెలిగించిన హారతి కర్పూరానికి అందరూ నమస్కారాలు చేసి కళ్ళకద్దుకున్నారు.

అలా నమస్కారాలు చేస్తున్న ఆ సమాజం మధ్య, వంటరిగా, నిఠారుగా నుంచుని, “శ్యామలకు ఇక ఏ కష్టాలు రాకుండా నా గుండెల్లో దాచుకుంటాను” అని దేవుడి ముందు ప్రమాణం చేశాడు సారథి, మనసులోనే తన ప్రాణాలు అర్పణ చేసి, తనకి ప్రాణదానం చేసిన భానుమూర్తికి తన నిర్ణయం తెలియజేస్తూ.

Posted in October 2023, కథలు

10 Comments

  1. వి.వి.వి. కామేశ్వరి (v³k)

    హృదయ విదారకమైన వాస్తవానికి దగ్గరగా తీసుకువెళ్ళిన కథ. సారథి తీసుకున్న నిర్ణయం సమంజసమా? కాదా? అనే దానికంటే ఆ సమయంలో శ్యామల స్పందన ఏమిటి? ఆమె నిర్ణయంతో పనిలేదా? మేనమామకు, మామగారికి భారమౌతుందని మనసు చంపుకుని మరిదితో మళ్ళీ జీవితం కొనసాగించమని శాసించినట్లు అనిపించింది. ఏది ఏమైనప్పటికీ, సమాజానికి చురక అంటించిన కథ. అభినందనలు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు కామేశ్వరి గారు. ఇది నిజంగా జరిగిన కథ కనుక, సారథి, శ్యామల అంగీకారంతోనే చేసుకున్నాడు కనుక, ఆ సుఖాంతం మనవతా దృష్టితో విశ్లేషిస్తే నాకూ నచ్చింది కనుకే ఇది ఐదు దశాబ్దాల పైగా కొందరు పాఠకుల మనస్సుల్లో నిలచిపోయింది. మీకూ నచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు.

  2. సత్యం మందపాటి

    ఇక్కడ అతనికన్నా, అతని వదినే చిన్నది కనుక తల్లిగా చూడవలసిన అవసరం లేదు. ఆమెకు మళ్ళీ కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకునే తాహతు లేదు. పసి పిల్లని పెంచి పెద్ద చేసే స్థోమతా లేదు. అంటే ఆమెకూ, ఆ పసిపాపకూ మరణమే శరణం. అలాటప్పుడు, తన ప్రాణం త్యాగం చేసి, తనని రక్షించిన అన్నకు, ఒక మంచి మనిషిగా అతను తీర్చుకున్న ఋణం అది. జీవితంలో పెద్ద దెబ్బ తిన్న వ్యక్తికి, మరో జన్మనిచ్చి బ్రతికించటం. అదీకాక ఇది మానవత్వానికి సంబంధించిన విషయం, బంధుత్వానికీ, మూఢ సంప్రదాయానికి సంబంధించినది కాదు. మనవేపు అన్నయ్య కొడుకుకి పిల్లనివ్వరు. కానీ అక్కయ్య కొడుకుకి పిల్లనిస్తారు. అదీ తప్పే కదా! ఇద్దరిదీ ఒకటే రక్తం. వైద్య రీత్యా చాల తప్పు. అయినా ‘అదో’ సంప్రదాయం. కొంచెం తీరిగ్గా ఆలోచిస్తే ఈ కథ ముగింపు సరైనదే అనిపిస్తుంది.

  3. సత్యం మందపాటి

    మీ స్పందనకి ధన్యవాదాలు, అన్నపూర్ణగారు. మీకీ కథ నచ్చినందుకు సంతోషం.

  4. Swarna Aryasomayajula

    నేను నిజంగానే మీ ముగింపు సన్నివేశం చూశాను. వాళ్లు ఇప్పుడు మనములతో చాలా సంతోషంగా ఉన్నారు

    • సత్యం మందపాటి

      అవునండి స్వర్ణగారు. ఇలాటి సంఘటన ఆరోజుల్లో జరిగితేనే, ఆ స్పందనతో నేను వ్రాశాను. ఇది అన్ని దేశాల్లోనూ, ప్రాంతాల్లోనూ జరిగేదే. ఎందుకంటే ఇది సంప్రదాయంతో ముడిపడినది కాదు. మానవత్వంతో ముడిపడినది. మానవత్వం ఉన్నవాళ్ళ స్పందన మరి ఇలాగే ఉంటుంది.

  5. Seetha

    ఆమె కి జీవనోపాధి కల్పించి ఉంటే బాగుండేది. వదిన అంటే తల్లి తో సమానం. అలాంటి వదిన జీవితం బాగుండాలంటే ఆమెను పెళ్లి చేసుకోవటం సరికాదు. అప్పటివరకూ తల్లి లా చూసిన వదిన ని భార్య లా ఎలా చూస్తాడు? ఆమె కూడా కొడుకు లాంటి మరిదితో జీవితం….బాలేదు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు శ్రీనిగారు. అవును, ఇలాటి ముగింపులు అదృష్టవశాత్తూ ఈరోజుల్లో ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఆరోజుల్లో ఇది ఒక మహా పాపం. ఎదురుగా మనిషి కష్టాలు పడి చనిపోయినా ఫరవాలేదుగానీ, సంప్రదాయాన్ని పాంటించాలి అనే ఒక మూఢనమ్మకం గట్టిగా ఉన్న రోజులవి. మీ స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!