Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
కృష్ణుఁడు

సీ.    చిఱునవ్వు లొలుకుచుఁ జిలిపిచేష్టలు సేయు
        చిన్నికృష్ణుని లీల లెన్నఁ దరమె?
        రాధామనోహరరాగరంజితవేణు
       గానలోలునిఁ జెప్ప వాణి కగునె?
       నరున కజ్ఞానంపుతెరఁ దీయ గీతను
       దెలియఁ జెప్పిన రీతిఁ దెలుప వశమె?
       గాంగేయకృతనుతిగంగాఝరీనామ
       సాహస్రి కెవ్వఁడు శక్తి నొసఁగె ?

తే.గీ. దుష్టసంహార మొనరించి శిష్టరక్ష
      ణము నొనర్పఁగ దేవకీనందనుఁ డయి
      పూర్ణవిష్ణ్వవతారుఁడై పుడమి నుద్ధ
      రించు శ్రీకృష్ణమూర్తి నర్చింతు మదిని				99

ఉ.   నందకుమార! నాహృదయనందననర్తనలీలఁ జూచి యా
      నందము నొందు భాగ్యము ననారత మిమ్మ! యనుగ్రహంబు నీ
      వందఱియందుఁ జూపి చరితార్థులఁ జేసిన దివ్యరూపమున్
      చందనచర్చితాభ్రసమచారువపుర్ధర! చూప రావయా!		100

చం.  మురళినిగాను నీ మృదులమోహనవాదనభాగ్య మొందఁగా;
      సిరిసిరిమువ్వ గాను వ్రజసీమల నర్తన సేయఁ; గానుగా
      మరుకపుపింఛ మగ్రమగు మస్తకభూషణమై స్ఫురింపఁగా;
      నిరతము నిన్నుఁ గొల్చు మది నీవె వసించినఁ జాలు మాధవా!	101

చం.  మురళినిఁ దాల్చి యూఁదుమయ మువ్వలు సవ్వడి సేయ గోపికా
      తరుపశుపక్షిజీవసముదాయముదావహతాళసంగతుల్
      మురిపెముగా ధ్వనించి జగమున్ భవదీయకృపాబ్ధివీచికా
      స్ఫురదురుడోలికాసరసముగ్ధమనోహరకేళిఁ దేల్చఁగా	102

కం.  గోగోపగోపికాజన
      రాగాతీతానుభవము రసడోలికలం
      దూఁగించె వేణుజనితం
      బౌ గానము; చెవుల నింపు మదె శ్రీకృష్ణా!		103

శా.  చేతోరంజకదివ్యవేణురవమున్ సృష్టింప నర్తించు నా
      చేతుల్, ప్రాణమువోయు మోవి, జగముల్ చెన్నొందు వా(1), గోపసం
      ఘాతత్రాణభుజంబు(2), పాపదమనఖ్యాతాంఘ్రులున్, గ్రీడికిన్
      గీతాబోధన సేసినట్టి పలుకుల్ నిత్యమ్ము మ మ్మేలుతన్!	104
             (1) నోట్లో విశ్వదర్శనము (2) గోవర్ధనోద్ధరణము
Posted in November 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!