Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

జగన్నాధం గారు జీవన్ చేసిన ఏర్పాటుకి చాలా సంతోషించారు. ఆ పద్ధతివల్ల పెద్దాయన ఎప్పుడూ ఒంటరిగా ఉండడం జరగదు. తల్లీ కొడుకుల్లో ఎవరో ఒకరు ఎల్లవేళలా ఆయనకు తోడుగా ఉంటారు. మొదటినుండే, మీనాక్షిని ఆయన “అమ్మాయీ!” అనీ, జీవన్ని “మనుమడా!” అనీ ఆత్మీయంగా పిలవసాగారు. జీవన్ ఎక్కడెక్కడ తిరిగినా, పవలు పన్నెండు దాటే సరికి తాతయ్య ఇంటికి వచ్చేస్తున్నాడు, ఆయనకు డైనింగ్ టేబుల్ దగ్గర కంపెనీ ఇవ్వడం కోసం. మొదట్లో మీనాక్షి, మగవాళ్ళిద్దరికీ వడ్డించి తరవాత తను తిoటానని చెప్పింది. కాని, దానికి జగన్నాధం గారు ఎంతమాత్రం ఒప్పుకోకపోడంతో, మీనాక్షి ఒకసారి అందరికీ వడ్డించి తనుకూడా వాళ్ళతో కూర్చుని తినడం మొదలుపెట్టింది. మారు కావలసివస్తే ఎవరికి కావలసినది వారు వడ్డించుకుని తింటున్నారు. మొత్తం మీద ముగ్గురూ ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ సరదాగా భోజనం చేస్తున్నారు. సాధారణంగా భోజన సమయంలో జీవన్, తాను ఊళ్ళో చూసిన, విన్న విశేషాలన్నీ తాతయ్యకు చెప్పేవాడు.

ముగ్గురూ కూడా ఆత్మీయతల కోసం వలపలాడుతున్నవాళ్ళే కనక ఈ ఏర్పాటు వాళ్లకు ఎంతో ఆనందాన్నిచ్చింది. భోజనం చేసి, మరి కొద్దిసేపు తాతయ్యతో కబుర్లు చెప్పి, జీవన్ తన పనిమీద వెళ్ళిపోయేవాడు. మీనాక్షి కూడా తాతయ్య మధ్యాహ్నం నిద్రపోయాక, వీధి తలుపు తాలూకు తాళాన్ని కొంగున గట్టిగా కట్టుకుని, తలుపు గడియపడేలా దగ్గరగా లాగి, “స్వగృహాఫుడ్సు” వాళ్ళకి సహాయం చెయ్యడం కోసం వెళ్ళేది. ఆమె అక్కడ పని పూర్తిచేసుకుని వచ్చేసరికి, తాతయ్య ఇంకా నిద్రపోతూనే ఉoడే వాడు. ఆయన లేచిన తరువాత చిరుతిండి పెట్టి, కాఫీ కలిపి ఇచ్చి, మీనాక్షి రాత్రి వంట మొదలుపెట్టేది. వంట పూర్తి చేసి, తనమట్టుకు రాత్రి భోజనం డబ్బాలో సద్దుకుని, తక్కిన వంటకాలు “కేసరోల్సు”లో ఉంచి, టేబులుపై సద్ది, మంచి నీళ్ళు, కంచాలూ గ్లాసులూ అందుబాటులో అమర్చి, చీకటి ముసరకముందే తాతయ్యతో చెప్పి వెళ్ళిపోయేది మీనాక్షి. చీకటి పడే వేళకి జీవన్ వచ్చేసేవాడు. కాసేపు తాతయ్యకు ఏదో ఒక పురాణం నుండి మంచి రసవత్తరఘట్టం ఒకటి చదివి వినిపించేవాడు. టైం ఎనిమిది దాటగానే తాతయ్యకు భోజనం వడ్డించి, ఆయన పక్కనే కూర్చుని తనూ తినేవాడు. భోజనం అయినాక కాసేపు తాతయ్యతో కబుర్లు చెప్పి, ఆయన నిద్రపోయాక, తాను మరికొంత సేపు రాసుకునో, చదువుకునో కాలక్షేపం చేసి తరువాత నిద్రపోయేవాడు. మీనాక్షీ జీవన్ ల సంరక్షణలో తాతయ్య చక్కగా కోలుకుంటున్నాడు. తాతయ్య సంతోషంగా ఉండడం చూసి జీవన్, మీనాక్షీ కూడా సంతోషించారు.

డబ్బుంటే చాలు సమస్తం ఉన్నట్లే అనుకుంటారు గాని, అది అన్నప్పుడూ నిజం కాదు. జగన్నాధంగారికి డబ్బుకి కొదువ లేదు. కాని, వృద్ధాప్యంలో కనిపెట్టి ఉండి, ఆయన బాగోగులు చూసుకునే వాళ్ళెవరూ లేకపోడంతో, నిన్నమొన్నటి వరకూ తిండికి కూడా మొహం వాచిపోవలసిన దుర్గతి పట్టింది ఆయనకి. జీవన్ చేసిన ఏర్పాటువల్ల ఆయన కష్టాలుతీరాయి. పనిలోపనిగా ఆ తల్లీకొడుకుల ఇబ్బందులూ పోయాయి.

మాటల సందర్భంలో ఒక రోజున పెద్దాయనకు “హెల్పులైన్” గురించి చెప్పాడు జీవన్. వెంటనే జగన్నాధం గారు, తనుకూడా హెల్పులైన్లో మెంబర్షిప్ తీసుకుoటానంటూ ఉబలాటపడ్డారు. ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తెచ్చి ఇచ్చి నీకు రావలసిన కమీషన్ నువ్వు తీసుకోమన్నారు జీవన్ని. జీవన్ నవ్వాడు ...

“మనింటికి కావలసిన వస్తువులు తెచ్చినందుకు నేను కమీషన్ తీసుకోడం మొదలెడితే తాతయ్యా! ఇక మనం తాతా మనుమల మెలాగౌతాము? ఇది మన ఇల్లు ఎలా గౌతుoది, నువ్వే చెప్పు తాతయ్యా!” అన్నాడు చిరునవ్వుతో.

వెంటనే జగన్నాధంగారు బుంగమూతి పెట్టి, గారాలుపోతూ, “మరలాగైతే నువ్వీ తాతయ్య దగ్గర నెలనెలా పోకెట్ మనీ గుoజుకోవాలి. నేను మర్చిపోతే నువ్వు మారాం చెయ్యాలి. అలాగైతే సరే ... ” అన్నారు. ఆయన మాటాడిన తీరు తల్లీ కొడుకులకి నవ్వు తెప్పించింది.

తాతయ్య అవసరం లేదని చెప్పినా వినకుండా, పట్టుపట్టి జీవన్ ఆయన కొడుక్కి, జరిగిన యాక్సిడెంట్ ను గురించి ఆయనచేతే ఉత్తరం రాయించి, దానికి అడ్రస్ రాసి పోస్టు చేశాడు. వారం తిరిగేసరికి ముక్తసరిగా కొడుకు దగ్గరనుoడి జవాబు వచ్చింది ...

నాన్నకి నమస్కారాలు. మీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి నేనూ, రజనీ చాలా బాధపడ్దాము. ఇప్పుడు కులాసా చిక్కిoదని తలుస్తాను. వద్దామంటే సెలవు దొరకలేదు. ఉంటా – రఘురాం.

పెద్దకాగితంలో చిన్న ఉత్తరం! మరి రెండు మాటలు రాసేందుకు కూడా టైం దొరకలేదా? తన కుటుంబ యోగ క్షేమాలను గురించి ఒక్కముక్క కూడా రాయలేదు సరికదా, యాక్సిడెంటైనప్పుడు తనని ఎవరు ఆదుకున్నారన్నదానిని గురించి కూడా ఒక్కమాట లేదు. అంటీ అంటనట్లుగా, ముట్టీ ముట్టనట్లుగా ఉన్న కొడుకు ఉత్తరం పెద్దాయనకు చాలా కోపం తెప్పించింది. “మనసు కోరితే మార్గo దొరక్కపోదు. ఇది తీరుబడి లేక కాదు - ముసలాడు ఎలాపోతే మనకేమిటన్న నిర్లక్ష్యం. నా పుణ్యం బాగుండి, సమయానికి నువ్వు వచ్చి నన్ను రక్షిoచావు కనక బ్రతికి ఉన్నా. లేకపోతే రోడ్డుమీద బస్సు కింద పడి, ముక్కలుచెక్కలై దిక్కుమాలిన చావు చచ్చేవాడిని!” జీవన్ తో పదేపదే తన కొడుకుని గురించి చెప్పి ఆ రోజంతా బాధ పడ్డారు ఆ పెద్దాయన…

“ఒక్కగానొక్క కొడుకని ప్రాణాలన్నీ వాడిమీదే పెట్టుకుని పెంచి పెద్దచేశాము. కోరిన చదువు చెప్పించి, పెళ్ళీ పేరంటం చేసి, ఉద్యోగపు ఊరికి అంపకం పెట్టాము. వాడికి ఏ లోటూ రాకుండా కళ్ళల్లో పెట్టుకుని చూశాము. అలాంటప్పుడు కాలూ, చెయ్యీ ఉడిగిన తల్లితండ్రులపై కాస్తంత కనికరమైనా ఉండొద్దా? నాకు ఇద్దరు మనుమలున్నారు. కాని, వాళ్ళ ముద్దుముచ్చట్లు చూసుకునే భాగ్యం నాకు లేదు. నా భార్య పోయే ముందు ఒక్కసారి కొడుకుని, వాడి కుటుoబాన్ని చూడాలని ఆరాట పడింది. కాని ఎంత దేవులాడినా, రేపు మాపు అంటూ గడిపేశాడేగాని వాడు రాలేదు. చివరకి కొడుకుకోసం బెంగతోనే ఆమె చనిపోయింది. తప్పనిసరిగా అప్పుడు వచ్చాడు కర్మలు చెయ్యడానికి! అదేదో నాల్గురోజులకు ముందే రావచ్చుకదా...  మళ్ళీ – నా కర్మానికి నన్నిక్కడే ఒంటరిగా వదిలేసి, వచ్చిన బంధువులతోపాటుగా తనూ, తన కుటుంబాన్ని తీసుకుని - వెళ్ళిపోయాడు! ఎంత బాగుoదో చూడు” అంటూ మీనాక్షి దగ్గర కొడుకు చైదాలు తలుచుకుని వాపోయాడు పెద్దాయన.

వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఒకసారి, కొడుకు పంపించిన ఫోటోలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ ఆల్బం తెచ్చి మీనాక్షికి చూపించారు ఆయన. ఆ ఫోటోలు తీయించి పదేళ్ళు దాటింది. ఇప్పుడెంత ఎదిగారో, ఎలా ఉన్నారో అన్న ఆలోచన వచ్చింది జగన్నాధoగారికి.

“అమ్మా మీనాక్షీ! నేను పోయేలోగా వాళ్ళు ఒక్కసారి వచ్చి కనిపిస్తారంటావా?” అంటూ అమెతో తన బాధను వెళ్ళబోసుకున్నాడు ఆయన. ప్రేమలకు, ఆత్మీయతలకూ, మొహoవాచి ఉన్న ఆ పెద్దాయన, మీనాక్షి, జీవన్ తనపై చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుడై, వాళ్ళని తనవాళ్ళుగా భావించి తృప్తిపడసాగాడు.

జగన్నాధంగారి వృద్ధ మిత్రులు ముగ్గురూ ఆయనతో గడిపి పోడానికి అప్పుడప్పుడూ వస్తూంటారు. పేకాడుకుoటూనో, లోకాభిరామాయణం మాటాడుకుoటూనో, రాజకీయాలను తమదైన పద్ధతిలో విమర్శిస్తూనో గడిపి వెడుతూoటారు. మీనాక్షి వచ్చాక వాళ్ళ రాకపోకలు ఎక్కువయ్యాయి. వాళ్ళలో ఎవరొచ్చి తలుపు తట్టినా వెంటనే వెళ్లి తలుపు తెరిచి, లోనికి ఆహ్వానించి కూర్చోబెట్టి, కాఫీయో, మజ్జిగ తేటో, మంచినీళ్ళో - ఎవరేది కావాలంటే అది తెచ్చి ఇచ్చి, కుశలప్రశ్నలడిగి గౌరవిoచేది మీనాక్షి. వాళ్లకి ఏ వస్తువు కావాలన్నా సరే జీవన్ యిట్టే తెచ్చి ఇచ్చేవాడు. ఏ నశ్యమో, వక్కపొడో, పటికబెల్లమో - ఇలా ఏది కావాలన్నా జీవన్ చేత తెప్పిoచుకునీవారు ఆ వృద్ధులు. మాటలో మృదుత్వం, మనసులో సుహృద్భావన, పరోపకారబుద్ధీగల ఆ తల్లీ కొడుకులు చాలా తొందరగా వాళ్ళ మనసును చూరగొన్నారు. అలా వాళ్ళు జగన్నాధంగారికే కాకుండా, ఆయన మిత్రులకు కూడా ఆత్మీయులుగా మారిపోయారు. అంతేకాదు, జగన్నాధంగారు మిత్రులతో, కూతురులేని తనకు దేవుడు వరంగా ఇచ్చిన కూతురు మీనాక్షని చెప్పి మురిసేవారు.

ఆయన మిత్రులు భోజనానికి వచ్చిన రోజున మీనాక్షి భోజనంలోకి రెండు మూడు రసవర్గాలు ఎక్కువ చెయ్యడమే కాకుండా, ఒక పిండివంట కూడా చేసి, వాళ్ళను సంతోషపెట్టేది.

మొదట్లో వాళ్ళు, “జగన్! నువ్వు చాలా అదృష్టవంతుడివిరా! “కలిసొచ్చేకాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడంటారు”, అలాగే నీ అదృష్టం పండి, నీకు వండిపెట్టే కూతురు దొరికింది, ఇంక నీకేo భయంలేదు” అన్నారు.

వెంటనే జగన్నాధంగారు చిరునవ్వుతో జవాబు చెప్పారు, “నిజం చెప్పాలంటే నాకు దొరికింది కూతురు కాదు, మనుమడు! వాడు కూడా నడిచిరాలేదు, పరుగెత్తుకుని వచ్చాడు నన్ను రక్షించడానికి! ఆపై, వాడే వాళ్ళ అమ్మను చెయ్యిపట్టుకుని నడిపించుకుని వచ్చాడు నాకోసం ఇక్కడకి” అన్నారు.

అది విని ఆయన మిత్రులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. జగన్నాధంగారి మాటలకు నవ్వుకుంది, వంటగదిలో పనిచూసుకుంటూ వాళ్ళ మాటలు విoటున్న మీనాక్షి.

మీనాక్షి ఇచ్చిన ఫిల్టర్ కాఫీ తాగి, నెమ్మదిగా మిత్రులంతా ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆ తరువాత తన గదిలోకి వెళ్లి విశ్రాంతిగా మంచం మీద నడుము వాల్చారు జగన్నాధంగారు.

*     *      *

చూస్తూండగా ఒక నెల యిట్టే గడిచిపోయింది. జగన్నాధంగారు చెక్కు రాసిచ్చి జీవన్ చేత డబ్బు తెప్పించారు. మీనాక్షికి నెల జీతంగా నాలుగువేలు తీసి ఇచ్చారు ఆయన. మీనాక్షి ఆ డబ్బు తీసుకుని కొంగున కట్టుకుంది. మనుమడికి పోకెట్ మనీగా ఒక వెయ్యి రూపాయిలు జేబులో పెట్టబోయారు. కాని జీవన్ తీసుకోడానికి ఒప్పుకోలేదు. అలాగని ముసలాయన ఊరుకోలేదు, జీవన్ కి పుట్టినరోజు కానుకగా ఒక మంచి రిస్టు వాచీ, ఒక ర్యాలీ సైకిల్ కొని బహుమతిగా ఇచ్చారు.

చేతిలో సైకిల్ ఉండడంతో హెల్పులైన్ పనులు మరింత వేగంగా జరిగిపోతున్నాయి. చేతినున్న గడియారం పన్నెండు చూపించగానే ఎక్కడి పనులక్కడ కట్టిపెట్టి, తాతయ్యతో కలిసి భోజనం చెయ్యడం కోసం ఇంటికి వచ్చేసే వాడు జీవన్.

ఆరోజు జీవన్ రాకకోసం గుమ్మంలో కనిపెట్టుకుని ఉoది మీనాక్షి. ఆమె ముఖం ఆదుర్దాతో నిoడి ఉoది. తల్లి మొహం చూసి భయపడ్డ జీవన్ గమ్మున హాల్లోని పడకకుర్చీవైపు చూశాడు. అక్కడ అతనికి తాతయ్య కనిపించకపోవడంతో కంగారుపడ్డాడు...

“ఏమయ్యింది తాతయ్యకు? ఏరీ, ఎక్కడున్నారు” అని అడిగాడు తల్లిని ఆత్రపడుతూ.

“ఉష్! గట్టిగా మాటాడకు. తాతయ్య ఆయన గదిలో పడుకుని నిద్రపోతున్నారు. పొద్దున్న నువ్వెళ్ళాక ఆయన బయటికి వెళ్లి వచ్చారు. ఇంటికి రాగానే పడుకున్నారు, ఇంకా లేవలేదు.”

“హమ్మయ్య! తాతయ్య బాగున్నారుకదా! నీ మొహం చూస్తే ఆయనకు ఏమైనా అయ్యిందేమోనని నాకు చాలా భయమేసింది. అలా ఉన్నావెందుకమ్మా?”

“తాతయ్య బాగున్నారు. కాని, ఆయన వేలిని ఉండాల్సిన ఉంగరం కనిపించడములేదు, ఎక్కడో పడిపోయింది కాబోలు.”

“తాతయ్య బాగున్నారు, అదే పదివేలు. ఉంగరం కూడా ఇంట్లోనే ఎక్కడో పడిపోయి ఉoటుది. దొరుకుతుందిలే, వెతుకుదాం” అన్నాడు జీవన్ ధీమాగా.

“తాతయ్య గది తప్ప తక్కిన ఇల్లంతా కలయ వెతికాగాని, ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడూ లేనిది తాతయ్య ఈవేళ బయట తిరిగి వచ్చారు. అందుకే నాకు భయంగా ఉంది. పక్క వీధి మిత్రుడైన పార్ధసారధిగారికి ఒళ్ళు బాగాలేదంటే వెళ్లి చూసొచ్చారు. ఉంగరం వీధిలోనే కనుక పడిపోయి ఉంటే, ఈ సరికి ఎవరికో దొరికే ఉంటుంది.”

అంతలో జగన్నాధంగారు నిద్రలేచి, “అమ్మాయీ! జీవన్ వచ్చాడా” అని కేకపెట్టి అడిగారు.

”వచ్చా తాతయ్యా” అన్న కేకతో జవాబు చెప్పి, “అమ్మా! రా” అంటూ జగన్నాధంగారి గదివైపు నడిచాడు జీవన్.

లోపలకు వెడుతూనే, “ఏమిటిది తాతయ్యా! వేలికి ఉంగరం ఉందో లేదో చూసుకోవద్దా? మీ కసలు అది పడిపోయినట్లే తెలియదనుకుంటా! ఒకసారి పక్కమీద ఉందేమో వెతుకుదాం లేవండి” అన్నాడు జీవన్.

జగన్నాధంగారు లేచివెళ్ళి దగ్గరలోవున్న కుర్చీలో కూర్చున్నారు. “ప్రాప్తమున్న వస్తువు నట్టేట్లో పడ్డా మళ్ళీ నట్టింటికే వస్తుంది - అంటారు. మనకి ప్రాప్తముంటే అది ఎక్కడికీ పోదులే, భయపడకు” అన్నారు ఆయన.

“అలా అంటే ఎలా తాతయ్యా? విలువైన వస్తువుని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా” అన్నాడు జీవన్ చనువుగా.

“నువ్వు చెప్పింది నిజమేరా అబ్బాయీ! ఆ ఉంగరం ఒక వారసత్వపు ఆస్తి లాంటిది. తరతరాలనుండే అది తండ్రి నుండి కొడుక్కి, కొడుకునుoడి  మనుమడికి – ఇలా ఆనువంశికంగా వస్తోoదది. ఆమాట చెప్పే మా నాన్న నా వేలికి ఈ ఉంగరం తొడిగాడు. అంటే దీన్ని నేను నా పుత్రరత్నానికి అందజెయ్యాలన్నమాట! కాటికి కాళ్ళుజాచుకుని కూర్చున్న కన్నతండ్రి మీదే గౌరవం లేనివాడు, ఈ అరిగిపోయిన పాత ఉంగరాన్ని పట్టిoచుకుంటాడా ఏమిటి! నాకా నమ్మకమేమీ లేదు. ఇక ఈ ఉంగరం ఉన్నా, పోయినా ఒకటే” అన్నారు ఆయన కుర్చీలో వెనక్కివాలి కూర్చుంటూ.

అంతలో మీనాక్షి మొహమంతా సంతోషం నింపుకుని అక్కడకు వచ్చింది. ఆ గదికి ఉన్న ఆటాచ్డు బాత్రూం లో వెతుకుతున్న మీనాక్షికి ఒక వారగా కనిపించింది ఆ ఉంగరం. వెంటనే దాన్ని తీసుకుని, శుభ్రంగా సబ్బుతో తోమి, కడిగి పట్టుకుని వచ్చింది మీనాక్షి.

“తాతయ్య బాగా చిక్కిపోయారు. ఉంగరం వదులైపోయింది. ఉండు, నేను రిపేర్ చేసి తెస్తా” అంటూ ఆ ఉంగరాన్ని అందుకున్నాడు జీవన్.

ఉంగరానికి దారంచుట్టి, దాని కైవారం తగ్గించి, బిగువుగా ఉండేలా చేసి, తెచ్చి తాతయ్య కుడిచేతి అనామికకు తొడిగాడు జీవన్.

“అమ్మయ్య! ఇక భోజనానికి రండి, ఇప్పటికే తాతయ్యకు ఆలస్యమయ్యింది” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది మీనాక్షి.

మీనాక్షి సంరక్షణలో రోజురోజుకీ జగన్నాధం గారు కోలుకొని, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. తండ్రిలాంటి వ్యక్తికి సేవలు చెయ్యడంలో ఒక విధమైన ఆనందాన్ని అనుభవిస్తోంది మీనాక్షి.

*     *      *

ఆరోజు కాలక్షేపానికి జగన్నాధంగారి ఇంటికి మిత్రులు ఉదయం తొమ్మిదయ్యేసరికల్లా వచ్చారు. వాళ్ళు మీనాక్షి చేతి వంట తృప్తిగా భోజనం చేసి, కొంచెం సేపు విశ్రమించి, పేకాట మొదలు పెట్టారు. మూడున్నర అవ్వగానే అందరికీ మధ్యాహ్నం కాఫీలు, తినడానికి చిరుతిండి ఇచ్చి, మీనాక్షి వంటగదిలో సాయంత్రం వంట ప్రయత్నం చేసుకుంటోంది.

జగన్నాధంగారు, ఆయన మిత్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలాసేపు ఆడాక పేకాట విసుగెత్తడంతో, పేకముక్కల్ని వదిలి కబుర్లలో పడ్డారు.

“ఏం బ్రతుకులో ఇవి! ఈ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో వృద్దాప్యమంత దుర్దశ మరొకటి ఉండదు. చేసుకునే ఓపికలేక పరాధీనమయ్యి, అందరిచేత మాటలుపడుతూ, మనసు చంపుకుని బ్రతక వలసి వస్తోంది. ఇంత కంటే దుర్దశ మరోటి ఏదీ లేదు. ప్రాణం ఉన్నన్నిరోజులూ ఈ దుర్భర నరకంలో పడి కొట్టుకోక తప్పదు కదా! పున్నామ నరకం అంటే వేరే ఎక్కడో లేదు, ఇదే” అన్నాడు పతంజలి, జగన్నాధంగారి మిత్రుల్లో ఒకడు, స్వగతంలాగ.

వెంటనే అందుకున్నాడు మరో మిత్రుడు. “పసివాళ్ళుగా ఉన్న పిల్లలు అసమర్ధులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పెంచి, పెద్దవాళ్ళను చేసి, వాళ్లకి ఒక చక్కని జీవితాన్ని ఇవ్వాలని తాపత్రయ పడతారు కదా! మళ్ళీ అలాంటి బాధ్యత, వృద్దులై అసమర్ధులైన పెద్దవాళ్ళ విషయంలో చూపించవలసిన పూచీ పిల్లలకి లేదా? కాని మనుష్యుల్లో పెరిగిపోయిన స్వార్ధం వాళ్లని బాధ్యతలను నిర్లక్ష్యం చేసీలా ప్రేరేపిస్తోoది. వృద్దాప్యంనుండి తప్పిoచుకోడం అర్ధాయుష్కులకు తప్ప, మన లాంటి పూర్ణాయుష్కులెవరి తరమూ కాదు. ఈవేళ యువకులుగా ఉన్నవాళ్ళకీ రేపు వృద్ధాప్యం రాకమానదు. కొడుక్కి రోల్ మోడల్ తండ్రే కదా! తన తండ్రిని తాను ఎలా చూసుకున్నాడో, రేపు తనను తన కొడుకూ అలాగే చూసుకుంటాడు. ”తాతబోలే తరతరాలూ వస్తుoది” అన్న జ్ఞానం కూడా లేదు ఈ కాలం వాళ్లకు! తనదాకా వస్తేగాని తప్పు తెలియదు ఎవరికీ. కాని, అప్పుడు పశ్చాత్తాపపడి లాభమేమిటి” అంటూ కంఠశోష పడ్డాడు మరో మిత్రుడు సదాశివుడు.

“ఏం కర్మం వచ్చిపడిందిరా బాబూ!" అంటూ అందుకున్నాడు పరశురామ్. "ఈ రోజుల్లో ఇది ఇంటింటి పురాణమై పోయింది. పెద్దవాళ్ళు అందరికీ బరువైపోయారు. వృద్ధులైన తల్లిదండ్రుల్ని పిల్లలు కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోడానికి బదులుగా, ఈ తరం వాళ్ళు, సంవత్సరంలో ఒకరోజు “మదర్సు డే” అనీ, మరో రోజు “ఫాదర్సు డే” అనీ తల్లితండ్రులు బ్రతికుండగానే ఏటేటా వాళ్ళ దినాలు జరిపించేసి, వాళ్ళ పిండం వాళ్ళ చేతనే తినిపించేసి, సంవత్సరానికి ఒక్కరోజు పండుగ చేసి, తక్కిన రోజుల్లో మాత్రం వాళ్ళ సంగతే పట్టించుకోకుoడా తిరుగుతున్నారు!  ఎంత బాగుoదో చూడండి! మన రోజుల్లో మనం మన తల్లిదండ్రులకు బ్రతికుండగా సేవలు చెయ్యడమేకాదు, పోయాక కూడా తల్లితండ్రులకు తద్దినాలనీ, తర్పణాలనీ, వాళ్ళ పేరున దానధర్మాలనీ ఏడాది పొడుగునా ఎదో ఒకటి చేస్తూ వాళ్ళకి తరచూ తర్పణాలు వదులుతూ గడిపాము. ఐనాకూడా అడపా తడపా ఏదో వంకని వాళ్ళను తలుచుకుంటూనే ఉంటాము కదా” అన్నాడు.

“ఇప్పుడిలా బాధపడి లాభమేమిటి? మనమాట చెల్లడం ఎప్పుడో ఆగిపోయింది. ఇది కలియుగం, అంటే - యుగాల క్రమంలో ఇది ఆఖరు యుగం! “చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయిట!  అందుకే ధర్మ విరుద్ధమైన మనుష్యులు పుట్టుకొస్తున్నారు. ఇక్కడ ఇంకా మొదలవ్వలేదుగాని, చాలా ఊళ్లలో, ముఖ్యంగా పట్టణాలలో, పెద్దవాళ్ళను సాకడానికి “ఓల్దేజ్ హోమ్సు” అని డబ్బుతీసుకుని వయసుమళ్ళిన వాళ్ళను కనిపెట్టి చూసేందుకు వసతి గృహాలు, వీధికొకటి చొప్పున బయలుదేరాయిట! అక్కడ అదొక పెద్ద వ్యాపారమయ్యిందిట! వాటిలో పోటా పోటీలమీద వృద్ధులైన తల్లిదండ్రుల్ని చేర్పిస్తున్నారుట కడుపున పుట్టిన పిల్లలు. డబ్బులు కడితే చాలు, బాధ్యత తీరిపోయిoదనుకుoటున్నారు వాళ్ళు. ఆ హోముల్లో ఆత్మీయతలు లోపిoచినా, వృద్ధుల కనీసపు అవసరాలు తీరుతాయిట!”

“నాలాంటి అనాధ పక్షికి ఆపాటి సదుపాయమున్నాచాలు” అనుకునే వాడిని ఇదివరకు” అన్నారు జగన్నాధం గారు.

“ముప్పుకి లోగా తిప్పలు ఎన్నో!“ నిట్టూర్చాడు మిత్రుడు పతంజలి.

అందరి మాటలూ వినివిని తలెత్తి జగన్నాధంగారిని ఉద్దేశించి, “భగవంతుడికి కృతజ్ఞతలు. వదిన పోయాక, జగన్! చాలారోజులు నువ్వు చాలా కష్టాలు పడ్డావు. ఇన్నాళ్ళకి ఆ దైవానికి నీమీద దయగలిగింది. నువ్వే కాదు, నీతోపాటు మేమూ పెట్టిపుట్టాము, మీనాక్షి చేతి వంట తినడానికి. ఆహా! ఏమి రుచి” అన్నాడు మిత్రులందరిలోకీ చిన్నవాడైన సదాశివం, లొట్టలేస్తూ.

వెంటనే మిత్రుడు పరశురాం అoదుకున్నాడు, “మేమూ ఏవేవో కష్టాలు పడుతూనే ఉన్నాం గాని, జగన్! నీలా మేము బొత్తిగా తిండికి కూడా మొహoవాచిపోలేదు. "నూరు తిట్లయినా ఒక బొబ్బట్టుకి సరిగావు" అన్నది సామెత! అలా కష్టమో, నిష్టూరమో మా పిల్లలు మమ్మల్ని తమ దగ్గరే ఉండనిచ్చారు కనుక వేళకింత భోజనo దొరుకుతోంది మాకు.  ఎవరేమన్నా పట్టిoచుకోకుoడా, ఎంత కష్టపెట్టినా ఎవర్నీ ఏమీ అనకుండా “నూరు తిట్లైనా ఒక బొబ్బట్టుకి సరి రావు” అనుకొని బతికేస్తున్నాము. ఆ రోజుల్లో మేము నిన్ను తలుచుకుని బాధపడడమేగాని నీకు రవంత సాయం కూడా చెయ్యలేని పరిస్థితి అయ్యింది మాది. ఈ చివరి రోజుల్లోనైనా నిన్ను చూసుకునీ వాళ్ళు నీకు దొరికారు. జగన్! ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ళని వదులుకోకు సుమీ!”

“ఔను! వదులుకోకూడదు. రక్త బంధం ఉన్నవాళ్ళు చిన్న చూపు చూసినా, మనసున్న మంచి మనుష్యులు ఇన్నాళ్ళకు నీకు దొరికారు. సుఖీభవ” అన్నాడు అందరిలోకీ పెద్దవాడైన పశుపతి.

“మనుమడు, మనుమడు అంటూ మురిసిపోతూ తెగ పొగడుతున్నావు బాగానే ఉందిగాని, జగన్! ఇవన్నీ శుష్కప్రియాలేనా లేక ఆస్తిలో వాటా కూడా ఇస్తావా మనుమడికి?” అన్నాడు పరాంకుశం పుటుక్కున.

జగన్నాధంగారు ఏమీ మాటాడలేదు. అంతలో మీనాక్షి అటువైపుగా వస్తున్నఅలికిడి అవ్వడంతో వాళ్ళ సంభాషణ వేరేతోవ పట్టింది.

*      *       *

ఆ ఊళ్ళోని ప్రముఖులు కొందరు కొత్తగా ఒక ఎడ్యుకేషనల్ అకాడమీ పెట్టి, దానిని నైట్ కాలేజీగా నడిపించసాగారు. దానిలో చెప్పే కోర్సుల్లో కంప్యూటర్ సైన్సు కూడా ఉంది. అటునుండి వెడుతున్నప్పుడూ, వస్తున్నప్పుడూ ఆ బోర్డు కనిపించగానే జీవన్ మనసు గుబగుబలాడేది. అందులో చేరి కంప్యూటర్ కోర్సు చెయ్యాలని అతనికి ఆశగా ఉండేది. “కంప్యూటర్ సైన్సు” మానవమేధాశక్తికి పరాకాష్ట - అని అతని అభిప్రాయం. అది కనక చదివితే ఇక ఉద్యోగానికి ఢోకా ఉండదు, కళ్ళకద్దుకుని ఉద్యోగం ఇస్తారు కదా – అనుకునేవాడు జీవన్ ఎప్పుడూ. చిన్న చదువులు చదివినవాళ్లకి తొందరగా ఉద్యోగాలు రావు. అడపాతడపా ఇంటర్వ్యూలకు వెడుతూ, వస్తూవున్నా, తనలాంటి ఉత్తరదక్షణాదులు సమర్పిoచుకోలేనివారిని, ఎంత మoచి మార్కులు తెచ్చుకున్నా, గోల్డు మెడలిస్టు అయినా కూడా ఎదో ఒక సాకు చెప్పి బయటకు పంపేస్తారు. డిగ్రీ ఒక్కటే చదివితే ఉద్యోగం వచ్చే సూచనలేమీ లేవు కదా! ఇప్పుడు తమ పరిస్థితులు మెరుగుపడ్డాయి కనక, నెమ్మదిగా డబ్బు కూడబెట్టి తానీ స్కూల్లో చేరి తప్పకుండా కంప్యూటర్ సైన్సు తో పై చదువు చదువుకోవాలి - అని కలలు కనేవాడు.

ఆది ఆవూరి హైస్కూల్లో టెరం ఫీజు కట్టాల్సిన రోజు కావడంతో, చాలామంది తమ పిల్లల స్కూల్ ఫీజు కట్టమంటూ జీవన్ కి పురమాయించారు. ఫీజులు కట్టెయ్యడం అయ్యింది. కాని అక్కడితో సరిపోదు కదా, ఆ ఫీజులు తాలూకు రిసీట్లు, మిగిలిన చిల్లర ఇంటింటికీ తిరిగి అందజేయవలసి ఉంటుంది. ఆ పనులన్నీ ముగించి వాచీ చూసుకునే సరికి అది సాయంకాలం ఆరు దాటినట్లుగా చూపించడంతో జీవన్, తాతయ్య ఈసరికి తనకోసం ఎదురుచూస్తూ ఉంటారని కంగారుపడ్డాడు. సరిగా ఏడున్నర అయ్యేసరికి ఏరోజునా భోజనం చెయ్యడం ఈమధ్యన తాతయ్యకి అలవాటుగా మారింది. ఆ సమయానికి తానూ ఇంటిలో ఉండాలన్న కోరికతో జీవన్ వేగంగా సైకిలు తొక్కుకుంటూ ఇంటిదారి పట్టాడు.

గేటు తెరుచుకుని కాంపౌండులో ప్రవేశించి, గుమ్మం పక్కగా సైకిల్ కి స్టాండ్ వేసి, తాళం పెట్టి వేగంగా మెట్లెక్కి లోపలకు రాబోతున్న జీవన్ ని గుమ్మందగ్గర, లోనికి వెళ్ళనీకుoడా అటకాయిoచింది - కాప్రి, టీషర్టు వేసుకుని, బాబ్డుహెయిర్తో ఉన్న ఒక సుమారుగా పదహారేళ్ళ వయసున్న అమ్మాయి! ఒక్క క్షణం తటపటాయిoచాడు జీవన్. తలెత్తి చూసిన జీవన్ కి ఇంటి నిండా వెలుగుతున్న దీపాలతో ఇల్లు కొత్తగా కనిపించింది. తన కంగారులో తను వేరే వాళ్ళ ఇంట్లో ప్రవేశించాడేమోనని భయపడ్డాడు జీవన్. కాని గోడకి ఉన్న తాతయ్య నేమ్ ప్లేటు, అది సరైన చోటేనని అతనికి తెలియజెప్పింది.

ఇల్లంతా దీపాలు వెలుగుతున్నాయి. గుమ్మానికి ఎదురుగా పడకకుర్చీలో కూర్చుని వీధివైపు చూస్తూ తన రాక కోసం ఎదురు చూసే తాతయ్య అక్కడలేరు. గుమ్మానికి అడ్డంగా ద్వారబంధానికి చేతులు ఆనించి నిలబడ్డ ఆ అమ్మాయివైపు ఆశ్చర్యంగా చూశాడు జీవన్. తాతయ్య ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు గావును - అనుకున్నాడు.

ఆమె కూడా అతనివైపు ఆశ్చర్యంగా చూసింది. “ఇంత చొరవగా యితడు లోపలకు వస్తున్నాడంటే యితడు తాతయ్యకు బాగా తెలిసినవాడే అయ్యివుంటాడు, సందేహం లేదు. ఎవరితను? అలేగ్జాoడరుకి తమ్ముడా లేక సెల్యూకస్ కి మేనల్లుడా! ఎవరై ఉంటాడు? ఎంత “హాడ్సం”గా ఉన్నాడు” అనుకుంది ఆ అమ్మాయి.

అతని సంగతేమిటో తేల్చేయాలనుకున్న ఆ అమ్మాయి గుమ్మానికి అడ్డం తప్పుకోకుoడానే, కొంటెగా జీవన్ వైపు చూస్తూ, “ఎవరండీ మీరు? మా తాతయ్యకు తెలిసినవారా ఏమిటి, అంత చొరవగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఇకచాలు, ఈ స్రవంతి పర్మిషన్ ఉoటే గాని మీరు లోపలికి వెళ్ళలేరు” అంది కోపం నటిస్తూ.

జీవన్ తెల్లబోయి చూశాడు ఆమెవైపు. దాచాలన్నా దాగని చిరునవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ఆమె కళ్ళలోని కొoటె మెరుపులు పసిగట్టగలిగాడు జీవన్. వెంటనే అతనికి తెలిసిపోయింది, ఆ అమ్మాయి తనని ఆటపట్టిస్తోoదని! ఇక్కడ ఉందంటే, ఈమెకు తాతయ్యకు ఏదో చుట్టరికం ఉండే ఉంటుంది" అనుకున్నాడు జీవన్.

స్రవంతి స్వరూప స్వభావాలు అతనికి వింతగా కనిపించాయి. తనుకూడా ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె పద్ధతిలోనే తనూ జవాబు చెప్పాలనుకున్నాడు, "క్షమించండి యువరాణీ! నేను తాతయ్యకి నమ్మినబంటుని. ఆయన రమ్మంటేనే కార్యార్ధినై వచ్చాను ఇక్కడికి. నన్ను చూసి భయపడవలసిన పనిలేదు. లోపల నాకొక ముఖ్యమైన పని ఉంది. దయయుంచి తమరు అడ్డు తప్పుకున్నట్లైతే నేనెళ్ళి ఆ పని పూర్తిచేస్తా. అసలే అలసి సొలసి ఆకలితో ఉన్నాను" అన్నాడు చిరునవ్వుతో.

"ఎవరే అక్కా! ఎవరితోటి మాట్లాడుతున్నావు" అని అడుగుతూ స్రవంతి తమ్ముడు రవి అక్కడికి వచ్చాడు.

స్రవంతి ద్వారబంధం మీద అడ్డంగా ఉంచిన చేతులు తీసేసి, "సరే ఐతే! పర్మిషన్ గ్రాంటెడ్. ఇక వెళ్లొచ్చు" అంటూ పక్కకి తప్పుకుంది.

ఎవరో చుట్టాలు వచ్చారన్నది తెలుస్తోనే ఉంది. కానీ ఎవరో! తాతయ్య, చుట్టాలొస్తున్నట్లు చెప్పనే లేదు - అనుకుంటూ లోపల ప్రవేశించాడు జీవన్.

మొహం చిట్లబెట్టుకుని హాల్లో పడకకుర్చీలో కూర్చుని ఉన్నారు జగన్నాధం గారు. జీవన్ని చూడగానే ఆయన ముఖం వికసించింది. "హమ్మయ్య! వచ్చావా, నీ మాటే అనుకుంటున్నా" అని, "ఇదిగో చూడుబాబూ! సర్పైజ్ విజిట్ గా వచ్చి, నన్నొకసారి పలకరించిపోడానికి మా అబ్బాయి కుటుంబ సమేతంగా వచ్చాడు. అతిధి మర్యాదలు చెయ్యాలిగా మరి! అమ్మ నడిగి లిస్టు రాసుకుని కావలసిన వన్నీ తీసుకురా. బీరువా సొరుగులో డబ్బుoది, ఎంత కావాలో తీసుకెళ్ళు" అన్నారు.

ఈలోగా జగన్నాధం గారి అబ్బాయి రఘురామ్ అక్కడకి రావడం జరిగింది. జీవన్ అతనికి నమస్కరించాడు. రఘురామ్ తేరిపారజూశాడు జీవన్ ని.

"వచ్చావా నాయనా, సంతోషం! ఇంతవరకూ ఈ పెద్దాయన నీ పేరే జపిస్తున్నాడు. నువ్వేనన్న మాట ఈయనను ఆదుకోడానికి పరుగు, పరుగున వచ్చిన మనవడివి! ఏం మాయ చేశావో గాని - వచ్చినప్పటినుండి వింటున్నా, ఈయనకు నీ ఊసు తప్ప మరో ధ్యాస లేదు" అంటూ ఒక పెడనవ్వు నవ్వాడు రఘురామ్.

ఆయన స్వరంలోని వెటకారానికి "గతుక్కు" మని తెల్లబోయాడు జీవన్. తన ఉనికి ఎందుకనో రఘురామ్ గారికి కిట్టటం లేదని జీవన్ కి అర్థమయింది. కానీ తాను చేసిన తప్పేమిటో అతనికి ఎంతమాత్రం అంతుపట్టలేదు. పెద్దాయన మళ్ళీ హెచ్చరించడంతో కాగితం, పెన్సిలు తీసుకుని తేవలసిన సామాను లిస్టు రాసుకోడం కోసం వంటగది వైపుగా నడిచాడు జీవన్.

వంటగదిలో మీనాక్షి వంటపనిలో సతమత మౌతూనే, ఉత్తరదేశపు స్త్రీల ఆహార్యమైన సెల్వార్, కమీజ్, దుపట్టాలను ధరించివున్న ఒక యువతితో మాటాడుతూ, ఆమె అడుగుతున్న ప్రశ్నల కన్నిటికీ ఓపిగ్గా జవాబులు చెపుతోoది. ఆమె తాతయ్యగారి కోడలని గ్రహించాడు జీవన్.

"మీరు ఇదివరకు పనిచేసిన యాజులుగారు మా అమ్మవైపున మాకు దగ్గర బంధువులు. వాళ్ళు అమెరికా నుండి వచ్చేవరకేనన్నమాట మా మామగారికి ఈ భోగం" అంది ఆమె మీనాక్షితో.

మీనాక్షి గుమ్మంబయట పెన్ను, పేపరు పట్టుకుని తచ్చాడుతున్న కొడుకుని చూసి పలుకరించింది, "ఏమైనా పని ఉందా నాతో?"

"ఇంటికి కావలసిన సరుకులన్నీ లిస్టు రాసుకుని, రేపు ఉదయమే తీసుకురమ్మన్నారు తాతయ్య."

"ఔను, చాలావరకూ సరుకులు నిండుకున్నాయి. ఈ పూటకి ఎలాగో సరిపెట్టాగాని, రేపు మాత్రం మన సరుకు ముందు తేవాలి నువ్వు, లేకపోతె పొయ్యిలో పిల్లికి లేవాల్సిన పని ఉండదు" అంది మీనాక్షి చిరునవ్వుతో.

"సరే! మొదటి ట్రిప్ లో మన పనే చక్కబెడతా, లిస్టు చెప్పు" అంటూ జీవన్ లిస్టు రాసుకునే పోజులో నిలబడ్డాడు.

"నాకు వంటకి ఆలస్యమౌతుంది, నువ్వు రజనీగారి నడిగి రాసుకో. తరవాత నేను వస్తా" అంటూ తరిగి ఉంచిన కూరముక్కల్ని పోపులో వేసే పనిలో పడింది మీనాక్షి.

జీవన్ రజనికి నమస్కరించి, " మీరు చెప్పండమ్మా! నేను రాసుకుంటా. రేపు కొట్లు తెరవగానే ముందు మన సామానే తీసుకువస్తా" అంటూ రాయడానికి వీలుగా కాగితం కలం పట్టుకుని నిలబడ్డాడు. రజని చెప్పసాగింది.

****సశేషం****

Posted in November 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!