Menu Close
Kadambam Page Title
మా పిల్లాడి మైదానం
గవిడి శ్రీనివాస్

మీకు నా చిన్ని ప్రపంచాన్ని చూపించనా!

రెక్కలు విచ్చుకున్న మా పిల్లోడు
గుండెలపై తూనీగలా ఎగిరిగంతేవాడు
వాడికి నా గుండె ఓ మైదానం లా ఉండేది

ఇప్పుడు టి.వి చూడటం మొదలెట్టాడు
తమాషాగా బ్యాట్ పట్టుకొన్నాడు
ఓ మైదానాన్ని వెతుక్కున్నాడు

చిన్న వయసులో
వాడు కొట్టే ప్రతి బంతిలో
ఉత్సాహం ఉరకలేస్తుంది.
వాడి కళ్ళ లో మెరిసే ఆనందాన్ని
నాలో దాచుకున్నాను.

ఒక్కోసారి చెబుతాను
ఆటలో గెలిచినట్లు
ఆటలో ఓడినట్లు
సంఘటనలు ఎదురవుతాయనీ..
ఓడినా వెనుతిరిగని వాడే
గెలుస్తాడనీ బోధిస్తాను.
జీవిత పాఠాలని వినిపిస్తాను.

మా పిల్లోడు ఆకాసాన్ని ఆరేసుకుంటాడు
బంతులతో చుక్కల్ని చెక్కుతుంటాడు
ఆటల్లేని చదువులకి ఆరాటపడక
ముంగిట వాలిన బాల్యాన్ని
ఆస్వాదిస్తున్నాడు.
సమతుల్యతను సాధన చేస్తున్నాడు.

బాల్యమంటేనే ఓ పూలపరిమళం
ముళ్ళుగుచ్చినా, గుచ్చుకున్నా తీసి
ఇంకా పరిగెత్తటంలో ఆరితేరుతున్నాడు.
వాడి జీవన మైదానంలో అలుపెరుగక.

Posted in November 2023, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!