Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

6. అశోకుడు

గత సంచికలో అశోకుడు అనేక శిలా-రాతి శాసనాలను పట్టణాల పొలిమేరలలోనూ, యాత్రికులు, ప్రజలు ప్రయాణించే, సంచరించే మార్గాలలోనూ నెలకొల్పినట్లు తెలుసుకున్నాము. ఈ విధంగా ఈ మూడవ మౌర్య చక్రవర్తి ముద్ర భారత దేశంలోనే గాక, పొరుగు దేశాలలో ఈ కారణంగా ఈ రోజుకూ స్పష్టంగా గోచరిస్తుంది.

అశోకుడు ఇచ్చిన సందేశాలు, ఆదేశాలు కేవలం శిలా-రాతి శాసనాలకే పరిమితమవ్వలేదు. అయన మరో రెండు రూపాలలో తన ముద్రను శాశ్వతంగా నిలపటం జరిగింది. వీటి ద్వారా గౌతమ బుద్ధ మానవాళికి ఇచ్చిన ఉపదేశాన్ని విస్తారంగా వ్యాప్తి చేయటం, వాటిని మానవులు అనుసరించే టట్లు చేయటానికి ఈ చక్రవర్తి గట్టిగా కృషి చేయటం జరిగింది. దీని కొరకు ఈయన బౌద్ధ సన్యాసులకు ధ్యాన మరియు నివాస యోగ్యమైన కొండ గుహలను నిర్మించటం, అనేక శిలా స్తంభాలు స్థాపించటం జరిగింది. ఈ సంచిక కేవలం గుహలకే పరిమితమైంది.

ఆ కాలంలో మతాల మధ్య వైరం, శత్రుత్వం అమితంగానే ఉండేది. బౌద్ధ గ్రంధాలు అజీవికలను క్రూరులు, మోసగాళ్లుగా చిత్రీకరించాయి. అజీవికలలో కొంతమంది బౌద్దులతో సహవాసం చేసి తమ పోషణ జరుపుకునేవారు. మొదట్లో జైనులు, అజీవికల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. క్రమేణా ఈ రెండు మతాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నందువల్ల కొంతమంది అజీవికలు జైనులుగా మారారు. ఈ మతాల మధ్య వైషమ్యాలు తొలగించాలనే కోరికతో అశోకుడు కొన్ని గుహలను వారికి కేటాయించటం జరిగింది.

అశోక చక్రవర్తి నిర్మించిన కొండ గుహలు (Caves)

భారతావని గుహలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దేశం. 1,500 పైచిలుకు ఉన్న గుహలలో 1000 బౌద్ధులకు, 300 హిందువులకు, 200 జైనులకు చెందినవి. ఈ గుహలు భారతీయుల అద్భుత పనితనానికి నిదర్శనం. తన పరిపాలనాకాలంలో అశోకుడు అనేక గుహలను బౌద్ధ, అజీవిక సన్యాసులు, సన్యాసినిలకు నిర్మించటం జరిగింది. ఈ గుహలు పవిత్రతకు నిలయమైన ప్రదేశాలు. వీటిని క్రొత్తగా నిర్మించినా, పాత వాటిని విస్తరించినా పూర్తిగా మానవుల స్వహస్తాలతో (యంత్ర-రహితంగా) చేసినవే. సాధారణంగా ఈ గుహలు చిన్నవిగానూ, చీకటితో నిండి ఉంటాయి. కాని సూర్యరశ్మి ఈ చీకటిని కొంత మేర పార త్రోలేటట్లుగా నిర్మాణం జరిగింది.

అశోకుడి నమ్మకాలలో ముఖ్యమైనవి పరమత సహనం; పెద్దల యెడల గౌరవం; తన రాజ్యంలో అన్ని మతాల ప్రజలు బేధాలు, విభేదాలు లేకుండా జీవించాలి. ఈ మౌర్య చక్రవర్తి క్రీ.పూ. 257-256 నుంచి కొన్ని కొండలలో సొరంగాలు త్రవ్వించి గుహలను నిర్మించటం జరిగింది. ఆయన నిర్మించిన గుహలలో బీహార్ లోని బారాబర్ (Barabar) గుహలు అత్యంత ప్రసిద్ధి చెందినవి.

కొండను త్రవ్వి, తొలిచి గుహలను నిర్మించే శిల్పశాస్త్ర విజ్ఞానం ప్రపంచంలో మొదట భారతదేశం లోనే సుధామ, లోమస్ ఋషి గుహలతో మొదలయింది. వీటి నిర్మాణం అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో జరిగింది. ఏటవాలు గోడలు, వర్తులాకార పైకప్పులతో ఉన్న ఈ గుహలు చెక్కలు, వెదురు బొంగులతో నిర్మించబడిన గృహాలు, గుడిసెల లాగా ఉన్నాయి. నున్నగా, మెరిసే గోడలు, పైకప్పు ఉన్న, నిశ్చబ్దం వాతావరణం నెలకొన్న ఈ గుహాలలోనే సన్యాసులు చాలా సుఖంగా ఉండగలరు.

నల్ల గ్రానైట్ కొండలలో ఈ గుహల నిర్మాణం జరగాలంటే ముందు జాగ్రత్తగా, క్షుణ్ణంగా కొండను పరిశీలించి ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. అదీగాక ఇది అధిక ఖర్చుతో కూడిన పని. ఇటువంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టాలంటే చక్రవర్తి పూర్తి మద్దతు, సహకారం అవసరం. ఇటువంటి గుహలలోనే భిక్షుకులు, సన్యాసులు నివసించాలని మౌర్య చక్రవర్తి వాంఛ, ఆదేశం.

బారాబర్ (Barabar) కొండ

బారాబర్ కొండ బీహార్ లోని ‘గయ’ పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉంది. ఈ కొండ బారాబర్-నాగార్జుని జంట కొండలుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో అశోకుడు నాలుగు గుహలను నిర్మించిన ఫలితంగా బారాబర్ కొండలో నాలుగు గుహలు, నాగార్జుని కొండలో మూడు గుహలు నెలకొన్నాయి. ఇవి: ‘లోమస్ ఋషి’ (Lomas Rishi); ‘సుధామ’ (Sudama), ‘కర్ణ చౌపర్ (Karna Chaupar), ‘విశ్వకర్మ’ (Visvakarma). బారాబర్ గుహలలో అశోకుడి పేరు ‘రాజు పియదస్సి’ (King Piyadassi/Priyadarsi)గా, నాగార్జుని గుహలలో ఆయన మనుమడు దశరథ మౌర్య (క్రీ.పూ. 232-224) పేరు (‘దేవనామ దశరథ’) గా చెక్కించబడ్డా యి. ఈ నాలుగు గుహలను మతాల మధ్య సామరస్యం పెపొందించటానికి తాను నిర్మించినట్లు అశోకు డు ఒక శాసనం లో పేర్కొన్నాడు.

  1. లోమస్ ఋషి గుహ (Lomas Rishi Cave)

బారాబర్ గుహలలో అత్యంత ప్రసిద్ధి పొందిన ‘లోమస్ ఋషి’ గుహ క్రీ.పూ. 250-249 లో నిర్మించబడింది. దీని ముఖద్వారం అతి సుందరంగా మలచబడింది. దీనికి ఎడమ ప్రక్కన ‘సుధామ’ గుహ ఉంది. లోమస్ గుహలో రెండు గదులున్నాయి. ఒక గది దీర్ఘ చతురస్రాకారంలో 33 అడుగులు వెడల్పు 60 అడుగుల పొడవు ఉంటే రెండవ గది 16 అడుగుల వ్యాసంతో అర్ధ గోళాకారంలో ఉంటుంది. ఈ రెండు గదుల మధ్య ఒక ఇరుకైన ద్వారం ద్వారం ఉంటుంది. ఇందులో మధ్య కామాను (arch) మీద ఒక వరుసలో ఏనుగులు ఒక స్థూపాన్ని మోసుకెళ్తూ ఉన్న చిత్రాలు కనిపిస్తాయి. దీని పైన ఉన్న కామాను మీద ‘వజ్రాసనం’ చిత్తరువు ఉంటుంది. ఈ వజ్రాసనాన్ని అశోకుడు బుద్ధుడి గౌరవార్ధం చెక్కించటం జరిగింది. ఈ కారణంగా ఈ గుహను బౌద్ధ సన్యాసుల నివాసం కొరకు కేటాయించడమైనది. లోమస్ ఋషి గుహ లాంటిదే ఆంధ్రప్రదేశ్ లోని ‘గుంటుపల్లి’లో కూడా సుమారు క్రీ.పూ. 250 ప్రాంతంలో నిర్మిం చబడ్డాయి.

గుంటుపల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కామావరపుకోటకు దగ్గరలో (ఏలూరు కు 40 కి.మీ. దూరం) ఉన్నాయి. వీటిని లోమస్ రుషి నిర్మించినప్పుడే అశోకుడు ఈ రెండు గుహల సముదాయాన్ని నిర్మించాడు. ఒక్కొక్క గుహలో ఒక ‘చైత్య’ చావిడి (ప్రవేశ గది: hall), అందులో కొన్ని స్తూపాలు ఉన్నాయి. వీటి నిర్మాణం ఇంచుమించు లోమస్ ఋషి గుహను పోలి ఉంటుంది.

  1. సుధామ గుహ (Sudhama Cave)

బారాబర్ కొండ దక్షిణ భాగాన, లోమస్ రుషి గుహకు ప్రక్కన సుధామ గుహ ఉంది. ఈ గుహను ‘నిగోష’ (Nigosha) గుహ లేక ‘మర్రి చెట్టు (Banyan) గుహ’ అని పిలుస్తారు. దీనిలో రెండు గదులు ఉన్నాయి. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక గది 33 అడుగులు పొడవు 20 అడుగుల వెడల్పుతో ఉంది. రెండవ గది 20 అడుగుల వ్యాసంతో అర్ధ గోళాకారంలో ఉంటుంది. ఈ రెండు గదులకు మధ్య ఒక ద్వారం ఉంది. ఈ రెండు గుహలకు మెరుగు పెట్టినందువల్ల నున్నగా కనపడతాయి. ఈ గుహ సరంబి (లోకప్పు) ధనురాకారంలో ఉంది. గదుల గోడలను చూస్తే అత్యంత సాకేతిక నైపుణ్యంతో నిర్మించినట్లు కనిపిస్తాయి. ఈ గోడలు చదునుగా సమతలంగా, నున్నగా ఉండి అద్దం లాగా మెరుస్తుంటాయి. లోపల మాటలు ప్రతి ధ్వనిస్తాయి. ఈ ప్రతిధ్వని సన్యాసులు పాటలు పాడినప్పుడు వినసొంపుగా ఉండేటట్లు చేస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ గుహ క్రీ.పూ. 257 లో (అశోకుడు రాజుగా అయిన తరువాత 12 వ సంవత్సరంలో) నిర్మించబడింది. సుధామ గుహ లోపల విశ్రాంతి ప్రదేశంలో అశోకుడి పేరు ‘ప్రియదర్శి’ గా బ్రహ్మ లిపిలో ఈక్రింది విధంగా చెక్కబడింది.

“రాజు ప్రియదర్శి చేత ఆయన ఏలుబడిలో 12వ ఏట ఈ Banyan గుహను అజీవికలకు ఇవ్వబడినది.”

  1. కర్ణ చౌపర్ గుహ

ఈ కర్ణ చౌపర్ గుహ బారాబర్ కొండ సుధామ, లోమస్ రుషి గుహలు ఉన్న చోటే ఉత్తరం వైపున నిర్మించబడింది. ఉత్తరం అభిముఖంగా ఉన్న ఈ గుహలో ఒకే గది ఉంది. ఇది 34 అడుగులు పొడవు 14 అడుగుల వెడల్పుతో ఉండి ఈ దీర్ఘ చతురస్రాకార గది గోడలు అతి నున్నగా నగిషీతో ఉంటాయి. ఎత్తైన కప్పు ఉన్న ఈ గది గోడలు చాలా మెరుస్తూ ఉంటాయి. ఈ గుహలో ఒక పెద్ద రాతిని తొలిచి వేదికను నిర్మించటం జరిగింది. ఈ గుహ ప్రవేశ ద్వారం కుడి వైపున అశోకుడు తన పరిపాలనలో 19 వ ఏట (క్రీ.పూ. 250) దీనిని నిర్మించినట్లు ఒక శాసనం ఉంది. అశోకుడు “నేను ఈ గుహను వర్షాకాలంలో అజీ వికల సన్యాసుల ఆశ్రయం కొరకు దానం చేశాను” అని చెక్కించాడు. ఈయన ఈ గుహను ‘సుప్రియెక్షా’ (Supriyekṣā) అని నామకరణం చేయుట జరిగింది.

  1. విశ్వకర్మ గుహ

విశ్వకర్మ గుహ (విశ్వామిత్ర గుహ) ను బారాబర్ కొండ తూర్పు దిశన 100 మీటర్లు దూరంలో నిట్రం (cliff) గా ఉన్న చోట నిర్మించబడింది. ఇందులో ఒక గది మాత్రమే ఉంది. దీర్ఘ చతురస్రాకారంతో ఈ గది 14x9 అడుగుల వైశాల్యంతో గుండ్రంగా ఉంది. దీనికి విశ్వ జోప్రి (Vishwa Jhopri) కూడా అంటారు. ఇందులో అశోకుడి విరాళాలు, దానాల వివరాలు చెక్కబడి ఉన్నాయి. ఆయన ఈ గుహను క్రీ.పూ. 256 లో అజీవిక సన్యాసుల నివాసం కొరకు దానంగా ఇవ్వటం జరిగింది.

మహాబోధి, బుద్ధుడి వజ్రాసనం

సిద్ధార్ధ గౌతమ క్రీ.పూ. 531 లో బీహార్ లోని ‘గయ’ లో జ్ఞానోదయం పొందిన తరువాత 300 ఏళ్లకు (అంటే క్రీ.పూ. 259-258 లో) అశోకుడు ‘మహాభోధి’ని దర్శించి బుద్ధుడు మొదటి భోజనం తీసుకున్న చోట ఒక గుడిని నిర్మించాడు. ఈ గుడిని పైకప్పు లేకుండా కేవలం రాతి స్తంభాలతో నిర్మించడం జరిగింది. ఆ గుడి వెనక ‘బోధి వృక్షం’ (మర్రి వృక్షం) రూపులో ఇసుక రాళ్లతో ఒక ‘సింహాసం’ తయారు చేయించి దాని ని బౌద్ధులకు విరాళం ఇవ్వటం జరింగింది. ఈ సింహాసనం 200 నాపరాళ్లతో చేయబడింది. ఈ బోధి వృక్షం చుట్టూ 10 అడుగుల ఎత్తు గోడను నిర్మింపజేశాడు. ఇటువంటి చైత్యాలను అశోకుడు లుంబిని, సారనాధ్, కుశీనగర (గౌతమ బుద్ధ పరినిర్యాణం పొందిన పట్టణం) లో కూడా నిర్మించటం జరిగింది.

 

Barabar-hill-with-Sudama-and-Lomas-Rishi-caves
Photo Credit: Wikimedia Commons

బారాబర్ కొండ సర్వదిగ్దర్శనం; ఈ కొండను త్రవ్వి నిర్మించిన సుధామ, లోమస్ రుషి గుహల ముఖ ద్వారములను చూడవచ్చు.

Lomas-Rishi-entrance
Photo Credit: Wikimedia Commons

లోమస్ ఋషి గుహ ముఖ ద్వారం
Sudama-cave-entrance
Photo Credit: Wikimedia Commons

సుధామ గుహ ప్రవేశ ద్వారం
Sudama-and-Lomas-Rishi-entrances
Photo Credit: Wikimedia Commons

సుధామ గుహ ముందరి భాగం
Vivaskarma-cave-BL
Photo Credit: Wikimedia Commons

విశ్వకర్మ (విశ్వ జోప్రి) గుహ ప్రవేశ, లోపలి మార్గం

Devanampriyasa-Asoka
Photo Credit: Wikimedia Commons

బ్రహ్మ లిపిలో అశోకుడి గౌరవ వాచకం: ‘దేవనామ పియ’ (ప్రియ)
Piyadasi-in-the-Lumbini-Edict-of-Ashoka
Photo Credit: Wikimedia Commons

బ్రహ్మ లిపిలో అశోకుడి మరొక గౌరవ వాచకం: పియదర్శి (ప్రియదర్శి)

అశోకుడి గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.

మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com

****సశేషం****

Posted in December 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!