Menu Close
తెలుగు పద్య రత్నాలు 30
-- ఆర్. శర్మ దంతుర్తి --

నరకం, స్వర్గం ఉన్నాయా అనేవారికి సమాధానం ఏమిటంటే అవి ఉన్నాయా లేవో మనకి అనవసరం. ఉన్నది మన ఎదురుగా ఉండే జీవితం. దాన్ని సుఖంగా ఎవరినీ బాధించకుండా ఉంటే అదే చాలు. ఆ తర్వాత నరకం ఉంటే ఉంది లేకపోతే లేదు. పట్టించుకోనవసరం లేదు. మనకి ధనం వచ్చింది, కావాల్సిన దానికన్నా ఎక్కువగానే. దాచుకుంటామా, మిగతావారిక్కూడా ఇస్తామా? ఇస్తే – అదీ ఫలాపేక్ష లేకుండా ఇస్తే అద్భుతమైన ఫలితాలు రాబడుతుంది. అయితే ఎవరికీ ఇవ్వకుండా దాచుకుంటే అది నాలుగు విధాలుగా పోతుందిట. ఈ విషయం భర్తృహరి నీతి శతకంలో కనిపిస్తుంది.

దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య,
యోన దదాతి న భుంక్త్యే తస్య తృతీయాగతిర్భవతి భర్తృహరి నీతిశతకం. [43].

దీని అర్ధం ఏమిటంటే డబ్బు ఉన్నవాడు దాన్ని అనుభవించగలిగి ఉండాలి లేదా దానం చేయాలి. లేకపోతే మూడో విధంగా – అంటే రాజుల వల్ల (పన్నులు) గాని చోరులవల్ల (దొంగతనం) గానీ - బయటకి పోతుంది. ఎందుకలా పోతుంది అంటే లక్ష్మీదేవి చంచలమైనది. ఎప్పుడూ ఒకేచోట ఉండడం ఆవిడకి నచ్చదు. ఎందుకలా చెప్తున్నారంటే మనకి కావాల్సిన దానికంటే ఎక్కువగా ఏది వచ్చినా వదిలించుకోవాలి లేకపోతే అదో ఏడుపుకి కారణమై తీరుతుంది. ఇదే భాగవతంలో చెప్తున్నారు వ్యాసులవారు. పోతన చేసిన అనువాదం గమనించండి.

మ.
ధనవంతుండగు మానవుండు గడఁకన్ ధర్మోపకారంబులన్
ఘనతం జేయక యుండెనేని యమలోకంబందు సూచీముఖం
బను నా దుర్గతిఁ బట్టి త్రోఁచి నిధిగా పై యున్న భూతం బటం
చును బాశంబులఁ బట్టి కట్టి వడితో నొప్పింతు రత్యుగ్రులై. [5-2-161]

ధనవంతుడై ధర్మకార్యాలు, దానలు చేయకుండా ఉన్న మానవుణ్ణి పట్టుకొని యమలోకంలోని సూచీముఖం అనే నరకంలోకి త్రోసి “నిధికి కాపలా ఉన్న దయ్యమా (నిధిగా పై యున్న భూతం)” అంటూ యమకింకరులు తాళ్ళతో కట్టి (దుర్గతిఁ బట్టి త్రోఁచి) కోపంతో బాధిస్తారు. ఇలా చెప్పడానిక్కారణం మన కోసమే. ధనం పోగుచేసే కొద్దీ దాని గురించి చింత ఎక్కువౌతూ ఉంటుంది. దాన్ని దాచుకోవడానికి అనేకానేక వక్ర మార్గాలు అవలంబించవచ్చు. అయినా ధనం ఎంతని దాస్తే ‘ఇంక చాలు’ అనిపిస్తుంది? ఇంక చాలు అనిపించే విషయం ఒకటే – తిన్న భోజనం. కడుపు నిండాక ఇంక తినలేరు కనక. ధనం విషయంలో అలా అనిపించదు. ఇలా పురాణాల్లో చెప్పడానిక్కారణం ఒకటే – ప్రాపంచిక సుఖాలు సంతృప్తిని ఇవ్వలేవు. అన్నింటిని వదులుచుకున్న బుద్ధుడి సంగతి చూడండి. ఆయన గతించి దాదాపు 2500 సంవత్సరాలైంది అయినా ఆయనని ఎవరూ మర్చిపోలేదు. మరి ధనవంతుల సంగతో? ఓ యాభై ఏళ్ళు గడిస్తే వాళ్ళెవరో ఎవరికీ గుర్తుండదు. అయితే ఇచ్చే దానం ఎలా ఉండాలి? అది భగవద్గీతలో చూడవచ్చు.

దాతవ్య మితి య ద్దానం దీయతేనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ త ద్దానం సాత్త్వికం స్మృతం
య త్తు ప్రత్యుపకారార్ధం ఫల ముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం త ద్దానం రాజసం స్మృతం
అదేశకాలే య ద్దాన మపాత్రేభ్య శ్చ దీయతే
అసస్కృత మవజ్ఞాతం త త్తామస ముదాహృతం (భగవద్గీత, శ్రద్ధాత్రయ విభాగయోగం 20-22)

“దానం ఇవ్వడమనేది నా కర్తవ్యం” అనే భావంతో ప్రత్యుపకారం ఆశించకుండా పుణ్యప్రదేశాల్లో, పుణ్యకాలాల్లో పాత్రులైనవాళ్ళకి చేసేది సాత్వికమైన దానం. ప్రత్యుపకారం ఆశించో ఆముష్మికఫలం అభిలాషించో, అనిఛ్ఛాపూర్వకంగా చేసేది రాజసిక దానం. అపవిత్ర స్థానంలో, అయోగ్యులకి ప్రియవచనం అనే సత్కారాలు లేకుండా తిరస్కార భావంతో చేసేది తామసిక దానం.” అయితే ఎవరికీ ఇవ్వకుండా ధనం మొదలైన వాటిని దాచుకునే లోభి గురించి సంస్కృత సుభాషితంగా చెప్పబడే ఈ శ్లోకం ఏమంటోందో గమనించండి.

కృపణేన సమో దాతా న భూతో న భవిష్యతి,
అస్పృశన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి.

లోభి అంత గొప్పగా దానం చేసేవాడు ఎవరూ లేరుట. ఎందుకంటే ఎవరికీ ఇవ్వకుండా, తాను వాడుకోకుండా లోభి కూడబెడుతూ ఉంటాడు. అయితే వాడు పోయిన తర్వాత ఆ సంపద ఏమౌతుంది? పరులకి పోతుంది కదా? అంటే కూడబెట్టిన డబ్బుల్ని తన చేత్తోకూడా ముట్టుకోకుండా (అస్పృశన్నేవ విత్తాని) ఎవరికో దానమిచ్చేస్తున్నాడని చమత్కారం. అయితే ఇక్కడ గమనించ వల్సింది, లోభగుణం వల్ల లోభికి కీర్తీ రాదు, పుణ్యమూ రాదు.

****సశేషం****

Posted in December 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!