Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

పుస్తకానికి "ముందుమాట" ఉంటుంది, అలాగే ఉపోద్ఘాతంగా తెలుగు సాహిత్య అంతర్జాల మాస పత్రిక "సిరిమల్లె" గూర్చి రెండు ముందు మాటలతో ఈ నెల రచ్చబండ చర్చ ప్రారంభిద్దాం! మన సిరిమల్లె ఈ డిసెంబర్ 2023 సంచిక 100వది అవుతున్నది. నిజంగానే ‘వంద’ అనే మాటలో అందమైన ఓ నిండుదనం వుంది. నూరు, వంద, శతం, పదిపదులు ఎలా అన్నా ఈ సంఖ్య కున్న నిండుదనమే వేరు. క్రికెట్ లో సచిన్ నూరు కొట్టాడంటే అది ఒకప్పుడు పండగే! శతమానంభవతి దీవెనలు పొందాలని అందరూ కోరుకుంటారు. అప్పట్లో నటీనటులు, సాంకేతిక వర్గం వారు సినిమా వంద రోజులు ఆడిన సందర్భంగా సభాముఖంగా శతదినోత్సవం జ్ఞాపికను అందుకోవడం అంటే గర్వంతో పొంగిపోయేవారు. అంచేత 'వంద' అనేది ప్రగతికి, అభివృద్ధి కి పైమెట్టు. అందుకే మన ‘సిరిమల్లె’ మాస పత్రిక నూరవ సంచిక అంటే ఆనంద విపంచికే! ఎటువంటి ఆర్థిక లాభాపేక్షలేకుండా, సిరిమల్లె పత్రికను నడుపుతూ తెలుగు సాహిత్య పరిమళాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తున్న శ్రీమతి ఉమా బుడమగుంట గారు, శ్రీ మధు బుడమగుంట గారు ఎంతైనా అభినందనీయులు. ఒకటవ తారీఖు ఠంచనుగా సాహిత్యాభిమానులను అలరించే రీతిలో నూరు సంచికలు వెలువరించడం మామూలు విషయం కాదు. వీరిద్దరి నిబద్ధతకు ఇదో కొలమానం. బుడమగుంట జంటకి అభినందనలు. నూరు సంచికలతో ఒక స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న సిరిమల్లె ప్రయాణం ఇలాగే నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశిస్తూ.. మనం ఈనెల రచ్చబండ చర్చలోకి వెళ్దాం!

‘తేనెసోక నోరు తీయన యగురీతి’గా కవిత్వం వీనులవిందుగా ఉండాలంటుంది కవయిత్రి మొల్ల. అంత మధురంగానూ ఆమె తేటతెలుగులో రామాయణం రచించి వాసికెక్కింది. మొల్ల స్వస్థలం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం. చరిత్ర పరిశోధకులు ఈమె జీవించింది దాదాపు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. అయితే ఆధునిక సాహిత్యకారుల్లో అటు కవిత్వంతోనూ, ఇటు కథలు, నవలలతో తేనె వంటి మధురిమలతో పాఠకులను ఆకట్టుకున్న ప్రముఖ సాహిత్యకారులు ఒకరు ఉన్నారు - వారు మరెవరో కాదు - తన జీవితం తాలూకు అనుభవాలు, సృజనశక్తి ని ఆయుధంగా మలచుకొని సాహిత్య సృష్టి చేసి, మాతృ భాషలోనే కాదు ఇతర భాషలలో తన సాహిత్యం అనువాదం  చెయ్యబడి, అటు ఇంట - ఇటు రచ్చ రెండింటినీ గెలిచిన ప్రముఖ కవి, కథా-నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌  గారు. ఘనత వహించిన తెలుగు సాహిత్య శిఖరాలలో ప్రముఖ శిఖరంగా పేరొందిన వీరు 2015 నుండి జరిపిన మూడు అమెరికా పర్యటనలలో మూడు సార్లు కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో సందర్శించడం, ఇక్కడి స్థానిక తెలుగువారితో మమేకం కావడం, తన సాహిత్య అనుభవాలను పంచుకోవడం, వారిని తెలుగు సాహిత్య సృష్టి చేసే విధంగా ప్రేరేపించడం ముదావహం. ఈ నెల రచ్చబండ కార్యక్రమంలో వీరితో జరిగిన శాక్రమెంటో తెలుగు వాసుల ఆత్మీయ సమావేశం గురించి తెలుసుకుందాం! పనిలో పని ఈ క్రతువులో యజ్ఞఫలంగా యధావిధిగా కొన్ని సూచనలు, సలహాలు  ఉండబోతున్నాయి, ఈ ఆత్మీయ సమావేశం నిర్వాహకులకు కాదండోయ్! వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వారు చెయ్యాల్సిన పని గురించి - అయినా 'తినబోతూ రుచులు అడగటం దేనికి' సామెతను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

ముందుగా ఇనాక్ గారి గురించి మరింత పరిచయం చేసుకొని పిదప ఆయనతో జరిగిన శాక్రమెంటో తెలుగు వాసుల ఆత్మీయ సమావేశం గురించి చెప్పుకుంటే బాగుంటుంది. సమస్యల మధ్య సంస్కృతుల మధ్య నలిగే మనిషి ఎట్లా ఉంటాడో ఆయన  రచనల ద్వారా మనకు తెలుస్తుంది. ఆయన మనిషిని ఎంత గొప్పగా ప్రేమించారో ఆయన సాహిత్యం ద్వారా మనకు అర్థమవుతోంది. ఆయన రచనలు చదివాక సమాజాన్ని ఉన్నతంగా ప్రేమించారు కనుకే ఆయన రచనల్లో ఆయా పాత్రల వ్యక్తిత్వాన్ని, సంఘర్షణను సజీవంగా ఆవిష్కరించి ఆనక పాఠకుల మదిలో అద్వితీయుడుగా నిలిచారని నాకు అనిపించింది.  అహంకారం, అధికారం హద్దులు మీరితే సహనం రాను రాను అసహనంగా మారటం అనివార్యం అని ఆయన కథల ద్వారా చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఆ "అసహనాన్ని" కథాపాత్రల ద్వారా నేర్పుగా చెప్పిస్తారు, ఆ "అసహనానికి" సరైన ప్రాతిపదికను అంటే కారణాలను పాత్రల సంభాషణల ద్వారా మనకు పరిచయం చేస్తారు, మనల్ని ఆలోచింపజేస్తారు. కొన్ని రహస్య పధకాలను నేర్పుగా తన కథాపాత్రల ద్వారా అమలుచేయిస్తారు, మలుపులను నేర్పుగా సృష్టిస్తారు. తద్వారా కథాఫలాన్ని పాఠకులు ఊహించని ముగింపు ద్వారా ఆయన మనకు అందజేస్తారు. తన సాహిత్యంతో మనలను ఆలోచింపజేస్తారు.

ఇక ఆయనతో జరిగిన ఆత్మీయ సమావేశం విషయానికి వస్తే.. ఆదివారం అక్టోబర్ 29, 2023, సాయంత్రం 6 గంటలకు కాలిఫోర్నియా రాజధాని నగరమైన శాక్రమెంటో శివారు ఫోల్సం నగరంలో స్థానిక ప్రవాసాంధ్రులతో ప్రముఖ సాహిత్యకారులు పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముందుగా సువిధా ఇంటర్నేషనల్ సంస్థ అధినేత భాస్కర్ వెంపటి, శాక్రమెంటో తెలుగు సంఘం అధ్యక్షుడు ప్రేమ్ జొన్నల - సమావేశానికి విచ్చేసిన తెలుగు భాషా ప్రేమికులకు, సాహిత్య అభిమానులకు అందరికీ స్వాగతం చెప్పారు. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాక్రమెంటో తెలుగు సంఘం చైర్మన్ మనోహర్ మందడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సిరిమల్లె మాస పత్రిక అధినేత శ్రీ మధు బుడమగుంట, ఇనాక్ గారి వ్యక్తిత్వాన్ని, రచనా శైలిని చక్కటి కవిత రూపంలో వ్యక్తీకరిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఆ కవితను యధావిధిగా మీకు అందిస్తున్నాను.

వర్ణ, వివక్షల వావి వరుసలు విస్తరించిన వేళ
అణగారిన అట్టడుగు ప్రజానీకానికి పట్టెడు అన్నం కరువైన వేళ
సమాజపోకడలలో సాటి మనిషిని గుర్తించే సున్నితత్వం సమసిపోయిన వేళ
సగటు మనిషి, బానిసత్వ పోకడల భయంతో భీతిల్లిన వేళ,
‘ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే’ అని గీతలో అన్నట్లు
ఒక యోధుడు తనకు నిర్దేశించిన కార్యంతో మానవునిగా జనించాడు.
కత్తికన్నా కలం మిన్న అన్న నమ్మకంతో
తన చుట్టూ ఉన్న వాస్తవిక ప్రపంచ ఒడిదుడుకులను ఒనమాలుగా నేర్చుకుంటూ,
తన కలం యొక్క పదునును
నిజజీవన భావజాల ఆలోచనలతో అందరికీ చూపించడం మొదలుపెట్టాడు.
తన కింకర్తవ్యాన్ని స్థిరచిత్తంతో, కార్యదీక్షతో సంపూర్తిగా నిర్వర్తించాడు
అతనే నేడు మన మధ్యన కూర్చున్న ఆదర్శమూర్తి
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు.పట్టెడు మెతుకుల కోసం
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని
పల్లె పల్లెనా పడరాని పాట్లు పడుతూ
తల్లడిల్లుతున్న పవిత్రమూర్తుల
పారదర్శక వాస్తవ జీవన దృశ్యమే
తన కలానికి పదునుపెట్టే సానగా మారింది.
తన దైనందిన జీవన పోరాటమే తన భావజాలమై
అక్షరరూపం దాల్చి తనను అత్యున్నత శిఖరాన నిలిపింది.
ఇంతింతై వటుడింతై తన ఉనికిని చాటింది
ఎంతోమందికి జీవనశైలి గా అలవడింది.

వారు అలుపెరుగని, అవిశ్రాంత సాహిత్య సౌరభం.
పటిమా పిపాసి. ఛాందస వాదాల చట్రంలో చిక్కుకుని
సందిగ్దంలో కొట్టుమిట్టాడే అభాగ్యుల పాలిటి దిశానిర్దేశి.
ఆయన జీవితం చక్రం లోని అంశాలలో కేవలం పదిశాతం మనం పాటించిననూ వారిలాగే ఎల్లవేళలా మానసిక, శారీరక ధృడత్వంతో మనగలుగుతాము.”

అనంతరం భాస్కర్, ప్రేమ్, మనోహర్, నాగ్ మరియూ శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఇనాక్ గారికి ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఏండ్ల  తరబడి స్థానిక తెలుగు వారి పిల్లలకు తెలుగు విద్యాబోధన చేస్తున్న స్థానిక మనబడి, తెలుగు బడి నిర్వాహకులకు ఇనాక్ గారు తెలుగు సాహిత్య పుస్తకాలను అందజేసి వారిని అభినందించారు. దశాబ్దానికి పైగా "సిరిమల్లె" పత్రిక ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సాహిత్య పరిమళాలను వ్యాపింపజేస్తున్న "సిరిమల్లె" పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు శ్రీ మధు బుడమగుంట ను ఇనాక్ గారు అభినందించారు, అంతేకాక వారిని శాలువాతో సత్కరించి, వారికి తెలుగు సాహిత్య పుస్తకాలను ఇనాక్ గారు బహుకరించారు.

ప్రఖ్యాత తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, భారత ప్రభుత్వ “పద్మశ్రీ” మరియూ భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారి “మూర్తిదేవి” పురస్కారం గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ఆత్మీయ సమావేశం శాక్రమెంటో శివారు నగరమైన ఫోల్సం లో జరగడం ఆనందదాయకం అని మనోహర్ చెప్పారు. అనంతరం ఇనాక్ గారు మాట్లాడుతూ సమావేశానికి విచ్చేసిన ఆహుతులతో మీ అందరి అభిమానం పొందడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఇనాక్‌ మాట్లాడుతూ.. బలహీనులను పీడిస్తే ఏదో ఒకరోజు తిరగబడతారని చెప్పారు. తన సాహిత్యంలో పీడనను ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది అని ఆయన చెప్పారు. తన సాహిత్య ప్రసంగం లో మునివాహనుడు -  భక్తుడి పట్ల శ్రీ రంగనాధుడి ప్రేమ, దివంగత తెలుగు నాయకుడు ప్రఖ్యాత నటుడు కీ.శే. నందమూరి తారక రామారావు తో తనకున్న అనుబంధం గూర్చి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ అనుబంధం గూర్చి చెప్పాలంటే రెండు రోజులు పడుతుంది అని ఆయన చెప్పారు. తన సాహిత్య రచనలన్నీ సమాజంలో చోటుచేసుకున్న సంఘటనలేనని అని ఆయన తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం గూర్చి ఆహుతుల పలు ప్రశ్నలు, సందేహాలకు ఆయన సమాధానం చెప్పారు. అంతకు మునుపు స్థానిక తెలుగు బాలురు రుద్ర క్యాతం, ధృవ క్యాతం తెలుగు పద్యాలు పఠించారు. అనంతరం సత్య మొలబంతి ఆలపించిన ఘంటసాల మధుర గీతాల ఆలాపనతో ఈ సమావేశ  కార్యక్రమం ఆరంభం అయింది. వీరి ప్రతిభకు ఇనాక్ గారు ముగ్ధులు అయ్యారు. ఇనాక్ గారి చేతులమీదుగా వీరు శాక్రమెంటో తెలుగు సంఘం జ్ఞాపికలు అందుకున్నారు. ఫోల్సం నగర వైస్ మేయర్ శ్రీ చలం ఏడుకొండలు, శాక్రమెంటో తెలుగు సంఘం ఫౌండేషన్ బోర్డు సభ్యుడు శ్రీ వాసు కూడిపూడి, శాక్రమెంటో పుర ప్రముఖులు శ్రీ రమేష్ వడలి, స్వర మీడియా సంస్థ అధినేత రాజేష్ యెక్కలి కి ఇనాక్ గారు తెలుగు సాహిత్య పుస్తకాలను బహుకరించారు. శాక్రమెంటో తెలుగు సంఘం వైపునుండి వైస్ చైర్మన్ నాగ్ దొండపాటి, కార్యవర్గ సభ్యులు శ్యామ్ యేలేటి శాక్రమెంటో తెలుగు సంఘం జ్ఞాపికలు, పుస్తక బహుకరణ కార్యక్రమంను సమన్వయం చేశారు.

ప్రముఖ కవి, కథా-నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ తన అమెరికా పర్యటనలో భాగంగా ఫాల్సం రావడం, ఆయనతో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనందదాయకం అని శాక్రమెంటో తెలుగు సంఘం మాజీ  అధ్యక్షుడు రాఘవ్ చివుకుల చెప్పారు. చివరిగా భాస్కర్ మాట్లాడుతూ .. స్థానిక ఫాల్సం నగర గ్రంధాలయం ప్రాంగణంలో తెలుగు పుస్తక విభాగానికి నడుం కట్టడం జరిగింది అని, తమ వంతుగా సహాయ సహకారాలను అందించాలని ఆహుతులకు విజ్ఞప్తి చేశారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గం సభ్యులు రంగా తాడిపర్తి, రాజేష్ యెక్కలి, మాధవి క్యాతం తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకారం అందజేశారు. స్థానిక రుచి రెస్టారెంట్ వారు పసందైన భోజనాన్ని ఆహూతులకు అందించారు. శాక్రమెంటో తెలుగు సంఘం వైస్ చైర్మన్ ఉపాధ్యక్షుడు సందీప్ గుడిపెల్లి వందన సమర్పణ చేశారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు ఇటువంటి ఆత్మీయ సాహిత్య సమావేశాలు తరచూ జరుగుతూ ఉండాలని ఆకాంక్షించారు.

ఘనత వహించిన తెలుగు సాహిత్యంపై  ప్రవాసాంధ్రులకు కొంతైనా అవగాహన కల్పించడమే దిశగా ఈ కార్యక్రమం పురోగతి సాధించింది అని ఈ సమావేశ నిర్వాహక కార్యవర్గ సభ్యుడిగా నాకు అనిపించింది. శాక్రమెంటో తెలుగు సంఘం కు ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ కొత్త కాదు, అయితే సహా నిర్వాహక సంస్థగా సువిధా సంస్థ ముందుకురావడం, సమావేశానికి దాదాపు యాభై మంది స్థానిక తెలుగు వారు రావడం, వారు సమావేశం చివరివరకు ఆసక్తిగా పాల్గొనడం నాకు ఆనందాన్ని కలిగించింది.

అమెరికాలో పలు తెలుగు సంస్థలు రెండేండ్లకోసారి కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న మెగా సదస్సుల్లో సాహిత్యానికి తగిన ప్రాముఖ్యత లభించడం లేదని నా మిత్రుడు ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. సినీ సెలెబ్రెటీస్ కు, రాజకీయ నాయకులకు ఈ మెగా సదస్సులలో లభించినంత గౌరవం, ఆదరణ సాహిత్యకారులకు లభించకపోవడం దురదృష్టకరం. అయితే ఈ విషయంలో నిర్వాహకులదే పూర్తి బాధ్యత అని అనలేము, సినీ సెలెబ్రెటీస్, రాజకీయ నాయకుల  చుట్టూ తిరగడానికి, వాళ్ళను చూడడానికి  ఎగబడుతుంది ఎవరు? మనం కాదా? మనం కోరుకునేదే మెగా సదస్సు నిర్వాహకులు మనకు అందిస్తున్నారు! కదా! కాబట్టి  సదరు మెగా సదస్సు నిర్వాహకులను ఆడిపోసుకోవడంకంటే మన ఆలోచనా దృక్పథంలో కాసింత మార్పు ఆశించడం సబబేమో? ఆలోచించండి పాఠకులారా! నువ్వేడివోయ్! బోడి, పెద్ద అంతా నీకు తెలుసు అన్నట్లు మాట్లాడుతున్నావు అని అంటారా? సరే! ఏడు - ఎనిమిది ఏండ్ల క్రితం  కాలిఫోర్నియాలో జరిగిన ఒక మెగా సదస్సుకు వెళ్లిన  ఆహుతుడిగా నా అనుభవం ఇది! నా మిత్రుడి అనుభవం కూడా చెప్పాను కదా! పోనీ మీకు తెలిసినవారు ఎవరైనా వెళ్ళి ఉంటే వారినడగండి! విషయం అర్థం అవుతుంది! చివరిగా ఎక్కడో ఫోల్సం నగరంలో రెండు సంస్థలు నడుంకట్టి - రెండు వారాల కొద్ది  సమయంలో యాభై మందిని కూడగట్టి, దాదాపు మూడు గంటలపాటు ఒక సాహిత్య సమావేశాన్ని జరిపినప్పుడు, జాతీయ స్థాయిలో ఇంతకు ఐదింతలు పదింతలు ఆహుతులను కూడగట్టడం ఎందుకు సాధ్యంకావడం లేదు? మెగా సదస్సు నిర్వాహకులారా - కాస్త ఆలోచించండి!

ఈ 2023 ఆంగ్ల సంవత్సరానికి ఇది చివరి రచ్చబండ, మీరందరూ నెలనెలా ఈ చర్చా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు అని భావిస్తూ, సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు తెలియజేసుకుంటూ...ఎప్పటిలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో మీ  స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ..  వచ్చే నెల నూతన ఆంగ్ల సంవత్సరం రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం. -- నమస్కారములతో, మీ వెంకట్ నాగం.

********

Posted in December 2023, వ్యాసాలు

1 Comment

  1. GSS Kalyani

    కార్యక్రమ విశేషాలను కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ధన్యవాదాలు వెంకట్ గారు!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!