Menu Close
Ghali-Lalitha-Pravallika
కొలిమి (ధారావాహిక)
-- ఘాలి లలిత ప్రవల్లిక --

"ఉదయం నిద్ర లేచాక ఈరోజు నీ కూతురు బారసాల పిల్లను తయారుచేసి నువ్వుతయారవు‌." అని ప్రణవి తోటి కోడలు రాణి చెబితే తన కూతురు బారసాలను కూడా తన దగ్గర రహస్యంగా దాచారని బాధపడింది.

ఏం పేరు పెడతారో కూడా చెప్పలేదు. బంధువులు ఎవరినీ పిలవలేదు. రాజన్ ఆఫీస్ వాళ్లు ఒకళ్ళో ఇద్దరో వచ్చారు అంతే.

వాళ్ళిష్ట ప్రకారమే పిల్ల నామకరణం జరిగిపోయింది. ప్రణవికి కూడా కూతురు పేరు బియ్యంలో రాస్తుంటే తెలిసింది. అన్నప్రాసన కూడా అప్పుడే చేసేశారు.

ప్రణవి ఆ ఇంట్లో ఒక మర మనిషి.

"ఇదిగో అమ్మాయి సిర్లాక్ లూ అవి కొనాలంటే కష్టం. పిల్లకి అన్నం అలవాటు చెయ్" అన్నాడు రాజన్.

"చద్దన్నం పెట్టు ఏం కాదు. చలవ చేస్తుంది" అంటూ చద్దన్నం పసిపిల్లకు పెట్టటానికి ఇచ్చేది ప్రణవి అత్త. నోరిప్పి మాట్లాడటానికి లేదు. వారు ఏది చెప్తే అది చేయడమే. అలా ఉన్నా కూడా సరిగ్గా చూసుకునేవారు కాదు ప్రణవిని.

మళ్ళీ నెల తప్పింది ప్రణవి. మునుపు లాగానే మూడోనెల రాగానే ఇంట్లోంచి గెంటేశారు.

"నాకు అక్కర్లే నేను ఏలుకోను. ఆ పిల్ల మాతో కలవలేదు. చదువుకున్నాననే అహంభావం. వదినని అమ్మని ఇంగ్లీషులో తిడుతుంది." ఇది జంబేష్ వర్షన్.

అసలే ప్రణవికి నోరు తక్కువ. ఈ బాధలకు మనస్సు కూడా మూలిగి మూలకూర్చొంది. అసలు ఎప్పుడైనా అరాకొరా మాట్లాడినా అచ్చ తెలుగులో మాట్లాడేది. అలాంటిది ఈరకమైన నింద మోసింది.

ప్రణవికి మస్తు మానసిక క్షోభ. తప్పు చేయకుండా, అసలు ఎందుకు తనను బాధ పెడుతున్నారో తెలియకుండా బాధపడటం అంటే చాలా నరకం.

పాపం ప్రణవి కి కడుపుతో ఉన్నంత కాలం ఈ కాపురం ఏమవుతుందో అన్న దిగులే. కొడుకు పుట్టాడు. ఇప్పుడూ అంతే వాడిని చూడటానికి వాళ్ళు ఎవరు రాలేదు. బంధువులకి చుట్టుపక్కల, ఏం సమాధానం చెప్తారు? పాపం ఆ పిల్లవాడి మొహాన్న బారసాల లేదు ఏమి లేదు. బాగా ఆప్తులు ప్రణవి సంసారం గురించి తెలిసినవాళ్లు... ‘పిల్లను పంపక. వాళ్లకు అలుసుగా ఉంది. వాళ్లే వచ్చి తీసుకెళ్తారు ఉంచు’ అని గిరిజ కు సలహా ఇచ్చారు.

గిరిజ అలాగే ప్రణవిని అత్తారింటికి పంపడం మానేసింది.

"మేఘం ఉంటే కదా వాన పడటానికి. కరుడుగట్టిన మూర్ఖులలో మానసిక పరివర్తన రాదు కదా! వాళ్ళేం వస్తారు పిల్లనేం తీసుకెళ్తారు." అనుకొంది తాయారు.

షరామాములే. ఫోన్లు లేవు, ఉత్తరాలు లేవు, వాళ్ళు రాలేదు. వీళ్ళు ఫోన్లు చేసిన వాళ్ళు ఎత్తేవారు కాదు.

ఎవరన్నా మాట్లాడదాం అని వెళితే తాళాలు వేసుకుని వెళ్లిపోయేవారు. మాట్లాడే అవకాశం ఇచ్చేవారు కాదు. గట్టి యాక్షన్ ఏదైనా తీసుకుందామంటే ప్రణవి అడ్డుపడేది. మొత్తానికి ప్రణవి లాంటి భార్య దొరకడం వాళ్ళ అదృష్టం అయితే జంబేష్ లాంటి భర్త దొరకటం ప్రణవి దురదృష్టం.

వాళ్లు రాకపోవడంతో సంవత్సరం నిండిపోతుందని ప్రణవిని బిడ్డలను అక్కడ దించేసి వచ్చారు గిరిజవాళ్ళు. తల్లి బిడ్డ బాధ్యతలు వారు స్వీకరించ లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లు ఉండేవారు. ప్రణవి, పిల్లలూ ఏమన్నా అడిగితే మా మాట వినలేదు మాకు అక్కర్లేదు అనేవారు.

సనాతనభావాలతో పెరిగిన ప్రణవి భర్తను వదిలేసి ఉండలేక...వాళ్ళు ఎలా చెబితే అలా విన్నా వినలేదనే అనేవారు.

ప్రణవికి తెలియకుండా ఇంటి విషయాలు చాలా జాగ్రత్త పడేవారు. చివరికి ఆమె భర్తఫోన్ కూడా ముట్టుకోకూడదు.

ప్రణవి ఇచ్చిన కట్నం డబ్బుతో వాళ్ళు వ్యాపారం పెట్టారు. కానీ అక్కడికి కూడా ప్రణవి కి నో ఎంట్రీ.

అసలు ఎక్కడుందో? ఎలా ఉంటుందో? కూడా తెలియనివ్వలేదు. రాణి మాత్రం వాళ్ళతో కలిసి వెళ్ళేది. వ్యాపారం కలిసొచ్చింది. బాగా డబ్బు సంపాదించుకున్నారు.

ప్రణవి తోటికోడలు ఒంటినిండా నగలే బీరువా నిండాపట్టుచీరలే ఆమెకు. ప్రణవీకి మాత్రం పుట్టింటివారు కొన్నవే.మరి పెళ్ళిలో ఉన్న సమానత్వం ఇప్పుడు ఏమయ్యిందో? అడిగే సాహసం చేయలేదు ప్రణవి.

జంబేష్ ఉద్యోగం చేసి ఆ జీతం వాళ్ళకే ఇచ్చి రాత్రి 12వరకూ వ్యాపారంలో సాయం చేసినా జంబేష్ కుటుంబం రాజన్ ఇంట్లో ధర్మానికున్నట్లే వారు భావించే వారు.

ఓరోజు అకారణంగా

"నా ఇంట్లో మీరు ఉండటానికి వీల్లేదంటూ ప్రణవిని పిల్లలను గెంటేశారు.

నేను అన్నయ్య ఇంట్లో ఉంటున్నాను వేరే ఇల్లు తీసుకున్నప్పుడు వద్దుగానీ వెళ్ళిపో అంటూ జంబేష్ .

వెళ్ళను ఇక్కడే ఉంటాను అన్న ప్రణవి ఒకరెక్క జంబేష్, మరో రెక్క రాజన్ పట్టుకుని గెంటేశారు. పిల్లలు కాళ్లకు చుట్టుకునే ఏడుస్తున్నా పట్టించుకోలేదు.

ప్రణవి పెట్టెను కూడా గిరవాటేసేసారు బయటకి.

ఈ భాగోతాలన్నీ. చూస్తున్న హౌస్ ఓనరు...

"నువ్వు చదువుకున్నావు కదా! ఎందుకిలా బాధలు పడుతున్నావ్. ఒక్కమాట కూడా వాళ్లను అనవు. పద మేమంతా వస్తాం పోలీస్ కంప్లైంట్ ఇవ్వు." అంటూ ప్రణవితో అంది.

"వద్దండీ మాకు అలాంటివి అలవాట్లు లేవు. వాళ్లే మారుతారు లెండి." అంది ప్రణవి.

"వాళ్లేంమారతారు వాళ్ళు మారాలంటే వాడికి పుట్టిన పిల్లల్ని వాళ్ళింట్లో వదిలేసి నువ్వు వెళ్తే. అప్పుడు మారే అవకాశం ఉంటుంది." అంది ఆవిడ.

"అమ్మో పిల్లల్ని వాళ్ళు సరిగ్గా చూడరు. మధ్యలో పిల్లలు ఇబ్బంది పడతారు. వద్దు నా దగ్గరే ఉంచుకుంటాను"అంది.

"సరే అయితే ఇక్కడే ఉండు. వాళ్ళ ఇంట్లోకి రానివ్వకపోతే నా ఇంట్లో ఉండు. ఉద్యోగం తెచ్చుకొని ఇక్కడే ఉండు. మేమంతా నీకు సపోర్టుగా నిలబడతాం. నాకు నువ్వు అద్దె కూడా ఇవ్వక్కర్లేదు". అని చెప్పింది హౌస్ ఓనర్.

"వద్దండి అలా చేస్తే వాళ్లు బాధపడతారు". అంటూ ప్రణవి పిల్లల్ని తీసుకుని అవస్థ పడుతూ వెళ్ళిపోయింది. తర్వాత గిరిజా వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా రాజన్ నాకు తెలియదు అంటూ జంబేష్ కి ఇచ్చేవాడు.

"నాకు అక్కర్లేదు. ఇంట్లో వాళ్ళతో కలవలేదు. వేరే ఉండాలంటోంది. దీనిని పెళ్ళి చేసుకున్నందుకు నావాళ్ళను వదిలి రావాలా? నా కక్కరలా ...నేనేలుకోను "అని ఫోన్ కట్ చేసేవాడు.

ప్రణవి ఎప్పుడూ వేరు పడదాం అని అడగలేదు. అసలు ఆ భార్య భర్తలు ఎప్పుడు మాట్లాడుకున్నారు కనుక. అనని మాటలు అన్నీ అంది అంటూ చెప్తూ ఉంటే ఇంకా బాధపడిపోయేది ప్రణవి.

ప్రణవి "ఉమ్మడికుటుంబం అందరం కలిసీమెలిసీ సరదాగా ఉండొచ్చు." అన్న కారణంతోనే జంబేష్ ను పెళ్లి చేసుకుంది. అలాంటి ఆమె మనస్తత్వాన్ని వక్రికరించి ఈవిధంగా ప్రచారం చేస్తుంటే... కుమిలిపోయింది.

ఎందుకో ఆ రోజు నూర్జహాన్ గుర్తుకు వచ్చింది ప్రణవికి.

"ఏమైందో ఏమో పెళ్లయిన తర్వాత నా బాధల్లో పడి తన గురించి పట్టించుకోలేదు. రేపు ఫోన్ చేసి కనుక్కోవాలి.” అనుకొంది.

మర్రోజు నూర్జహాన్ నుంచి ఫోన్ వచ్చింది. ఇదేనేమో స్నేహమంటే తలుచుకోగానే...జరిగిపోవడం అనుకుంటూ

"నీకు నూరేళ్ళ ఆయుషు నీకు ఫోన్ చేయాలని అనుకున్నాను నువ్వే చేసావ్ .ఎలా ఉన్నావు? ఏంటి ?" అని అడిగింది ప్రణవి.

"నాకే బ్రహ్మాండంగా ఉన్నా మహమ్మద్ నన్ను  బాగా చూసుకుంటున్నాడు." చెప్పింది నూర్జహాన్.

"నువ్వు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నావ్ కదా. మరి మహమ్మద్ అంటున్నావు ఏంటి?" అనుమానంగా అడిగింది ప్రణవి.

"ఓ అదా... మూర్తి నాకోసం మతం మార్చుకున్నాడు. ఇప్పుడు తన పేరు మహమ్మద్. మూడు పూటల నమాజు చేస్తాడు." చెప్పింది నవ్వుతూ.

ప్రణవి మనసులో ఎన్నో అనుమానాలు. నీ ప్రేమ పెళ్లిళ్లలో మతమార్పిడులు ఏమిటి? అలా అదే మతం వాళ్ళు కావాలి అని అనుకున్నప్పుడు. వాళ్ళ మతం వాళ్ళనే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా! అనుకుంది.

"ఏయ్ పాత చింతకాయి. నీ గురించి చెప్పు ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? ఎంతమంది పిల్లలు" అడిగింది నూరి.

ప్రణవి తనగురించి చెప్పింది.

"మరి అలా ఉంటే అలాగే జరుగుతుంది నోరిప్పి ఏక్టివ్ గా ఉండాలి. నిన్ను చూస్తే వాళ్ళు భయపడాలి. అలా ఉంటేనే నీకు ద్రోహం చేయరు. ఇలా పప్పు సుద్దలా వాళ్ళు ఏమనుకుంటారో?...వీళ్ళు...?అని ఆలోచించబట్టే నువ్వేమనుకుంటావో అన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఒకరోజు పిల్లల్ని తీసుకుని మా ఇంటికి రా. చాలా విషయాలు మాట్లాడాలి నీతో" అంది నూర్జహాన్.

గిరిజ గాలి మార్పుగా ఉంటుంది వెళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికి అని పంపించడంతో నూర్జహాన్ ఇంటికి వెళ్ళింది ప్రణవి.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in December 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!