విజయనగర సామ్రాజ్య అంత్య దశ
:: 2 ::
రామరాయలి పరిపాలన:- ఫెరిస్తా రామరాయలు సామ్రాజ్యానికి నమ్మకస్తులుగా ఉన్న అనేక మందిని పదవుల నుండి తొలగించి వాటిని తన బంధువర్గంతోనూ, నమ్మకస్తులతోను భర్తీ చేశాడని రాశాడు.
రెండవ దేవరాయలి కాలం నుండీ ముస్లింలను సైన్యంలో చేర్చుకుంటూ వస్తున్నప్పటికీ, ఎన్నడూ కీలకమైన పదవులు అప్పగించలేదు. రామరాయలు ఈ పద్దతిని మీరి ముస్లింలకు కీలకమైన బాధ్యతలు అప్పగించడంతో వారికి రాజ్య వ్యవహారాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే వీలు చిక్కింది.
మరీ ముఖ్యంగా రామరాయలు అవకాశం చిక్కినప్పుడల్లా ముస్లిం సుల్తానుల సంబంధాలలో కలుగజేసుకునేవాడు. వారి మధ్య ఉన్న కలహాలను ఆసరాగా చేసుకుని తాను బలపడాలని ప్రయత్నించేవాడు. ఈ పద్ధతి వల్లే తామందరూ ఐక్యమవ్వాలన్న భావన ముస్లిం సుల్తానులకు కలిగింది. ఫలితమే రక్షసి-తంగ్డి యుద్ధం.
సదాశివరాయలి పట్టాభిషేకానంతరం రామరాయలు దక్షిణాదిపై దృష్టి సారించ వలసి వచ్చింది. రామరాయలి ప్రత్యర్ధులు అతనికి లభించిన అధికారాన్ని జీర్ణించుకోలేక చంద్రగిరికి దక్షిణంగా ఉన్న ప్రాంతంలో తిరుగుబాట్లు లేవదీశారు.
ట్రావెన్కోర్ సంస్థానాధీశులు తిరుగుబాటు చేశారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ నేతృత్వంలోని క్యాథలిక్ మిషినరీలు మలబార్ ప్రాంతంలోని ప్రజలను ప్రలోభాలకు లోనుజేస్తూ మతమార్పిడులకు పాల్పడసాగారు. దేవాలయాలను కూలగొడుతూ చర్చిలను నిర్మించసాగారు. పోర్చుగీసు గవర్నర్ కాంచీపురంలోని దేవాలయాలను కొల్లగొట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పాలెగాళ్ళు, సామంతులు అసూయాద్వేషాలతో పోర్చుగీసులతో మంతనాలు జరుపుతుండడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దుటకు రామరాయలు తన దాయాది చినతిమ్మకు పెద్ద సైన్యాన్నిచ్చి దక్షిణాదికి పంపించాడు.
చినతిమ్మ ముందుగా చంద్రగిరిలోని తిరుగుబాటును అణచివేసి తమిళ దేశంలోకి ప్రవేశించి భువనగిరి కోటను పట్టుకున్నాడు. తీర ప్రాంతం గుండా పయనించి, కావేరి నదిని దాటి నాగోర్ రేవును చేరుకున్నాడు. అక్కడ క్యాథలిక్స్ నాశనం చేసిన రంగనాథ ఆలయాన్ని పునరుద్ధరించాడు. కయట్టార్, ట్యుటికోరిన్ సంస్థానాధీశులను ఓడించి అధికారం నుండి తొలగించబడిన పాండ్యులకు తిరిగి అధికారం అప్పగించాడు. తదుపరి ట్రావన్కోర్ కు చెందిన ఐదు తిరువదుల సైన్యాన్ని ఓడించి వేశాడు. పద్మనాభ స్వామి దర్శనం చేసుకుని కేప్ కమోరిన్ లో విజయ స్తంభాన్ని ప్రతిష్టించాడు. జయించిన భూభాగానికి తన తమ్ముడు విఠలుడిని సంరక్షకుడిగా నియమించి రాజధాని చేరాడు.
పొర్చిగీసు వారితో రామరాయలు స్నేహ సంబంధాలే కొనసాగించినప్పటికీ 1542 లో గోవా గవర్నర్ గా వచ్చిన మార్టిన్ ఆల్ఫోన్సో డిసౌజా భత్కల్ కోటను ముట్టడించి స్నేహ సంబంధాలను దెబ్బ తీశాడు. మార్టిన్ తరువాత గవర్నర్ గా వచ్చిన జోవో డి క్యాస్ట్రో తో 1547 లో రామరాయలు సంధి కుదుర్చుకున్నాడు. దాంతో గుఱ్ఱాల దిగుమతిపై గుత్తాధిపత్యం సాధించాడు. 1558 వరకు పోర్చుగీసులతో స్నేహ సంబంధాలే కొనసాగి శాంతి నెలకొనింది. కానీ రోమన్ క్యాథలిక్ సన్యాసులు ఆలయాలను కొల్లగొట్టి, కూలగొట్టి అపార ధనం దోచుకున్నారని ఫిర్యాదులు రావడంతో రామరాయలు శాంథోమ్ పై దాడి చేశాడు. అదే సమయంలో తన దాయాది విఠలరాయడితో గోవాపై కూడా దాడి చేయించాడు. ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ పోర్చుగీసులు మలబార్ తీరం వెంబడి దాడులు, కొల్లగొట్టడాలు కొనసాగించారు.
ఇక ముస్లిం రాజులతో సంబంధాల విషయానికి వస్తే, రామరాయలు బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ నవాబుల మధ్య కలహాలు రేపి, ఒకరినొకమారు ఇంకొకరిని వేరొకమారు బలపరుస్తూ గందరగోళం వ్యాపింపజేశాడు. ఈ విధానమే రామరాయలి పతనానికి కారణమయ్యింది.
తదుపరి భాగంలో రక్షసి-తంగ్డి (తాళికోట) యుద్ధం గురించి !!!