“విజయనగర జమీందారు చెల్లించవలసిన పేష్కస్ పెంచడానికి, అతని సైనిక బలాన్ని తగ్గించడానికి, అతడి నుండి ఎనిమిదిన్నర లక్షల పేష్కస్ బకాయిలను వసూలు చేయడానికి ఆంగ్లేయులు ప్రయత్నించారు. తాను వారికి ఋణపడలేదని అతడు ఋజువు చేసినప్పటికీ ఆంగ్లేయులు 1793 ఆగస్టు 2 న విజయనగరాన్ని ఆక్రమించారు. రాజ్యంలోని రైతులు ఆంగ్లేయులకు భూమి శిస్తు చెల్లించడానికి నిరాకరించారు. అందువలన ఆంగ్లేయులు చిన విజయరామరాజును నెలకు 1200 రూపాయల పింఛనుతో మచిలీపట్నానికి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. దానిని లెక్కచేయకుండా రాజు విజయనగరం, భీమునిపట్నం మధ్యనున్న పద్మనాభం చేరాడు. ఆంగ్లేయుల సేనలు చిన విజయరామరాజును ముట్టడించి యుద్ధంలో ఓడించి వధించాయి.” చెప్పాడు గోవిందరాజులు.
“అదేంటి అంత తక్కువ సమాచారం? విపులంగా చెప్పండి నాన్నగారూ” అసంతృప్తిగా అడిగాడు వరదరాజులు.
“సరే వివరంగా చెప్తాను. కానీ రోజంతా మల్లిఖార్జున మన ఇంట్లో ఉండిపోతే వారింట్లో వారు వెతుక్కోరూ?” అడిగారు గోవిందరాజులు.
“లేదండీ. ఇవాళ గ్రంధాలయంలో తాళపత్రాల పరిశీలన ఉందని చెప్పి వచ్చానండి. సాయంత్రం ఇంటికి వెళ్తానండి.” చెప్పాడు మల్లిఖార్జున.
“అలా అయితే ఇబ్బంది లేదు. శ్రద్ధగా వినండి.” చెప్పడం ప్రారంభించారు గోవిందరాజులు.
“ఒప్పందం ప్రకారం చెల్లించవలసిన కప్పాన్ని ఇంకాస్త పెంచి అదనంగా చెల్లించాలని, సైన్యం సంఖ్య తగ్గించుకోవాలనీ విజయనగర పాలకుడు చిన్నవిజయరామరాజును బ్రిటీష్ వాళ్ళు డిమాండ్ చేశారు. బ్రిటీష్ వాళ్ళు బకాయిలుగా డిమాండ్ చేస్తున్న లక్షా యాభైవేల పెస్కాలను తాను చెల్లించవలసిన అవసరం లేదని, ఒప్పందం ప్రకారం చెల్లించిన వలసి కప్పం మొత్తం ఇప్పటికే చెల్లించానని, సైన్యం సంఖ్య ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించబోనని బ్రిటిషర్లకు విజయరామరాజు గట్టిగా సమాధానమిచ్చాడు. దాంతో ఆగ్రహించిన బ్రిటీష్ వారు విజయనగరాన్ని అక్రమించారు. విజయనగరం నుంచి చిన్న విజయరామరాజు పద్మనాభం ఊరికి మకాం మార్చాడు. మద్రాస్ గవర్నర్ సర్ చార్లెస్ ఓక్లే తరపున కల్నెల్ పెండర్గస్ట్ బ్రిటీష్ సైన్యానికి నాయకత్వం వహించాడు. పద్మనాభం వద్ద మకాం వేసిన చిన్న విజయ రామరాజుపై దొంగదెబ్బ తీయడానికి పథకం రచించాడు.
అంతకు ముందు కొండూరు యుద్ధంలో ఫ్రెంచివారిని తుదముట్టించిన చరిత్ర సొంతం చేసుకున్న విజయనగర రాజులు అదే స్ఫూర్తితో బ్రిటీష్ వారిపై కూడా పోరుకు సిద్ధమయ్యారు. అనంత పద్మనాభ స్వామి సన్నిధి లోనే వ్యూహరచన చేసి పోరుబాట పట్టారు. విజయనగర రాజుల తిరుగుబాటు సమాచారాన్ని తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం కలవరపాటుకు గురయింది. దీన్ని అణిచివేసేందుకు 1794 మే 29వ తేదీన కల్నల్ ఫ్రెండర్ గార్డు నేతృత్వంలోని అయిదు కంపెనీల సైన్యాన్ని భీమిలి ప్రాంతంలో మోహరించింది. యుద్ధమో, మద్రాస్ వెళ్ళేందుకు సిద్ధమవడమో తేల్చుకోవాలన్న బ్రిటిష్ సైన్యం ఆదేశాలను చిన్న విజయరామరాజు ధిక్కరించాడు. తన నాలుగువేల సైన్యంతో పద్మనాభం వద్ద యుద్ధానికి సిద్దమయ్యాడు.
చిన్న విజయరామరాజు ఒకవైపు బ్రిటీష్ దౌత్యవేత్తలతో రాయబారం నడుపుతూ, సామరస్య పూర్వక పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే అర్ధరాత్రి వేళ దాడికి బ్రిటీష్ వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు. గాఢనిద్రలో ఉన్న విజయనగరం సైన్యంపై బ్రిటిష్ మూకలు దాడిచేసి భయభ్రాంతులకు గురిచేశారు. పరిస్థితిని అంచనా వేసిన చిన్న విజయరామరాజు తన వెంట వచ్చిన సైన్యంతో కలిసి తెల్లదొరలపై జూలై పదవ తేదీన పోరాడాడు. అయితే విజయనగరం సైనికుల్లో ఒకడు శత్రుసేనానితో చేతులు కలపడంతో దొంగదారిలో వచ్చి తెల్ల దొరలు కురిపించిన గుండ్ల వర్షానికి చిన విజయరామరాజుతో పాటు సుమారు మూడు వందల మంది సైనికులు, సామంత రాజులు నేలకొరిగారు. వీరి తిరుగుబాటు తెల్లవారి వెన్నులో వణుకు పట్టించింది. అంతేకాకుండా తర్వాత తరాలకు తర్వాత జరిగిన అనేక ఉద్యమాలకు ఊపిరిగా, ఉత్తేజంగా నిలిచింది.
చిన విజయరామరాజు చనిపోయిన తరువాత అతని కుమారుడైన నారాయణబాబు మక్కువ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడి కొండ దొరలు, సర్దారులు అతనికి అండగా నిలిచారు. చివరికి అతడు బ్రిటిష్ వారికి 5 లక్షల పేష్కస్ చెల్లించడానికి అంగీకరించి రాజీ చేసుకున్నాడు.
ఆంగ్లేయులు విజయనగరాన్ని ఆక్రమించిన తరువాత కారాగారంలో బంధింపబడిన జమిందారులకు విముక్తి కలిగించారు. వారి భూములను వారి ఆధీనం చేసి వారితో ప్రత్యేక ఒడంబడికలు చేసుకున్నారు. క్రీ.శ. 1802లో వారి జమీనులకు శాశ్వత శిస్తు నిర్ణయ విధానం అమలు జరుపబడింది.
విజయరామరాజు సంస్మరణ దినాన్ని ఏటా పద్మనాభయుద్ధ ఘటనగా నిర్వహించుకోవడం ఉత్తరాంధ్రలో ఆనవాయితీగా వస్తున్నది.”
“చూసారా ఒక రాజు విదేశీయుల సాయంతో స్వదేశీయుల మీద దాడి చేస్తే, అదే వంశానికి చెందిన మరో రాజు స్వదేశీయులను కూడగట్టుకొని విదేశీయుల ఆక్రమణలను అడ్డుకోజూచాడు. విచారకరమైన విషయం ఏమిటంటే గెలిచిన వాడు మృత్యువు పాలయ్యాడు. ఓడినవాడు అమరుడయ్యాడు. కానీ విదేశీయుల మీద దాడి చేసిన వారు ఎప్పుడూ కీర్తి శేషులయ్యారు.” వివరించాడు గోవిందరాజులు.
“అవును గురువుగారు, నేటికి కూడా విదేశీయుల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి వీర చరిత్రలు మనలో పౌరుషాల్ని పెంచుతాయి. నేను మళ్ళీ రేపు వస్తాను గురువు గారు. పలనాటి వీర చరిత్ర కూడా విన కుతూహలంగా కూడా ఉంది” చెప్పాడు మల్లిఖార్జున.
“తప్పకుండా రా మల్లిఖార్జున. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలో తప్పులేదు.” చెప్పాడు గోవిందరాజులు.
“నాన్నగారు, నేను మల్లిఖార్జున ను దిగబెట్టి వస్తాను” చెప్పాడు వరదరాజులు.
“జాగ్రత్తగా వెళ్ళిరండి” చెప్పారు గోవిందరాజులు.
***
“వరదా! మీ ఇంట్లో ఎంత విజ్ఞాన సంపద ఉంది? నీవు ఎంతటి అదృష్టవంతుడివి.” అన్నాడు మల్లిఖార్జున.
“అవును మల్లిఖార్జున. బహుశా నాలుగైదు తరాలుగా మా ఇంట్లో ప్రాచీన గ్రంథాలు, తాళపత్ర గ్రంధాలు సేకరించి భద్రపరుస్తూ ఉండి ఉండవచ్చు. అవి ఈనాటికి భాండాగారమయ్యింది. నేను వాటిని సంరక్షించి, తర్వాతి తరాలకు అందజేయాలి. కేవలం గ్రంధాలుగా మాత్రమే కాకుండా వాటన్నిటినీ వీలువెంబడి పఠించాలి. విజ్ఞానాన్ని కూడా అందించాలి.” చెప్పాడు వరదరాజులు.
“అవును వరదా. మనం విజ్ఞానాన్ని, ముందు తరాల వారికి అందించాలంటే పుస్తకాలను భద్రం చేయాలి.” అంగీకరించాడు మల్లిఖార్జున.
“సరే మల్లిఖార్జున… నేను ఇక వెనుదిరుగుతాను. నువ్వు రేపు ఉదయాన్నే వచ్చెయ్. మరొక ఆసక్తికరమైన విషయం నేర్చుకుందాం” చెప్పాడు వరదరాజులు.
“పలనాటి యుద్ధం విశేషాలు వినాలని కుతూహలంగా ఉంది నాకు” అన్నాడు మల్లిఖార్జున.
“సరే అవే విందాం” మల్లిఖార్జున భుజం తట్టి, వెనుదిరిగాడు వరదరాజులు.
***
“నాన్నగారూ, మల్లిఖార్జునకు మన ఇంట్లో ఉన్న గ్రంధాలయం చాలా నచ్చింది.” చెప్పాడు వరదరాజులు.
“పుస్తకాలు నాగరిక జీవన వికాసాలు వరదా. గ్రామాలలో సాధారణంగా మౌఖిక సాహిత్యం ప్రచారంలో ఉంటుంది. ఒకరి నుండి మరొకరు విని నేర్చుకుంటారు. కోలాటం పాటలు, లాలి పాటలు, జోల పాటలు, మంగళహారతి పాటలు, నోము పాటలు, పెళ్లి పాటలు, అట్లతద్దె పాటలు, శ్రామికుల పాటలు, వేడుక పాటలు, పిల్లల పాటలు ఒకరి నుండి మిగతావారు నేర్చుకునేవే.
అలాగే పెద్దలు చెపితే పిల్లలు వినే జానపద కథలు, అద్భుత కథలు, సాహస కథలు, జంతువుల కథలు, ఇంటి కథలు, దెయ్యం కథలు, సాంఘిక కథలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపాఖ్యానాలు మొదలైనవి కూడా మౌఖిక సాహిత్యం గానే ఉండేవి.
అలాగే రోజువారీ వ్యవహారంలో సామెతలు, పొడుపుకథలు, సూచనలు, హాస్యాలు, వినోదాలు వంటివి కూడా ఒకరి నుండి మరొకరు విని తెలుసుకున్నవే.
జానపద నాటకాలు, వీధి భాగోతం, బహురూపుల గారడీ విద్యలు కూడా ఎక్కడా రాసి పెట్టలేదు. వీటిని ఎవరు పుట్టించారో, సృష్టించారో కూడా తెలీదు.
అంతెందుకు వరదా! వేద వాఙ్మయం, వీటిని శ్రుతులు అని అంటారని నీకు తెలుసుకదా… అంటే ఒకరి నుంచి మరొకరికి చెప్పడం, వినడం ద్వారానే తరతరాలుగా నేర్పబడుతోంది. కానీ ఇవన్నీ తరాలు మారే కొద్దీ మార్పులకు లోనవుతుండడంతో మనవాళ్ళు తాళపత్రాలపై లిఖించి భద్రపరచడం ప్రారంభించారు. అంతేకాదు నకళ్ళు కూడా రాసి భద్రపరచేవారు.” వివరించారు గోవిందరాజులు.
***
“వరదా! నాన్నగారు సిద్ధంగా ఉన్నారా? రాత్రంతా నిద్రలేదనుకో… ఎంతట మీ ఇంటికి వస్తానా? మీ గ్రంధాలయాన్ని చూస్తానా అనే ఆత్రుత నన్ను నిద్రపోనీయలేదు తెలుసా” వస్తూనే గబగబా చెప్పాడు మల్లిఖార్జున.
“ఉన్నారు వరదా! రా ముందు కూర్చుని కాసేపు స్థిమితపడు. మంచినీరు పుచ్చుకో.” సమాదరించాడు వరదరాజులు.
వరదరాజులు ఇచ్చిన మంచినీరు తాగి, “ఏరీ ఇంకా కనిపించరేం?” ఆతృతగా అడిగాడు మల్లిఖార్జున.
“అయ్యో మల్లిఖార్జున… వస్తారు. కాసేపు ఓపిక పట్టు. అదిగో ఆ గదిలో తాళ పత్రాలను శుభ్రం చేసే పనిలో ఉన్నారు”
“మనం అక్కడికి వెళదామా?”
“అవసరం లేదు. ఆయనే కాసేపటిలో ఇక్కడికి వస్తారు. నువ్వు కాసేపు ఈ పళ్ళు స్వీకరించు.” మల్లిఖార్జున ఆతృతకు నవ్వుకుంటూ పళ్ళబుట్ట అందించాడు వరదరాజులు.
ఇద్దరూ పళ్ళు తింటూ కాసేపు మాట్లాడుకున్నారు. ముందటిరోజు గోవిందరాజులు తెలియజేసిన మౌఖిక సాహిత్యం గురించి చెప్పాడు వరదరాజులు.
“అవును. మా అమ్మమ్మ నుంచి అమ్మ, అమ్మ నుంచి మా చెల్లెలు ఇలాంటి పాటలే నేర్చుకున్నారు. ధనుర్మాసంలో గొబ్బిళ్ళు పెట్టినప్పుడు పాడుతారు. నేను విన్నాను” చెప్పాడు మల్లిఖార్జున.
“అటవీ స్థలములు కరుగుదమా,
చెలి వట పత్రమ్ములు కోయుదమా
జనులారా గుమి గూడుదమా
జలకోలాటం ఆడుదమా
అటవీ స్థలములు కరుగుదమా,
చెలి వట పత్రమ్ములు కోయుదమా
చింత పిక్కాలాడుదమా
చిరు చిరు నవ్వులు నవ్వుదమా
అటవీ స్థలములు కరుగుదమా,
చెలి వట పత్రమ్ములు కోయుదమా
చెమ్మా చెక్కాలాడుదమా
చక్కిలిగింతలు పెట్టుదమా
అటవీ స్థలములు కరుగుదమా,
చెలి వట పత్రమ్ములు కోయుదమా
కోతీ కొమ్మచ్చులాడుదమా
కొమ్మల చాటున దాగుదమా
అటవీ స్థలములు కరుగుదమా,
చెలి వట పత్రమ్ములు కోయుదమా
చల్లని గంధం తీయుదమా
సఖియా మెడలో పూయుదమా
అటవీ స్థలములు కరుగుదమా,
చెలి వట పత్రమ్ములు కోయుదమా
పూలదండలు గుచ్చుదమా
దేవుని మెడలో వేయుదమా
అటవీ స్థలములు కరుగుదమా,
చెలి వట పత్రమ్ములు కోయుదమా”
విని విని నాక్కూడా వచ్చేసింది అంటూ నవ్వేసాడు మల్లిఖార్జున.
“చూడు, ఈ పాటలో ఆడపిల్లలు ఆడే ఆటలు ఉన్నాయి. జడకోలాటం, చింతపిక్కలు, చక్కిలిగింతలు, చెమ్మచెక్కలు, కోతి కొమ్మచ్చులు…”
“అవునవును”
“నేనొకటి చెప్పనా?” మజ్జిగ పుచ్చుకొని వచ్చింది నాంచారమ్మ.
“చెప్పమ్మా” అన్నాడు వరదరాజులు.
ఊర్మిళాదేవి నిద్ర అని మేము పాడుకుంటూ ఉంటాము.
"శ్రీ రామ భూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా
భరత శత్రుఘ్నులపుడు సౌమిత్రి వరుస సేవలు సేయగా
మారుతాత్మజులప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా
సుగ్రీవు డాకొలువులో కూర్మితో నమ్రుడైకొలువుండగా
తుంబురులు నారదులునూ యేతెంచి నిలచిగానము సేయగా
రంభాదు లా సభలలో యెంతొశుభ రమ్యముగ నాట్యమాడా
సనకాది మౌనీంద్రులు కొలువులో శాస్త్రములు తర్కింపగా
సకల దేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెనూ
సభయంత కలయజూచీ యేతెంచె సంతోషమున జానకీ
పతిముఖము జూచి నిలచీ వినయమున పట్టి అంజలి గ్రక్కునా
దేవదేవేంద్ర వినుమా విన్నపము తెలిపెదను చిత్తగింపూ
ముందు మనమడవులకునూ పోగాను ముద్దు మరిదీ వెంటనూ
పయనమై రాగ జూచీ తనచెలియ పయనమాయెను ఊర్మిళా…”
“ఇంకా ఉంది.” చెప్పింది నాంచారమ్మ.
“కస్తూరి రంగ రంగా… మాయన్న కావేటి రంగ రంగా” వరుసలో ఉంది కదా…” అడిగాడు మల్లిఖార్జున.
“అవును. ప్రాచుర్యంలో ఉన్న వరుసలలోనే కొన్ని పల్లె పదాలు రూపుదిద్దుకుంటాయి.” చెప్పారు గోవిందరాజులు.
వరదరాజులు, మల్లిఖార్జున లేచి నిలబడ్డారు. “కూర్చోండి” గోవిందరాజులు కూర్చుంటూ చెప్పాడు.
“మీరెప్పుడు వచ్చారు నాన్నగారూ?” అడిగాడు వరదరాజులు.
“మీ అమ్మ పాట మొదలుపెట్టినప్పుడు. చాలా పెద్ద పాట అది. ఈరోజుకు పూర్తవుతుందా? అనుకున్నాను. భగవదనుగ్రహం వలన కాస్తలోనే ఆపేసింది” నవ్వేరాయన.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.