Menu Close
Ghali Lalita Pravallika
మొదలు నేనిస్తా... ముగింపులు మీరివ్వండి
రచన-సేకరణ: ఘాలి లలిత ప్రవల్లిక

6. గంపా శ్రీదేవి

అంశం: ఓ చిన్న కథ (మొదలు నేనిస్తా... ముగింపు మీరివ్వండి); శీర్షిక: సంతృప్తి

ఉన్నట్టుండి పెద్ద శబ్దం రావడంతో బస్సులో వున్న వారందరూ కొంతసేపు నిశ్శబ్దం గా ఉండిపోయారు. తరువాత నెమ్మదిగా గుసగుసలు మొదలయ్యాయి. ఏమైంది? ఏమైంది? అనేవారే గానీ ఏమైందో ఎవరికీ తెలియదు.

డ్రైవర్ బస్సు ఆపేసాడు. కండక్టరు, డ్రైవర్ ఏదో నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు.

కొందరు దుండగులు గాల్లోకి తుపాకులు పేల్చారని, ఆ శబ్దమే అంత పెద్దగా వినిపించిందని అర్ధమైంది. ఉన్నట్టుండి కొందరు దుండగులు బస్సులోనికి ప్రవేశించారు. వచ్చినదే తడవుగా ప్రయాణీకులందరినీ కొట్టడం మొదలుపెట్టారు. ప్రయాణీకుల ఆర్తనాదాలు మిన్ను ముడుతున్నాయి.

అరణికి ఒక్కసారే తాను చదుకుకొనేటప్పుడు నేర్చుకున్న కరాటే విద్య, గురువుగారు చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి.

వెంటనే మెడలో వేసుకున్న చున్నీ నడుముకు బిగించి దుండగుల మీదికి దూసుకెళ్ళింది. బస్సులో చివరన కూర్చున్న కిరణ్ అనే యువకుడు కూడా ప్రయాణీకుల రక్షణలో పాలు పంచుకున్నాడు. ఒక అరగంటలో మొత్తం దుండగులందరికీ తన కరాటే విద్య రుచి చూపించి ఎముకలు విరగ్గొట్టింది అరణి.

బస్సు డ్రైవర్, కండక్టర్ తో సహా అందరూ అరణిని చూస్తూ నిలువు గుడ్లేశారు.

కొంతసేపటికి పోలీసులు వచ్చి దుండగులను తీసుకెళ్లడంతో ఊపిరి తీసుకున్నారు. తాను చదువుకొనేటప్పుడు సరదాగా నేర్చుకున్న కరాటే విద్య ఇప్పుడు ఈ విధంగా ఉపయోగపడినందుకు అరణి ఎంతో ఆనందించింది.

బస్సులో వున్నవారందరూ అరణిపై ప్రశంసల వర్షం కురిపించారు. కొంతసేపటి తరువాత మళ్ళీ బస్సు బయలుదేరింది. అరణి మళ్ళీ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతోంది.

కొన్ని సంవత్సరాలక్రితం వాళ్ళ సొంతవూరైన కొత్తకోటలో నివసించేటప్పుడు ఒకరోజు రాత్రి వాళ్ళ ఇంటిపై దొంగలు దాడి చేసి తండ్రిని చంపి, వస్తువులన్నింటినీ దోచుకుని, తల్లిని, తమ్ముని, తనను బయటికి తోసేసిన దృశ్యం కళ్ళముందు కదలాడింది.

తరువాత ఊర్లో అందరూ కొంచెం, కొంచెం డబ్బు చందాలు వేసుకుని ఎలాగో తండ్రి అంత్యక్రియలు జరిపించిన దీనస్థితి ఇంకా అరణికి గుర్తుంది. బాగా బ్రతికిన ఊర్లో దీనంగా బ్రతకలేమని విశాఖపట్నం వచ్చేసి వాళ్ళమ్మ 4,5 ఇళ్లల్లో పాచి పనులు చేసి వాళ్ళని పెంచడం, చదివించడం, అందులో భాగంగానే తాను కరాటే నేర్చుకోవడం అంతా గుర్తు వచ్చింది అరణికి.

అప్పుడు తన కళ్ళముందు తండ్రిని దొంగలు కొడుతున్నా కాపాడుకోలేకపోయానని, అప్పుడు తనకు అంత వయసు లేదని, అందువల్లనే నాన్నగారిని కాపాడుకోలేకపోయానని అరణి చాలా సార్లు బాధ పడుతుండేది.

కానీ, ఈరోజు తన తండ్రి లాంటి ఎందరో తండ్రులను కాపాడుకోగలిగిందని చాలా సంతృప్తి గా వుంది అరణి. ఈ ఆనందాన్ని తన తల్లితో పంచుకోవాలని బస్సు దిగి వడి వడిగా అడుగులు వేయసాగింది అరణి. తరువాత కొన్ని నెలలకి ప్రభుత్వం వారిచ్చిన వీర వనిత అవార్డుతో పాటు కిరణ్ ని జీవిత భాగస్వామిగా కూడా పొందింది.

★★★ సశేషం ★★★

Posted in November 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *