“అబ్బ! ఈ చెట్టు కింద కూర్చుందాము.. హా.. హా.. ఎంత బావుందో!”
“అవును లక్ష్మి! ఈ ఆకుల గుసగుసలు వింటూ, గలగలా పరుగులెత్తుతున్న ఆ గోదావరిని చూస్తుంటే మనసు ఎంత హాయిగా ఉంటుందో!” అంది వసుధ.
“ఏయ్ వసుధా! ఈ పచ్చటి ఆకులు మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి” అంది మరో అమ్మాయి. తను సైన్స్ స్టూడెంట్ కాబోలు!
నాలుగో అమ్మాయి జ్యోతి మాత్రం మౌనంగా వింటోంది. మిగతా ముగ్గురు, జ్యోతి మౌనంగా ఉండటం చూసి నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు.
అప్పుడే నది మీద నుంచి చల్లటి గాలి రివ్వున వీచింది. ఆ గాలికి కొన్ని రావి ఆకులు కింద పడ్డాయి.
“ఈ ఆకు చూడు.. కొంచెం హార్ట్ షేప్ (Heart shape) లో ఉంది.. ఎంత బావుందో కదా!” అంది జ్యోతి.
ఆకాశం పగిలినట్టు దిగివచ్చిన వర్షపు ఆనవాళ్ళేవీ లేవు కానీ, గాలిలో మాత్రం ఇంకా ఏదో తడి, మట్టి వాసన. గోదావరి గట్టు సాయంకాలపు ఎండ కిరణాలు తగిలి మెరిసిపోతోంది.
అక్కడ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి, గట్టు మొత్తం పరిశుభ్రం చేస్తున్నారు. పుష్కరాల కోసం యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కొత్త రేవులు నిర్మిస్తున్నారు.
రైల్వే వంతెన మీద ఒక రైలు వెళ్తోంది. చైతన్య జలపాతాల్లా ఉన్న ఆ నలుగురు కాలేజీ అమ్మాయిలను చూస్తున్నాను. పుష్కరాల కోసం స్కూళ్ళకు, కాలేజీలకు ప్రత్యేకంగా సెలవులు ఇచ్చారు.
గోదావరి స్టేషన్లో దిగే యాత్రికులకు సహాయపడటానికి కాలేజీ విద్యార్థులను వాలంటీర్లుగా నియమించారు. ఆ విషయమే వారి మధ్య చర్చకు దారితీసింది.
"నేను చెప్పేది వినండి. మొన్న ఆ పెద్ద ఉప్పెనప్పుడు మనల్ని కేవలం డబ్బులు కలెక్ట్ చేసేంతవరకు చక్కగా చూసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ గ్రూపులోకి మనల్ని చేర్చుకోలేదు. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. మన కాలేజీకి సెలవులు ఇచ్చారు. మన మేడమ్ ఏమో, 'మన ఎన్.ఎస్.ఎస్ (NSS) వాళ్ళంతా వాలంటీర్లుగా ఉండాలి, ముఖ్యంగా పుష్కర రేవు దగ్గర' అన్నారు. గోదావరి స్టేషన్లో చాలామంది యాత్రికులు దిగుతారు. వారికి టీకాలు వేయడానికి, మందులు ఇవ్వడానికి రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఉంటారంట. వారితో మనం కోఆర్డినేట్ కావాలి. మన కాలేజీ తరపున మనకు బ్యాడ్జీలు ఇచ్చి అక్కడ కూర్చోబెడతారంట."
లక్ష్మి మాట మధ్యలో అందుకుని, "అవును అనుకో వసుధా.. నేను చెప్పేది కూడా కాస్త విను. అప్పటి సంగతి వేరు, ఇప్పుడు ఇది వేరు. అది మనం ఎక్కడికో వెళ్లి సేవ చేయాల్సి వచ్చింది. ఇది మన సొంత ఊరిలో సేవ.
మన మేడమ్ చెప్పారు కదా, మనం ఎలాగో ఎన్.ఎస్.ఎస్ లో ఉన్నాము, ఇక్కడ సేవ చేస్తే మనకు కూడా మంచిదే కదా? ఏమంటావే జ్యోతి? నువ్వు చెప్పు.”
విజయ కలుగజేసుకుని, "జ్యోతి ఏమో గానీ నేను చెప్తాను" అంది. లక్ష్మి నవ్వుతూ, "అవునా.. అయితే సరే" అంది.
"ఏయ్ వినండి! మనం చక్కగా మేడమ్ చెప్పినట్టు వాలంటీర్లుగా చేద్దాం. మనకు ఎంతవరకు కుదిరితే అంతవరకే సాయం చేయాలని మేడమ్ చెప్పారు కదా. చక్కగా పొద్దున్నే వచ్చేద్దాము. వచ్చిన వాళ్ళందరినీ లైన్లో పంపించేసి, స్నానానికి వెళ్ళేటప్పుడు, ఆ తర్వాత వాళ్ళకి టీకాలు వేయడానికి రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఉంటారు. అవి కాకుండా మనకు సాయం చేసేందుకు ఆర్ట్స్ కాలేజీ వాళ్ళు కూడా వస్తున్నారు” అంటూ ఉత్సాహంగా చెప్పింది విజయ.
జ్యోతి అంతవరకు మౌనంగా వింటూ ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఆమెకు ఈ పనుల మీద అంత ఆసక్తి లేదు. కానీ స్నేహితుల మాట కాదనలేక వచ్చింది.
వసుధకు 'ఆర్ట్స్ కాలేజీ' పేరు వినిపించగానే, "అమ్మో! ఆర్ట్స్ కాలేజీ నుంచి వస్తున్నారా? అయితే ఆ పొగరుబోతు వంశీ కూడా ఉంటాడేమో?" అంది భయంగా. లక్ష్మి నవ్వుతూ, "ఉంటాడు.. ఉంటాడు" అంది.
రెండు రోజులు గడిచిపోయాయి. పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావరి నది గట్టు యాత్రికుల సందడితో, పూజలతో, భజనలతో కిటకిటలాడిపోతోంది.
లక్ష్మి, వసుధ, జ్యోతి, విజయ.. అటు ఆర్ట్స్ కాలేజీ నుంచి కిరణ్ కృష్ణ, వంశీ.. మరి కొందరు తమ వాలంటీర్ బ్యాడ్జీలు పెట్టుకుని పుష్కర ఘాట్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆ రోజూ ఉదయం వసుధ, లక్ష్మి, జ్యోతి ఒక పక్కన యాత్రికులకు సహాయం చేస్తున్నారు. అక్కడికి వంశీ వచ్చాడు. అంత దగ్గరగా అతడిని చూసిన వసుధకు జంకు, భయం కలిగాయి. "వంశీ! నీకోసమే చూస్తున్నాను," అంది లక్ష్మి నవ్వుతూ. వంశీ నవ్వుతూ, "అవునా, నేను కూడా!" అన్నాడు. వసుధ వైపు చూస్తున్న అతని కళ్ళు మాత్రం కొంటెగా నవ్వుతున్నాయి.
ఈలోపు లక్ష్మి అందుకుని, "చూశావా జ్యోతీ! వసుధ ఏమంటుందో. అప్పటిదాకా వాలంటీర్ పని అంటే అంత ఉత్సాహం లేదు, ఇప్పుడు చూడు ఎలా ఉందో!" అని ఏడిపించింది. జ్యోతి చిరునవ్వుతో, "ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది లక్ష్మి," అంటూ మరింతగా వసుధను ఉడికించింది.
ఒక పక్కన యాత్రికులకు టీకాలు వేసే రెడ్ క్రాస్ బృందంతో కలిసి పనిచేస్తున్నాడు కృష్ణ. ఇంతలో అక్కడికి ఒక వృద్ధ దంపతులు వచ్చారు. వారికి టీకాలు వేసిన తర్వాత, కృష్ణ వారిని పుష్కర ఘాట్ వరకు తీసుకెళ్ళాడు.
"లక్ష్మి! ఈ పెద్దవాళ్ళని నదిలోకి దిగడానికి సాయం చేస్తావా? వాళ్ళు ఎక్కువ నడవలేకపోతున్నారు” అని చెప్పాడు. “సరే అలాగే కృష్ణ! నేను వాళ్ళని చూసుకుంటాను, మీరు వెళ్లి మీ పని చేసుకోండి” అని చెప్పి, ముందుకు వెళ్లి వారిని పట్టుకొని జాగ్రత్తగా నదిలోకి దింపి స్నానం చేయించింది. ఈ సంఘటన కృష్ణ మనసులో లక్ష్మి పట్ల ఒక ప్రత్యేక గౌరవాన్ని కలిగించింది.
సాయంకాలం కృష్ణ, విజయ్, వంశీ ఒక పక్కన విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు వంశీ కృష్ణతో, "కృష్ణ! నువ్వు లక్ష్మిని ఇష్టపడుతున్నావని మాకు తెలుసు.. చెప్పు ఏంటి విశేషాలు?" అని అల్లరిగా అడిగాడు. "అదేమీ లేదు వంశీ," అని కృష్ణ సిగ్గుపడ్డాడు. అంతలో లక్ష్మి అక్కడికి వచ్చి, "ఏం మాట్లాడుకుంటున్నారు?" అని అడిగింది. వంశీ, "ఏమీ లేదు లక్ష్మి గారూ! కృష్ణ మీ గురించే మాట్లాడుతున్నాడు," అని ఆటపట్టించాడు. కృష్ణ సిగ్గుపడి లేచి, "నేను వెళ్తున్నా.. అక్కడ వ్యాక్సిన్ ఇచ్చే చోట సాయం చేయాలి," అని వెళ్లిపోయాడు. వంశీ, విజయ్ గట్టిగా నవ్వారు. లక్ష్మి సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆ రోజు సెలవు కావడంతో జనం విపరీతంగా వచ్చారు. అప్పటికే బాగా రాత్రి అయింది. అందరూ అలిసిపోయి కూర్చున్నారు. "అబ్బా! ఈ పని ఎంత కష్టమో!" అంది వసుధ.
వంశీ నవ్వుతూ, "కష్టమే! కానీ నువ్వు ఉండటం వల్ల ఆ కష్టమంతా మర్చిపోయాను," అన్నాడు సూటిగా ఆమెనే చూస్తూ. ఆ మాటలకు, చూపులకు వసుధ సిగ్గుతో తల వంచుకుంది.
“అబ్బ వంశీ! మా వసుధను బాగా ఏడిపిస్తున్నారు” అంది లక్ష్మి. “అబ్బ! మీరేమీ తక్కువ తినలేదు లక్ష్మి గారూ.. మా కృష్ణగాడికి నిద్ర లేకుండా చేస్తున్నారు” అని పుసుక్కున అనేశాడు వంశీ.
దానితో కృష్ణ కంగారుపడుతూ, "అబ్బే! అదేం లేదు.. అంతా వట్టిదే” అని లక్ష్మిని చూస్తూ అన్నాడు. ఆమె ముఖం ఎర్రగా అయింది.
జ్యోతి మాత్రం, "మీకు ప్రేమలు, నవ్వులు.. నాకు మాత్రం ఈ అలిసిపోయిన వారికి నీళ్ళు ఇవ్వడం, పండ్లను పంచుకోవడం.. ఇదే నా పని," అంది. అప్పుడు వంశీ, కృష్ణ ఇద్దరూ, "నీ పని అందరికంటే గొప్పది జ్యోతి. సేవ అంటే ఇదే!" అనడంతో సంభాషణ దారి మళ్ళింది.
పుష్కరాల చివరి రోజు, గోదావరి గట్టు అంతా హడావుడిగా, కోలాహలంగా ఉంది. “తడిగా ఉన్న మెట్ల పైన అందరూ జాగ్రత్తగా నడవండి” అంటూ వాలంటీర్లు హెచ్చరిస్తున్నారు. కొంతసేపటికి మిత్రబృందం అందరూ రావి చెట్టు, చుట్టూ సమావేశమయ్యారు.
"ఈ పుష్కరాలు త్వరగా అయిపోయాయి కదా?" అని వసుధ బాధగా అంది. లక్ష్మి, "అవును.. కానీ మన స్నేహం మాత్రం బలపడింది," అంది. "అది నిజమే," అంటూ వంశీ గబుక్కున వసుధ చేయి గట్టిగా పట్టుకున్నాడు.
“ఈ గోదావరి నది, ఈ పుష్కరాలు, ఇదిగో ఈ గంగరావి చెట్టు మనందరినీ కలిపాయి. ఈ నది ప్రవహిస్తున్నట్టే, మన స్నేహం కూడా ఎప్పటికీ ఇలానే కొనసాగాలి," అంది.
అప్పుడే వీచిన గాలికి రావి చెట్టు ఆకులు వాళ్ళ తలల పైన అక్షింతల్లా జలజలా రాలాయి.
“అబ్బో.. ఈ చెట్టు కూడా మన మాటలు వింటోంది కాబోలు!”
“అవును.. చెట్లకి ప్రాణం ఉంటుంది.”
“ఇదిగో చెట్టమ్మా! నీకు మాటలు నిజంగా వస్తే, ప్రతి పుష్కరాలకి వచ్చే వాళ్ళకి మా కథ చెప్పు” అన్నాడు వంశీ ఆ రావి చెట్టుతో.
అక్కడంతా యవ్వనపు చైతన్యమే! ఒకటే సందడి, ఉరకలేసే ఉత్సాహం.. అచ్చం పరుగులెత్తే చైతన్య గోదావరిలాగా!
పాండురంగడు, రావి చెట్టుతో సహా.. వాళ్ళ కబుర్లు, చిలిపి తగవులు, ప్రేమ చూపులను విన్నాయి, చూశాయి. వాటితో పాటు గోదారమ్మ కూడా వాళ్ళ మాటలు వింటూ ముందుకు సాగిపోతోంది.
ఆనాటి ఆ స్నేహబంధం కొనసాగిందో లేదో.. వాళ్ళు భవిష్యత్తులో ఒకరికొకరు దగ్గరయ్యారా లేక ఎవరికి వారే అయ్యారా.. తెలియదు!
కానీ మళ్ళీ మరో కొత్త కథ గలగలా మొదలవుతుంది. మళ్ళీ కొత్త నీరు వస్తుంది.. పాతవి వెళ్ళిపోతాయి. ఏవీ అక్కడే ఉట్టి కట్టుకుని ఉండవు.