నన్నెవరో .. తట్టి లేపుతున్నారు. కళ్ళు నులుముకొని లేచాను. ఎదురుగా ఓ అమెరికన్.
పెద్దాయనే. చుట్టూ చూశాను. మా ఇంటి దగ్గర పార్క్ లో ఓ చెట్టు క్రింద, బెంచ్ మీద ఉన్నాను. నేను పనిచేసే రెస్టారెంట్ 'జాక్ ఇన్ ద బాక్స్' యూనిఫారంలోనే ఉన్నాను. పనికి బయలుదేరడం గుర్తుందే! మరి ఇక్కడున్నానేమిటి? అయోమయంగా అనిపించింది. టైం చూస్తే మధ్యాహ్నం నాలుగయ్యింది. బాగా ఎండగా కూడా ఉంది.
ఆ పెద్దాయన ఇచ్చిన వాటర్-బాటిల్ అందుకుని కాసిన్ని నీళ్ళు తాగి లేచి నిలబడ్డాను. 'జాక్ ఇన్ ద బాక్స్' కి రైడ్ అడిగాను.
రైడ్ ఇచ్చినందుకు కూడా అతనికి థాంక్స్ చెప్పి, కార్ దిగి రెస్టారెంట్ లోనికి నడిచాను.
***
నన్ను చూడగానే నా స్నేహితురాలు తార, మేనేజర్ డేవిడ్ ఆశ్చర్యపోయారు. "పొద్దుటి నుండి ఏమయిపోయావు రేణు? ఫోన్ తీయవే?" అడిగారు ఆదుర్దాగా. జేబు నుండి ఫోన్ తీసి చూసాను. నిజమే! తార నుండి లెక్కలేనన్ని మిస్-కాల్స్ ఉన్నాయి. కాస్త తటపటాయించి ’’వొళ్ళు బాగోక ఇంట్లోనే ఉండిపోయాను” అని మాత్రం అన్నాను.
"జబ్బు పడి లేచినట్టుగా వున్నావు, అసలేమైంది? నాకైనా చెప్పు రేణు" అంది తార .
మౌనంగా ఉండిపోయాను. పనిచేస్తున్నా పరి పరి విధాల ఆలోచన సాగింది. ఏడాదిన్నర క్రితం మా వారు పోయినప్పటి నుండి, పుట్టెడు ధు:ఖంతో పాటు తలపోట్లు, ఉన్నట్టుండి మతి లేనట్టుగా అయిపోవడం, పరిసరాలు కూడా తెలియనంతగా మనసు స్థంభించిపోవడం, పరిపాటయిందన్న విషయం ఇదివరలోనే తారకి చెప్పినట్టు గుర్తే అనుకుంటూ పని ముగించుకుని ఇల్లు చేరాను.
జరిగిన సంఘటన గురించి ఆలోచన మాత్రం కొనసాగుతూనే ఉంది. పొద్దుటే ఏడింటికి పనికి బయలుదేరిన నేను ఎటు వెళ్ళానో గాని, ఒక అయోమయ స్థితిలో మరి ఎప్పటికో ఆ పార్క్ బెంచ్ మీద చేరానని ఆర్ధమయింది.
వెంటనే తారకి ఫోన్ చేసి గుర్తొచ్చిన విషయం చెప్పాను. మరునాడే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిందామె. ప్రాధమిక పరీక్షలు చేసిన డాక్టర్ గారు “కొన్నాళ్లగా 'మతిమరుపు’, ‘అయోమయ స్థితి’ ఉన్నట్టు మీరు ఇప్పటికే గుర్తించారు” అంటూ ‘డిమెంషియా వ్యాధి’గా నిర్ధారించి, మరిన్ని పరీక్షలు నిర్వహించాక “ఇకపై మీరు ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదు” అంటూ మందులు రాసిచ్చారు.
దాంతో మా అబ్బాయిలు.. రామ్, భరత్ లకి ఫోన్ చేసి, వారిని ఇంటికి రప్పించింది తార.
నా ఆరోగ్య పరిస్థితి వారికి వివరించి, "ఇకనుంచైనా వీలుచేసుకుని వచ్చి అమ్మని చూడాలి మీరు. ఆమెకి ఇంకెవరున్నారు? మేమున్నా బయట వారమే కదా! ఆమె ఇబ్బందులన్నీ కొడుకులుగా మీరు తీర్చగలిగినవే." అంది తార వారితో. వాళ్ళఎదుటే, నాచేత మెడికైడ్ ఇన్ష్యూరెన్స్ పేపర్స్ మీద సంతకం చేయించింది.
***
ఆ తరువాతి నుండి నా 'జాక్ ఇన్ ద బాక్స్' కుటుంబం - తార, డేవిడ్, జోసెఫ్ నన్ను ఓ పసిబిడ్డలా చూసుకుంటున్నారు. రోజూ జోసెఫ్ వచ్చి నన్ను తన కారులో పనికి తీసుకెళ్ళి చేతనయిన పని మాత్రమే చేయమని చెప్తాడు.
ఇక అడపాదడపా… డాక్టర్ చెకప్ కి తార తీసుకెళుతుంది. మాటల్లో ఓమారు "చూశావా రేణూ! తరచుగా వచ్చి నిన్ను చూడమని, నీ విషయం పట్టించుకోమని నీ కొడుకులకి నీ ఎదుటే కదా చెప్పాను? గడచిన ఆరునెలల్లో ఒకసారైనా వచ్చారేమో చూడు. ఇద్దరిద్దరే ఉత్త సన్నాసులు. అందుకే పిచ్చితల్లీ! వారి మీద ఆధారపడలేవని తెలుసుకోమంటున్నాను. నీ భర్త పెన్షన్ మీదే నీ జీవితం సాగుతుందని కూడా తెలుసుకోమంటున్నాను.” అంది తార.
ఆమె మాటలని అర్ధం చేసుకున్నాను. "నువ్వే నాకు అన్నీ తార" అన్నాను.
“సరేగానమ్మా రేణూ! రేపు డాక్టర్ వద్దకి వెళ్ళాలి. మూడునెలలకో మారు రొటీన్ చెకప్. తరువాత రెండు రోజులూ నీకు వర్క్ నుండి విశ్రాంతి.” అందామె.
***
వ్యాధి తీవ్రత తగ్గించేందుకు డాక్టర్ ఇచ్చిన కొత్త మందులతో నిద్ర ఎక్కువయింది. ఎప్పుడు లేస్తానో ఎప్పుడు పడుకుంటానో తెలీడం లేదు. రెండోరోజనుకుంటా... పనికి అలస్యమయిందని గబగబా తయారయి, తలుపులు వేసి బయలుదేరాను. సన్న తుప్పర పడుతుంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను.
గబక్కున, ఎప్పుడో చనిపోయిన అమ్మా, నాన్న గుర్తొచ్చి ఏడుపొచ్చింది. వెంటనే మరేదో ఆలోచన.. కాని వేగంగానే ఆలోచనలు మారిపోతున్నాయి. తెగిపోతున్న దారాల్లా. గజిబిజిగా అనిపించసాగింది. ఎక్కడికి వెళుతున్నానో కూడా గుర్తు రావడం లేదు.
గబక్కున వెనుక నుండి ఎవరో నా చేయి పట్టి ఆపారు. చూస్తే తార. ‘హమ్మయ్య’ అని ఊపిరి తీసుకున్నాను. "ఇలా నైట్ డ్రెస్సులో రోడ్డు మీద తిరగడమేంటి? అయినా నీకు సెలవ కదా! అదీకాక నీవు పనికి వెళ్లేందుకు… జోసెఫ్ పికప్ చేస్తాడుగా!” అంటూ నా పై విసుక్కొని, నా అపార్ట్మెంట్ లోనికి నడిపించింది తార. "నువ్వు విశ్రాంతి తీసుకో." అని నన్ను లోపలుంచి, బయట నుంచి తాళం వేసుకొని మరీ వెళ్ళింది.
ఎందుకు తార నన్ను కోప్పడిందో తెలియలేదు. వెళ్లి పడుకుండి పోయాను. తలపోటు మొదలైంది. లేచి నీళ్ళ కోసం కిచెన్లోకి వెళుతుంటే తలుపు తెరుచుకొని తార, జోసెఫ్ వచ్చారు. నా బట్టలు, అవసరాలు మూడు సూటుకేసులకి సర్దారు.
"ఈ రోజు నుండి నాతోనే మా ఇంట్లో ఉంటావు నువ్వు." అంటూ తార నన్ను బయలుదేర దీసింది.
***
తార అపార్ట్మెంట్ చేరాక నాచేత మందులు మింగించి, నాకోసం బెడ్-రూమ్ సిద్ధం చేసేవరకు సోఫాలో పడుకోమంది. సూటుకేసులు లోనికి తెచ్చిన జోసెఫ్ తో,
“రేణుని చూడలేక పోతున్నాను జోసెఫ్, తల దువ్వుకోదు, బట్టలు మార్చదు. రెండు రోజులకోసారి వెళ్ళి బలవంతంగా షవర్ లోకి తోస్తే..అలా నిలబడే ఉంటుంది. నోట్లోకి తిండి కూడా సరిగా పోనివ్వదు. బాధగా ఉంది. కొద్దిరోజులు నేనే అన్నీ చేసి చూస్తా.” అంది దిగులుగా తార.
'తార మాటలు వింటుంటే.. నా గురించి బాధపడుతుందని అర్ధం అయింది.'
కాసేపటికి తార అందించిన ఛాయ్ కప్పు అందుకుంటూ “ఈ స్థితిలో ఉన్న రేణుని నీవిలా ఆదుకోడం మామూలు సంగతి కాదు తార” అన్న జోసెఫ్ తో.. "నా భర్త నన్ను వంచించి పారిపోయినప్పుడు, ఓ అన్నలా ఆదుకొని, నేను నిలదొక్కుకునేంత వరకు నన్ను ఇంట్లో ఉంచుకున్నారు మా రేణు భర్త రాఘవ.” అంది తార.
“మరి నీవు చాలకాలంగా స్నేహితురాలివి కదా! ఏమిటిదంతా? రేణు కొడుకులు ఎక్కడ?” అడిగాడు జోసెఫ్.
"నాకు రేణు ముప్పైఐదేళ్ళగా ఇండియా నుండే తెలుసు. ఏడాదిక్రితం వాళ్ళాయన బ్రైన్-హెమరేజ్ వల్ల అకస్మాత్తుగా చనిపోయినప్పుడు ఆమె బాగా క్రుంగిపోయింది. అప్పుడే మన డేవిడ్ కి తన పరిస్థితి వివరించి పనిలో పెట్టించాను.
ఇక ఆమె కొడుకుల సంగతంటావా? వాళ్ళ నాన్న.. మంచివాడు. పల్లెత్తు మాట అనకుండా ‘రేయింబవలూ ఫోన్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు. రేణూ వొంటరిగానే చిన్న బేకరీ నడిపేది. కొడుకులని అతిగా గారాబం చేసేవారు. ఒకరిని ఇంజినీరింగ్ చదివించేందుకు హైదరాబాద్లో ఫ్లాట్ అమ్మేసారు. ఇంటిమీద అప్పులు చేసి మరొకడిని మెడిసిన్ చదివించారు. ఇప్పటికీ అమ్మతో కూరలు, రోటి చేయించుకొని తీసుకుపోతారే తప్ప అమ్మ బాగోగులు పట్టించుకోరు." వాపోయింది తార.
“వారి పనుల్లో చాలా బిజీగా ఉంటారేమోలే తారా” అన్నాను.
“చూశావా జోసెఫ్! ఇంత అమాయకురాలు ఎక్కడైనా ఉంటుందా?” అన్న తారతో ఏమనలేక సెలవు తీసుకున్నాడతడు.
***
చాలారోజులుగా పని కూడా మానేసి తారవద్దనే ఉన్నాను. అప్పుడప్పుడు తిండి తినమని, తల దువ్వుకోమని కోప్పడుతుంది తార. నాకూ కోపం వచ్చి ఆమె చెంపమీద కొట్టాను కూడా. అయినా బుజ్జగించి, ప్రేమగా చూసుకుంటుంది. ఈ మధ్య…. నెలకో మారు డాక్టర్ వద్దకి తీసుకెళుతుందని అర్ధమయింది.
ఓరోజు నావద్ద కూర్చుని బాధపడుతూ “చూడు రేణు! డాక్టర్ గారి సలహా మేరకు నిన్ను త్వరలోనే ‘ఆల్జిమర్స్ వసతి - మెమొరీ కేర్’ లో అడ్మిట్ చేయాలి. నెలరోజులుగా నీ కొడుకులకి ఫోన్ చేసినా జవాబు లేకపోవడంతో నేనే ఆ పని చేయాలి. అదయ్యాక కొద్దికాలం నేను ఊళ్ళో ఉండను. మెమొరీ కేర్ నర్స్ మాటవిని నీవు సరిగా తినాలి. మందులు వేసుకోవాలి.” అంటూ ఏడ్చేసింది.
***
ఇక మరునాటి నుండి ‘ఆల్జిమర్స్’ హోంలో ఉన్నానని, అక్కడ నిత్యం డాక్టర్, నర్స్ నన్ను చూసుకుంటున్నారని ఆర్ధమయింది. మందుల వల్లనేమో రోజంతా నిద్రలోలా ఉంటుందని అప్పుడప్పుడు తెలుస్తుంది.
ఓమారు కాస్త తెలివిగానే ఉన్నానేమో! గదిలోకొచ్చిన నర్సమ్మని “నేనెక్కడున్నాను? తార రాలేదే” అని అడిగాను.
“ఎన్నాళ్ళకి మాట్లాడావు? నీకు తార గుర్తుందా?” అంటూ వెళ్ళి మెడికల్ ఫైల్ తెచ్చి చెప్పడం మొదలెట్టింది.
నీ గురించిన సమాచారము:
ఆరునెల్లగా ఇక్కడ అడ్మిట్ అయిన ‘ఆల్జిమర్స్ వ్యాధి’ పేషెంట్ - 66 సంవత్సరాల రేణు కుమార్
దిగవంతుడైన భర్త పేరు – రాఘవ కుమార్
సంతానం - ఇద్దరు కొడుకులు – కాంటాక్టులో లేరు
కాంటాక్ట్/గార్డియన్ - తార శర్మ
ప్రస్తుతం – ఇక్కడ వైద్య బృందం అజమాయిషీలో ఉన్నావు.
ఇకపోతే, తార నిన్ననే నిన్ను చూడడానికి వచ్చినప్పుడు ఆమెని నీవు గుర్తు పట్టలేదు. కానైతే, కాసేపట్లో డా. రాజన్ వస్తారు. తార కూడా వస్తుంది. కనుక ఈ లోగా బ్రేక్-ఫాస్ట్ కానివ్వు.” అందామె.
కాఫీ తాగేలోగా తార వచ్చింది. నన్ను చూసి కౌగలించుకుని చాలా ఏడ్చింది. ఇంతలో డాక్టర్ వచ్చారు. నాతో మాట్లాడాక, "భారతీయుల కుటుంబాలలో, హెల్త్ సరిగా లేని తల్లితో కొడుకులు ఇలా కాంటాక్ట్ లేకుండా ఉండడం అరుదైన విషయమే," అన్నారు డాక్టర్ తారతో.
అవునన్నట్టు తలూపింది తార. “తమ పని వొత్తిడి వల్ల తల్లిని స్వయంగా చూసుకునే అవకాశం లేదని నిర్మొహమాటంగా చెప్పారు వారు. ఆమె కొడుకులే కాదు డాక్టర్. రేణు-తమ్ముడు, మరిది కూడా ఆమెని వంచించారు. ఇండియాలో నివసించే ఇరువైపుల కుటుంబాలకి, తలకి మించిన అప్పులు చేసి వీళ్ళు పంపిన పెట్టుబడులకు జవాబే లేదు.
అమెరికా అష్టైశ్వర్యాల నిలయం అనీ, ఇక్కడ నివసిస్తున్న తమ వారి జీవితాలు స్వర్గతుల్యమన్న అపోహతో, అసూయతో వారి అజమాయిషీలో ఉన్న వీరి ఆస్తులను స్వాహా చేసి పాపం ఆఖరికి రేణుని ఇలా మతిస్థిమితం పోయిన అనాధని చేశారు.
ఇలాంటి వారు ఎందరో కదా డాక్టర్ గారు! నిజానికి ఇక్కడ కొందరి జీవితాలు 'త్రిశంకుస్వర్గమే' మరి." అంటున్న తారతో…
అప్పటి వరకు రిపోర్ట్ రాస్తూ, శ్రోతగానే ఉన్న డా. రాజన్, " ఏకీభవిస్తాను మీతో, ఇటువంటి సందర్భాలు ఎన్నో తెలుసు, వింటూనే వున్నాము." అంటూ రిపోర్ట్ రాయడం ముగించారు.
************
(ఆంధ్రభూమి, కౌముది, నెచ్చెలి, వంగూరి వారి డయాస్పోరా సంపుటులు 2, విహంగా, మాలిక పత్రికల్లో 2012 - 2021 నడుమ ప్రచురింపబడిన కథనం)
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A. (Pol. Science) – Osmania University
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్