వీరభద్రయ్య ఆనాటి ఆచార వ్యవహారాలను వర్ణించడం లో దిట్ట. రాజులతో గూడా వేటకు వెళ్ళేవాడు కాబోలు వేట కుక్కలను మొదలైన వాటిని దుష్యంతుని వేట సందర్భంగా చక్కగా తెల్పాడు అని ఆరుద్ర ఈ క్రింది పద్యం తెల్పాడు.
పులిమల్ల డడనిపోతులరాజు గరుడుండు గాలి వేగంబు పందేలపసిడి
విష్ణుప్రసాదంబు వేడిగుండులు పరి పచ్చిమిర్యము వెర్రి పుచ్చకాయ
వేటమాణిక్యంబు పరవాది మెడ బల్కి పెట్టుగాడు వకారి పిడుగుతునక
జిగురుండు చిత్రాంగి శ్రీరామబాణంబు పుల్లియండు కస్తూరి బొడ్డుమల్లె యనగ
మరియును పెక్కుతోయములు పేళ్ళు
దారకులు దేర వచ్చె నుద్దండ వృత్తి
వేటకుక్కలు మృగరాజవిగ్రహములు
వటుక నాథుని వ్యాహాళివాహనములు (శకుంతలాపరిణయము, 1-108)
దీనిని గూర్చి చెబుతూ ఆరుద్ర వీరభద్రయ్య పెట్టిన ఈ ఒరవడి అల్లసాని పెద్దన అనుసరించినట్లు చెప్పి వాటిని వివరించాడు. అవి...
వీరభద్రయ్య పద్యం: కణ్వమహాముని శంకరుని స్తుతించిన పద్యం
గిరిజావిభుండు ముంగిక పెన్నిధానంబు కృత్తివాసుండు తంగేటిజున్ను
గోరాజగమనుండుగుజ్ఞామామిడిపండు - కుసుమాస్త్ర హరుడు ముంగొండిగడికి
శీతాంశుధరు డర చేతిమాణిక్యంబు కద్రూజకటకుండు గాదె కొలుచు
కరటి దానవైరి పెరటి కల్పద్రుమం బసమనేత్రుడు సిద్ధరసము చెలి
విషగరళుడు గాడికట్టిన వేల్పుటావు
హాటకాచలధ్వని సిద్ధాంజనంబు
పురహరుడు పెట్టెలోనున్న పరుసవేది
ప్రమధభర్త చింతామణి భక్తులకును (శకుంతలాపరిణయము, 1-4)
వీరభద్రుని పద్యంలోని పలుకుబళ్ళకు మురిసి అల్లసాని పెద్దన తన రచనలో వాడుకొన్నాడని ఆరుద్ర వాటిని చూపించాడు. అవి గృహస్థును వర్ణించే సందర్భంలో వాడాడు. పెద్దన పద్యం...
కెలకుల నున్న తంగేటిజున్ను గృహమేది యజమాను డంకస్థితార్థిమెట్టి
పండిన పెరటికల్పకము వాస్తవ్యుండు దొడ్డిబెట్టిన వేల్పు గిడ్డి కావు
కడలేని యమృతంబు నడబావి సంసారి సవిధమేరునగంబు భవన భక్తి
మరుదేశపథమధ్యమ ప్రప కులపతి కాకటికొదవు సస్యము కుటుంబ
బధిరవంగ్వుంధబిక్షుక బ్రహ్మచారి – జటిపరివ్రాజకాతిథిక్షపణకావ
ధూత కాపాలి కాద్య నాథులకునెల్ల భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియె? (మనుచరిత్ర, 1-16)
అయితే ఆరుద్ర పరిశోధనా పురుషోత్తములు కదా. అందువల్ల ఇలా తెల్పారు. ఈ పద్యాలు వీరభద్రయ్య కు సొంతాలు కావని, తిక్కన (శాంతి. ప. 5-381) “పరమగు పదంబు తంగేటి జున్ను చందంబునొరమి” అని వాడాడని అలాగే పాల్కురికి సోమనాథుడు కూడా (వృషాధిప శతకంలో) వాడాడని తేల్చి చెప్పారు. దీనివల్ల కవులు కొన్ని మంచి పదాలు పదబంధాలు ఒకరినుండి మరొకరు గ్రహిస్తారని అంతమాత్రం చేత వారు తస్కరులో లేక కవిత్వం రాయలేని వారో అని అనుకోవడం మాత్రం నిర్ణయించి మాట్లాడకూడదని మనం గ్రహించాలి.
వసుచరిత్ర లో “నానా సూన వితాన వాసనల...” అన్న పద్యం భట్టుమూర్తి గారు ముక్కు తిమ్మన రాసాడని అందుకే ఆయనకు ఆ పేరు వచ్చిందని ఒక ప్రచారం ఉన్నదన్న అది మంచిది కాదు.
ఈ విషయాన్ని గూర్చి చెబుతూ ఆరుద్ర “పద బంధాలను భావాలను ప్రాచీనుల నుండి ఆర్వాచీనులు స్వీకరించడం ఆనవాయితే” అని అన్నారు.
ఇంతేగాక పిన వీరభద్రుడు కాళిదాసు రచించిన కుమార సంభవం లోని శ్లోకాలను గూడా అనుసరించినట్లు తెల్పాడు.
అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయోనామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః
దీనికి వీరభద్రుని పద్యం:
అలరి పెంపొందు పూర్వాపరాంబునిధుల
నడుమదరనికి మానదండంబువోలె
దేవతాత్మధరాధీశ దిగ్బిభూష
పుణ్యనిలయంబు నీహారభూధరంబు. (శకుంతలా, 2-10)
ఇది కణ్వమహాముని శిష్యులు చెప్పే శకుంతల జన్మవృత్తాంతం ఘట్టం లోని తొలి పద్యం. కాళిదాసుని సుప్రసిద్ధమైన శ్లోకాన్ని పద్యంగా మలిచి తన రచనలో చేర్చాడు వీరభద్రయ్య.
అలాగే కాళిదాసుని శాకుంతలం లోని శ్లోకాలను కూడా వాడుకొన్నాడు వీరభద్రయ్య అని అన్నారు ఆరుద్ర.
కావ్యాలలో నాటకం, నాటకాలలో శాకుంతలం దానిలో చతుర్ధాంకం అందులో నాలుగు శ్లోకాలు రమ్యంగా ఉంటాయని చెప్పుకొంటారు అని అంటూ ఆరుద్ర వీరభద్రయ్య వ్రాసిన అంపకాల ఘట్టం ప్రబంధ శైలిలో జాతీయాలు ఉట్టిపడేటట్లు వ్రాసాడు అని అభిప్రాయ పడ్డారు. అంతేకాక “కాళిదాసు చతుర్ధాంకమునకు కూడా ఈ ఘట్టము వన్నె పెట్టుచున్నది” అని కొందరు అభిప్రాయపడు చున్నారు అని ఆరుద్ర తెల్పారు. ఇది వీరభద్రయ్య రచనా విధానానికి గీటురాయి అని చెప్పవచ్చు.
పిన వీరభద్రయ్య కణ్వమహర్షిని పూర్తిగా ఆంధ్రుణ్ణి చేశాడు. వీరభద్రయ్య తన ఇంట్లోనో, ఊర్లోనో అల్లుళ్ళు ఎంత అల్లరి పెట్టారో గానీ అదంతా తన రచనల్లో భద్రపరిచాడు అని అన్నారు ఆరుద్ర. అందుకు ఈ పద్యాన్ని ఉదహరించారు.
నేరములెన్ని గల్లినగణించుట నేరములట్లు వారిపై
నేరువులైన యల్లురును నేరములెన్నుదు రత్తవారివారిపై
వారల నేర్చు నేరములు వంకలు దీర్చ నయుక్త మెల్లెడం
గౌరవహీనులిజ్ఞగతి గన్నియ నిచ్చినవారు కోమలీ! (శకుంతలా, 4-78)
దీని తరువాత 8 పద్యాలలో కులకన్యకా ధర్మాలు చెప్తాడు. ఆనాటి తెలుగు ఇల్లాళ్లు ఎలా ఉండేవారో తెల్పాడు అని ఆరుద్ర ఆ పద్యాలను కూడా అందించాడు ఆరుద్ర.
కంచెలయుం బటీరతిలకంబును బాపటచెందిరంబు ఫా
లాంచలసీమ లేబసువు టచ్చతబొట్టు జెవాకు గాజులుం
గొంచెపు వీడ్యము న్విరులుకొప్పున నొప్ప నొనర్చ నెప్పుడుం
జంచలనేత్ర యుండదగు సంతతభర్హృఫలాభివృద్ధికిన్. (శకుం. 4-78)
ఈ పద్యం వల్ల పాపిట సింధూరం తెలుగు వారు కూడా పెట్టుకొంటునట్లు తెలుస్తున్నది.
ఈ విధంగా అలంకరించుకొన్న శకుంతల ఆశ్రమాన్ని వీడి వెళ్ళే ఘట్టాన్ని వీరభద్రయ్య చక్కగా వర్ణించాడు.
తండ్రిబాయంగలేని సంతాపమో, అత్తవారింటికేగెడి ఆహ్లాదమో, మొత్తం మీద గోరువెచ్చని కన్నీరు పాలిండ్లపై పడుచుండ శకుంతల ఎలా సాగి పోయిందో, ఆమె మానసిక శారీరక స్థితులను మరొక పద్యంలో వీరభద్రయ్య అత్యంత సహజంగా తెల్పాడు.
కదలు నాలుగు మూడు బదములు క్రమ్మరి తండ్రిపాదంబు లౌదల ఘటించు
గొంతద వ్వేగు నేగుచు వచ్చి కణ్యుని కడుపులో దలమోపి కౌగలించు
నరుగు కొండొక వేగ దిరిగి మౌనులకు మాయయ్యసుడీ యని యప్పగించు
గమనించు బెడమర్లి కాశ్యపుదెస జూచి నేబోదు నంచు గన్నీరు నించు
జనకు డుపలాలనము సేయ సంయమీంద్ర
భామలదలింప ననసూయ వట్టి తిగువ
నిగిడి యడుగిడె నొకభంగి మగిడిమగిడి
చూచుకొంచు శకుంతలానూనగంధి. (శకుంతలా. 4-97)
ఈ ఘట్టంలో పాఠకుడు కూడా కన్నీటిని దాచుకోలేని విధంగా వీరభద్రయ్య రచన సాగింది. ‘నిగిడి యడుగిడె నొకభంగి మగిడిమగిడి’ అని చెప్పి, కన్నీళ్లు కాల్వలై కట్టాక రత్నాకరుని వెతుక్కుంటూ వెళ్ళే గంగానది వలె శకుంతల కాపురానికి వెళ్లిందని చెప్పడం చక్కని ఉపమ.
అటు తర్వాత దుష్యంతుని పుర వర్ణన, ప్రభంధ యుతమైన అష్టాదశ వర్ణనలు చక్కగా జరిగింది.
శకుంతల తో పాటు కణ్వుడు పంపిన కొందరు ఆడవారిని గూర్చి దౌవారికుడు చెప్పగానే “సభాస్థలంబులు స్ర్త్రీజనులం బొడసూపించుకొనుట యనర్హం” బని అందరినీ పంపించేసి ఏకాంతగృహంలో ఉండి వృద్ధకాంతలను పంపి శకుంతలను, కణ్వమహర్షి శిష్యులను రప్పించాడట. దీనిని గూర్చి చెబుతూ వీరభద్రయ్యకు రాచమర్యాదలు బాగా తెలుసునని చెప్తూ అవి అతనికి ఎలా తెలిసాయో వివరించాడు ఆరుద్ర.