కదంబం - సాహిత్యకుసుమం
పంచశీల (వచన కవిత)
- వెంపటి హేమ -
అణువు నుండి మన జననం,
అంతు తెలియని దీ పయనం,
కాలచక్ర గమన మెన్నడూ నీకోసం
కదలక నిలువదు ఒక్క క్షణం!
గతాన్ని తలపోస్తే వచ్చేదంతా పరితాపం,
భవిష్యత్తు నూహిస్తే అంతా అయోమయం,
ఇక మిగిలున్నదీ వర్తమానమే, మానవా!
పురోగమించు పూనికతో ఇదేసుమీ వాస్తవం!
గడచిన కాలం మరలి రాదు నీకోసం
రేపన్న దేమిటో తెలియబోదు ఎవ్వరికీ,
మిగిలున్నది ఇక ఈ ప్రస్తుత మొకటే నేస్తం!
ఇదే సదా నీ వెన్నoటి ఉండే సమస్తం!
ఆశ అందలం ఎక్కాలని కోరుకుంటోoటే
రాతేమో గాడిదలని కాయమంటోoది ,
ఇక నువ్వేమంటావో తెలియక, బాసూ!
దడ దడా నా గుండె కొట్టుకుంటోంది.
పవలూ రాత్రీ రోజుకు సహజం,
కష్టం, సుఖమూ బ్రతుకున తధ్యం,
జటిలమౌ ఈ జీవన సంగ్రామంలో,
చెడు మనకెందుకు మంచే చేద్దాం.