గోవా విమోచనం - 1
భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, పోర్చుగీస్ వారు 450 ఏండ్ల నుండి భారత్ లో ఉన్న తమ కాలనీలైన గోవా, డయ్యూ, డామన్ లను ఖాళీ చేయడానికి నిరాకరించారు. దాంతో భారత ప్రభుత్వం పోర్చుగల్ ప్రభుత్వంతో శాంతియుత దౌత్య చర్చలు ప్రారంభించింది. గోవా, డయ్యూ, డామన్ లను భారతదేశానికి అప్పగించాల్సిందిగా కోరింది. అయితే, అప్పటి పోర్చుగల్ నియంత ఆంటోనియో డి ఒలివేరా సలాజర్ అందుకు స్పష్టంగా నిరాకరించారు. ఆ ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగాలని, వాటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మొండికేశారు. దీంతో భారత ప్రభుత్వం 1961లో సైనిక చర్య ద్వారా ఆ ప్రాంతాలను విముక్తి చేసింది. ఈ సైనిక చర్యకు ముందు, గోవా విముక్తి కోసం అనేక మంది భారతీయ మరియు గోవా స్వాతంత్ర్య సమరయోధులు శాంతియుత పోరాటాలు చేశారు. ముందుగా గోవా విముక్తి సమితి - రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖ నాయకులు గోవా ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారు. 1955 ఆగస్టు 15న 600 మంది నిరాయుధ భారతీయ సత్యాగ్రహులు గోవా సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిలో 35 మంది సరిహద్దు దాటి పోర్చుగీస్ కాలనీలో అడుగుపెట్టగానే, ఆ సమయంలో అక్కడ వీరికోసం మాటువేసి ఉన్న పోర్చుగీస్ సైనికులు జరిపిన కాల్పుల్లో 30 మంది సత్యాగ్రహులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో విజయవాడ నుండి సత్యాగ్రహం చెయ్యడానికి వచ్చిన "రామం" అనే నిరాయుధుడైన విద్యార్థి కూడా ఉన్నాడు. ఈ ఘోరకలి తీవ్ర ఉద్రిక్తతలను తీవ్రం చేసింది. ఆగ్రహం చెందిన ప్రజలు బొంబాయిలో ఉన్న పోర్చుగీస్ దౌత్య కార్యాలయం పైకి ఎక్కి అక్కడున్న పోర్చుగీస్ జెండాను తొలగించి భారత పతకాన్ని ఎగురవేశారు. దౌత్య ప్రయత్నాలన్నీ విఫలమవడం, నిరాయుధులైన సత్యాగ్రహులపై హత్యకాండ జరగడంతో అప్పటి భారత ప్రధాని నెహ్రూ సైనిక చర్యకు ఆదేశించారు. ఈ రక్షణ చర్యకు "ఆపరేషన్ విజయ్" అని పేరు పెట్టారు. డిసెంబర్ 17, 1961 న అధికారికంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. భారత ఆర్మీ, నేవీ మరియు వాయుసేన సంయుక్తంగా గోవా, డయ్యూ, డామన్ లపై ముప్పేట దాడి చేశాయి. కేవలం 36 గంటల్లోనే భారత సైన్యం పోర్చుగీస్ రక్షణ వలయాలను ఛేదించింది. ఆధునిక ఆయుధాలలేమి, బలగాల కొరత ఉన్న పోర్చుగీస్ సైన్యం భారత్‌ను ఎదిరించలేక 36 గంటల్లో చేతులెత్తేసింది.
భారత్ దళాలు ఇంత త్వరగా ఎలా పని పూర్తి చేశాయో తెలుసుకుందాం. గోవాలోని ఏకైక విమానాశ్రయమైన దాబోలిమ్ పై భారత వాయుసేన కాన్బెర్రా మరియు హంటర్ బాంబర్ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. దీనివల్ల రన్‌వే పూర్తిగా దెబ్బతిని, పోర్చుగల్ నుండి ఎలాంటి అదనపు సైనిక విమానాలు లేదా సహాయం రాకుండా నిలిచిపోయింది. బాంబోలిమ్ లోని ప్రధాన పోర్చుగీస్ వైర్లెస్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని భారత వాయుసేన బాంబర్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి. దీనివల్ల గోవాలోని పోర్చుగీస్ సైనికులకు మరియు లిస్బాన్లోని వారి ప్రధాన కార్యాలయానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. డయ్యూ లో ఉన్న బలమైన పోర్చుగీస్ కోటపై మరియు రక్షణ వలయాలపై భారత వాయుసేన విమానాలు ఖచ్చితమైన దాడులు జరిపి, అక్కడి పోర్చుగీస్ సైన్యం భారత పదాతి దళాలపై ఎదురుదాడి చేయకుండా ముందుగానే వారి కథ ముగించింది.
మరోవైపు భారత నావికాదళం గోవా తీరాన్ని పూర్తిగా ముట్టడించి, సముద్ర మార్గం ద్వారా పోర్చుగీస్ నౌకలు బయటకు పారిపోకుండా లేదా బయటి నుండి సహాయం అందకుండా దిగ్బంధం చేసింది. గోవా తీరానికి సమీపంలో ఉన్న అంజెడివా ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం నావికాదళం చేసిన అతి పెద్ద ఆపరేషన్. అక్కడ దాగి ఉన్న పోర్చుగీస్ సైనికులు భారత నౌకలపై కాల్పులు జరిపారు. భారత నౌకలైన త్రిశూల్, మైసూర్ లు ఎదురుదాడి చేసి తీవ్ర పోరాటం తర్వాత ఆ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ పోరాటంలో ఏడుగురు భారతీయ నావికులు వీరమరణం పొందారు. గోవాలోని మోర్ముగావ్ హార్బర్లో కాపలాగా ఉన్న పోర్చుగీస్ వారి యుద్ధనౌక 'అఫోన్సో డి అల్బుకెర్కీ'ని భారత నావికాదళానికి చెందిన బెత్వా, బియాస్ నౌకలు చుట్టుముట్టాయి. ఇరుపక్షాల మధ్య తీవ్రమైన ఫిరంగుల యుద్ధం జరిగింది. పులి గర్జనకు అడవి వణుకుతుంది కదా! భారత నౌకల దాడుల వల్ల పోర్చుగీస్ వారి యుద్ధనౌక ఇంజన్ రూమ్, బాయిలర్ పూర్తిగా ధ్వంసమై, ఈ నౌక పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకున్న తర్వాత, సదరు నౌకను మునిగిపోకుండా ఉండడానికి పోర్చుగీస్ సిబ్బంది గోవాలో బాంబోలిమ్ బీచ్ కు హుటాహుటిన మళ్లించారు. చివరికి అక్కడ తగలబడుతున్న స్థితిలో ఉన్న ఈ నౌకను పోర్చుగీస్ సిబ్బంది విడనాడి భారత సైన్యానికి లొంగిపోయారు. దీనితో 1510లో పోర్చుగీస్ సామ్రాజ్యం స్థాపన కోసం మొదటగా గోవాను ఆక్రమించిన 16వ శతాబ్దపు పోర్చుగీస్ జనరల్, వైస్రాయ్ 'అఫోన్సో డి అల్బుకెర్కీ' పేరు పెట్టుకున్న ఈ యుద్ధ నౌక కథ ముగిసింది, పైగా అదే రోజున గోవాలో పోర్చుగీస్ వలస పాలన కూడా పూర్తిగా ముగిసిపోయింది. అలా తగలబడిన స్థితిలో ఉన్న అఫోన్సో డి అల్బుకెర్క్ యుద్ధ నౌక 1962 వరకు గోవా సమీపంలోని అదే బీచ్‌లో చిక్కుకుపోయింది, ఆ తర్వాత దానిని తిరిగి బొంబాయి తీరానికి లాక్కొని వచ్చారు. ఈ నౌకలోని కొన్ని భాగాలు ముంబైలోని ఒక మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి. మిగిలిన భాగాన్ని తుక్కుగా అమ్మేశారు.
భారత నావికాదళానికి చెందిన మొట్టమొదటి విమానవాహక నౌక ఐ ఎన్ యెస్ విక్రాంత్ పోరాటం గూర్చి తెలుసుకుందాం. గోవా తీరానికి కొన్ని మైళ్ల దూరంలో సముద్రంలో ఈ నౌక మాటువేసింది. దీనివల్ల పోర్చుగీస్ వారు సముద్ర మార్గం ద్వారా పారిపోయే అవకాశమే లేకుండా పోయింది. ఈ విధంగా ఒకవైపు భారత వైమానిక దళం ఆకాశం నుండి రన్‌వేలను, కమ్యూనికేషన్లను కట్ చేయగా, మరోవైపు భారత నావికాదళం సముద్ర మార్గాలను దిగ్బంధించింది. దీనివల్ల పూర్తిగా ఒంటరి అయిపోయిన పోర్చుగీస్ సైన్యం, భారత ఆర్మీ గోవా లోపలికి ప్రవేశించిన వెంటనే లొంగిపోక తప్పలేదు. ఐ ఎన్ యెస్ విక్రాంత్ కు ఈ యుద్ధం ఒక రకంగా అతి పెద్ద సైనిక పరీక్ష. ఎందుకంటే 1961 మార్చిలో బ్రిటన్ నుండి భారత్‌కు తాజాగా వచ్చిన ఈ నౌక, అదే ఏడాది డిసెంబర్ నాటికి ఆపరేషన్ విజయ్‌లో అత్యంత కీలకమైన బాధ్యతను మోసింది. గోవా బయట సముద్రంలో భారత్ కు చెందిన ఒక భారీ విమానవాహక నౌక యుద్ధ విమానాలతో, పెద్ద ఎత్తున మందుగుండు, నౌకాదళ సిబ్బందితో మాటువేసి ఉందనే వార్త గోవాలోని పోర్చుగీస్ బలగాల ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. తాము పూర్తిగా ఒంటరి అయిపోయామనే భయం, మానసిక ఒత్తిడితో వారిని భారత్ కు లొంగిపోయేలా చేయడంలో సాయపడింది.
చివరికి డిసెంబర్ 19, 1961 న పోర్చుగీస్ ఇండియా చివరి గవర్నర్-జనరల్ మాన్యుయెల్ ఆంటోనియో వాస్సాలో ఇ సిల్వా లొంగుబాటు పత్రంపై సంతకం చేశారు. దాదాపు 3,300 మంది పోర్చుగీస్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. దీంతో భారతదేశంలో 451 ఏళ్ల పోర్చుగీస్ వలస పాలనకు శాశ్వతంగా తెరపడింది. పోర్చుగీస్ పాలన నుండి విముక్తి పొందిన డిసెంబర్ 19 వ తేదీని ప్రతి సంవత్సరం గోవాలో "గోవా లిబరేషన్ డే" గా జరుపుకుంటారు. ప్రారంభంలో గోవా, డయ్యూ, డామన్ లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. తదుపరి కాలంలో, మే 30, 1987 న గోవా భారతదేశంలో 25వ రాష్ట్రంగా అవతరించింది. డయ్యూ, డామన్ లు కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగాయి.
పోర్చుగీస్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ అయిన మాన్యుయెల్ ఆంటోనియో వాస్సాలో ఇ సిల్వా గురించి చెప్పుకోవాలి. ఆయన లొంగిపోవడం వెనుక ఒక ఉద్వేగభరితమైన నాటకీయత ఉంది. పోర్చుగల్ నియంత సలాజర్ నుండి అతనికి కఠినమైన ఆదేశాలు వచ్చాయి. "చివరి సైనికుడు బతికున్నంత వరకు భారత్‌తో పోరాడాలి. లొంగిపోవడమనేది జరగకూడదు. అవసరమైతే గోవాను సర్వ నాశనం చేయాలి" అని. కానీ 45,000 మందితో కూడిన భారత త్రివిధ దళాల ముప్పేట దాడి ముందు తమ కున్న కొద్దిపాటి 3,000 మంది సైన్యం ఎక్కువ సేపు నిలబడలేదని గవర్నర్ సిల్వా గ్రహించారు. అనవసరంగా రక్తం చిందించడం, గోవాలోని చారిత్రాత్మక కట్టడాలను, వేలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఆయనకు ఇష్టం లేదు. దాంతో ప్రధాని ఆదేశాలను ధిక్కరించి లొంగిపోవడానికే సిద్ధమయ్యారు. 1961 డిసెంబర్ 19 రాత్రి పనాజీ సమీపంలోని వాస్కోడిగామా పట్టణంలో ఉన్న 'మెకానిజ్డ్ ఇన్ఫాంట్రీ' క్యాంప్‌లో లొంగుబాటు కార్యక్రమం జరిగింది. భారత సైన్యానికి నాయకత్వం వహిస్తున్న మేజర్ జనరల్ కె.పి. కాండెత్ ముందు గవర్నర్ సిల్వా లొంగుబాటు పత్రం పై సంతకం చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం గోవాలోని గవర్నర్ అధికారిక నివాసం (ఇప్పటి రాజ్ భవన్) పై 451 ఏళ్లుగా ఎగురుతున్న పోర్చుగల్ జెండాను దించి, భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేశారు.
ఆపరేషన్ విజయ్ విజయవంతంగా ముగిసి, పోర్చుగీస్ పాలన అంతమవ్వగానే గోవా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు నాలుగున్నర శతాబ్దాల విదేశీ పాలన నుండి విముక్తి లభించడంతో గోవా ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డిసెంబర్ 19న భారత సైన్యం పనాజీ, మార్గావ్ వంటి ప్రధాన నగరాల్లోకి ప్రవేశిస్తుండగా, వేలాది మంది ప్రజలు రోడ్ల పక్క నిలబడి చేతుల్లో భారత త్రివర్ణ పతాకాలను పట్టుకుని "జై హింద్", "భారత్ మాతా కీ జై" నినాదాలతో స్వాగతం పలికారు. సరిహద్దులు దాటి లోపలికి వస్తున్న భారత సైనికులపై మహిళలు పూలవర్షం కురిపించారు, ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి సైనికులకు హారతులు ఇచ్చి, మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. పోర్చుగీస్ ప్రభుత్వం విధించిన కఠినమైన ఆంక్షలు, భావప్రకటన స్వేచ్ఛపై నిషేధాలు ఒక్కసారిగా తొలగిపోవడంతో గోవా ప్రజలు అర్ధరాత్రి వరకు వీధుల్లో నృత్యాలు చేస్తూ స్వేచ్ఛా ఉత్సవాలు జరుపుకున్నారు.
ఆపరేషన్ విజయ్ తర్వాత భారత సైన్యానికి లొంగిపోయిన దాదాపు 3,300 మందికి పైగా పోర్చుగీస్ సైనికులు మరియు అధికారులను తిరిగి వారి స్వదేశానికి పంపించడం వెనుక ఒక పెద్ద దౌత్య మరియు మానవీయ ప్రక్రియ నడిచింది. లొంగిపోయిన పోర్చుగీస్ సైనికులను భారత ప్రభుత్వం శత్రువులుగా కాకుండా, జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలుగా పరిగణించింది. వారిని గోవాలోని పోండా మరియు అల్‌తో పోర్వోరిమ్ లలో ఉన్న తాత్కాలిక సైనిక క్యాంపులలో ఉంచారు. వారికి మంచి ఆహారం, వైద్య సదుపాయాలు మరియు వసతి కల్పించారు. పోర్చుగల్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులతో ఉత్తరాల ద్వారా మాట్లాడుకునే అవకాశాన్ని కూడా భారత ప్రభుత్వం కల్పించింది. యుద్ధ ఖైదీలను వెంటనే పోర్చుగల్ పంపించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, పోర్చుగల్ నియంత సలాజర్ మొండితనం వల్ల ఐదు నెలల ఆలస్యం అయింది. గోవాను భారత్ ఆక్రమించిందని సలాజర్ వాదించారు. పట్టుబడ్డ ఖైదీలను తిరిగి తీసుకోవడం అంటే గోవాపై భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించినట్లే అవుతుందని ఆయన భావించారు. సలాజర్ మొండి వైఖరితో నేరుగా భారత్-పోర్చుగల్ మధ్య చర్చలు జరగలేదు. చివరకు ఈజిప్ట్ మరియు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సంస్థ మధ్యవర్తులుగా వ్యవహరించి ఈ చిక్కుముడిని విప్పాయి.
భారత ప్రభుత్వం యుద్ధ ఖైదీలను సగౌరవంగా స్వదేశానికి పంపించినప్పటికీ, తిరిగి పోర్చుగల్ చేరుకున్న సైనికులు సలాజర్ పాలన నుండి తీవ్రమైన అవమానాలకు గురయ్యారు. స్వదేశం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి భారత్‌కు లొంగిపోయినందుకు, అప్పటి పోర్చుగల్ నియంత సలాజర్ గవర్నర్ వాస్సాలో ఇ సిల్వాను జైలులో పెట్టి, ఆయన సైనిక బిరుదులను తొలగించాడు. లొంగిపోవద్దన్న తన ఆదేశాలను అతిక్రమించారన్న కోపంతో సలాజర్ అనేక మంది ఉన్నతాధికారులను సైన్యం నుండి తొలగించాడు. గవర్నర్ జనరల్ సిల్వాను దేశద్రోహిగా ముద్రవేసి, సైనిక గౌరవాలను రద్దు చేసి దేశం నుండి బహిష్కరించారు. అయితే గోవా ప్రజలను, తన సైనికులను అనవసర ప్రాణనష్టం నుండి రక్షించినందుకు ఆయనకు చరిత్రలో ఒక మంచి పాలకుడిగా నిలిచే స్థానం లభించింది. చివరకు 1974లో పోర్చుగల్‌లో కార్నేషన్ విప్లవం చోటుచేసుకుని సలాజర్ - అతడి వారసుడి పాలన ముగిసిన తర్వాత, కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం సిల్వా సహా ఆ సైనికులకు తిరిగి పూర్తిస్థాయి గౌరవాన్ని మరియు న్యాయాన్ని ఇచ్చింది.
మొండివాడు రాజును మించినవాడని సామెత. మరి మొండితనమే సింహాసనంపై కూర్చుంటే పాలన, నిర్ణయాలు ఎంత దారుణంగా ఉంటాయో చూద్దాం! గోవా "పోర్చుగీస్ ఇండియా" కాలనీ కానే కాదు, అది పోర్చుగీస్ లో అంతర్భాగం అనే మొండి వాదనకు సలాజర్ కట్టుబడి ఉన్నాడు. ఇందుకు 1951లో ఆయన పోర్చుగల్ రాజ్యాంగాన్ని సవరించి, గోవాతో సహా అన్ని విదేశీ స్థావరాలను "ఓవర్సీస్ ప్రావిన్సెస్" (సముద్రతీరావతలి పోర్చుగల్ జిల్లాలు) గా ప్రకటించారు. దీని అర్థం పోర్చుగల్‌లో ఉన్న రాజధాని నగరం లిస్బాన్ పోర్చుగల్‌లో ఎంత భాగమో, గోవా కూడా పోర్చుగల్ దేశంలో అంతే భాగం అని. కాబట్టి తన సొంత దేశ భూభాగమైన గోవాను భారత్ కు ఎలా అప్పగిస్తాం అనేది ఆయన ప్రధాన వాదన. పోర్చుగీస్ వారు బ్రిటీష్ వారి కంటే ముందే (1510 లోనే) గోవాకు వచ్చారు. దాదాపు 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భూభాగాన్ని వదులుకోవడం అంటే పోర్చుగల్ సామ్రాజ్య వైభవానికి, చారిత్రాత్మక ప్రతిష్టకు పెద్ద దెబ్బ అని సలాజర్ భావించారు. గోవాను ఇవ్వడం స్వదేశంలో తన రాజకీయ పతనానికి దారితీస్తుందని ఆయన భయపడ్డారు. గోవాలో శతాబ్దాలుగా రోమన్ కాథలిక్ క్రైస్తవ మతం మరియు పోర్చుగీస్ సంస్కృతి బలంగా నాటుకుపోయాయి. ఒకవేళ గోవాను హిందూ మెజారిటీ ఉన్న భారతదేశానికి అప్పగిస్తే, అక్కడ ఉన్న క్రైస్తవ సంస్కృతి మరియు పశ్చిమ దేశాల గుర్తింపు పూర్తిగా నశిస్తుందని సలాజర్ వాదించారు. తాము గోవాలో క్రైస్తవ మతానికి గొప్ప రక్షకులుగా ఉన్నామని ఆయన ప్రపంచానికి నమ్మబలికారు. అప్పట్లో కేవలం భారతదేశంలోనే కాకుండా ఆఫ్రికాలో కూడా (అంగోలా, మొజాంబిక్ వంటి దేశాల్లో) పోర్చుగల్‌కు పెద్ద ఎత్తున వలసరాజ్యాలు ఉండేవి. భారతదేశానికి భయపడి గోవాను శాంతియుతంగా అప్పగిస్తే, ఆఫ్రికాలోని కాలనీలు కూడా తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం కోరతాయని, తద్వారా వలస కాలనీలతో కూడిన పోర్చుగీస్ సామ్రాజ్యం మొత్తం ముక్కలైపోతుందని సలాజర్ తీవ్రంగా భయపడ్డారు. పోర్చుగల్ దేశానికి అప్పటికే నాటో లో వ్యవస్థాపక సభ్యుత్వం ఉంది. భారతదేశం ఒకవేళ గోవాపై దాడి చేస్తే, నాటో నిబంధనల ప్రకారం అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు పోర్చుగల్‌కు మద్దతుగా వచ్చి భారత్‌ను అడ్డుకుంటాయని సలాజర్ గుడ్డిగా నమ్మారు. ఈ కారణాల వల్లే భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పదేపదే జరిపిన శాంతియుత దౌత్య చర్చలను సలాజర్ పూర్తిగా తిరస్కరించారు. అయితే, చివరిలో గోవా విషయంలో తాము జోక్యం చేసుకోలేమని నాటో దేశాలు తప్పుకున్నాయి. చివరకు భారత్ సైనిక చర్య (ఆపరేషన్ విజయ్) ద్వారా మాత్రమే గోవాను విముక్తి చేయాల్సి వచ్చింది.
మొదట్లో నెహ్రూ అంతర్జాతీయంగా తానున్న "శాంతి కాముకుడు" అనే ఇమేజ్ను కాపాడుకోవడానికి గోవా విషయంలో ఆలస్యంగా స్పందించారు. దాదాపు 14 ఏళ్ల పాటు శాంతియుత చర్చలకే మొగ్గు చూపారు. గోవాను పోర్చుగల్ యొక్క "అంతర్భాగం" అని సలాజర్ ప్రకటించడాన్ని నెహ్రూ తీవ్రంగా ఖండించారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా భారతదేశంలో భాగమైన గోవాను కేవలం కాగితాలపై పోర్చుగల్ చట్టాలు మార్చి తమ దేశం అనుకోవడం "హాస్యాస్పదం" అని, ఇది వారి కాలనీ వాదానికి రంగులు పూయడమేనని నెహ్రూ స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశం నడిబొడ్డున ఒక విదేశీ సైనిక శక్తి ఉండటం దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పని నెహ్రూ భావించారు. 1955లో నిరాయుధ భారతీయ సత్యాగ్రహులపై పోర్చుగీస్ సైన్యం కాల్పులు జరిపి చంపినప్పుడు నెహ్రూపై దేశీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. "శాంతియుత మార్గాలను బలహీనతగా భావిస్తే ఊరుకోం" అని నెహ్రూ హెచ్చరించారు. చివరికి ఆఫ్రికా దేశాల నుండి కూడా "భారత్ ఎందుకు ఇంకా పోర్చుగల్‌ను సహిస్తోంది" అనే విమర్శలు రావడంతో తప్పని పరిస్థితుల్లో నెహ్రూ సైనిక చర్యకు సిద్ధమయ్యారు.
గోవా విమోచనం పంచాయితీ లో అమెరికా-బ్రిటన్-ఫ్రాన్స్ జోక్యం, భారత్ కు అనుకూలంగా రష్యా, ఈజిప్టు వ్యవహరించిన తీరు వచ్చే వారం తెలుసుకుందాం. చివరగా, పాఠకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నెల రచ్చబండ అంశం "గోవా విమోచనం - 1" పై మీ అభిప్రాయాలను తప్పకుండా క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, వచ్చే నెల గోవా విమోచనం - 2' చర్చతో మళ్లీ కలుద్దాం మిత్రులారా!
నమస్కారములతో, --మీ వెంకట్ నాగం.