అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
- మధు బుడమగుంట -
పద్మావతీదేవి బ్రోహ్మోత్సవాలు – ఆశ్వవహనసేవ, తిరుచానూరు
మ.కో. నీ కసాధ్య మసాధ్య మమ్మరొ! నీక సాధ్యము సాఁకఁగాఁ
బ్రాకటం బగు స్వర్ణరత్నవిరాజమానవిభూషణా
స్తోకపీతసువర్ణవస్త్రవిశుద్ధగంధభృతార్తవా
నీకధారణ నీక చెల్లును నీతవాజిసువాహనా!
భావము-
నీకు సాధ్యముకానిది అసాధ్యము అమ్మా! కాపాడుట/పెంచుట నీకు
మాత్రమే సాధ్య మగును. ప్రసిద్ధమైన బంగారము మఱియు రత్నములతో
ప్రకాశించే ఆభరణములు, అధికమైన మంచి రంగుకల పట్టువస్త్రములు,
పరిశుద్ధమై సువాసనలతో నిండిన పూల సముహములు ధరించుట,
శిక్షణపొందిన/నియమము కలిగిన గుఱ్ఱము మంచి వాహనముగా కలిగినతల్లీ!
నీకు మాత్రమే చెల్లును. 311
పద్మావతీదేవి పుష్పయాగము - తిరుచానూరు
మ.కో. ఎంత చక్కని రంగులో మఱి యెంత గొప్ప సువాసనో
యింతగా వెదజల్లు పూవుల నిన్ని రీతులఁ గూర్పఁగాఁ
బంతమాడుచు మేము మేమని పట్టుపట్టుచు నీర్ష్యమై
సుంత తావు లభింపఁ జా లని సోయగాల ప్రదర్శనం
బంతు లేక ప్రసూనబాలిక లంద ఱి ట్లొనరింపఁగా
వింతగాఁ గనువిందు సేసెడి వేడుకన్ గనఁ గోట్ల సు
స్వాంతముల్ ముద మొంది దిగ్భ్రమ సాగ స్తంభన మొందవే?
చెంత నుండిన వారి భాగ్యముఁ జెప్ప బ్రహ్మకు సాధ్యమే?
కాంతు లీనెడు కాసులున్ గనకంపు రత్నపు భూషలున్
గాంతి పుట్టినయింటి మేనను(1) గ్రాలు పర్వమె పర్వమౌ,
కాంతవైభవ మీ విధంబునఁ గాంచి ముచ్చట నొందు శ్రీ
కాంతుఁడౌ తిరువేంకటేశ్వరు గాఢప్రేమనివాసమౌ
నంతరంగము మాకుఁ దత్కృప నందఁజేయఁగ వేఁడెదన్
(1) కాంతికి జన్మగృహమైన లక్ష్మీదేవి ఒంటిపై 312
జీవితము
శా. సోపానంబుల శ్రేణి జీవితము; సంశుద్ధాత్మ నా తోడుగాన్
నాపై నీశుకృపే బలం బగుఁ; బరంధామంబు గమ్యం బగున్;
ప్రాపౌ మద్భవదాతృ(1)సద్గురువచఃప్రాణేశ్వరీశ్రద్ధయే;
నా పద్యంబులు దీపికల్; చదువు, జ్ఞానం బాజ్యవర్తుల్(2) సదా
(1) నా జన్మ నిచ్చినవారు (2) నెయ్యి, దీపపువత్తులు 313
కటాక్షము
ఉ. నీ కడగంటిచూపు మము నిత్యముఁ గావదె? వేంకటేశ్వరా!
నీ కడఁ గంటిచూ పొరుల నీడను సైతముఁ జూడ నొల్లునే?
మా కడుగంటు దుఃఖములు, మా కడగండ్లు, భవాబ్ధివీచికల్
మా కడుగండముల్ వెసఁ దొలంగు స్మరించిన నీదు నామమున్ 314
పాదసేవ
మ. భవదీయాంఘ్రిసరోజసేవయె కదా పాపౌఘవిధ్వంసియై
భవమున్ ధన్యము సేయు నీ భువి, దయావారాన్నిధీ! యాప్తహృ
ద్భవనాంతర్లసదేకసంతతశ్రితార్తత్రాణసంకల్పసం
భవనారాయణజీవమూర్తిగఁ గనన్ బ్రార్థింతు మోక్షార్థినై 315
కం. కలకాలము కాదయ, దయ
కల కాలము నాప్తసఖులు కల కాలంబే
యిలఁ జాలు మనఁగ, మనదౌ
కలయిక కలకాల మున్నఁ గలకలము హరీ!
భావము-
ఎల్లకాలము కాదు, విష్ణుదేవా! (నీ)దయ ఉన్న కాలము మఱియు
నమ్మదగిన స్నేహితులు ఉన్న కాలమే భూమిపై బ్రతుకు సాగించడానికి
చాలును. మనది యైన కూటమి ఎల్లప్పుడు ఉంటే / మనది యైన
స్వప్నము (common dream) ఇకముందు ఉన్న కాలము ఉంటే*,
సందడే కదా!
(*ఈ రెండవ అర్థములో ‘ఇఁక’ వారు తమ మధ్యలోను, వెంటనే ఉన్న
తుంటరి అరసున్నను గెంటివేసేరు. వ్యాకరణరీత్యా “యిఁకఁ గల...” అని
ఉండాలి మఱి) 316