ఇండో - పాక్ యుధ్ధం 1965
ఎప్పటి కప్పుడు అగ్ర రాజ్యమైన అమెరికా దగ్గర భారత్ తనని ఆరడి పెడుతోందంటూ, భారత్ పైన లేనిపోని నేరాలు సృష్టించి, రకరకాల నిందారోపణలు చేస్తూ, కల్పిత కథలు అల్లి వారికి చెబుతూ, బుడి బుడి ఏడ్పులు ఏడుస్తూ, మొత్తానికెలాగైతేనేం పైవాళ్ళ సానుభూతిని, సహకారాన్ని సంపాదించుకో గల్గింది పాకిస్థాన్. పెద్ద రాజ్యమైన భారత్, చిన్న రాజ్యమైన పాకిస్థాన్ ని చిన్న చూపు చూస్తోందనీ, అన్యాయంగా బాధ పెడుతోందనీ నమ్మి, సంపన్న దేశమైన అమెరికా పాకిస్థాన్ కి ధన సహాయం మాత్రమే కాకుండా, తన దగ్గర ఉన్న అత్యాధునిక యుద్ధ సామగ్రిని కూడా ఇచ్చి ఆదుకుంది. అమెరికా అండ చూసుకుని 1965 వ సంవత్సరంలో పాకిస్థాన్ భారత్ తో కయ్యానికి మళ్ళీ కాలు దువ్వింది. “ఆపరేషన్ జిబ్రాల్టర్” అనే పేరుతో పాకిస్థాన్ వాళ్ళు భారత్ కి వ్యతిరేకంగా ఒక భయంకరమైన వ్యూహాన్ని రచించారు. ఇక తమకి తిరుగు ఉండదనే అనుకున్నారు. ఈసారి తప్పకుండా భారత్ పని సరి - అంటూ ఉప్పొంగి సాగింది పాక్ ప్రభుత్వం.
ఆటవికులైన కొండజాతి వాళ్ళను రెచ్చగొట్టి, వాళ్లను పంపి కాశ్మీర్ లో అల్లకల్లోలాన్ని సృష్టించి, అదే సమయంలో పాకిస్థాన్ భారత్ పైన యుద్ధం ప్రకటిస్తే, రెండు భయంకర శక్తులతో పోరాడలేక భారత్ తోక ముడవక తప్పదు, అలాగైతే తనకింక తిరుగు ఉండదు, భారత్ చిత్తు చిత్తు అవ్వడం ఖాయమని భావించి విర్రవీగింది పాకిస్థాన్.
నిజం చెప్పాలంటే పాకిస్థాన్ దగ్గర ఉన్నటువంటి, అమెరికా ఇచ్చిన, అధునాతన యుద్ధసామగ్రి భారత్ వద్ద లేదు. అమెరికా పాకిస్థానుకి జెట్ ఫైటర్ విమానాలు, అధునికమైన తుపాకులు, యుద్ధ టాంకులు లాంటి అత్యంత శక్తివంతమైన వాటిని ఇచ్చింది. ఇక పోతే భారత్ దగ్గర ఉన్న యుద్ధసామగ్రి ఎక్కువ భాగం సెకండ్ వరల్డు వార్ లో ఉపయోగించిన యుద్ధసామగ్రిలో చివరకు మిగిలివున్న కొద్దిపాటి పాతపడిన ఆయుధాలు మాత్రమే! కానీ సమస్త లోపాలనూ చక్కదిద్దగల పటిమ భారత యుద్ధవీరుల శౌర్యంలో, శక్తి , యుక్తి, సామర్ధ్యాలలో ఉంది. దానికి సాటి మరేదీ రాదు.
భారత్ సైన్యంలో పనిచేస్తున్న అబ్దుల్ హమీద్ అనే హవల్దార్, పాకిస్థాన్ ఆర్మీ నడుపుతున్న నాలుగు, అమెరికా ఇచ్చిన అతిశక్తివంతమైన “పట్టన్ టాంకు”ల్ని చాటున దాగివుండి పేల్చి పారేశాడు. ఎప్పటికప్పుడు తానున్న చోటును మారుస్తూ, పాక్ ఆర్మీకి కనిపించకుండా దాగి ఉండి చాలాసేపు అతడు పాక్ ఆర్మీతో ఒంటరిగా పోరాడి, వాళ్ళని తికమక పెట్టాడు. కానీ, చివరకు అతని ఉనికిని పసికట్టిన పాక్ సైన్యం చేతిలో మరణించి, అమరుడై అతడు వీరస్వర్గాన్ని చేరుకున్నాడు. యుద్ధానంతరం అతనిని “హీరో ఆఫ్ 1965 ఇండో పాక్ వార్” గా ప్రకటించి, భారతీయులు అమరుడైన తమ వీరసైనికునికి నివాళు లర్పించారు. భారత ప్రభుత్వం అబ్దుల్ హమీద్ కి మరణానంతర పరమవీరచక్ర అవార్డు (PVC)ని ఇచ్చి గౌరవించింది.
***
1965 యుద్ధ సమయంలో, భారత్ కి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనంత నిస్వార్ధ బుద్ధిగల భారత్ PM ఆయన మాత్రమే! తను భారత్ ని పాలించింది కొద్దికాలమే అయినా “పొట్టివాడైనా చాలా గట్టివాడు” అన్నపేరు గడించాడు ఆయన. పాక్ దురాలోచనను ముందుగానే పసిగట్టిన శాస్త్రిజీ, భారత సైన్యంలోని సేనాధిపతులకు, కాశ్మీర్ వైపునుండి కాకుండా పంజాబు గుండా పాకిస్థాన్ లోకి ప్రవేశించి, పాక్ సేనల్ని చిత్తు చేసి, ఘనవిజయాన్ని సాధించమని ఆనతిచ్చాడు, మనసులో ఆశీర్వదించాడు.
భారత సేనలు సమరోత్సాహంతో, శరవేగంగా పంజాబ్ నుండి పాకిస్థాన్‌లోకి దూసుకు వెళ్లి, పాకిస్థాన్‌లోని ఎన్నో నగరాలు తేలికగా ఆక్రమించుకుని, అనతికాలంలోనే పాకిస్థాన్ కి మధ్య భాగంలో ఉన్న లాహోరుని చేరుకున్నాయి.
పాకిస్థాన్ వేసుకున్న ప్లాన్ తలక్రిందై, నిలువునా కుప్పకూలిపోయింది. విజయం భారత్ నే వరించింది.
కానీ, ఈ మాటు ఇరు పక్షాలకు మధ్య మధ్యవర్తిత్వం వహించినది, ప్రపంచలో ఉన్న రెండు అతి పెద్ద రాజ్యాలలో ఒకటైన సోవియట్ యూనియన్! భారత్ గెల్చుకున్న ప్రదేశాలన్నీ తిరిగి పాకిస్థాన్ కి ఇప్పించేసింది రష్యా. యుద్ధానికి ముందున్నట్లే, సరిహద్దులు ఏ మార్పు లేకుండా ఆ తరవాత కూడా ఉండేలా భారత్ ని ఒప్పించింది. సంధి పత్రాలపై సంతకం చెయ్యడానికి జనవరి 1966 లో, రష్యాలోని తాష్కెంటుకి వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి భారత్ కి తిరిగి వచ్చినది విగతజీవిగానే! ఆయనకు అక్కడ ఉండగానే అర్థరాత్రి సమయంలో “హార్ట్ అటాక్” రావడంతో మరణించారు. ఆ విధంగా ఒక ధృవతారను కోల్పోయింది భారత దేశం. అది సహజ మరణం కాదు - అని కొందరి అనుమానం. సరైన సమయానికి ఆయనకు ఏ వైద్య సహాయం అందలేదన్నది నిర్వివాదాంశం.
“జై జవాన్, జై కిసాన్” - అన్నది లాల్ బహదూర్ శాస్త్రి గళమెత్తి చేసిన నినాదం! మాతృ దేశం శత్రువుల పాలవకుండా అహర్నిశలు ప్రాణాలకు తెగించి సరిహద్దుల్ని కాపాడే సైనికుడికీ, శీతాతపాలు లెక్క చేయకుండా సంవత్సరమంతా మట్టి నేలల్లో పని చేసి, మనకు తిండి పెట్టి పోషించే అన్నదాతకీ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండి, వారి విజయాన్ని కోరుకోవాలన్నది ఆయన మనకు ఇచ్చిన అక్షర లక్షలు - కాదు - కాదు - ఒక అమూల్యమైన విలువ కల్గిన అద్భుత సందేశం! మనతో ఉన్నది కొద్ది రోజులు ఐనా, మనకు నిజమైన విలువలను గుర్తించడం నేర్పిన ఆ మహానుభావుడిని సదా మనం కృతజ్ఞతతో గుర్తు ఉంచుకోవాలి. మన దురదృష్టం వల్ల భారతదేశం ఎక్కువ రోజులు ఆయన పాలనలో లేకుండా పోయింది. భారతీయులకు ఎన్నటికీ మరుపురాని మహామనీషి లాల్ బహదూర్ శాస్త్రి!
1965 యుద్ధంలో భారత్ నెగ్గినప్పటికీ, ఇది భారత్ కు అంతులేని నష్టాన్నే కల్గించింది. ఆ సంవత్సరం ఆగస్టు నుండి, సెప్టెంబర్ వరకు సాగిన ఈ కొద్ది రోజుల యుద్ధంలో ఇరు పక్షాల సైనికులూ చాలా మంది చనిపోయారు. సెకండ్ వరల్డు వార్ తరువాత జరిగిన యుద్ధాలలో ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగిన యుద్ధం ఇదే అన్నారు యుద్ధ విశ్లేషకులు. పాక్ దుర్బుద్ధివల్ల ఇరు పక్షాలకీ చాలా పెద్ద ధన నష్టం, ప్రాణ నష్టం జరిగింది అన్నది చరిత్రలోని నిజం.
1965 యుద్ధంలో ఓడిపోయిన పాకిస్థాన్ ఏమాత్రం సిగ్గు పడకుండా, ఎప్పటిలాగే నెత్తిన కొంగువేసుకుని వెళ్లి అగ్రదేశాలముందు బుడి బుడి ఏడ్పులు ఏడ్చి, తమకి భారత్ వల్ల ఏదో జరగరాని అన్యాయం జరిగిపోయిందని వెక్కిళ్లు పెడుతూ చెప్పుకుంది. భారత్ పైన ఎన్నెన్నో అభూత కల్పనలతో కూడిన అభాoడాలు వేసీ, అబద్ధపు ఆరోపణలు చేసీ, ఎదుటి వారికి నచ్చేలా భారత్ పైన రకరకాల పితూరీలు చెప్పీ వాళ్ళ దయను, ఆపై సహకారాన్ని సంపాదించుకుంది. పాక్ ని నమ్మి జాలితో కరిగి నీరై, వాగయి ప్రవహించిన అగ్రరాజ్యమైన అమెరికా, పాక్ కి తన సహాయ, సహకారాల్ని వాగ్దానం చేసింది. అది చాలక భారత్ పైన తలమునకగా ద్వేషాన్ని పెంచుకుంది అమెరికా.
ఇక భారత్ తో యుద్ధం చేసి గెలవడం తమవల్ల కాదన్న విషయం గ్రహించిన పాకిస్థాన్ ఒక నీచ నికృష్ట నిర్ణయాన్ని తీసుకుంది. ఉగ్రవాదులను సృష్టించి, వారిని పెంచి, పోషించి, ఆ ఉగ్రవాదులను భారత్ లోకి దొంగ దారులవెంట ప్రవేశపెట్టి, భారత్ లో అరాచకాన్నీ, వినాశనాన్నీ సృష్టించి తమ పగను తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.
పగా! పగ ఎందుకు? అది ఎందుకో మనకే కాదు, భారత్ పై పగతో రగిలిపోతున్న ఆ పాకిస్థాన్ వాళ్లకి కూడా, సరైన కారణం ఏమిటి అన్నది తెలియదని అనుకోవచ్చు.
తప్పు తనది, శిక్ష మనకినా? యుద్ధం కావాలని భారత్ కోరుకో లేదు ఎప్పుడూ. అసలు పాకిస్థాన్ విడిపోవాలని కోరుకున్నది కూడా భారత్ కాదు కదా! వాళ్ళు కోరిన మీదట తప్పనిసరియై భారత్ వాళ్లకు తన భూమిలో కొంతమేర పంచి ఇవ్వవలసి వచ్చింది. ఇది అబద్ధము కాదు, చరిత్ర మనకు చెపుతున్న సత్యం ఇదే.
అది మొదలు కుటిలత్వం ప్రోత్సహించగా, పాక్ నుండి దొంగదారుల వెంట వచ్చిన ఉగ్రవాదులవల్ల భారత్ లో అనేక దుర్మార్గపు పనులు చోటు చేసుకోడం మొదలయ్యింది. వాళ్ళ అవినీతి వల్ల ఏ పాపమూ ఎరుగని అమాయకులైన భారత ప్రజలు అనేక రకాల ఇడుములు పడవలసి వస్తోంది. దీని ముగింపు ఎప్పటికీ?
***
చైనా సేనయైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)తో ఘర్షణ!
1967 వ సంవత్సరంలో సరిహద్దు దేశాలైన ఇండియా, చైనాల మధ్య మరో చిన్నపాటి యుద్ధంలాంటి తీవ్రమైన ఘర్షణ ఒకటి జరిగింది. ఇరు సేనల మధ్య సరిహద్దు తగాదాల వల్ల వచ్చిన విభేదం అది.
ఇండియా, చైనాలని విడదీస్తూ నిర్థిష్టమైన సరిహద్దురేఖ లాంటిది ఏమీ లేదు. రెండు దేశాల మధ్య నున్న సరిహద్దు రేఖ LAC (లైన్ ఆఫ్ యాక్ట్యువల్ కంట్రోల్) అన్నది ఒక ఊహా రేఖ మాత్రమే! ఇండియా పాకిస్థాన్ ల మధ్య ఉన్న LOC (లైన్ ఆఫ్ కంట్రోల్) లాంటి పటిష్టమైన "బార్బుడు వైర్ ఫెన్సింగ్" వంటిది భారత్, చైనాల మధ్యన ఏదీ లేదు. బ్రిటిష్ వారు నిర్ణయించిన చైనా భారత్ ల సరిహద్దు రేఖా “మెక్ మోహన్ లైన్” కాగితాల మీద మాత్రమే ఉంది. సరిహద్దును నిర్దేసిస్తూ ఏ ఫెన్సింగ్ లేకపోడంతో ఈ సరిహద్దు తగాదాలు అప్పుడప్పుడు భారత్ చైనాల మధ్య తలెత్తక తప్పడం లేదు.
టిబెట్ - సిక్కిం బోర్డర్ దగ్గరలో ఉన్న “నాధూ లా” కి, ఉత్తర దిశలో చైనా సైనికులు, దక్షణ దిశలో భారత సైనికులు, సరిహద్దుకు కాపలాగా ఒక్క 20 - 30 మీటర్ల ఎడంలో బసచేసి ఉంటారు. సుమారుగా 4,000 కి.మీ. ఉన్న ఇండియా - చైనా సరిహద్దులో మరెక్కడా అలా లేదు. ఇద్దరు శత్రువుల సేనలు ఎదురు ఎదురుగా వచ్చి నప్పుడు వారి మధ్య ఘర్షణలు జరగడమన్నది సర్వత్రా సాధారణమే కదా!
1967 వచ్చేసరికి భారత్ ప్రధానిగా ఇందిరా గాంధీ ఉంది. ఆమె హయాంలో భారత్ డిఫెన్సు రంగం కొంతలో కొంత బలోపేతం అయ్యింది. ఆమె హయాంలో, "7 మౌంటెన్ డివిజన్సు" చైనా సరిహద్దు కాపలాకు నియమించబడ్డాయి. చైనా సేనలు అటూ, భారత్ సేనలు ఇటూ సరిహద్దుకు కాపలాగా ఉన్నాయి.
1967 ఆగష్టు నెలలో NEFA లోని “నాథు లా” దగ్గర కాపలాగా ఉన్న చైనా సేనలు ట్రెంచిలు తవ్వుకుంటున్నారు. అలా తవ్వుకుంటూ తవ్వుకుటూ వాళ్ళు ముందు ముందుకు వచ్చి భారత్ భూభాగంలోకి ప్రవేశించబోతున్నారని గుర్తించింది అక్కడ కాపలాగా ఉన్న భారత్ సేన. ఆ తవ్వకాలు తమ భూభాగంలోకి రాకుండా ఉండడంకోసం హద్దును నిర్దేశిస్తూ, ఇండియన్ ఆర్మీ కొంత “బార్బుడు వైరు” తెచ్చి, భారత సరిహద్దుకు గుర్తుగా, అడ్డంగా ఉంచింది. అది చైనా వాళ్లకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళు సాయుధులై వచ్చి భారత సేనకు ఎదురు నిలిచారు. ఐనా, ఆ రోజు ఎవరూ తొందరపడి యుద్ధానికి దిగలేదు. చైనా సేన తమ అసమ్మతిని భారత సేనకు తెలియజేసి వెనక్కి వెళ్లిపోయింది.
తరువాత “నాథూ లా” కు దక్షిణపు దిక్కున, తమవైపున ఫెన్సు వేసుకుంటూన్న భారత సైనికులను చైనా ఆర్మీ కమాండర్ వచ్చి, “ఫెన్సు" వెయ్యడానికి వీలు లేదంటూ తీవ్రంగా ప్రతిఘటించాడు. కానీ, భారత్ ఆర్మీ ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో అక్కడ ఇరుపక్షాల సైనికుల మధ్య బాహా-బాహీ, కచా-కచీ, దొమ్మీ లాంటిది జరిగింది. ఇరువైపుల వాళ్ళకూ బాగా గాయాలయ్యాయి.
“పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా” అనబడే చైనా సామ్రాజ్యానికి చుట్టూ చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. చైనా తన రాజ్యాన్ని విస్తరించుకోడం కోసం ఏమాత్రం సంకోచ మన్నది లేకుండా సరిహద్దును దాటి, పక్క రాజ్యాల భూభాగాల్లోకి నెమ్మదిగా, చాపక్రింది నీరులా, ఎవరికీ తెలియరాని విధంగా కొద్ది కొద్దిగా ముందుకు చొచ్చుకు పోతూ, అన్యాయంగా తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం మొదలుపెట్టింది. దీనినే “సలామీ స్లైసింగ్” అంటారు. తమ రాజ్య విస్తరణకు చైనా అవలంబించే పద్దతులలో ఇది కూడా ఒకటి. అంత పెద్ద రాజ్యానికి ఇంత చిన్న కక్కుర్తి ఎందుకో!!!
ఇండియన్ ఆర్మీ, “నాధూ లా” మొదలు “సెబు లా” వరకు, ఇదివరకు వేసిన బార్బుడు వైర్లకు మధ్యలో మరొక బార్బుడు వైరు వెయ్యసాగారు. మళ్ళీ అడ్డుపడింది చైనా సేన. భారత్ వాళ్ళని పట్టించుకోకపోడంతో వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు ఏ గొడవా లేకుండా. కానీ, కొద్దిసేపు మాత్రమే ఆ ప్రశాంతత నిలిచి ఉంది.
అంతలో చైనా వైపునుండి గట్టిగా ఈల(విజిల్) ఒకటి వినిపించింది. మరుక్షణంలో సాయుధులైన చైనా సైనికులు వేగంగా ముందుకు వచ్చి, భారత్ సైనికులపై కాల్పులకు దిగారు. భారత సైనికులు కొందరు చూస్తూండగా చైనా సేన చేతిలో దివంగతులయ్యారు. దిగ్భ్రాంతికి లోనయ్యారు భారత్ జవాన్లు. కానీ, మరు క్షణంలోనే తేరుకుని ఎదురుకాల్పులు జరిపారు. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా మూడు రోజులపాటు అక్కడ ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది. చివరకు భారత వీరులు చైనా సేనను తరిమి కొట్టారు. విజయం భారత్ దయ్యింది.
***
మళ్ళీ, 1969 లో భారత్, చైనా సైనికులమధ్య మరోమారు “చో లా” దగ్గర ఘర్షణ జరిగింది. ఒక రోజు జరిగిన ఆ యుద్ధంలోనూ చైనా దళమే ఓడిపోయింది. భారత్ సేన విజయపతాకను ఎగురవేసింది.