Menu Close
Radhika-Nori
రాధికారుచిరం
రాధిక నోరి

ఎడమచేతివాటం

మానవ శరీరం బయటనుండి చూడటానికి చాలా సమతుల్యంగా, అంటే balanced గా వున్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి మానవ శరీరంలోని అవయవాలన్నీ అసమతుల్యంగా, అంటే imbalanced గా వుంటాయి అని సైన్సు చెపుతోంది. అంటే కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు, ఇలా అన్నీ సమాన పరిమాణంలో వుండవుట. చిన్న, పెద్ద తేడాలు, కొంచెంగా ఎగుడుదిగుడులు కూడా వుంటాయిట. కాకపోతే మరీ ఎక్కువగా వుండవు కాబట్టి మనకు తేలికగా కనిపించవు. ఉదాహరణకి గుండె వుంది, అత్యంత ముఖ్యమైన అవయవం, శరీరం అంతటికీ ప్రధాన కేంద్రం, చక్కగా శరీరం మధ్యలో వుండచ్చు కదా, ఉహు, ఒక పక్కగా, ఎడంవైపుగా వుంటుంది. సరే, ఇంక ఊపిరితిత్తులు వున్నాయంటే కుడిదాంట్లో మూడు ఖండాలు వుంటే, ఎడందాంట్లో రెండు ఖండాలే వున్నాయి. మరి ఎడమవైపు వున్న గుండెకి చోటు కావాలి కదా! అందుకని, పాపం, ఎడమ ఊపిరితిత్తుకు కుడిదానికంటే ఒక ఖండం తక్కువ.  అలాగే కాలేయం, అంటే liver అన్నమాట, చాలా భాగం కుడివైపు వుంటుంది. దానిలోని చిన్న ఖండం మాత్రం కొంచెం మధ్యకి జరిగివుంటుంది. ఇలాగే కళ్ళని పరిశీలిస్తే ఒక కన్ను రెండోదానికంటే కాస్తంత పైకి వుండే అవకాశం వుంది. అలాగే ఒక కాలు రెండోదానికంటే కాస్తంత పొడుగు కావచ్చు. కాకపోతే ఈ తేడాలు అత్యంత సూక్ష్మాతిసూక్ష్మంగా వుంటాయి కాబట్టి మనకు కనిపించవు. కనిపించాయి అంటే అప్పుడవి లోపాలైపోతాయి. అసాధారణ పరిస్థితులన్నమాట. కానీ నేను మొదట చెప్పినవి చాలా సాధారణమైన, 'ఫరవాలేదులే' అనుకునే పరిస్థితులన్నమాట.

దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే మన మెదడులో ఎడమభాగం మన శరీరంలోని కుడివైపుని నిర్దేశిస్తుంది. అలాగే మెదడులోని కుడిభాగం శరీరంలోని ఎడమభాగాన్ని నిర్దేశిస్తుంది. దీన్నే మనం English లో mirror image అంటాము. మన శరీరం చేసే పనులన్నిటినీ ఈ మెదడులోని రెండు భాగాలు పంచుకుంటాయి. ఆ పంపకంలో భాష, మాటలాంటి అత్యంత ముఖ్యమైన పనులన్నీ  మెదడులోని ఎడమ భాగం వాటాలోకి వెళ్ళిపోయాయి. మెదడులో ఏ భాగం ఎక్కువ శక్తివంతంగా వుంటే శరీరంలోని opposite భాగం అంత ఎక్కువ బలంగా వుంటుంది.  దాని ఫలితంగా కొంతమందిలో కుడిభాగం, మరికొంతమందిలో ఎడమభాగం కాస్త ఎక్కువ బలంగా వుంటాయి. అలా కుడిచేతివాటం, ఎడంచేతివాటం మనుషులు ఏర్పడతారు. కాకపోతే మానవ మనుగడకి భాష, భావప్రకటన చాలా ముఖ్యం కాబట్టి వాటిని నిర్దేశించే మెదడులోని ఎడమభాగం, దాని ప్రభావం వలన చలించే శరీరంలోని కుడిభాగం చాలామందిలో ఎక్కువ ఆధిపత్యం వహించటం చాలా సహజం. అందువలన చాలామంది కుడిచేతివాటంవాళ్ళే వుంటారు. దీన్నే మనం ఇంగ్లీష్ లో right shift అంటాము. ఎడమచేతివాటంవాళ్ళు చాలా అరుదుగా వుంటారు. అంతమాత్రం చేత వాళ్ళేదో తీసిపోయారని అర్ధం కాదు. కేవలం భిన్నం మాత్రమే అని అర్ధం, అంతే! అందుకే W.C. Fields అనే అమెరికాకు చెందిన ఒక ప్రసిద్ధ రచయిత, హాస్య నటుడు If the right side of the brain controls the left side of the body, then only lefthanders are in their right minds అని చాలా గర్వంగా, కొంచెం హాస్యంగా కూడా, అన్నారు. సరే, ఎవరు ఎక్కడ ఎందుకు ఎంత శాతం ఎక్కువ వున్నారు, లేదా తక్కువ వున్నారు అన్న వివరాలలోకి వెళ్ళేముందు ఈ ఎడమచేతివాటం గురించి ఇంకొన్ని వివరాలు  తెలుసుకుందాం.

అసలు ఎడమ, అంటే ఇంగ్లీష్ లో left అన్న పదం, Lyft అనే ఒక Anglo-Saxon పదం లోంచి వచ్చిందిట. ఆమాటకి  బలహీనం, అంటే ఇంగ్లీష్ లో weak అని అర్ధం. అయితే ఎడమచేతివాటం మనుషులలో మాత్రం ఈ విషయం ఏమాత్రం నిజం కాదు సరికదా, దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రపంచంలో వున్న ఎడంచేతివాటం మనుషులలో కనీసం కొంతమందినన్నా మనం గుర్తు చేసుకుంటే వాళ్ళెంత గొప్పవారో, శారీరకంగా తెలీదు కానీ మానసికంగా మాత్రం వారివారి రంగాల్లో ఎంత బలవంతులో మనకి జ్ఞాపకం వస్తుంది. Oprah Winfrey, Lady Gaga, George Bush, Bill Clinton, Barack Obama, Tom Cruise, Paul McCartney, Leonardo De Vinci, Albert Einstain, Aristotle, Napoleon Bonaparte, Babe Ruth, Amitabh Bacchan ఇలా ఈ పట్టికకు ఒక హద్దు అంటూ లేదు. అనేకమంది మేధావులు, గొప్ప కళాకారులు, నేతలు ఎడమచేతివాటం వారే! అందుకే ఇలాంటి గొప్ప మేధావులను చూసే కాబోలు, Life without lefthanded people would not be right అని South America కు చెందిన C. R. Manske అనే ఒక రచయిత్రి అన్నారు.

అయితే ప్రపంచం మొత్తంలో వీరు ఎక్కడ ఎక్కువ వున్నారు అని చూస్తే తూర్పు దేశాల్లో కంటే పశ్చిమ దేశాల్లోనే ఎక్కువ కనిపిస్తారు. ప్రపంచంలోకల్లా ఎక్కువమంది ఎడమచేతివాటంవారు Netherlands దేశం లో 13.23 శాతంతో వున్నారట. ఆతర్వాత అమెరికా దేశంలో, Belgium దేశంలో 13.10 శాతంతో, ఆతర్వాత కెనడా దేశంలో 12.8 శాతంతో వున్నారట. అలాగే అతి తక్కువ శాతం ఎక్కడ వున్నారు అని చూస్తే  ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలు, అంటే middle eastern దేశాలు కనిపిస్తాయి. దీనికి ఒక మంచి  తార్కికమైన, అంటే logical కారణం వుంది. తూర్పు దేశాల్లోని వారికి ఎడమచేయిని వాడితే అదేదో అపశకునంలాగా,  అగౌరవమైన, అశుభమైన,  అశుభ్రమైన, అపవిత్రమైన పనిలాగా అనిపిస్తుంది. దానికి తోడు వారి సంప్రదాయాలు చాలా కఠినంగా, ఖండితంగా, స్థిరంగా వుంటాయి. ఏమాత్రం మారటానికి అవకాశం లేకుండా మూసివేయబడిన వ్యవస్థలాగా వుంటాయి. అందుకని వారి అభిప్రాయాలు కొంచెమైనా సరే, మార్చుకోవటానికి ఎవరు చెప్పినా, ఎట్టి పరిస్థితిలోనూ వారు ఇష్టపడరు. అంతేకాకుండా ఎడమచేతిని వారు సౌచాలయశుభ్రతకు వాడతారు, అందుకని అదే చేతిని ఇతర పనులకు వాడటానికి వారు అంతగా ఇష్టపడరు.

నా చిన్నతనంలో, ఏదన్నా గుడికి వెళ్ళినపుడు పూజారిగారు ప్రసాదం ఇస్తే దాన్ని తీసుకోవడానికి పిల్లలెవరైనా ఎడమచేయి చాపితే పెద్దవారు వారిని కోప్పడటం నాకింకా గుర్తుంది. ఎడమచేయి ఏమిటి, కుడిచేత్తో తీసుకో అంటూ వాళ్ళేదో తప్పు చేస్తున్నట్లు వారిని గద్దించి,  సవరించేవారు. అంతేకాదు. ఎడంచేత్తో ఎవరికైనా ఏదన్నా ఇవ్వడం కూడా తప్పే! అలా ఎడమచేతితో ఇస్తే వారిని అగౌరవపరచడం అన్నమాట. అందుకే ఎడంచేత్తో ఏమిటి, కుడిచేత్తో ఇవ్వు అంటూ పెద్దవారు ఇతరులముందే  కోప్పడేవారు. మనలో చాలామంది అలాగే పెరిగాం. అవునా? అంటే వారి దృష్టిలో ఎడమచేతితో ప్రసాదం తీసుకోవటం కానీ, ఆ చేత్తో అన్నం తినడం కానీ, చివరికి ఎవరికైనా ఏదన్నా ఇవ్వడం కానీ చాలా అమంగళకరం, పెద్ద అపరాధం. అందుకని కుడిచేతిని మాత్రమే వాడాలి. ఇలాంటి అర్ధం, పర్థంలేని నమ్మకాలతో, మూఢవిశ్వాసాలతో మనం ఎడమచేతిని చిన్నచూపు చూసాం. కుడిచేతికి అవసరానికి మించిన ప్రాముఖ్యతను ఇచ్చి, ఎడమచేతికి అవసరమైనా కూడా ఇవ్వవలసిన ప్రాధాన్యతని ఇవ్వకుండా అగౌరవపరిచాం. మన పిల్లలని ఎడమచేతిని వాడటానికి నిరుత్సాహపరిచాం. అదేదో తప్పులాగా ఆ అలవాటుని మార్చటానికి ప్రయత్నించాము.  అమంగళకరం, అగౌరవనీయం, అశుభకరం అని వాళ్ళ మనసులలో తప్పు అభిప్రాయబీజాలను నాటాము. అందుకే తూర్పు దేశాలలో ఇలాంటి మూఢనమ్మకాల కారణంగా ఎడమచేతిని వాడేవాళ్ళు తక్కువయ్యారు. ఇలాంటి నమ్మకాలేవీ లేని పశ్చిమ దేశాల్లో ఎవరికైనా ఆ అలవాటు పడితే అది అలాగే వుండిపోయింది. అందుకే అక్కడ ఎడమచేతిని వాడేవారు ఎక్కువయ్యారు. బహుశా అదే కారణం అయివుండచ్చు. అందుకే  I may be left-handed but I am always right అనే లోకోక్తి కూడా అక్కడే పుట్టివుంటుంది.

అయితే మధ్యయుగంనాటి రోజుల్లో పశ్చిమదేశమైన గ్రేట్ బ్రిటన్ లో ఒక నానుడి వుండేదిట. ఎడమచేతిని వాడేవారికి దెయ్యాలతో, భూతాలతో సంపర్కాలుంటాయని, వారికి చేతబడులు లాంటి విద్యలు కూడా వచ్చివుంటాయని అప్పట్లో వారు నమ్మేవారుట. మరి అందుకో, లేక వేరే ఇంకేదో కారణం వల్లనో తెలీదు కానీ గ్రేట్ బ్రిటన్ కి చెందిన అప్పటి రాజు King George VI (ఇప్పటి రాజు King Charles II కి తాత) కి ఎడమచేతిని వాడే  అలవాటు వుంటే ఆయన తండ్రి King George V ఆయన చేత ఆ అలవాటు మాన్పించి కుడిచేతిని బాగా వాడేట్లు కొత్త అలవాటు చేయించారట.

అసలు మనం పుట్టకమునుపు అమ్మ పొట్టలో వున్నప్పుడు ఏ చేతి వేలును నోట్లో పెట్టుకుని  వుంటామో మనం పుట్టిన తర్వాత కూడా అదే చేతిని ముఖ్యంగా వాడుతామని రిసెర్చి చెపుతోంది. అలాగే ఎడమచేతివాటం వున్న తల్లితండ్రులకు పుట్టిన పిల్లలకు కూడా ఈ ఎడమచేతివాటం అలవాటయే అవకాశం ఎక్కువ వుందని కూడా రిసెర్చి చెపుతోంది.  ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే identical twins అయినా సరే, పిల్లలిద్దరికీ వేరు వేరు dominant hand వుండే అవకాశం  వున్నదట.

నేను ముందే చెప్పినట్లు ఎడమచేతివాటంవారు ఈ ప్రపంచం జనాభాలో చాలా తక్కువ వున్నారు. అందుకేనేమో, వారికోసం ప్రత్యేకమైన వనరులు, అవకాశాలు ఏవీ లేవు. వారికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఏమీ లేదు. కుడిచేతివాటంవారు అతి సులభంగా వాడే అనేక వస్తువులు ఎడంచేతివాటంవారికి వాడటానికి  కొంచెం కష్టతరంగానే వుంటాయి. పైగా మనం ప్రతీరోజు వాడే వస్తువులన్నీ చాలామటుకు కుడిచేతివాటంవారి కోసమే తయారుకాబడ్డాయి. ఏదన్నా డబ్బా మూత తెరవాలన్నా, ఏదన్నా సంగీతవాయిద్యం వాయించాలన్నా, పాపం, ఎడమచేతివాటంవాళ్ళు ఎంత కష్టపడాలో! అసలు ఆమాటకొస్తే ఎడమచేతితో ఏదన్నా సంగీత వాయిద్యం ఎవరైనా వాయించటం నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే  దానికి తగ్గట్లుగా వీలుగా వుండే వాయిద్యం ఏదీ? అందుకే అలాంటి వాయిద్యాన్ని కూడా, ఎక్కడన్నా వున్నాయేమో, కానీ నేను మాత్రం ఎప్పుడూ చూడలేదు. కనీసం వినను కూడా లేదు.

అందుకేనేమో 1990 లో గ్రేట్ బ్రిటన్ లో Lauren, Keith Milsom అనే దంపతులు, Keith తండ్రిగారైన Reg Milsom తో కలిసి ఈ ఎడమచేతివాటంవారి కోసం ఒక club ని స్థాపించారు. రోజువారి జీవితంలో ఎడమచేతివాటంవారు పడే practical కష్టాల గురించి అందరికీ తెలియచెప్పటం, నిజజీవితంలో మనం ఎప్పుడూ వాడే వస్తువులని ఎడమచేతివాటంవారిని కూడా దృష్టిలో పెట్టుకుని తయారుచేయమని, వాటికోసం ఇంకా ఎక్కువ రీసర్చ్ చేయమని  ఆ కంపెనీలవారికి గుర్తుచేయటం ఆ club ముఖ్యోద్దేశం. మొదటిసారి 1992 లో ఈ club వార్షికోత్సవాన్ని గ్రేట్ బ్రిటన్ లో జరుపుకుంది. తమలాంటివారికి వున్న కష్టాలు, నష్టాలు, ప్రత్యేకతలు కూడా ఈ ప్రపంచానికి తెలియచెప్పడమే ఈ వార్షికోత్సవ ముఖ్యోద్దేశం. దానితోపాటు తమలాంటివారందరిని నలువైపులనుండి ఒకచోట చేర్చి వారందరి మధ్య స్నేహాన్ని నెలకొల్పడం కూడా వారి ముఖ్యోద్దేశమే! వారి కోరికమేరకు ప్రపంచం నలువైపుల నుండి ఈ వార్షికోత్సవ ఉత్సవాలలో పాల్గొనడానికి ఎడమచేతివాటంవారందరు, చాలామందే వచ్చారట. ఆటలు, పాటలు, పార్టీలు, అబ్బో, ఒకటేమిటి, బోలెడన్ని సరదాలు, బోలెడంత సందడి చేసుకున్నారట. ,

అన్నట్లు ఈ ఎడమచేతివాటంవారికి ఒక website కూడా వుందండోయ్. www.lefthandersday.com.   ఈ site లో మీకు వారి వార్షికోత్సవ వివరాలన్నీ దొరుకుతాయి.

అంతేకాదు. 1976 లో Dean R Campbell అనే ఆయన ఆగస్టు 13 ని International Lefthanders’ Day గా పరిగణించాడు. దాని ద్వారా ఎడమచేతివాటంవారు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అందరి దృష్టికి తీసుకురావడమే ఆయన వుద్దేశం.

అమెరికాలో West Virginia అనే రాష్ట్రంలో, మీరు నమ్మరేమో కానీ Left Hand అనే ఒక నగరం కూడా వుంది. ఆ రాష్ట్ర రాజధాని అయిన Charleston కి సుమారు ఒక అర్ధగంట డ్రైవింగ్ దూరంలో వుంది ఆ వూరు. అక్కడ జనాభా కేవలం 498 మంది మాత్రమే! కానీ అక్కడి ప్రకృతి సహజసౌందర్యానికి అందరు ఆకర్షితులవుతారట. అయితే అక్కడ వున్న ప్రజలంతా ఎడమచేతివాటంవారు అవటం వలననే ఆవూరికి ఆ పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారు కాబోలు. అది నిజం కాదు. ఆ ఊరికి దగ్గరలో వున్న Left Hand అనే ఒక వాగు కారణంగా ఆ ఊరికి ఆ పేరు వచ్చిందిట.  ఏమైనా ఆ వూరిపేరు మాత్రం చాలా ప్రత్యేకమైన పేరు సుమా!

అసలు ఎడమచేతివాటంవారే ప్రత్యేకమైన మనుషులు. వారు కేవలం రాయటం, పనులు చేయటం వంటివి మాత్రమే విభిన్నంగా చేయరు, వారి ఆలోచనావిధానం కూడా చాలా విభిన్నంగానే వుంటుంది. అందుకే Peter Cole C. Onele అనే నైజీరియాకు చెందిన ఒక వకీలు ఎడమచేతివాటంవారు ప్రత్యేకంగా వున్నారు కాబట్టి విభిన్నంగా వుండరు, వారు విభిన్నంగా వున్నారు కాబట్టి ప్రత్యేకంగా వుంటారు అని అన్నారు.

అయితే ఎడమచేతివాటం గురించి కొన్ని ప్రతికూల వాదనలు కూడా వున్నాయి. ఏదన్నా కొత్త విషయం నేర్చుకోవడంలో వారు వెనుకబడతారని, వారికి తెలివితేటలు తక్కువని, వారికి అభ్యాస వైకల్యాలు, అంటే learning disabilities వుంటాయని, వారికి తేలికగా Parkinson’s disease వచ్చేస్తుందని, అదని, ఇదని, ఇలా ఏవేవో లేనిపోని పుకార్లు వున్నాయి. కానీ ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే! ఏమాత్రం నిజాలు కావు. ఎందుకంటే వీటికి శాస్త్రపరంగా ఏమాత్రం  ఋజువులు లేవు. కానీ వీటికి వ్యతిరేకంగా చెప్పాలంటే  మాత్రం శాస్త్రపరంగా ఋజువులు వున్నాయి. ఎడమచేతివాటంవారు చాలా తెలివైనవారు అని కొంతమంది అంటారు. గొప్ప శిల్పులు, కళాకారులు అని  మరికొంతమంది అంటారు. Leonardo da Vinci, Tom Cruise, Amitabh Bacchan లాంటి గొప్ప కళాకారులు వెంటనే నా మనసులోకి వస్తున్నారు. Ronald Reagan, Barack Obama, Bill Clinton లాంటి మహానేతలు కూడా నాకు గుర్తు వస్తున్నారు. ఇంక Babe Ruth లాంటి క్రీడాకారులు, Aristotle లాంటి మహా మేధావుల సంగతి విడిగా చెప్పాలా? వారు ఎప్పుడూ జ్ఞాపకం వుండనే వుంటారు. ఇంక సైన్సు ప్రకారం ఋజువుల గురించి చెప్పాలంటే ఎడమచేతివాటంవారికి మెదడులో lateralization, తక్కువగా వుంటుంది. అంటే వీరి  మెదడులో ఎడమ లేదా కుడి వైపునకు ఒక నిర్దిష్ట విధి అంటూ ఏదీ పరిమితం అయి వుండదు. అందుకే వీరు ఏ పని అయినా తేలికగా నేర్చుకోవడానికి, శరీరంలో కుడి, ఎడమ అన్న తేడా లేకుండా ఎటువైపైనా సమాన ప్రతిభను చూపించగలగడానికి, దానిలో అమిత ప్రతిభను ప్రదర్శించడానికి చాలా అవకాశం వుంటుంది. రెండు చేతులతో బాణాలు వేయగల సవ్యసాచి, మన అర్జునుడు ఇప్పుడు నాకు గుర్తు వస్తున్నాడు. అమెరికా మాజీ రాష్ట్రపతి అయిన Ronald Reagan గారు ఎడమచేతివాటం అయినా కుడి చేతిని కూడా సమాన ప్రతిభతో వాడగలిగేవారట. అలాగే అమెరికా 20 వ రాష్ట్రపతి, James  Garfield అనే ఇంకో మాజీ రాష్ట్రపతి Latin భాష ఒక చేతితో, Greek భాష ఇంకో చేతితో రాసేవారట. ఇలా రెండు చేతులను సమాన ప్రతిభతో వాడగలగడాన్ని English లో Ambidextrousness , అంటే సవ్యసాచిత్వం అన్నమాట, అంటారు. ఎడమచేతితో చిన్న పూచికపుల్లని కూడా  కొంచెమైనా కదిలించలేని నాలాంటివారికి ఇవన్నీ అసాధ్యాలుగా అనిపిస్తాయిలెండి. కానీ ఇవన్నీ అపార సత్యాలు. సరే, ఇలాంటిదే ఇంకో రకం కూడా వుంది. దాన్ని Mixed handedness అంటారు. అంటే కొన్ని పనులకి కుడిచేతిని, వేరే ఇంకొన్ని పనులకి ఎడమ చేతిని వాడటం అన్నమాట. ఉదాహరణకి చింపాంజీ వేరువేరు పనులకి తనకిష్టమైన చేతిని వాడుతుందట.

ఒక్క సెకను ఆగండి. ఈ విషయం గమనించారా? ఆఖరికి మన ఇతివృత్తం లోనికి ఇప్పుడు జంతువులు కూడా వచ్చేసాయన్నమాట. ఆస్ట్రేలియా జంతువు Kangaroo ఒక ప్రత్యేకమైన ఎడమచేతివాటం జంతువు. అలాగే చిలకలు కూడా ఆహారాన్ని తినటానికి తమ ఎడమ పాదాన్నే వాడతాయట. అంటే, అదేం వాటమో కానీ ఈ కుడి, ఎడమచేతివాటంలు మాత్రం జంతువులను కూడా వదలలేదన్నమాట. అన్నమాట ఏమిటి, వున్నమాటే అని అనిపిస్తోంది కదూ!

ఎడమచేతివాటంవారికి చాలా మారుపేర్లు వున్నాయి. కొందరు Lefties అంటారు. మరికొందరు Southpaw అంటారు. ఇంకొందరు Mollydooker అంటారు. Monalisa, The last supper లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రాలను చిత్రించిన చిత్రకారుడు, Leonardo da Vinci ని అందరూ Mancino అని పిలిచేవారట. అంటే Italian భాషలో ఎడమచేతివాటం అని అర్ధం అన్నమాట.

నేను అమెరికా వచ్చిన కొత్తల్లో ఒక విషయాన్ని బాగా గమనించాను. ఇండియాలో కంటే ఈ దేశంలో బట్టతలవాళ్ళు, ఎడంచేతివాటంవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అని ఎప్పుడూ అనుకునేదాన్ని. సరే, బట్టతలవారిలో ఎక్కువగా మగవారే వుండటం సహజమే, కానీ ఎడమచేతివాటం వారిలో కూడా ఎక్కువగా మగవారే వుంటారట. 11 నుండి 12 శాతం మగవారు ఎడమచేతివాటం అయితే కేవలం 9 నుండి 10 శాతం మాత్రమే ఆడవారిలో ఎడమచేతివాటంవారు  వుంటారట. ఆసక్తికరమైన విషయం కదూ?  సరే, ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పనా? అమెరికాలో ఈ ఎడమచేతివాటంవారు ఎక్కువ శాతం Vermont రాష్ట్రంలో వున్నారట. ఆతర్వాత Massachusetts, ఆతర్వాత Maine, ఆతర్వాత Connecticut రాష్ట్రాలు వస్తాయట. సరే, ఇంక అన్నిటికంటే అతితక్కువ శాతం ఎక్కడ వున్నారు అని వెదికితే Wyoming, ఆతర్వాత North Dakota రాష్ట్రాలు కనిపించాయట. ఈ అంకెలను చూస్తుంటే ఎడమచేతివాటంవారికి demand సంగతి తెలీదు కానీ, బహుశా అది కూడా చాలానే వుందేమో, కానీ పాపం, supply యే తగినంత లేదు అని అనిపిస్తోంది కదూ?

నేను ముందే చెప్పినట్లు మన శరీరం చాలా అసమానత్వంతో నిండి వుంది. ఈ ప్రపంచంలో 40 శాతం వాళ్ళు left-eared, 30 శాతం వాళ్ళు left-eyed, 20 శాతం వాళ్ళు  left-footed,  వుంటారట, కానీ ఎడమచేతివాటంవారు మాత్రం కేవలం 10 శాతం మాత్రమే వున్నారట.  ఇంక రెండు చేతులవాటం వారైతే ఇంకా తక్కువ, కేవలం ఒక్క శాతం మాత్రమే! మన పురాణాలని పరిశీలిస్తే కూడా సవ్యసాచి అని ఒక్క అర్జునుడి గురించి చెప్పుకున్నామే తప్ప ఎడమచేతివాటంవారని వేరే ఇంకెవరిగురించీ విన్నట్లు గుర్తు లేదు. ఇంకో విషయం, మన దేశంలో వున్న అజంతా, ఎల్లోరా, మొహంజదారో లాంటి చారిత్రాత్మక ప్రదేశాల్లోని అతి ప్రాచీన శిల్పాలని పరిశీలిస్తే ఈ కుడిచేతివాటం ఎంత పురాతనమైనదో, అలాగే ఎడమచేతివాటం ఎంత అరుదైనదో మనకు తెలిసిపోతుంది. అరుదైనది, నిజమే, కానీ అల్పమైనది కాదు. అమంగళకరం, అశుభకరం, అగౌరవనీయం అంతకంటే కాదు. అవునా? మరి మీరందరూ నాతో ఏకీభవిస్తారా?  If nothing goes right, go left అన్న లోకోక్తి గుర్తు పెట్టుకుంటారు కదూ?

సరే, ఇంక ఈసారికి మరి ఇంతటితో ఆపనా? మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి, ఆసక్తికరమైన విషయాన్ని వెంటపెట్టుకొని మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు.

**********

Posted in November 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *