పెద నాన్నగారూ! పెద స్వామి తాతగారి సంతానంలో పోయిన వారు పోగా, మిగిలిన వారిలో పెద్ద వారు మీరు. ఆ తర్వాత మానాన్న గారు మోహన్ మాత్రమే. జనవరి ఒకటో తారీఖుకు మీరు మా ఊరికి రావాలి. మీరు వస్తానంటే పెదస్వామి తాతగారి సంతానం అందరినీ పిలుస్తాను. మన కుటుంబం లోని అందరమూ కలుసుకుందాం అని సురేష్ చెప్పాడు. మోహన్ కొడుకే సురేష్.
అలాగే. అందరం కలుసుకుందాము అన్నాడు శంకర్.
2026 జనవరి ఒకటవ తేదీన ఉదయం ఏడు గంటలకు బంధువులందరూ సురేష్ ఇంటిలో విశాలమైన హాలులో సమావేశమయ్యారు. సురేష్ తమ కుటుంబంలోని సభ్యులందరినీ చూపించడానికి తన ముఖ్యమైన స్నేహితులందరినీ ఆహ్వానించాడు.
సురేష్! మీ శంకర్ పెద నాన్న గారు ఇంకా రాలేదా? అని సురేష్ స్నేహితుడు అడిగాడు.
"ఆయన నిన్ననే వచ్చారు. ఉదయం అయిదు గంటలకే లేచి, అర్ధగంట సేపు వాకింగ్ చేసి వచ్చారు. కొంతసేపు యోగాసనాలు వేశారు. ఇప్పుడే స్నానం చేశారు. అయిదు నిమిషాలలో ఇక్కడికి వస్తారు" అన్నాడు సురేష్.
అంతలో పొట్టి పొడుగు కానీ ఎత్తుతో, లావు సన్నం కానీ శరీరంతో, రవ్వంతయినా లేని పొట్టతో, తెల్లని జుట్టుతో డెబ్భై సంవత్సరాల వయసులా కనిపిస్తున్న శంకర్ వచ్చారు.
మామయ్యా బాగున్నావా? బాబాయి బాగున్నావా? పెదనాన్నా బాగున్నావా? అంటూ అందరూ ఆయనను పలుకరించారు.
శంకర్ అందరి వంక చిరునవ్వుతో చూసి, నేను బాగానే ఉన్నాను. మీకు చూడడానికి ఎలా కనిపిస్తున్నాను? అన్నాడు.
మీరు చూడడానికి డెబ్భై సంవత్సరాల వయసు వారిలా ఉన్నారు. మీ వయసు ఎంత? అని సురేష్ స్నేహితుడు ఒకరు అడిగారు.
నా వయసు ఎనభై అయిదు సంవత్సరాలు అన్నారు శంకర్.
మీరు అంత వయసుగల వారిలాగా కనిపించడం లేదు. మీ ఆరోగ్య రహస్యం చెపితే మేము తెలుసుకుని, వీలైతే మేము కూడా ఆచరిస్తాం గదా! అన్నారు సురేష్ స్నేహితులలో మరొకరు.
***
నేను వ్యవసాయదారుల కుటుంబంలో 1940వ సంవత్సరంలో పుట్టాను. మాది మధ్య తరగతి కుటుంబం. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు.
నా తర్వాత తమ్ముడు మోహనుకు, నాకు వయసులో తేడా పద్నాలుగు నెలలు మాత్రమే. అందువల్ల మేము ఇద్దరం కవల పిల్లల లాగా ఉంటామని అందరూ అనేవారు.
చిన్నప్పటినుండి నేను, మోహన్ కలిసి ఆడుకునేవాళ్ళం. మా చిన్నతనంలో గోళీలు, కర్రా బిళ్ళ, బచ్చాలాట, కోకో, చెడుగుడు,అంటే ఇప్పటి కబడ్డీ, ఆటలు ఆడేవాళ్ళం. నేను నా తమ్ముడు మోహన్ ఒక పక్కన ఉండి ఆడితే, ఎప్పుడూ మేమే గెలిచే వాళ్ళం. మా స్నేహితులు కొందరు, మీ అన్నదమ్ములు ఒక పక్కన ఉంటే, మేము మీతో ఆటలు ఆడము అనేవారు. మా స్నేహితులు ఎవ్వరూ మాతో కుస్తీ పట్టేవారు కాదు. మాతో ఎవ్వరూ గెలిచేవారు కాదు. మా ఊరిలో ఉన్న మా వయసు పిల్లల్లో మేమే బలవంతులం.
మా ఊరిలో ఎలిమెంటరీ స్కూలు ఉండేది. హైస్కూలు లేదు. నేను ఏడవ తరగతి వరకు మా ఊరిలో ప్రైవేట్ స్కూలులో చదివాను. ఎనిమిదవ తరగతిలో తమరిశ హైస్కూల్లో చేరాను.
మా మోహను ఏడవ తరగతిలో చేరాడు. ఇద్దరం కలిసి హైస్కూలుకు వెళ్ళే వాళ్ళం. మేము హైస్కూలుకు వెళ్ళేదారిలో మా పొలం ఉండేది. సాయంత్రం స్కూలు నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు, పచ్చగడ్డి కోసుకుని తెమ్మని, మా నాన్న చెప్పేవాడు. మేము పచ్చగడ్డి, మా పొలంలో కాచిన బెండకాయలు, బీరకాయలు కోసి, మూట కట్టుకుని తెచ్చేవాళ్ళం, చలి కాలంలో ఇంటికి వచ్చేటప్పటికి చీకటి పడేది. చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు.
సెలవు రోజుల్లో రోజంతా ఆటలు ఆడేవాళ్ళం. సెలవు రోజున ఇంట్లో ఉండి చదువుకోకుండా, ఎప్పుడూ ఆటలేనా? అని అమ్మ నాన్న తిట్టేవారు. పక్క ఊరి హైస్కూలుకు రోజూ నడిచి వెళ్ళి రావడము, ఎక్కువ సేపు ఆటలు ఆడుతూ ఉండడం వల్ల మేము ఆరోగ్యంగా దృఢంగా ఉండేవాళ్ళం. నేను పదవ తరగతి పరీక్ష పాసయ్యాను.
ఎస్.ఎస్.ఎల్.సి. చదివే నాటికి నేను గుడివాడ హైస్కూల్లో చేరాను. మా ఊరికి గుడివాడ ఇంకా దూరము. రోజూ కొంత మంది పిల్లలం కలిసి నడిచి వెళ్ళేవాళ్ళం.
ఇంటర్ గుడివాడ కాలేజిలో చదివాను. ఇంటర్ చదివే రోజుల్లోనే గుడివాడ వ్యాయామశాలలో చేరాను. అక్కడ ఇసుక గుట్టలోని ఇసుక, పారతో తీసి పక్కన పోసేవాళ్ళము. ఇంకా వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్లం. ప్రతి రోజు ఉదయం గుప్పెడు శనగలు నీళ్లలో నాన బోసి, సాయంత్రం ఆ శనగలు తినేవాడిని. రోజు పొద్దున పాలు తాగేవాడిని. అందువల్ల నా శరీరం ఎంతో దృఢంగా అయింది. నేను బి.ఏ. పాసయ్యే వరకు గుడివాడలోనే ఉన్నాను.
నేను తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ. లో చేరాను. అక్కడ నా క్లాస్ మేట్ సుబ్బారావు వల్ల డంబెల్స్ చేయడం, యోగాసనాలు వేయడం నేర్చుకున్నాను. అతి కష్టమైన మయూరాసనం, శీర్షాసనం వేసేవాడిని. నౌలి చేయడం కూడా వచ్చింది. అప్పటినుండి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా అన్నీ చేస్తాను. ఇదే నా ఆరోగ్య రహస్యం అంటూ శంకర్ ముగించారు.
ఇంత క్రమ శిక్షణతో మీరు జీవించడంవలన, మీరు వయసును జయించారు. మీ వయసు కంటే ఎంతో చిన్న వారిలాగా కనిపిస్తున్నారు. మీరు మా అందరికీ ఆదర్శం అన్నారు సురేష్ మిత్రులు.
***
మధ్యాహ్నం భోజనాలు ముగించి అందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో, మోహన్ ... "మా కుటుంబంలో శంకరన్న ఒక్కడే బాగా చదువుకున్నాడు. నేను మా పెద్ద అన్నయ్య ప్రసాద్, మా తమ్ముడు రంగారావు, ఎవరమూ ఎస్.ఎస్.ఎల్.సి. దాటలేదు. మా శంకరన్న ఎమ్.ఏ., పిహెచ్.డి, చదివి అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఉద్యోగంలో చేరాడు. మా శంకరన్న తాను చదువుకున్నానని, ఉమ్మడి ఆస్తిలో మేము వాటా తీసుకోమన్నా కూడా తీసుకోలేదు. మా శంకరన్న నిరాడంబరంగా జీవించాడు. ఆయన ఇంటిలో విలాస వస్తువులు లేవు. ప్రొఫెసరుగా ఉద్యోగము చేసినా కారు కూడా కొనలేదు.
మా శంకరన్న ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఈ నాటి వరకు మా తోబుట్టువులు అందరికీ, ఆర్థిక సాయం చేస్తున్నాడు. మా శంకరన్న లాంటి వాళ్ళు నూటికి ఒకరు కూడా ఉండరు. శంకరన్న ఇద్దరు కొడుకులు ఇంజనీరింగులో పిహెచ్.డి., చేసి ఒకరు అమెరికాలో, మరొకరు చెన్నై లో పెద్ద పదవుల్లో ఉన్నారు. శంకరన్న లాంటి వాళ్ళు ఇంటికి ఒకరు ఉంటే ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అన్నాడు మోహన్.
***
శంకర్ గారి అన్న కొడుకు రాజా...
మా నాన్న సడెన్గా హార్ట్ ఎటాకుతో చనిపోతే, ఆ తర్వాత మా చెల్లెలి పెళ్ళి, బాబాయే చేశాడు. ఇప్పుడు నా కూతురిని ఇంజినీరింగు చదివించాడు. నాకు ఇంత సాయం చేసిన బాబాయి చల్లగా ఉండాలని నేను దేవుడిని కోరుకుంటాను అన్నాడు.
శంకర్ గారి అన్న రెండవ కొడుకు చిట్టిరాజ... నేను ఒకరిని నమ్మి డబ్బు ఇచ్చాను. నాకు అప్పు ఇచ్చిన వారు, తమ డబ్బు వెంటనే ఇవ్వమని ఒత్తిడి చేశారు. నాకు ఏమి చేయాలో దిక్కు తోచక, మానసిక ఒత్తిడికి లోనయ్యాను. నేను అడగక పోయినా నా పరిస్దితి తెలిసి నాకు వెంటనే మా శంకర బాబాయి రెండు లక్షల రూపాయలు పంపించాడు. అంతే కాదు. మా అమ్మాయి బి.డి.ఎస్. చదువుకు కూడా ఆర్థిక సాయం అందించాడు. శంకర బాబాయి ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడికి దణ్ణం పెట్టుకుంటాను అన్నాడు.
శంకర్ అన్న కూతురు తులసి ...
మా నాన్న సడెన్గా గుండె జబ్బుతో చనిపోతే, నా పెళ్లి ఖర్చు శంకర బాబాయే భరించాడు. మరల నా కూతురు పెళ్లికి, బాబాయే డబ్బు ఖర్చు పెట్టాడు. మా శంకర్ బాబాయి కలకాలం చల్లగా ఉండాలని నేను దేవుని కోరుకుంటాను" అంది.
శంకర్ రెండవ అక్క కూతుళ్ళు, భారతి, లక్ష్మీ, శంకర మామయ్య మాకు కూడా ఆర్థిక సాయం అందించాడు. ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు మనకు చేతనైన సాయం చేయాలి అని మామయ్య అంటాడు. ఆయనది అంత మంచి మనసు అన్నారు.
శంకర్ చిన్న తమ్ముడు కూతురు రేణు, వనజలు...
శంకర పెదనాన్న మాకు కూడా ఆర్థిక సాయం చేశారు. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పవద్దు అన్నారు. ఆయనకు తాను చేసిన సాయం పది మందికీ తెలియడం ఇష్టం లేదేమో అన్నారు.
సురేష్..." మా కుమారుడు సంతోష్ అమెరికాలో ఎం.ఎస్. చదివేటప్పుడు, శంకర పెదనాన్న కొడుకు అమెరికాలో ఉన్న కృష్ణఅన్నయ్య, మా సంతోషుకు ఫీజు కట్టాడు. నేను పెద నాన్నకు ఋణ పడి ఉన్నాను అన్నాడు.
మోహన్ ... మా చిన్నక్క కుటుంబానికి కూడా మా శంకరన్న ఎంతో సాయం చేశాడు. మా దురదృష్టం వల్ల మా చిన్నక్క, ఆమె కొడుకులు చనిపోయారు. నాకు కూడా మా శంకరన్న ఆర్థిక సహాయం చేసాడు.
ఈ రోజుల్లో అందరూ తాను తన భార్యా పిల్లలు బాగుంటే చాలు అనుకునే వారే. తల్లి దండ్రులను కూడా పట్టించుకోవడంలేదు.
మా శంకరన్న మా కుటుంబానికి కల్ప వృక్షం లాంటి వాడు. తన తోబుట్టువులు అందరికీ ఆర్థిక సాయం చేశాడని ఆయన చల్లగా ఉండాలని మేమందరం కోరుకోవడంవల్ల మా శంకరన్న ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయనకు వయసు సంఖ్య మాత్రమే అన్నాడు మోహన్.
***
అందరి మాటలను శ్రద్ధగా విన్న సురేష్ స్నేహితులలో ఒకరు, ఎవరైనా ఈ విషయాన్ని చెపితే నేను నమ్మే వాడిని కాదు. కానీ కళ్ళ ముందు ఆ మనిషిని చూస్తూ, మీరందరూ ఆయనను గురించి చెపుతుంటే నమ్మక తప్పడం లేదు అన్నాడు.
సురేష్ స్నేహితులలో మరొకరు...
ప్రొఫెసరుగా ఉద్యోగం చేసిన ఒక వ్యక్తి ఇంత నిరాడంబరంగా తాను బ్రతుకుతూ, డబ్బును పొదుపు చేసి, తన తల్లిదండ్రులు కన్న సంతానానికి ఆర్థిక సహాయం అందించాడంటే వినడానికే ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. ఆయనను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన వలె మనం చేయలేకపోయినా, ఇక్కడున్న మనందరం మన తోబుట్టువులకు కొంతయినా సాయం చేద్దాం. అలా ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అండగా ఉంటే, ఒకరిని చూసి మరొకరు సాయం చేస్తే, దేశమంతా సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది గదా! అన్నాడు.
అవును, అందరం అలాగే చేద్దాం అన్నారు ఏకగ్రీవంగా.