461.
నీకో పేరుందా
నాకో పేరుందా
ఇద్దరి పేర్లు పెనవేసుకునే దారుందా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
462.
నీకో ఊరుందా
నాకో ఊరుందా
ఇద్దరి ఊరు ఒకటయ్యే వీలుందా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
463.
నీకో ఎద్దుందా
నాకో ఎద్దుందా
నా మనసు ఎద్దు నీ బుద్ధిని తెలుసుకోలేక పోతుందా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
464.
నీకో పని ఉందా
నాకో పని ఉందా
నా పని నీ పనిలో పవిత్రమవక
పనికిమాలిన పనులతో పలచన అవుతుందా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
465.
నీకో పాముంది
నాకో పాముంది
నా పాము బుసలను నువ్వైనా తీయవా
పాములతో ఆడుకునే పరమేశ్వరా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
466.
నీ తలపై గంగుంది
నా తలపై బెంగుంది
నా బెంగను తీసే జ్ఞాన గంగను ఇవ్వవా ఈశ్వరా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
467.
నీదో ఆటనా
నాదో ఆటనా
ఈ ఆట అలజడిలో బ్రతుకు బాట
బలైపోయే పూదోటనా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
468.
నీ కంట్లో నిప్పు సెగే వెలుగైయ్యింది
నా కంట్లో కొపాగ్ని సెగే నేను కాల్చే పొయ్యి అయ్యింది
శిగతో శివాలెత్తే శివమూర్తి నీ కంటి అగ్గిసెగతో
నా ఒంటి అహంకారం సెగను బుగ్గిచేయవా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
469.
నీకంటూ మహిమ ఉందా
నాకంటూ మోహాముందా
నా మోహం నీ మహిమగా మార్చే, మనసే నీకు లేకుందా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.
470.
నీకో దండమయా
నా బ్రతుకే దినదిన గండమయా
నే పెట్టిన దండమే దక్షిణగా భావించి
దయ చూపి నా బ్రతుకును పండించవయా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా.