Menu Close
Ghali Lalita Pravallika
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

ఉదయాన్నే తయారయ్యి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రణవి. రోజూ టైమ్ కి వచ్చే బస్సు... ఎంతకీ రాలేదు. కాసేపు చూసి, డ్రైవర్ కి ఫోన్ చేసింది.

"బస్సు సాంకేతిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. రెండవ నెంబర్ బస్ అటు వచ్చి, మిమ్మల్ని ఎక్కించుకుంటుంది. ఓ అరగంట సమయం పడుతుంది," అంటూ చెప్పాడు డ్రైవర్.

'అరగంట అంటే స్కూల్ కి ఆలస్యం అయిపోతుంది. అందులో ఈ రోజు తనదే పరీక్ష. తను ముందు ఉండాలి,' అనుకున్న ప్రణవి, ఆటోలో వెళ్ళాలనుకుంది.

ఆటోల వాళ్ళు స్కూల్ దగ్గరకు తీసుకు వెళ్ళటానికి, చాలా ఎక్కువ అడిగారు. అంత పైకం తనదగ్గర లేకపోవడంతో, జంబేష్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది.

"అయితే నాకెందుకు చెబుతావు? ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ననే ఆలోచనతో డబ్బులు కాస్త ఎక్కువగా నీ దగ్గర ఉంచుకోవాలి కదా!" అన్నాడు.

"నాకు మీరు చేతిలో ఉంచుకోమని ఏమాత్రం డబ్బులు ఇవ్వలేదు ," అంది భయపడుతూనే.

"నువ్వు చేసే బోడి ఉద్యోగానికి, నేను నీకు డబ్బులు ఇవ్వాలా? నేను నిన్ను దిగబెట్టాలా? ఇలా ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేయక. నేను ఆఫీసులో బిజీగా ఉంటాను," అంటూ ఫోన్ కట్ చేసేసాడు.

ప్రణవి లో టెన్షన్ మొదలైంది. ఎగ్జాం టెన్షన్ ఒకపక్క, స్కూల్ కి ఎలా వెళ్ళాలి అనే టెన్షన్ మరోపక్క. టెన్షన్ గా రోడ్డు పక్కగా నుంచున్న ప్రణవి దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది.

'ఈ ఊర్లో తనకు పరిచయం అయిన వాళ్ళు ఎవరూ లేరు కదా! ఎవరబ్బా!' అనుకుంటూ చూసింది.

ఇంతలో కార్లోంచి ఐదవ తరగతి చదువు తున్న పావని దిగి,

"స్కూల్ కేనా మిస్. మా కార్లో డ్రాప్ చేస్తాను రండి," అంటూ పిలిచింది.

కాగల కార్యం గంధర్వులు తీర్చారని మనసులో అనుకొని, ఆ పిల్లకి ధన్యవాదాలు చెప్పి, కారులో ఎక్కి కూర్చుంది.

బడి ప్రారంభ సమయానికంతా చేరుకుంది. బడిలో ప్రార్థన జరుగుతున్నప్పుడు... కంప్యూటర్ స్టాఫ్ నందరినీ ఆఫీసు రూమ్ కి పిలిచారు.

వారి ముందే పరీక్ష పేపర్ల కవర్లను తెరిచి, ఎవరెవరు ఏ ఏ తరగతులకు వెళ్తున్నారో ఆయా తరగతుల ప్రశ్నాపత్రాలను ఆయా ఉపాధ్యాయులకు ఇచ్చి, తప్పులను తనిఖీ చేసుకోమన్నారు. కొందరు పేపర్ బాగుందని చెప్పారు. మరి కొందరు మా...మా పేపర్లలో మార్పులు లేవని, తప్పులు లేవని చెప్పారు. కొందరు వారి వారి ప్రశ్నాపత్రాలలో ఏమేం మార్చాలో తెలియజేశారు.

ప్రణవి డీల్ చేసే ఫిఫ్త్ క్లాస్ పేపర్ లో కూడా రెండు తప్పులు పడ్డాయి. ఆ పేపర్స్ కట్టను ఆమెకు ఇచ్చి, తప్పులను కొట్టివేసి పెన్నుతో సరిదిద్దండి అని చెప్పారు. మిగిలిన స్టాఫ్ తో పాటు ప్రణవి కూడా పేపర్స్ తీసుకుని, తప్పులు సవరించి హెడ్మాస్టర్ గారికి అప్పజెప్పింది. పని అయిపోగానే టీచర్లందరూ ప్రార్థన సమావేశం దగ్గరికి వెళ్లిపోయారు.

గుమాస్తా అవన్నీ తీసుకుని, ఏ రూమ్ కి‌... ఏ తరగతి కి, ఎన్ని పేపర్లు అనేది పరిశీలించి, ఆయా గదులకు అన్ని అన్ని తరగతుల పేపర్లతో పాటు, అడిషనల్ షీట్స్ రూమ్ నెంబర్లు ఉన్న అట్టలకి అమర్చి తాడుతో బిగించింది.

ప్రార్థన ముగిసాక స్టాఫ్ అంతా నోటీసు బోర్డు దగ్గరికి వచ్చి ఎవరెవరికి ఏ రూమ్ వేసారో చూసుకొని, సంతకాలు పెట్టి వారి వారి రూముల ప్రశ్నాపత్రాలను తీసుకుని వెళ్లారు.

ప్రణవికి, ఇంకో ఇద్దరు కంప్యూటర్ స్టాఫ్ కి ఇన్విజిలేషన్ డ్యూటీ వేయలేదు. ఎగ్జామ్ అప్పుడు పిల్లలకు ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పండి అని చెప్పారు.

ప్రణవి... ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే అన్ని రూములకు వెళ్లి, ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? అని అడిగి, ఒకరిద్దరేవో డౌట్లు అడిగితే చెప్పి, వచ్చేసింది. మిగిలిన టీచర్లు పిల్లల దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరి పేపరు తనిఖీ చేసి, సరిగ్గా రాయని వారి చేత జవాబులు చెప్పి రాయించుకుంటున్నారు.

"ఇదేంటి ఇలా రాయిస్తున్నారు. పరీక్షలు కదా!" అని ఓ టీచర్ ని అడిగింది ప్రణవి.

"చిన్నపిల్లలు కదా! చదివినది మర్చిపోతూ ఉంటారు. మనం గుర్తు చేయాలి. వాడు సరిగ్గా పేపర్ రాయకపోతే, టీచర్ సరిగ్గా పిల్లలకు అర్థమయ్యేట్టుగా చెప్పలేదు అని మళ్ళీ మనల్నే అంటారు. అందువల్ల పరీక్షలు జరుగుతున్నప్పుడు, మనం వెనకబడిన విద్యార్థుల పేపర్లను చూసుకోవాలి. వాళ్లు జవాబు రాసేట్టుగా వారికి కొంత మనం జవాబులు అందించాలి. నువ్వు కూడా వెళ్లి పిల్లల పేపర్లు ఒక్కొక్కరివి తీసుకొని సరిగ్గా రాస్తున్నారో లేదో చూసుకో. అందుకే మనకి ఇన్విజిలేషన్ డ్యూటీ వేయకుండా ఫ్రీగా వదిలారు. ప్రధానోపాధ్యాయులు వారు తనిఖీకి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త! పిల్లలకి జవాబులు ఏం చెప్పకు. వారికి వచ్చిన సందేహనివృత్తి చేస్తున్నట్టే ఉండు," అంటూ సలహా ఇచ్చింది ఆ టీచర్.

ప్రణవి కీ అంతా అయోమయంగా అనిపించింది. 'క్లాసులో పిల్లల చేత ప్రశ్నలు జవాబులు వల్లె వేయించింది. పిల్లలు అన్ని బాగా నేర్చుకున్నారు. కంప్యూటర్ ఎగ్జామ్ అంటేనే చాలా సులభంగా ఉంటుంది. ఇక ఇది చెప్పేదేముంది. వాళ్లు సరిగ్గా చెప్పలేదు ఏమో! అందుకనే ఆ టీచర్లు అవస్థ పడుతున్నారు. నేను పిల్లలకు బాగా చెప్పాను. నేను లెసన్ మధ్యలో... వారిని ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు చక్కగా చెప్పారు. ఇంకేం వీళ్ళు బ్రహ్మాండంగా రాస్తారు. నేను వంగుని, కూర్చుని, లేచి వాళ్ళ పేపర్లు పరిశీలించ వలసిన అవసరం లేదు.' అనుకుంది.

ఇంతలో ఒక రూమ్ లోంచి ప్రణవికి కబురు వచ్చింది. ఆ రూమ్ ఇన్విజిలేటర్ కబురు పెట్టారు. ప్రణవి అక్కడికి వెళ్ళింది.

ఆ మేడం చిన్నగా ఒక పిల్లవాడి వంక చూపించి, "వాడు ఏమి రాయలేదు. చెక్ చేసుకోండి. తర్వాత పేరెంట్స్ తోను మేనేజ్మెంట్ తోను ప్రాబ్లం వస్తుంది. మీరు కొత్త కాబట్టి చెప్తున్నాను," అంది.

ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి పేపర్ చెక్ చేసింది ప్రణవి. వాడు పేపర్ మీద, పేరు నెంబరు మాత్రమే వేశాడు. ఏ ప్రశ్నకి జవాబులు రాయలేదు.

డ్రిల్లింగ్ ఇవ్వడం వల్లనేమో! ప్రశ్నను చదివి వినిపిస్తే జవాబులు చెప్తున్నాడు. వాటినే రాయమంటే.... రాయలేకపోతున్నాడు. ఏం చేయాలో ప్రణవికి అర్థం కాలేదు.

"ఎగ్జామ్ ముందు క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయించలేదా?" అడిగిందా టీచర్.

"లేదు మేడం. నేను పిల్లలకి ఎగ్జామ్స్ కి ఏమి వస్తాయి అనేది చెప్పలేదు. మొత్తం అన్ని ప్రశ్నలను వారి చేత చదివించాను," అంది ప్రణవి.

“ఎగ్జామ్ ముందు పరీక్షలలోవచ్చేవి, పిల్లలకి అవే వస్తాయి అని తెలియనివ్వకుండా... మనం ప్రాక్టీస్ చేయించాలి. ఆ ప్రశ్నల జవాబులనే డ్రిల్లింగ్ ఇప్పించాలి," అని చిన్నగా చెప్పింది ఆ టీచర్.

ప్రణవి ఎందుకో ఆ విషయంతో ఏకీభవించలేకపోయింది. 'పరీక్షలు పెట్టేది పిల్లలు ఏం నేర్చుకున్నారో తెలియటానికి కదా! ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి, వాటి జవాబులు ప్రాక్టీస్ చేయిస్తే... వాటినే బట్టి కొట్టి, పరీక్షలలో పిల్లలు అవే రాసేస్తే... ఏమిటి ప్రయోజనం? అలాంటప్పుడు ఈ ఎగ్జామ్స్ పెట్టడం ఎందుకు? ఈ తతంగమంతా తల్లిదండ్రులను మోసం చేయటంకదా!' అనుకుంది.

"మేడం టైం అయిపోతోంది. ఎక్కువ సమయం మీరు ఈ రూములో ఉంటే... మనం ఏదో మాట్లాడుకున్నాం అనుకుంటారు. మీకు అన్ని రూమ్ లు తిరిగి పిల్లల్ని చూసుకోవటం కుదరదు. ఎగ్జామ్స్ అయిపోయాక ఏమి చేయలేరు. పేపర్లు ఇంటికి ఇవ్వరు. పిల్లల దగ్గర దిద్దడానికి లేదు. మేనేజ్మెంట్ వారు కేటాయించిన గదిలో కూర్చుని సెలవు రోజు వచ్చి దిద్దాలి," అని చెప్పింది అ టీచర్.

ప్రణవి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టింది.

"మేడం మనం ఒకళ్ళ కింద పనిచేయటానికి వచ్చాము. వారు చెప్పినట్టు మనం నడుచుకోవడమే. మన సొంత నిర్ణయాలు ఇక్కడ తావు ఉండదు. మీకు ఒక నిజం చెప్పనా!" అని ఎవరూ వినకుండా ప్రణవి చెవిలో... "ఈ తంతు మేనేజ్మెంట్ వారి సూచన మేరకే జరుగు తున్నాయి. మనకు మన సబ్జెక్టు అధికారి వారికి తెలియకుండా ఇలా చెప్పాలని సలహా ఇస్తారు. మనం ఆ భయం నటించాలి.

ఇది అందరికీ తెలిసిన రహస్యమైనా... పైకి అందరూ స్ట్రిక్ట్ గా ఉన్నట్టు నటిస్తారు. ఇక్కడే కాదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడైనా కూడా ఇదే వరుస. ఇక మీరు సమయము వృధా చేయకుండా... మీ పని పూర్తి చేసుకోండి. ఈ రూములో నేను చూసుకుంటాను మీరు వేరే రూమ్ వెళ్ళండి," అని చెప్పింది.

'ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తే మా పిల్లలు బాగా చదువుతారు. వాళ్లకి మంచి మార్కులు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అని తల్లిదండ్రులు అపోహపడుతూ ఉంటారు. నిజానికి జరుగుతున్న తంతు ఇదా! అయినా ప్రతి పిల్ల లు మేధావులు అవ్వాలని రూలు లేదు కదా!

అన్ని రకాల వారు ఉంటారు. ఈ తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోలేరు? వారికి నూటికి నూరు మార్కులు రావాలని కోరుకోవడం వల్ల కదా ఇలా జరిగేది. మేము అంతంత ఫీజులు కట్టి, మీ స్కూల్ కి పంపితే ఇవా వచ్చే మార్కులు? అని స్కూలు మీద విరుచుకు పడతారు. ఆ పిల్లవాడిని కూడా వాడి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాడికి 98 వస్తే నీకు 96 రావటం ఏమిటి? ఆ నాలుగు మార్కులు నువ్వు ఎందుకు సంపాదించుకోలేకపోయావు? అంటూ వాళ్లను దండిస్తారు. ముందు తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. జ్ఞానానికి మార్కులు కొలమానము కాదు అనే విషయం గ్రహించుకోవాలి. వారిని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి. ముందు ముందు ఈ విద్యావ్యవస్థను మార్చాలి,' అనేక రకాలైన ఆలోచనలతో ఉన్న ప్రణవిని సురేష్ వచ్చి హెచ్చరించాడు.

'ఉద్యోగం చేయాలంటే తలవంచక తప్పదు. వారు నిర్దేశించిన పద్ధతులను అనుసరించాలి' అనుకొని గబగబా వెనకబడిన పిల్లల పేపర్లను పరిశీలిస్తూ... ముందుకు సాగింది ప్రణవి.

★★★ సశేషం ★★★

రచయిత్రి పరిచయం ..

Ghali Lalita Pravallikaపేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in October 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *