Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు

మురళి, వెంకన్న స్నేహితులు. ఒకరోజు సాయంత్రం దగ్గరలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద కూర్చుని మురళి దినపత్రిక చదువుకుంటున్నారు. పక్కనే ఆయన మనవడు జున్నుబాబు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అప్పుడే వెంకన్న దిగులుగా మురళీ గారి దగ్గరకు వచ్చాడు.

"ఏం వెంకన్నా! అలా ఉన్నావు? ఏమైంది?" అని అడిగాడు మురళి.

"ఏం చెప్పమంటావు మురళీ.. మా అబ్బాయికి ఎన్ని సార్లు చెప్పినా వీడియో గేములు, ఆన్‌లైన్ ఆటలు మానట్లేదు. మొన్నటికి మొన్న ఇంట్లో ఉన్న నగలు కూడా తీసుకెళ్లి బెట్టింగ్‌లో పెట్టేశాడు. నా మాట వాడికి అస్సలు వినపడట్లేదు" అని నిట్టూరుస్తూ చెప్పాడు వెంకన్న.

మురళీ తన కళ్లద్దాలు తీసి, పేపరు పక్కన పెట్టి "నిజమే వెంకన్నా.. 'చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు' ఉంది నీ పరిస్థితి. వాడికి నువ్వు ఎంత మంచి చెప్పినా అది ఒక రొదలాగే వినిపిస్తుంది. బాధపడితేనే కానీ బోధపడదు వాడికి" అన్నాడు.

ఆ మాట వినగానే జున్నుబాబు ఆశ్చర్యంగా "తాతయ్యా! 'చెవిటివాడి ముందు శంఖం' అంటే ఏంటి తాతయ్యా?" అని అడిగాడు.

మురళీ గారు మనవడిని దగ్గరకు తీసుకుని మురిపెంగా "అది ఒక సామెత రా జున్నూ! శంఖం ఊదినప్పుడు వచ్చే శబ్దం చాలా పవిత్రమైనది, గొప్పది.

కానీ, అది ఒక చెవిటివాడి ముందు ఊదితే అతడికి ఏమీ వినిపించదు కదా? అలాగే, మనం ఎంత గొప్ప విషయం చెప్పినా, ఎంత మంచి మాట చెప్పినా.. అది వినడానికి ఇష్టం లేని వాడికి లేదా అర్థం చేసుకోలేని వాడికి చెబితే అది వృథా అవుతుంది.

వాళ్లకు అది కేవలం ఒక శబ్దం లాగే అనిపిస్తుంది తప్ప, దానిలోని మంచి అర్థం కాదు. అందుకే అలా అంటారు."

జున్నుబాబు తల ఊపుతూ, "ఓహో.. అంటే పెద్దలు చెప్పే మంచి మాటలు విని ఆచరించాలన్నమాట!" అన్నాడు.

మురళీ గారు నవ్వుతూ," పెద్దల మాట చద్ది మూట. ఆచరిస్తే మంచి జరుగుతుంది” అన్నారు.

“సరే తాతయ్యా! మీరు చెప్పిన మాట వింటాను” అన్నాడు.

“మీ మనవడు బుద్ధి” అన్నాడు వెంకన్న.

“నేను బుద్ధి” అనుకుంటూ ఆడుకోవడానికి స్నేహితుల దగ్గరికి పరుగుతీసాడు జున్నుబాబు.

***********

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 500 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in October 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *