Menu Close

కదంబం - సాహిత్యకుసుమం

ఓ (ఆడ) కూలీ కత!
- సముద్రాల హరికృష్ణ -
ఓ (ఆడ) కూలీ కత!

పూటపూటకు మాచెడ్డ వెతుకులాట,
దినము నా వీట!

పొట్ట కూటి కొకే పరుగు లటూ ఇటూ,
పొట్ట అరచేత!

కట్టు గోడల కడ, కూలిని;పెట్టు ఆ తల్లి
కడ, దాదిని

బండచాకిరి ఆ కొట్టాన,నోరువాయి లేని
ఓ చిరు జీవిని!
**
ఇంటి పని రామిని,అడుగు బొడుగుల
అన్న భోగిని

చంటి వానికి చాటుమాటున పాలిచ్చి
రంగాన దూకు నటమణిని

ఏ దిశగ పనినావ లాగితే,అటు తరలు,
నీడ లేని పక్షిని

కంట కన్నీరె రాకూడని,బతుకు కుస్తీల
ఆడు పోటరిని!
**
తల పైన ఒక్క సంచి, సంచి నిండుగ
ఒక్కటే మారుచీరె,

తల లోన ఉరికేటి వేచేటి యోచనలు,
అడుగు లా నగరి దిక్కు!

కలలోన తలపె రాదు కట్టేటి ఆ ఇల్లు
నాది కావాలని

వేళ కీ చెమటకు సరి జీత మిచ్చితే,
అదే పదివేలని!
**
ఈ దారి ఎటు సాగి పని దొరికితే,
అదే నా సొంత ఊరు,

నాది కానిది దారేది లేదు, పనియె
నను లాగు సూదంటు

తల దాచు పై కప్పు, ఒక్క గుడిసెకై,
చిరు ఆశ ఒకటి,

పదుల ఇళ్ళు కట్టిన చేతులు,నోచనా
చిన్న గూడొక్కటి?!
**
అదే తట్ట, అదే గంప, అదే మోత
ఇదేమి లెక్కల చిక్కో?!

ముట్టేదింతే అని తరుగు లేస్తారు,
బదులె లేదు ప్రశ్నకు!

బదులా?! మాది ప్రశ్నే కాదెవ్వరికి
ఆడకూలి అంత అలుసు!

హద్దుపద్దే లేని అడ్డచాకిరికి బాగ
పనికొచ్చే చౌక దినుసు!
**
ఏ దేవుని రాత కాదు,శ్రమకు ఫలం
రాని ఈ దైన్యం

మనుషులదే ఈ‌ తంత్రం, శ్రమల దోచే
అచ్చపు మోసం!

అన్యాయం తెలిసినా మాది ఆపలేని
బలహీన స్వరం

స్వేద జలం,గుండె బలం నడిపించే
ఆడ కూలిజనం!
**
బ్రతుకే మాకు బడి,మా రెక్క బలమే
మూల ధనం

అతుకుల ఉడుపులేమొ కాని మావి,
అభిమానమె కవచం!

కష్టానికి తగిన కూలి ఇస్తే సంతోషం,
ఎన్నడు దేహి అనం

ముత్తెపు గుణముల ముక్కుసూటుల
ఓరిమి పెద్దక్కలం!
**

Posted in October 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *