Menu Close
Uma Bharathi Kosuri
‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్’ ... ‘a friend in need’ (కథాభారతి)
కోసూరి ఉమాభారతి
A-friend-in-need

యోగా క్లాసు నుండి వచ్చి, లంచ్ తినేసి, పేపర్ వర్క్ పూర్తి చేసుకుని, ఓ కునుకు తీయడం నాకు పరిపాటయింది.

ఆ రోజు లంచ్ తినబోతుంటే, ఆగకుండా మ్రోగుతున్న ఫోన్ తీయక తప్పలేదు. "హలో" అన్నాను అసహనంగా. అటునుండి “10-10-1977”, “అదే.. అక్టోబర్ టెన్త్ 1977”…  గంభీరంగా ఉన్నా, ఆడమనిషి గొంతే. అలా ఆమె పలుకుతున్నది ‘నా పుట్టిన తేది. గబుక్కున ఫోన్ నెంబర్ చెక్ చేసి చూస్తే, న్యూయార్క్ నెంబర్. అనుమానం వచ్చింది. ఒకవేళ తనేనా?.. అనుకుంటుండగానే..

“టైం తీసుకో, గుర్తు వస్తానులే” మళ్ళీ అటునుండి ఫోన్లో గంభీరంగా ఆ గొంతు. ఫోన్ చేసి, పుట్టిన తేదీ గుర్తు చేయడమంటే? కళ్యాణి, నేను ఒకే రోజు పుట్టాము. గొంతు ఒకింత మారినా అనుమానం అక్కరలేదు. తప్పక కళ్యాణి అయి ఉండాలి.

“ఎవరు? కళ్యాణీ” అన్నాను. అటు నుండి ఉత్సాహంగా “ఆ నేనే, కళ్యాణినే, నువ్వు బాగున్నావా? ఎంతో కష్టపడి నీ నెంబర్ సంపాదించాను” అంటూ మొదలైన సంభాషణ ఐదు నిముషాలన్నా సాగి, “మళ్ళీ ఫోన్ చేస్తానే” అన్న కళ్యాణి మాటతోనే ముగిసింది.

తాను ఇంకా కూడా న్యూయార్క్ లోనే ఉన్నానని, అసాధారణ మలుపులు తిరిగిన తన జీవితం ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడిందని, వీలు చేసుకొని మా ఇంటికి వస్తానని కళ్యాణి అనడం… ఆ ఐదు నిముషాల సంభాషణ సారాంశం. నేనెక్కువ మాట్లాడలేదు. ఏమనాలో తెలియక మిన్నకుండిపోయాను.

ఫోన్ పెట్టేసి కళ్యాణి గురించిన ఆలోచనలో పడ్డాను. నా నెంబర్ దొరకపుచ్చుకోవడం అంత కష్టమా? మొదటి నుండీ మా ల్యాండ్‌లైన్ నంబర్ మారలేదుగా. తాను ఎప్పుడు ఏమాట ఎందుకంటుందో, అర్ధం కాదుగా! అంతు పట్టని మనస్తత్వం కళ్యాణిది.

నిజానికి కళ్యాణి నా చిన్ననాటి ప్రాణస్నేహితురాలు. పోయినసారి సరీగ్గా పాతికేళ్ల క్రితం... నన్నుచూడ్డానికి, పసిపిల్లాడితో డెన్వర్ లో మా ఇంటికి వచ్చి, నాలుగు రోజులు మా ఆతిధ్యాన్ని స్వీకరించి వెళ్ళింది. ఆమెని అప్పుడు చూడ్డమే.

అన్నేళ్ల నాటి ఆ కలయిక పిదప, కళ్యాణి ఇండియాకి వెళ్లడం, అమ్మావాళ్ళని కలిసి నా గురించి ప్రస్తావించడం తెలుసు. అటుపైన కళ్యాణి గురించి ఏనాడూ అనుకోలేదు, తలవలేదు, కలవలేదు.

ఉన్నట్టుండి.. పాతికేళ్ళ తరువాత ఈ నాటి కళ్యాణి ఫోన్ కాల్ ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటి కళ్యాణి రాకపోకల పర్యవసానాలు చేదు జ్ఞాపకాలనే మిగిల్చాయి. అనుకుంటూ ప్లేటులోకి ఉప్మా పెట్టుకుని కాఫీ కలుపుకున్నాను. వద్దనుకున్నా ఆ చేదు జ్ఞాపకాల దిశగానే మళ్ళింది ఆలోచన..

.. ముందుగా కళ్యాణితో నా చెలిమి నలభై ఏళ్ళ నాటిదని జ్ఞాపకం చేసుకున్నాను.. ..

ఏడేళ్ళప్పుడు సెకండ్ స్టాండర్డ్ లో పరిచయమయిన కళ్యాణి మా పక్కింటమ్మాయి అవడం, అనూహ్యంగా మా పుట్టిన తేదీలు కూడా ఒకటే అవడంతో మంచి స్నేహం ఏర్పడింది. జంట కవుల్లా కలసి తిరిగేవాళ్ళం. ఆటల్లో, చదువుల్లో అన్నిటా నాకన్నా కాస్త ముందే ఉండేది కళ్యాణి. అందరి మెప్పూ పొందేది. కాని, నలుగురితో కలిసేది కాదు. మా ఇద్దరిలో ఒకటే తేడా. తనకి కళల పట్ల ఆసక్తి ఉండేది కాదు. నేను కర్ణాటక సంగీతం ఇష్టంగా నేర్చుకునేదాన్ని. కళ్యాణి అంటే అమ్మకి కూడా ఇష్టమవడంతో మా స్నేహాన్ని ప్రోత్సహించేది.

నేను సిక్స్త్ స్టాండర్డ్ లో ఉండగా, నాన్న బదిలీ వల్ల మేము ఒరిస్సా కి వెళ్ళిపోయాము. కళ్యాణితో నాలుగేళ్ళ స్నేహం గురించయితే నాలో మంచి అనుభూతులే ఉండేవి. కళ్యాణి లాంటి ఫ్రెండ్ నాకు మళ్ళీ ఉండదనిపించేది.

కొద్ది కాలం, నాన్నగారి బదిలీల వల్ల ఆంద్రప్రదేశ్ కి దూరంగా ఉండిపోయాము.

***

తరువాత మరి కొన్నేళ్ళ కి మేము తిరిగి హైదరాబాదులో స్థిరపడ్డాక, కళ్యాణిని కాస్త ఆశ్చర్యకరమైన పరిస్థితిలో చూశాను. పేరున్న సైకియాట్రిస్ట్ కి చూపించాలని, ఆమెని తీసుకుని వాళ్ళ అమ్మ, అక్క హైదరాబాద్ లో మా ఇంటికే వచ్చారు. కళ్యాణి నాకన్నా పొడుగ్గా ఉంది. చురుగ్గా కనబడింది. ముభావంగా ఉంది. ఆమెకి, మెడికల్ కాలేజీ సీట్ సునాయాసంగా వచ్చిందట.

వచ్చిన రెండు రోజులకి గాని నాతో మాట్లాడలేదు కళ్యాణి. సైకియాట్రిస్ట్ తో తనకున్న అపాయింట్మెంట్ గురించి  ఆదుర్దాగా ఉందన్నది. “నేనిప్పుడు మెడిసిన్ లో చేరాను తెలుసా?” అంది. తెలుసన్నట్టు తలూపాను. ఇంకా ఏమన్నా అడిగేటంత చనువు గాని, ధైర్యం గాని నాకు లేవు.

“మా లెక్చరర్, ఒకాయన తో నాకు లవ్-ఎఫైర్ ఉంది. దానివల్ల తన వాళ్ళతో ఆయనకీ, మా ఇంట్లో వాళ్ళతో నాకు గొడవలు. నేను ఎదురు తిరగటంతో ఏం చేయాలో తెలియక, మీ నాన్నగారితో మాట్లాడి.. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తారట” అని కాసేపు నిశబ్దంగా ఉండిపోయింది.

ఏమాత్రం సంకోచం లేకుండా నాకు చెప్పేసింది. అసలు ఇన్నాళ్ళ తరువాత కలసిన నాకు ఇవన్నీ చెప్పడం ఏమిటా అని నాకే ఇబ్బందిగా అనిపించింది.

మళ్ళీ తానే, “నాకేమన్న భయమా? అతనికి పెళ్ళైందని తెలిసి కూడా అతనితో సంబంధం పెట్టుకున్నాను.   అయితే, ఈ విషయంలో సైకియాట్రిస్ట్ ఏం చేయగలడు? బుద్ధులు చెబుతాడా?” అంటూ కోపంగా ఉండిపోయింది.

ఆ తరువాత.. ఉన్న నాలుగు రోజులు అయిష్టంగా అందరికీ దూరంగానే ఉంది కళ్యాణి. డాక్టర్ ని కలిసి, మందులు ఏవో తీసుకొని కళ్యాణితో పాటు వాళ్ళ అమ్మ, అక్క తిరిగి వెళ్లి పోయారు.

***

మళ్ళీ రెండేళ్లకేమో, N.R.I ఇంజినీర్ని పెళ్లి చేసుకొని, మెడిసిన్ పూర్తి చేయకుండానే కళ్యాణి 1999 లో  అమెరికా వెళ్ళిపోయిందని విన్నాము.

అప్పటికి, నేను శాస్త్రీయ సంగీత కళాకారిణిగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాను. తరువాత ఆరు నెలలకి, బి.ఇ.డి పూర్తి అవుతూనే వివాహం చేసుకొని నేనూ అమెరికా చేరాను.

***

నేను డెన్వర్ కి వచ్చిన మూడు నెల్లకి కళ్యాణి ఫోన్ చేసింది. “నీకు పెళ్లయిందని తెలిసింది. శుభాకాంక్షలు. నిన్ను, మీ ఆయన్ని కలవాలని ఉంది. వచ్చే వారం వస్తాను” అంది కళ్యాణి.

అప్పుడు మేము సింగిల్ బెడ్రూం అపార్ట్మెంట్ లో ఉన్నాము. నేను రాక మునుపే, తను పనిచేసే క్లినిక్ కి దగ్గరిలో అపార్ట్మెంట్ తీసుకున్నారు మా వారు. నాకు నచ్చుతాయో లేదో అని, కొద్ది వంటింటి సామాను,  అవసరమైన ఫర్నిచర్ మాత్రం తీసుకొన్నారు.

***

తాను అన్న ప్రకారమే మరో వారానికి, న్యూయార్క్ నుండి ఆరు వారాల పసిపిల్లవాడిని తీసుకొని వచ్చింది కళ్యాణి. పసివాడిని వెంట తీసుకునే.. కాసేపు షాపింగ్ చేసి, బయట తినేవాళ్ళం. మా వారు వర్క్ కి వెళ్ళినప్పుడు, చిన్నప్పటి సంగతులు, చుట్టాల కబుర్లు చెప్పుకునే వాళ్ళం.

మాటల్లో ఓ రోజు, “నేను విన్న దానికి విరుద్ధంగా, మీ ఆయన చూడడానికి బాగున్నారు, మంచి వారిలా కూడా ఉన్నారుగా! ‘మ్యూజిక్ స్టూడియో’ స్థాపించమని, మ్యూజిక్ క్లాసులు చెప్పమని కూడా నిన్ను ప్రోత్సహిస్తున్నట్టున్నారు.” అంది.

అది మెచ్చుకోలు కిందే జమకట్టాను.

తన భర్తకి మాత్రం, పెళ్ళికి మునుపు ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉండేదని తనకి అనుమానమట. ఇలా ఎన్నో విషయాలు చెప్పుకున్నాము. నాలుగు రోజులు సంతోషంగా గడిపి కళ్యాణి తిరిగి వెళ్లిపోయింది. దేశం కాని దేశాన చిన్ననాటి నేస్తం కళ్యాణితో.. తిరిగి చిగురించిన మైత్రి సంతోషాన్నిచ్చింది.

***

న్యూయార్క్ తిరిగి వెళ్ళి వారం తిరక్కుండానే...తాను కొడుకుతో ఇండియా వెళ్ళుతున్నానని ఫోన్ చేసింది కళ్యాణి. బాబుతో ప్రయాణం కదా, హైదరాబాదులో దిగి రాజమండ్రి వెళ్ళేంత మటుకు, అమ్మా వాళ్ళ దగ్గర ఉండేలా ఏర్పాటు చేసాను. దాంతో... ఒకటిన్నర రోజులు అమ్మావాళ్ళ వద్దనే ఉందట కళ్యాణి.

“మా ఉమా కొత్త కాపురం ఎలా ఉంది కళ్యాణీ! విషయాలు చెప్పు” అని అడిగిందట అమ్మ. నా గురించిన కబుర్లు వినడానికి ఇంటిల్లిపాది కళ్యాణి చుట్టూ చేరారట.

“ఏమీ అనుకోకండి గానీ, ఉమా ఇక్కడ ఓ యువరాణి లా పెరిగిందా? అక్కడ తన అవస్థ చూడలేకపోయాను.  ఇంటికి వెళ్ళిన నాకు సరైన ఆతిధ్యం ఇవ్వలేకపోయారు. ఇంట్లో కనీసపు సామాను కాని వస్తువులు కాని లేవు. ఇంతకీ ఆయన... అదే మీ అల్లుడు డాక్టర్ అవునో కాదో.. వైద్య వృత్తిలో ఉన్నారో లేదో అని కూడా అనుమానం వచ్చింది ఆంటీ!” అంటూ అమ్మవాళ్ళతోనే ధైర్యంగా అన్నదట.

ఇంకేముంది! బెంబేలెత్తిపోయి, నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసారు నాన్న. అమ్మైతే.. ఒకటే ఏడుపు.

“అమ్మా, నాన్న! ఇలాటి చెప్పుడు మాటలు వినకండి. నేను ఇక్కడ నిజంగా బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. మావారి క్లినిక్ కి కూడా పలుమార్లు వెళ్లాను.” అని ధృవీకరించి, అతి కష్టం మీద భరోసా కల్పించాను.

కళ్యాణి వరస అంతుపట్టలేదు. అలా ఎందుకు చెప్పిందో అర్ధం కాలేదు. తిన్ననయిన మనిషి కాదని మాత్రం  అనిపించి అంతటితో వదిలేసాను.

***

జరిగిపోయిన ఆ సంఘటనలు, గతంలోని పాతికేళ్ళ నాటి విషయాలు కదా.. అనుకుంటూ మ్యూజిక్ క్లాస్ కి సమయమవడంతో స్టూడియో లోకి నడిచాను.

***

రాత్రి భోజనం పెడుతూ, కళ్యాణి ఫోన్ గురించి మా వారికి చెప్పాను. ఆయన ఎప్పటిలా ‘తస్మాత్ జాగ్రత్త! అనే ధోరణిలో “మనుషుల మనస్తత్వాలు అర్ధం అయ్యాకైనా కాస్త జాగ్రత్తగా మసులుకోవలసిన అవసరం ఉంది. లేదంటే మళ్లీ బాధపడాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు.

ఆయన మాటలు నిజమే అనిపించింది. మా పిల్లలు కూడా పెద్దవాళ్ళయి.. జీవితం హాయిగా సాగిపోతున్న ఈ సమయంలో.. కళ్యాణితో మళ్ళీ స్నేహం అంటే.. కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగేయాలి అనిపించింది. తన కొడుకు కూడా ఇప్పుడు పాతికేళ్ళ వాడయ్యుంటాడు’ అనుకుంటూ భోజనం ముగించాను.

***

మరో రెండు నెలలకి అన్నమయ్య సంగీతోత్సవంతో బిజీగా ఉన్న సమయంలో కళ్యాణి ఫోన్ చేసింది.   వాళ్ళబ్బాయిని తీసుకొని ఓ వారం ఉండేలా వస్తున్నానంటూ, ఫ్లైట్ సమాచారమంతా ఇచ్చింది. కళ్యాణి ఇంకా అదే పద్ధతి, మాకు ఆ వారం వీలేనా అని కూడా అడగలేదు. ఏమయినా, తను రావాలని ఉత్సాహంగా ఉందని అర్ధమయి మిన్నకుండిపోయాను.

అన్నమయ్య ఉత్సవాల తరువాత వచ్చారు కళ్యాణి, కొడుకు శ్రీకాంత్. పాతికేళ్ళ ఆమె కొడుకు అంగ వైకల్యం తో పాటు లెర్నింగ్ డిసెబిలటి (బౌతిక మానసిక వైకల్యం) వల్ల, ఎప్పుడూ తన వెన్నంటే ఉంటాడని అన్నది.  శారీరకంగా బాగానే ఉన్నా ఆ యువకుని మానసిక ఎదుగుదల పన్నెండేళ్ళ అబ్బాయిలా ఉంటుందట. శ్రీకాంత్ ని గురించి విని, చాలా బాధపడ్డాను. కళ్యాణి మీద ఎంతో జాలి కలిగింది. ఆ తల్లి మనసు ఎంత కుమిలి పోతుందో కదా! అనిపించింది. అందుకే, ఎటువంటి కోపతాపాలు, అలకలు పెట్టుకోకుండా, ఆ వారం రోజులు కళ్యాణి వాళ్ళతో కలసి పోయి బాగానే గడిపాము నేను, మా వారు కూడా.

***

తరువాతి నుండి.. రెండు రోజులకోసారి ఫోన్ చేయసాగింది కళ్యాణి. తన గోడు చెప్పుకుంటూ.. తన విడాకులు, కొడుకు పరిస్థితి, తన ఒంటరి బతుకు పోరాటం గురించి వాపోతుంది.

నేనూ సానుభూతితో విన్నాను.

***

అలా మరో ఆరు నెలలు గడిచాక... మా ఊళ్ళో ఉద్యోగం చూసుకొని, నాకు దగ్గరగా ఉండేలా వస్తానంది.  జాలేసింది. ఆమెని ప్రోత్సహించాను. కళ్యాణి కోసం నా వంతు ప్రయత్నాలు చేయసాగాను. మా వారు కూడా వైద్య వృత్తిలో ఉండడంతో, కళ్యాణి ఉద్యోగ అవకాశాల గురించి వాకబు చేసి సమాచారం సేకరించి కళ్యాణికి అందించాము.

నాతో మాట్లాడందే అడుగు తీసి అడుగు వేయలేనట్టు ఉంది కళ్యాణి వాలకం. నాకో వ్యసనంగా మారింది ‘ఆపరేషన్ కళ్యాణి’ అంటూ నవ్వుతూనే చిరాకు పడేవారు మా వారు.

అంతలా నా జీవితం లోకి, నా మనస్సు లోకి చొచ్చుకుపోయింది కళ్యాణి. నా ఆలోచనలెప్పుడూ ఆమె బాగు కోసం, ఆమె మనుగడ కోసమే సాగాయి.

అయితే, కళ్యాణిలో వేగంగా, అసహనం పెరిగిపోవడం గమనించాను. గబుక్కున ఒకరోజు ఉద్యోగానికి రాజీనామా కూడా చేసింది. మాకు దగ్గరిలో ఇల్లు చూడమంది. ఆ పనిలో నిమగ్నమయ్యాను.

ఇంతలో, మంచి మెడికల్ గ్రూప్ నుండి కళ్యాణికి ఇంటర్వ్యూకి పిలుపు, వెనువెంటనే హాస్పిటల్ ఇంటర్నిస్ట్ గా ఉద్యోగం కూడా వచ్చాయి. రెండు నెలల్లో జాయిన్ అవ్వాలి. జాయినింగ్ డేట్ కి నెలముందే తన వర్క్ కి దగ్గరగా పొందికైన ఇల్లు దొరకడంతో.. రిజిస్ట్రేషన్ చేయించడానికి న్యూయార్క్ నుండి వచ్చివెళ్ళింది కళ్యాణి.

ఈ లోగా ఆమెకి అన్నీ సమకూరాలన్న తపనతో... ఇంటికి సెక్యూరిటీ సిస్టమ్, లాండ్-స్కేపింగ్, ఫోన్ కనెక్షన్స్, టివి కేబిల్, గట్టర్స్ లాంటివి పెట్టించేసాను.

***

మొత్తానికి మహా బేషుగ్గా కళ్యాణి సెటిల్ అయ్యింది. ఎంతో గర్వంగా అనిపించింది. బేలగా, నిస్సహాయంగా, ఒంటరితనంతో బాధ పడుతున్న తోటి స్త్రీకి సహాయ పడగలిగినందుకు తృప్తిగా ఉంది. ఉద్యోగం కూడా చాలా నచ్చింది కళ్యాణికి. కాస్త స్థిరపడ్డాక గృహప్రవేశం చేయవచ్చని అనుకున్నాము.

***

కొన్ని నెలల గడిచాక పని వొత్తిడిలో తీరిక లేకుండా పోయిందని బాధ పడుతూ, ఇ-మెయిల్ పంపింది  కళ్యాణి. రెండేళ్లగా కళ్యాణి విషయం ఓ యజ్ఞం లా చేసిన నాకు.. ఆమెతో కొద్ది కాలం కాంటాక్ట్ లేకపోవడం కూడా కాస్త విశ్రాంతి దొరికినట్టయిందని అనుకున్నాను.

కళ్యాణి ఇంట్లో నేనమర్చిన సామాను, వగైరాలకి ఐదు వేల డాలర్ల వరకు తాను నాకివ్వాల్సిన అమౌంట్ ఉన్నా.. ఉద్యోగంలో సెటిల్ అవ్వనీలే.. అనుకున్నాను.

***

మరో వారానికి నా ఫ్రెండ్ ఇందిర ఫోన్ చేసింది. ఆమె భర్త కళ్యాణి పని చేసే క్లినిక్ లోనే పని చేస్తారు. కళ్యాణి ఇంట జరిగిన గృహప్రవేశంకి మేమెందుకు రాలేదని అడిగింది ఇందిర. వారితో పాటు కళ్యాణి ఇంట గృహప్రవేశం కి ఇరవై ఇండియన్ కుటుంబాలు అతిధులట. బాగా జరిగిందని చెప్పింది.

నిర్ఘాంతపోయాను. సంభాషణ పొడిగించక,,, మేము రాలేకపోవడానికి ఏదో కారణం చెప్పి ఫోన్ పెట్టేసాను.  మా వారితో చెప్పడానికి సంకోచించాను.

***

ఆదివారం పొద్దుట పది గంటలప్పుడు ఫోన్ చేసింది కళ్యాణి. ఎలా ఉన్నావని అడుగుతూ, “నాకు మాట్లాడ బుద్ధికావడం లేదు,” అంది.

నా కాళ్ళ కింద భూమి జారినట్టయింది. “వొంట్లో బాగోలేదా?” అని అడిగాను.

“ఫోన్ ఎత్తి మాట్లాడాలని కూడా అనిపించడం లేదు,” అంది.

పసిపిల్లలా ఆమె నోట ఆ మాటలు... నమ్మలేక పోయాను. ఏమనగలను?

“అంత అలసటగా, విసుగ్గా ఉంటే మాట్లాడకు,” అన్నాను.

“నీ అడ్రెస్ ఇస్తే, నీకు పంపవలసిన అమౌంట్ కి చెక్ పోస్ట్ లో వేస్తాను,” అంది.

***

కాల చక్రం ఆగదుగా! మరో మూడు నెలలు గడిచాయి. మ్యూజిక్ క్లాసు ముగించుకుని లోనికి వచ్చి లంచ్ పెట్టుకొని కూర్చున్నాను. అప్పటికే భోంచేసి, పేపర్ చదువుతున్న మా వారు ఉన్నట్టుండి, సోఫా నుండి బయటకి పడినంత పని చేసారు.

“షాకింగ్” అంటూ పేపర్ లోని న్యూస్ చదివారు మా వారు, “న్యూయార్క్ పోలిస్, F.B.I శాఖ కలిసి పన్నెండు మంది భారతీయ వైద్యులని, మెడికేర్ ఫ్రాడ్ గావించిన వారిగా గుర్తించి, మోసపూరితంగా ప్రభుత్వాన్ని కొన్ని మిలియన్స్ కి నష్టపరచినందుకు, దగా చేసినందుకు, త్వరలో అరెస్ట్ చేసి కట్టడి లోకి తీసుకుంటారు” అని హెడ్ లైన్స్ న్యూస్. ఆ పన్నెండు మంది వైద్యుల్లో మూడవ పేరు, డాక్టర్. కళ్యాణి కులశేఖర.”

అవాక్కయ్యాను. విని కుర్చీ నుండి, కింద పడటం నా వంతులా అయింది. న్యూస్ లోని ఆ కళ్యాణి, మా కళ్యాణియే.

ఊహంచని సంఘటనలతో నిండినదే జీవితమా? గుణపాఠాలు, దుర్ఘటనలు, నిరాశలు ప్రతినిత్యం చోటు చేసుకొనేవే. అయినా వాటి పర్యవసానాలు.. జీవితాన్ని తప్పక  ప్రభావితం చేస్తాయి. ఒక్కోసారి చెరగని ముద్ర వేస్తాయి కూడా.

సప్త సముద్రాలని దాటి దూర తీరాలు చేరగానే, పరిచయాలు, స్నేహాలు, చుట్టిరికాలు స్వరూపాన్ని మార్చి కొంగ్రొత్త రూపాన్ని ఆపాదించుకుంటాయి కాబోలు.

‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఇజ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్’ అనే నానుడి నాకిష్టం, ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తాను. ఆ విధానంలో కొన్ని పాఠాలు నేర్చుకోవడం, మరికొన్ని అనుభవాలు పొందడం తప్పదుగా!.

కళ్యాణి తో పునఃప్రారంభమైన ఈ రెండేళ్ళ స్నేహం, ఆ అనుభవం, మరోజన్మకి క్కూడా సరిపడా పాఠo నేర్పింది, నాకు.

*****

రచయిత్రి పరిచయం ....

Uma Bharathi Kosuri‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A. (Pol. Science) – Osmania University
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in October 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *