అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
- మధు బుడమగుంట -
కార్తీకపౌర్ణమి సీ. కడలివెన్నగ ఖ్యాతి గాంచిన పున్నమి చంద్రబింబము చూడఁ జక్కనగుచు, శివపార్వతులపెండ్లి సిరులీను కేళిలోఁ బూబంతియై మించి ముదము గూర్చు, దర్పణంబునఁ జూపఁ దల్లి మామయ్యనే దరిఁజేరినట్లుగాఁ దనిసె బాల రాముఁ డయోధ్యలో, రజనీకరుండౌచు రిక్కలరాయఁడై పిక్కటిల్లు, నందాలు చిందించు నాననస్వచ్ఛత లకు నుపమానమై, సకలప్రాణి మానసోల్లాసప్రేమానురాగంబులు కథలు సృష్టించిన గడుసరియును, ఓషధులకు సార మొసఁగి పెంపొందించి మే లొనరించెడి మేనమామ, సూర(1)వంశోత్తముఁ డౌ రామభద్రుఁడే రామచంద్రుని పేరఁ బ్రణుతి కెక్కె, తే.గీ. నట్టి రాకాశశాంకుని నమృతకిరణుఁ గార్తికంబునఁ జనుదెంచి కౌతుకమునఁ బలుకరించిన పెద్దబింబముగఁ జూడఁ జక్షురుత్సవమౌ నేఁడు జగతి కెల్ల (1) సూర్య 307 మ. భవదంఘ్రిస్మరణంబె నా కొసఁగుఁగా భాగ్యాలు; వెయ్యేల నా కవి? నీ సన్నిధి నిల్వఁగల్గినను; లోకైకప్రభూ! నీ కృపన్ కవినై నీ గుణగానమున్ సలుపగల్గన్ నా కృతుల్ చాలు; నా కవిరామంబును సర్వశ్రేష్ఠమగు భాగ్యం బయ్యదే యీశ్వరా! 308 ప్రభాతము చం. తెలతెలవాఱఁ దూర్పుదిశఁ దెల్లని దీధితు లెన్నొ పర్వు; భూ తలము నవోదయంబునకుఁ దానదె సిద్ధముగాఁగఁ జేతనం బులు పులకించు వేళ యిది; పుట్టిన బిడ్డకుఁ బాలు పట్టఁగాఁ గలిగెడు తృప్తి యా ప్రకృతికాంతకుఁ గాన్గగు పుణ్యకాలమౌ 309 కార్తీకరుద్రాభిషేకసమాప్తము – శ్రీఉమాబృహదీశ్వరాలయము, తిరుపతి ఉత్పలమాలిక కొల్లలు కొల్లలై శివునకున్ దమభక్తినిఁ జాటెఁ గల్వలే యెల్లెడలన్ స్పృశించుచు మహేశ్వరలింగముఁ బానవట్టమున్ సల్లలితార్చనన్ సలిపి, చాలదు నేత్రయుగంబు కాంచ నీ యుల్లము పల్లవించు బృహదుత్సవశోభనుఁ గార్తికాంతమం దెల్ల శ్రితుల్ తరింప, నిది యెన్నటి పుణ్యఫలంబొ? యర్చకుల్ తల్లజు లెందఱో కలిసి దక్షతఁ జూపుచు నాగమోక్తసే వోల్లసితాభిషేకము ననుత్తమరీతి నొనర్ప, దగ్గరఱో యిళ్లను మాధ్యమంబులనొ యించుక రెప్పలు వాల్చకుండ తా మొల్లక చూడ నన్యము, మహోత్సుకతన్ గన విశ్వప్రేక్షకుల్, వెళ్ళగ శక్యమౌనె వినువీధిని వచ్చినవారు సైతమున్? భళ్ళునఁ దెల్లవాఱఁ గను పర్వము మాసముపాటు చూపి సం కెళ్ళను వేసి నిల్పి రిటఁ గిమ్మనకుండఁగ(1) మానసమ్ములన్ దెల్లము సేసినారు ‘తితిదే’(2) మన పూర్వులధర్మసంస్కృతిన్ కొల్లగ దండముల్(3) తెలిపికొందును స్వామికి, వారి, కెప్పుడున్ (1) ‘కిమ్?’ అనకుండ /శబ్దము చేయకుండ (2) తిరుపతి తిరుమల దేవస్థానమువారు (3) నమస్కారములు 310