Menu Close
Rajesam Thokala
బతుకమ్మా! (పద్యకవిత)
తోకల రాజేశం
తే.గీ. పూలు దేవతావిగ్రహమ్ములను కొలుచు
        వేళ వాడెదరన్ని ప్రాంతాల లోన
        పూలనే దైవముగ నెంచి పూజ సేయు
        దొడ్డ సంస్కృతి గలదు మా గడ్డ మీద

తే.గీ. మందిరాల ప్రవేశమ్ము నందలేని
        మంద భాగ్యమ్ము దలపోసి కుందు పూవు
        లిచట బతుకమ్మ రూపమ్ము నెత్తగలవు
        సమత యను దానికర్థమ్ము చాట గలవు

తే.గీ. పూవు పూవులో సరికొత్త తావి యీన
        కూడళులు పరీమళముతో కూడినపుడు
        నా తెలంగాణ మట్టి గంధమ్ము దాల్చి
        నాల్గు దెసలలో బతుకమ్మ నాట్యమాడు

ఆ.వె. ఆడిబిడ్డ లెల్ల హర్ష సముద్రమ్ము
        నందు మునిగి పాడి ఆడునపుడు
        ఆకసాన చుక్కలన్ని తెలంగాణ
        గడ్డ మీద దిగిన కరణి దోచు

తే.గీ. రంగు రంగుల పూలతో నింగి లోని
        ఇంద్ర ధనువుగా శోభలనీను వేళ
        చూడవలె బతుకమ్మను-చూచు వారి
        కనులు బంగారు కాంతుల గనులు గాగ

తే.గీ. ఇలకు వెన్నెల కల్లాపి చిలుకరించు
        చందమామ లేడన్న మీ శంక వలదు
        వీధి వీధిలో బతుకమ్మ వెలుగు జూచి
        చీకటులు దాగుకొనె నెటో చిన్న వోయి!

క. బతుకమ్మా! నూరేళ్ళని
     అతివల దీవించు చల్లనగు తల్లిగ నీ
     బతుకమ్మనెంతు రెల్లరు
     బతుకమ్మా!బతుకు కోట్ల వర్షములిలలో!

రచయిత పరిచయం

Rajesam Thokalaతోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు. వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు. ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం (2006), చెమట చుక్కలు (నానీలు-2010), పాతాళ గరిగె (సాహిత్య వ్యాసాలు-2013), అడవి దీపాలు (వచన కవిత్వం-2017), మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర (తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020), కొబ్బరి నీరా! శతకం (పదిమందితో కలిసి-2023), మట్టి విజయం (పద్యకవిత్వం-2024) అనే పుస్తకాలు ముద్రించారు. తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం (2012), సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012), సాహితీ శిరోమణి పురస్కారం(2015), సినారె పురస్కారం(2023), తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Posted in October 2026, పద్యకవితలు, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *