Menu Close
డా. వల్లూరుపల్లి శివాజీరావు
మహాత్మా గాంధి
డా. వల్లూరుపల్లి శివాజీరావు
Mahatma-Gandhi

Image by WikiImages from Pixabay

బొంబాయిలో నాయకులతో గాంధీజీ సమావేశం, బహిరంగ సభ

గాంధీజీ రాజ్ కోటలో కరపత్రాల (Green Pamphlets) విషయంలో నిమగ్నమైనప్పుడు ఒక రోజు (ఆగష్టు 17 న) ఆయన విమానంలో బొంబాయి వెళ్లారు. అచ్చట కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి నాటాల్ లో భారతీయులకు జరుగుచున్న అన్యాయాలను వివరించాలని భావించారు. ఆ సమయంలో న్యాయమూర్తి మహాదేవ్ గోవింద్ రానడే (Mahadev Govind Ranade: (అప్పటికి 55 ఏళ్ళు) ను కలిసినప్పుడు ఆయన గాంధీజీ చెప్పినవన్నీ శ్రద్ధగా విని సర్ ఫెరోజ్-షా మెహతా (Sir Pherozeshah Mehta: 51 ఏళ్ళు) ను కలుసుకోమని సలహా ఇచ్చారు.

ఆ తరువాత ఆగష్టు 19 వ తేదీన గాంధీజీ న్యాయమూర్తి బద్రుద్దీన్ త్యాబ్జి (Justice Badruddin Tyabji: 52 ఏళ్ళు) ని కలుసుకోగా ఆయన కూడా ఫిరోజ్-షా మెహతా ను కలుసుకోమని సెలవిస్తూ ఇలా సలహా ఇచ్చారు: “రానడే, నేను న్యాయమూర్తులు అయినందువల్ల ప్రజా వ్యవహారాలలో మేము చురుకైన పాత్ర పోషించలేము. కాని, మా సానుభూతి నీతోనే ఉంటుంది. నీకు సమర్థవంతంగా సలహా ఇవ్వటానికి సర్ ఫిరోజ్-షా మెహతా మాత్రమే సమర్ధవంతుడు.”

ఫిరోజ్-షా మెహతా తో జరిగిన సమావేశం గురించి గాంధీజీ ఇలా వివరించారు: “నేను 1896 జనవరి 12 వ తేదీన ‘The Lion of Bombay’, ‘Uncrowned King of the Presidency’ గా పేరొందిన ఈ మహా వ్యక్తిని కలుసుకున్నాను. ఈయనతో పాటు కొంతమంది స్నేహితులు, అనుయాయులు కూడా ఉన్నారు. వీరిలో Sir Dinshaw Edulji Wacha (52 ఏళ్ళు), మరియు Kharshedji Rustomji Cama (K.R. Cama: 66 ఏళ్ళు) ముఖ్యులు. Mr. Wacha ప్రముఖ గణాంకవేత్త (Statistician). ఈ Mr. Wacha ‘గాంధీ, మనం ఒక రోజు తప్పక కలవాలి’ అని సూచించటం జరిగింది.

ఆ తరువాత ఫిరోజ్-షా మెహతాను కలిసి దక్షిణ ఆఫ్రికాలో జరిగే విషయాలను గురించి నేను చెప్పినప్పుడు ఫిరోజ్-షా మెహతా శ్రద్ధగా విని, వెంటనే ఆయన ‘గాంధీ, నేను నీకు సహాయం చేయాలి; దీని కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి’ అని అంటూ, ప్రక్కన ఉన్న ఆయన కార్యదర్శిని ఈ సభకు తేదీ నిర్ణయించమని ఆదేశించారు. ఈ సభ తేదీ ముందటి రోజున తనను కలవమని నాకు సూచించారు. ఆయనతో ఈ సమావేశం నా భయాలను పోగొట్టింది; ఇంటికి సంతోషంతో వెళ్లగలిగాను.”

గాంధీజీ బొంబాయిలో ఉన్న సమయంలో ఆయన బావగారు (అక్క భర్త: వృందావన్ దాస్) తీవ్రమైన అనారోగ్యం తో బాధ పడటం జరిగింది. ఆ సమయంలో గాంధీజీ తన అక్క (రలియత్ గాంధి: Raliat Gandhi) కోరిక మేరకు వారిని రాజ్ కోట తీసుకువెళ్లారు. కొన్ని రాత్రుళ్ళు, పగళ్లు గాంధీజీ ఆయనకు సేవ చేసిన తరువాత ఒక రోజు బావగారు మరణించటం జరిగింది. ఆ తరువాత గాంధీజీ కొద్ది రోజులలో జరగబోయే సమావేశానికి తిరిగి బొంబాయి వెళ్లారు.

అచ్చట ఆయన వెంటనే ఫిరోజ్-షా మెహతా కలిసినప్పుడు మరుసటి రోజు జరగబోయే బహిరంగ సమావేశానికి ‘నీ ఉపన్యాసం సిద్ధంగా ఉందా’ అని అడిగితే గాంధీజీ ‘లేదండీ, నేను అప్పటి కప్పుడు ఆశువుగా (extempore) మాట్లాడుతాను’ అని సమాధానమిచ్చారు. దీనికి మెహతా అంగీకరించక ఉపన్యాసాన్ని ఒక కాగితం మీద వ్రాయమని ఆదేశించగా గాంధీజీ దానిని మరుసటి రోజు తెల్లవారేలోపల సిద్ధం చేయటం జరిగింది.

ఆ రోజు Sir Cowasji Jehangir Institute లో జరిగిన సమావేశంలో మొదట మెహతా మాట్లాడిన తరువాత అయన గాంధీజీని ఉపన్యాసం ఇవ్వమని ఆదేశించగా కిక్కిరిసిన ప్రజలను చూసి ఈయన కాళ్ళు, చేతులు వణకటం ప్రారంభమయ్యింది. కాని ధైర్యం తెచ్చుకుని బలహీనమైన స్వరంతో ఉపన్యాసం ఇస్తుంటే దగ్గర ఉన్న వాళ్లకు కూడా విపించటం లేదు. ఇది చూసి మెహతా ప్రక్కన ఉన్న Din-shaw Edulji Wacha ను గాంధీజీ వ్రాసిన ఉపన్యాసం చదవమని కోరగా ఆయన తన గంభీరమైన స్వరంతో చదివారు. ప్రేక్షకులు అనేక సార్లు చప్పట్లతో ‘సిగ్గు, సిగ్గు’ అంటూ ప్రతిస్పందించారు. ప్రేక్షకుల ప్రతిస్పందన చూసి గాంధీజీ హృదయం పులకించిపోయింది.

దక్షిణ ఆఫ్రికాలో భారతీయులకు జరిగే అవమానాలు, అన్యాయాల గురించి గాంధీజీ వ్రాసిన, 'వాచా' (Wacha) వెలిబుచ్చిన విషయాలను తెలుసుకున్న ప్రజలలో ఇంత స్పందన రావటం చూసి మెహతా కూడా సంతోషించారు. గాంధీజీ కృషికి తగిన ఫలం బొంబాయిలో లభించిందని భావించారు.

ఈ విధంగా పరాయి దేశంలో వలస భారతీయులు పడుతున్న కష్టాలు ఇచ్చటివారికి తెలిసివచ్చాయి.

పూనా (పూణే), మద్రాసు లో గాంధీజీ

బొంబాయిలో బహిరంగ సమావేశం తదుపరి గాంధీజీ పూనా, మద్రాసు వెళ్ళటం జరిగింది. అక్కడ రెండు పార్టీలు ఉన్నాయి. అందరి ప్రజల సహకారం పొందటం గాంధీజీ ఉద్దేశ్యం. మొదట పూనాలో ‘శ్రీ బాల గంగాధర తిలక్’ (43 ఏళ్ళు) ను కలిశారు. ఆయన అప్పుడు: “నీవు అన్ని పార్టీల సహాయం పొందాలను కోవడం మంచి ఉద్దేశ్యం. కాని నీవు ఏ పార్టీకి సంబంధించని వ్యక్తిని మీ సంఘానికి అధ్యక్షుడిగా చేసుకుంటే మంచిది. అందుకు నీవు ‘ప్రొఫెసర్ భండార్కర్’ (Ramakrishna Gopal Bhandarkar: 60 ఏళ్ళు) ను కలుసుకో. ఆయన ప్రస్తుతం ఏ ప్రజా ఉద్యమంలోనూ పాల్గొనటం లేదు. అందువల్ల దక్షిణ ఆఫ్రికాలో మీ సమస్య ఆయన విని ముందుకు రావచ్చు. ఆయనను కలిసినప్పుడు ఏమన్నారో మరల నాకు తెలియజేయి. నీవు నన్ను ఎప్పుడైనా కలవవచ్చు. నేను నీకు అందుబాటలోనే ఉంటాను” అని గాంధీజీకి చెప్పారు.

తిలక్ సలహా మీద ‘గోపాలకృష్ణ గోఖలే’ (31 ఏళ్ళు) ను పూనా లోని Ferguson College లో కలిసినప్పుడు ఆయన ఆప్యాయంతో గాంధీజీని స్వాగతించారు. గాంధీజీ దృష్టిలో ఫిరోజ్ షా హిమాలయాలంత మనిషి అయితే, తిలక్ ఒక మహా సముద్రం; గోఖలే గంగా నది అంత మహా వ్యక్తి. గోఖలే ని కలిసినప్పుడు గంగానదిలో స్నాన మారించిన అనుభూతి కలుగుతుంది. ఈ మహావ్యక్తిని గురించి గాంధీజీ ఇలా వివరించారు:

“ఒక ఉపాధ్యాయుడు లాగా నన్ను గోఖలే తీక్షణంగా పరిశీలించి నా వివరాలు అడిగారు. తరువాత నేను బొంబాయి లో ఉపన్యాసం కొరకు వ్రాసిన ఉపన్యాసాన్ని చదివారు. దక్షిణ ఆఫ్రికా భారతీయులకు జరిగే అన్యాయాలను తెలుసుకుని ప్రొఫెసర్ భండార్కర్ ను కలిసి ఆయన ఇచ్చిన సలహాను తనకు తెలియజేయమని కోరారు. చివరకు ఆయన ఎంతో ఆనందంతో నన్ను పంపించారు.

భండార్కర్ వద్దకు (అక్టోబర్ 12 న, 1896) వెళ్ళినప్పుడు ఆయన నన్ను ఒక తండ్రిలాగా ఆదరించారు. దక్షిణ ఆఫ్రికాలో జరిగే విషయాలను ఆయనకు వివరించాను. అంతా విని ఆయన ‘నేను రాజకీయాలలో తలదూర్చను. కాని నిన్ను తిరస్కరించలేను. అలా అని నీకు సహాయం చేయకుండా ఉండలేను. శ్రీ గోఖలే, శ్రీ తిలక్ లను సంప్రదించటం వల్ల మంచి జరుగుతుంది. వారు ఏర్పాటుచేసే సభకు నేను అధ్యక్షత వహిస్తాను’ అని ఆయన నన్ను ఆశీర్వదించి పంపించారు.

ఈ మహా నాయకులు ముగ్గురు, వారితో ఉన్న నిస్వార్ధ వ్యక్తులు పూనా లో ఒక నిరాడంబరమయిన ఒక సభ అక్టోబర్ 22 వ తేదీన ఏర్పాటు చేయటం జరిగింది. విజయవంతమైన ఈ సమావేశం తరువాత నేను ఎంతో సంతోషంతో మద్రాసు వెళ్ళాను.”

ఈ సభ జరిగిన తరువాత రెండవ రోజున (అక్టోబర్ 26) గాంధీజీ మద్రాసు చేరగానే అచ్చటి ప్రజలు అత్యుత్సాహంతో ఆయనను స్వీకరించారు. బాలసుందరం వ్యవహారం అప్పటికే వారికి తెలిసింది. గాంధీజీ దీర్ఘ ఉపన్యాసం అచ్చటి నాయకులు అచ్చు (print) వేశారు. గాంధీజీ ఇచ్చిన ఆ ఉపన్యాసం శ్రోతలు శ్రద్ధగా విన్నారు. ఆయన ఆగస్టు నెల లో రాజ్ కోటలో ప్రచురించిన ‘Green Pamphlet’ ను సవరించి దాని 10,000 ప్రతులు అచ్చు వేయిస్తే వాటిని ఉత్సాహంతో కొనటం జరిగింది.

మద్రాసులో ఉన్నప్పుడు గాంధీజీకి బారిస్టర్ జి. పరమేశ్వరన్ పిళ్లై (33ఏళ్ళు) చాలా సహాయం చేశారు. ఆయన అప్పుడు The Madras Standard వార్తా పత్రికకు సంపాదకుడు. గాంధీజీ నుంచి ఆయన దక్షిణ ఆఫ్రికాలో ప్రవాస భారతీయులకు జరుగుచున్న అన్యాయాల గురించిన వివరాలు తెలుసుకుని తగిన మార్గదర్శకత్వం చేయట జరిగింది. ఈ పత్రికలో గాంధీజీ కొన్ని వ్యాసాలు ప్రచురించారు.

ఈయనే గాక The Hindu దిన పత్రిక స్థాపకులు, సంపాదకులు జి. సుబ్రమణ్య అయ్యర్ (42 ఏళ్ళు) గాంధీజీకి సానుభూతి తెలిపి, అన్యాయాలను పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. ఇంకా అనేకమంది ప్రముఖులను గాంధీజీ మద్రాసులో కలిసినప్పుడు వారు చూపించిన ఆప్యాయత, ఉత్సాహం వర్ణించరానిది. వారందరు దక్షిణ ఆఫ్రికాలో జరుగుతున్న అన్యాయాల గురించి గాంధీజీతో ఆంగ్లంలోనే చర్చించారు. ఇది ఈ మహనీయుడికి అత్యంత ఆనందం కలిగింది.

దక్షిణ ఆఫ్రికాకు నుంచి తిరుగు ప్రయాణం

దక్షిణ ఆఫ్రికాకు తిరుగు ప్రయాణంలో గాంధీజీ మద్రాసు నుంచి కలకత్తా వెళ్లారు. అచ్చట ఆయనను ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆయనకు అచ్చట ఎవరు తెలియదు. Great Eastern Hotel లో గది తీసుకున్న తరువాత అచ్చట The Telegraph దినపత్రిక ప్రతినిధి Mr. Ellerthorpe పరిచయమవ్వగా అతను గాంధీజీని అతను ఉంటున్న Bengal Club కు ఆహ్వానించాడు. కాని భారతీయుడిని ఆ క్లబ్బు drawing room కు తీసుకెళ్లకూడదనే నిబంధన అతనికి తెలియదు. ఇతను గాంధీజీకి క్షమాపణలు చెప్పి క్లబ్బులో తన గదికి తీసుకువెళ్లాడు.

ఆ సమయంలో గాంధీజీ ‘Idol of Bengal’ సురేంద్రనాథ్ బెనర్జీ (38 ఏళ్ళు) ని కలవగా ఆయన ‘రాజా సర్ ప్రియమోహన్ ముఖర్జీ’, ‘మహారాజా జాతీంద్రమోహన్ టాగోర్’ (65 ఏళ్ళు) ను కలిసి దక్షిణ ఆఫ్రికా సమస్య గురించి చర్చించమని సలహా ఇవ్వటం జరిగింది. వారే గాక British Indian Association ప్రతినిధులను కూడా కలవమని సలహా ఇచ్చారు. వీరు గాంధీజీ అభిప్రాయాలతో ఏకీభవించినా వీరిలో ఎవరూ సహాయం చేయటానికి, బహిరంగ సభను ఏర్పాటు చేయటానికి ముందుకు రాలేదు.

‘అమృత్ బజార్’ పత్రిక కార్యాలయానికి వెళ్తే ఆ సంపాదకుడు గాంధీజీని ఒక సంచరించే యూదుడుగా (Wandering Jew) గా పరిగణిస్తే, మరో దినపత్రిక సంపాదకుడు “నా చేతులనిండా పని ఉందని చూడలేవా” అని అవమానించాడు. వీరికి దక్షిణ ఆఫ్రికాలో జరిగే విషయాల గురించి ఏమీ తెలియవు, తెలుసుకోవాలనే కుతూహలం లేదు. అయినా గాంధీజీ అధైర్యపడక The Statesman మరియు The Englishman పత్రికల సంపాదకులను కలిస్తే వారు దక్షిణ ఆఫ్రికాలో భారతీయుల సమస్యల ప్రాముఖ్యతను గ్రహించి ఈ మహాత్ముడు చెప్పిన విషయాలను పూర్తిగా ప్రచురించటం జరిగింది. The Englishman సంపాదకుడు Mr. Saunders అయితే తన కార్యాలయాన్ని గాంధీజీ అధీనంలో ఉంచి ఆయనతో వ్యాసాలు వ్రాయించి తన దినపత్రికలో ప్రచురించాడు. వీరిద్దరి పరిచయం స్నేహంగా మారి చాలాకాలం ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు.

చివరికి కలకత్తానుంచి గాంధీజీ బొంబాయి వెళ్లి అచ్చట నుంచి 1896 నవంబర్ 30 వ తేదీన బయలుదేరారు. అప్పటివరకు తన అన్న లక్ష్మీదాసు సంరక్షణలో ఉన్న భార్య (కస్తూరిబాయి), ఇద్దరు పుత్రులతో (8 ఏళ్ల హరిలాల్ గాంధి; 4 ఏళ్ల మణిలాల్ గాంధి) ఓడలో దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరారు.

వెంట తన వితంతువు సోదరి (అక్క: Raliat), ఆమె పుత్రుడు గోకుల్ దాసు ను కూడా తీసుకువెళ్లారు. దాదా అబ్దుల్లాకు చెందిన ఓడలో (పేరు: Courland) వీరు ప్రయాణించారు. డర్బన్ రేవు చేరటం ఇంకా నాలుగు రోజులు ఉందనగా ఓడ 24 గంటల పాటు తీవ్రమైన తుపానుకు లోనయ్యింది. దానిని తట్టుకుని చివరికి ఓడ డిశంబర్ 18 (1896) న గమ్యం చేరింది.

****సశేషం****

ఆ తరువాత జరిగిన విపరీత సంఘటనల వల్ల గాంధీజీకి ప్రాణహాని కలిగింది. దీనినుంచి ఆయన ఎలా బయటపడ్డారు, తదితర సంగతులు వచ్చే సంచికలో తెలుసుకుందాము.

Posted in October 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *