బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24 న తెల్లవారుతూండగానే మొదలై సాయంత్రానికి ముగిసింది.
ఫ్రెంచి ఫిరంగులు బొబ్బిలి కోటను బీటలు వార్చడానికి పెద్దగా సమయం పట్టలేదు. అయితే బొబ్బిలి వీరుల ప్రతిఘటన కారణంగా ఫ్రెంచి వారు కోటలోపలికి ప్రవేశించలేకపోయారు. 9 గంటల ప్రాంతంలో యుద్ధానికి కొంత విరామం ప్రకటించి, ఫిరంగులను ప్రయోగించాక, మళ్ళీ కొనసాగించారు. 2 గంటలకు మరో విరామం ప్రకటించేవరకూ కూడా ఫ్రెంచి సైన్యం కోటలోకి ప్రవేశించలేకపోయింది.
ఆ సమయంలో రంగారావు తన ముఖ్య సేనానులను, అనుచరులను సమావేశపరచి, ఓటమి అనివార్యమని చెప్పి, తదుపరి కర్తవ్యం గురించి వారికి చెప్పాడు, అందరూ రంగారావు చెప్పినదానికి అంగీకరించారు. ఓటమి తరవాత, తమ స్త్రీలు, పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాల పాలు కాకూడదని భావించిన బొబ్బిలి వీరులు, కోటలోపల ఉన్న తమ నివాసాలకు నిప్పు పెట్టారు. మంటలకు తాళలేక బయటకు వచ్చే వారిని కత్తులతో పొడిచి చంపారు. ఆలా కోటలో ఏ ఒక్క స్త్రీ, గానీ, పిల్లవాడు గానీ బ్రతకలేదు, ఒక్క రంగారావు కుమారుడు తప్ప. కుమారుని చంపమని అతడి గురువుకు రంగారావు ఇచ్చిన ఆదేశాలను అమలు చెయ్యలేక అతడిని రక్షించాడు, ఆ బాలుడి గురువు. (మరో కథనంలో ఆ బాలుణ్ణి రక్షించినది అతడి ఆయా లక్ష్మి అని ఉంది.)
యుద్ధంలో చిట్టచివరి బొబ్బిలి వీరుడు కూడా నేలకొరిగాక మాత్రమే ఫ్రెంచి సైన్యం కోటలోనికి ప్రవేశించగలిగింది. లోపలికి వెళ్ళిన వారు అక్కడ మంటల్లో స్త్రీలు, పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి దిగ్భ్రాంతులయ్యారు. శవాల మధ్య నుండి నడుచుకుంటూ, ఆ గురువు, రంగారాయుని కుమారుణ్ణి తీసుకుని వచ్చి బుస్సీ మనుష్యులకు అప్పగించారు. వాళ్ళు ఆ కుర్రవాడిని బుస్సీ వద్దకు తీసుకువెళ్ళారు.
లోపల జరిగిన సామూహిక మరణాల గురించి తెలిసిన బుస్సీ, కోటలోనికి వెళ్ళేందుకు కూడా ఇష్టపడలేదు. (మరొక కథనం ప్రకారం అతడు కూడా లోపలికి వెళ్ళాడు.) బుస్సీ ఆ పిల్లవాడిని బొబ్బిలి వారసునిగా గుర్తించి, తాను రంగారావుకు బొబ్బిలి స్థానంలో ప్రతిపాదించిన కొత్త ప్రాంతానికి రాజుగా ఆ కుర్రవాణ్ణి గుర్తించాడు. బొబ్బిలి కోటలో జరిగిన ఈ బొబ్బిలి వెలమ వీరుల, తెలగ వీరుల, బొందిలి వీరుల వీరమరణాలు, స్త్రీల ప్రాణాహుతి తెలుగుదేశం యావత్తూ అనేక బుర్రకథలకు స్ఫూర్తినిచ్చింది.
యుద్ధం ముగిసిన తరువాత మూడవ రాత్రి, విజయరామరాజు తన శిబిరంలో నిద్రిస్తూండగా ఇద్దరు సాయుధులు అతడి శిబిరంలోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న విజయరామరాజును ఒక్కసారే తమ వద్ద ఉన్న బాకులతో పొడిచి చంపారు. మొదటి పోట్ల తరువాత విజయరామరాజు అరచిన అరుపులకు అతడి అనుచరులు వచ్చి ఆ ఇద్దరిపై కాల్పులు జరిపారు. అప్పటికే వారిద్దరూ రాజును 32 పోట్లు పొడిచారు. అనుచరులు లోపలికి రాగానే వాళ్ళిద్దరూ లేచి నిలబడి "ఇదిగో చూడండి, మా పగ తీరింది." అని అన్నారు. ఆ ఇద్దరిలో ఒకడు తాండ్ర పాపయ్య, అతడు రంగారావు తరపున రాజాం కోటకు అధికారి. విజయనగర రాజు పూసపాటి విజయరామరాజు ఫ్రెంచి జనరల్ బుస్సీతో వారితో చేతులు కలిపి బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు వచ్చినపుడు బొబ్బిలి కోట విదేశీయుల పాలపడకూడదని యుద్దంచేసి ప్రాణాలొడ్డిన వీరుడు. బొబ్బిలి కోట ఫ్రెంచి వశమైన సంగతి తెలిసిన అతడు ఆ వినాశనానికి కారణమైన వాడిపై పగతీర్చుకుంటాను అని శపథం చేసాడు.
తాండ్ర పాపారాయుడు రాజాం సంస్థానాధీశుడు. బొబ్బిలి వెలమ రాజు గోపాలకృష్ణ రంగారావు భార్య సుప్రసిద్ధ రాణీ మల్లమ్మ ఈయన సోదరి. రంగారావు వేగులు తమ శిబిరం దగ్గర తచ్చాడడం చూసిన విజయరామ గజపతి రాజు, తమ సైన్యం రాజాం మీదుగా బొబ్బిలి పై దాడి చేస్తున్నట్లు నమ్మించాడు. అందుచేత తాండ్ర పాపయ్య బొబ్బిలి కోట నుండి రాజాం వచ్చి కొద్దిమంది సైన్యంతో రాజాంలో మాటు వేసాడు. విజయరామరాజు తన సైన్యాన్ని వేరేదారిలో బొబ్బిలి మళ్లించి తాండ్ర పాపయ్య సహాయం రంగారావుకు అందకుండా చేసాడు. రాణి మల్లమ్మ బొబ్బిలి కోటలో జరిగిన దారుణం ఒక వార్తాహరుని ద్వారా తాండ్ర పాపయ్యకు అందే ఏర్పాటు చేసింది. కానీ ఆ కబురు తాండ్ర పాపయ్యకు అందించకుండానే మార్గమధ్యంలో వార్తాహరుడు హతమయ్యాడు. బుస్సీ సేనలు వస్తాయని ఎదురు చూసిన తాండ్ర పాపయ్య మర్నాడు బొబ్బిలి కోటకు చేరుకున్నాడు. జరిగిన దారుణం గ్రహించాడు. తనవారి నాశనానికి కారణమైన విజయరామరాజుపై పగ సాధించడానికి ప్రతిన పూనాడు.
పూసపాటి విజయరామ గజపతిరాజు ఒక గుడారంలో మకాం వేసి, తన శత్రువును నాశనం చేసిన ఆనందంలో ఒళ్ళు మరచి నిద్రలో మునిగిపోయాడు. తాండ్ర పాపారాయుడు దేవులపల్లి పెద్దన్న మరియు బుద్దరాజు వెంకయ్యతో కలిసి పూసపాటి విజయరామ గజపతి రాజు నిద్రిస్తున్న గుడారానికి చేరుకోగలిగాడు. పాపారాయుడు గుడారం వెనుక నుండి ప్రవేశించాడు, మిగిలిన ఇద్దరు ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉన్నారు. అతను "పులి, పులి... బొబ్బిలి పులి" అని అరుస్తూ పుసపాటి విజయరామగజపతి రాజుని నిద్రలేపాడు. పూసపాటి విజయరామ గజపతిరాజు అతని దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించాడు. ‘వెలమ వీరులు వెనుక తలుపు ద్వారా ప్రవేశించే పిరికివాళ్ళు కాబట్టి వారి వంశం ఉండకూడ’దన్నాడు.
"నువ్వు మా వంశం మొత్తాన్ని అన్యాయమైన మార్గాల ద్వారా తుడిచిపెట్టావు. నీకు బతికి ఉండే హక్కు లేదు" అని పాపారాయుడు జవాబిచ్చి అతని ఛాతీపై పదేపదే పొడిచాడు. ఆ గందరగోళం విని, పూసపాటి మొదటి విజయరామ గజపతి రాజు అంగరక్షకుడు డేరాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు, కానీ ప్రవేశద్వారం వద్ద కాపలాగా ఉన్న పెద్దన్న చేతిలో హత్యకు గురయ్యాడు. మొత్తం సైన్యం అప్రమత్తమైంది. బొబ్బిలిపులి పాపారాయుడు మరియు మిగిలిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.”
“ఇదీ బొబ్బిలి యుద్ధం వీరగాధ. బొబ్బిలి, విజయనగరం రెండూ చిన్న రాజ్యాలే అయినప్పటికీ, పంతాలకు పట్టుదలలకు పోయాయి. బొబ్బిలి పాలకులు సైన్య పరంగా తక్కువైనా, పౌరుషంలో మిన్న. తమ ప్రాణాలు పోయేవరకు కోటను దక్కించుకునేందుకు పోరాడారు. చివరగా శత్రువు అంతాన్ని కూడా కళ్ళజూసారు. అసూయా ద్వేషాలకు గురియైన విజయనగర పాలకులు, విదేశీయుల సహాయంతో సాటి పాలకులను అణచివేయడానికి చూడటం, దానికి కూడా మోసపూరిత విధానాలు అవలంబించడం శోచనీయం. యుద్ధం గెలిచిన ఆనందం ఒకరోజైనా పొందకుండానే శత్రు శేషం చేతిలో విజయరామరాజు మృతి చెందడం దురదృష్టం.
ప్రజలంతా ఓడిపోయిన బొబ్బిలి వంశస్తుల వీరగాధను కొనియాడారు కానీ గెలిచిన విజయరామరాజు గొప్పదనాన్ని కీర్తించలేదు.” ముగించాడు గోవిందరాజులు.
“వీరులైన వారి శౌర్య ప్రతాపాలు కీర్తించబడతాయి కానీ మోసాలు, కుట్రలు శ్లాఘనీయం కాదు కదా” అన్నాడు మల్లిఖార్జున.
“భోజనాల వేళ కావస్తోంది. ఇంకా యుద్ధం లోనే ఉంటారా? కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి వచ్చేదేమైనా ఉందా?” కేకేసింది వరదరాజులు తల్లి నాంచారమ్మ.
“ఇదిగో వచ్చే వచ్చే” భార్యకు చెప్తూ “పదండిరా… నువ్వు కూడా భోజనానికి రా మల్లిఖార్జున” చెప్పాడు గోవిందరాజులు.
“అయితే భోజనం అయ్యాక నాకు పలనాటి యుద్ధం కూడా వివరిస్తారా?” అడిగాడు మల్లిఖార్జున.
“తప్పకుండా నాయనా” చెప్పాడు గోవిందరాజులు.
ముగ్గురూ భోజనానికి లేచారు. దోసకాయ పప్పు, మెంతి వంకాయ కూర, చిలగడ దుంపల పచ్చడి, ధనియాల కారం, ముక్కల పులుసు, దొండ ఒరుగులు, గుమ్మడి వడియాలు, చల్లమిరపకాయలు, అన్నం విస్తరినిండా వడ్డించింది నాంచారమ్మ. రుచికరమైన పదార్ధాలు విస్తరి నిండా ఉన్నా, నాలుకకు తగిలిన రుచి మనసుకు ఎక్కడం లేదు మల్లిఖార్జునకు.
“ఏమిటి ఆలోచిస్తున్నావు మల్లిఖార్జున? భోజనం వేళ పరధ్యానం తగదు సుమా” హెచ్చరించాడు గోవిందరాజులు.
“నాన్నగారూ, సాటి పాళెగాళ్లను ఓడించడానికి విజయనగర పాలకులు విదేశీయులతో చేతులు కలపడం మల్లిఖార్జునకు నచ్చలేదులా ఉంది. అదే ఆలోచిస్తున్నాడు. కదూ మల్లిఖార్జున…” అడిగాడు వరదరాజులు.
“సరిగ్గా చెప్పావు వరదా! అన్యాయంగా సంపాదించింది ఆయువు తీసింది. పరాయి వారితో పొత్తు ప్రాణాంతక మయ్యింది.” అన్నాడు మల్లికార్జున.
“లేదు మల్లిఖార్జున. విజయనగర పాలకులు అవసరానికి ఫ్రెంచి సేనానితో ఒడంబడిక చేసుకున్నా, తర్వాత కాలంలో ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని అంగీకరించక వారితో యుద్ధం చేశారు. అదే పద్మనాభ యుద్ధం. అది కూడా చరిత్రలో నిలిచిపోయిన యుద్ధమే.” చెప్పారు గోవిందరాజులు.
“బొబ్బిలి యుద్ధం జరిగిన దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలకు పద్మనాభ యుద్ధం 1794, జూలై 10న విశాఖపట్నం జిల్లా, పద్మనాభం వద్ద జరిగింది. ఈ యుద్ధం మద్రాసు గవర్నరు జాన్ ఆండ్రూస్ తరఫున వచ్చిన బ్రిటిషు కల్నల్ పెందర్గాస్ట్ కు విజయనగర రాజులకూ మధ్య జరిగింది. యుద్ధములో చిన్న విజయరామరాజు మరణించాడు. యుద్ధ పర్యవసానంగా విజయనగరం పూర్తిగా బ్రిటిషు పాలనలోకి వచ్చింది.” చెప్పారు గోవిందరాజులు.
“నాన్నగారు భోజనం పూర్తి చేశాక ఆ విశేషాలు వివరిద్దురు కాని, ముందు భోజనం చేద్దాం. ఆహారం స్వీకరించేటపుడు శ్రద్ధగా, భక్తిగా స్వీకరించక పోతే ఒంటికెక్కదని మా గురువుగారు చెప్పారు” చెప్పాడు వరదరాజులు.
“సరే సరే. ముందు భోజనం కానీయండి.” అన్నాడు గోవిందరాజులు.
త్వర త్వరగా భోజనాలు ముగించారు. తినడమే ఆలస్యం, పుస్తకాల జాబితా దగ్గరకు పరుగెత్తి వచ్చాడు మల్లిఖార్జున. యుద్ధ పుస్తకాల జాబితాలో పద్మనాభ యుద్ధం గురించిన పుస్తక వివరాల కోసం వెతికాడు. ఛట్రాతి లక్ష్మీ నరస కవి రచించిన ఏకాశ్వాస ప్రబంధం ‘పద్మనాభయుద్దం’ కనిపించింది.
“గురువు గారూ… మీ దగ్గర పద్మనాభయుద్దం పుస్తకం కూడా ఉంది.” అన్నాడు సంబరంగా.
“ఏమిటీ నన్ను గురువుగారు అంటున్నావు?” అడిగారు గోవిందరాజులు.
“మనకు తెలియని విషయం ఎవరు చెప్పినా వారిని గురువుగా భావించాలని మా గురువుగారు చెప్పేరండి” చెప్పేడు మల్లిఖార్జున.
“అవును. ప్రకృతిని మించిన గురువు లేదు. మనుషులే కాదు మొక్కలు, చెట్లు, పూలు, పండ్లు, జంతువులు, పక్షులు, కీటకాలు, నదులు, పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు ఇలా ప్రతీ ఒక్కరి నుంచి మనం నేర్చుకోవచ్చు.” చెప్పారు గోవిందరాజులు.
“సరే గురువు గారు, పద్మనాభయుద్దం విశేషాలు చెప్పండి” అడిగాడు మల్లిఖార్జున.
“సరే విను.” చెప్పడం ప్రారంభించారాయన.
“1768 నాటికి గంజాం గిరిజన ప్రాంతంలో పర్లాకిమిడి, మొహిరి, గుంసూరు, ప్రతాపగిరి మొదలైన 20 మంది జమీందారులు ఉండేవారు. వారి ఆధీనంలో 34 కోటలు, ఇంచుమించు 35,000 సైన్యం ఉండేది. వీరిలో ఎక్కువమంది ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసారు. వీరిలో కొందరికి కొండలకు ఎగువనున్న మన్యం ప్రాంతంలో కోటలు ఉండేవి. అందువలన ఓడిపోయిన జమిందారులు ఈ కోటలలో తలదాచుకుని తిరుగుబాటును కొనసాగించేవారు.
విజయనగర రాజు ఆనంద గజపతిరాజు మరణం తరువాత చిన విజయరామరాజు జమీందారయ్యాడు. అతడు బాలుడు కావడం వలన సవతి తల్లి కుమారుడైన సీతారామరాజు దివానుగా నియమించబడ్డాడు. చిన విజయరామరాజుకు యుక్త వయసు రాగానే సీతారామరాజును దివాన్ పదవి నుండి తొలగించాడు. అందుకు ఆగ్రహించిన దివాన్ ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.
1759-68 మధ్య కాలంలో విజయరామరాజు గంజాం, విశాఖపట్నం ప్రాంతాలలోని అనేక మంది జమీందారులను ఓడించి వారిని కారాగారంలో బంధించి, వారి భూముల్ని ఆక్రమించి నిరంకుశంగా పాలించసాగాడు.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.