Menu Close
నిర్మలాదిత్య
కథ వెనుక కథ
నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్)

నోబెల్ బహుమతి గ్రహీత గేబ్రియల్ మార్క్వజ్ గార్సియ వ్రాసిన పుస్తకాల గురించి, ముఖ్యంగా ఆయనకు బాగా పేరు తెచ్చిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్’ గురించి విన్నా, ఆ పుస్తకం 2022 వరకు కానీ చదవలేదు. చదివిన తరువాత ఎందుకింత ఆలస్యం చేశానని బాధపడిన పుస్తకాలలో ఇది ఒకటి.

​అంతవరకు కథలు వ్రాస్తున్నప్పుడు తరువాత ఏమి వ్రాయాలని అప్పుడప్పుడు ఆలోచించడం ఉండేది. గార్సియ రచనలు ఒక్కసారి నా ఆలోచనలకు సంకెళ్ళు తెంపేసాయి. మన సాహిత్యంలో మన జీవన విధానంలో ఉన్న మ్యాజిక్‌ను గుర్తుకు తెప్పించాయి. మన జానపద కథలలో ఉన్న పరకాయ ప్రవేశాలు, జంతువులు, పిశాచాలు, దెయ్యాలు, ప్రేతాలు మాట్లాడడం, మళ్ళీ నమ్మేలా, అలాంటి ఊహాలోకాలలో విహరింపజేసేలా చేశాయి. నేను చిన్నప్పుడు మా ఊళ్లకు వెళ్లినప్పుడు గ్రామ దేవతలకు కోరికల కోసం కోళ్లను, గొర్రెలను బలి ఇవ్వడం, మన పొరుగువారు, ఆత్మలు ఆవహించి, పిచ్చిగా మాట్లాడడం, చేతబడి గురించి చెవులు కొరుక్కోవడం ఆశ్చర్యపడే విశేషాలు కావు. వాటిపై నమ్మకం ఉన్న జనమే ఎక్కువ.

​అలానే 2015 సంవత్సరంలో దాదాపు తొమ్మిది నెలలు, నేను క్యాన్సర్ చికిత్సలో గడిపి బయటపడడం నా ఆలోచనలలో బాగా మార్పులు తెచ్చాయి. జీవితం గురించి, జీవిత కాలం, మరణం గురించి ఆలోచించడం ఆపలేకపోయాను. అందులోనుంచి వచ్చిన ప్రశ్నలే మన జీవిత కాలం ఎంత ఉండాలి? మన జీవిత పరమావధి ఏమిటి? దానికి మన జీవిత కాలం సరిపోతుందా? రచయితగా ఒక సౌలభ్యముంది - అలాంటి ప్రశ్నలకు జవాబులు కథల ద్వారా వెతుక్కోవచ్చు.

​కథలు వ్రాసేటప్పుడు ఆలోచనలననుసరించి, చాలా సమయం రీసెర్చ్ చేసిన తరువాత కానీ కాగితం మీద కలం/కీ బోర్డ్ మీద వేళ్ళు పెట్టను. అలా ఈ కథకు  రీసెర్చ్ చేస్తుంటే అమెరికాలో ఉన్న చెట్ల గురించి చదవడం జరిగింది. చూసిన మనుషులు, ప్రదేశాల మీద కథ వ్రాయడం మామూలే. అనూహ్యంగా ఈ కథ వ్రాసిన తరువాత కథలోని ప్రదేశాలను వెతికి, పనిగట్టుకుని చూసి రావడం జరిగింది. అది చాలు, ఒక మంచి కథ వ్రాశాను అని వ్యక్తిగతంగా సంతృప్తి చెందడానికి. నా ఆలోచనలకు కొత్త ప్రపంచాలు ఆవిష్కరించిన కథలలో మొదటి కథ ఇదే.

గార్సియ తరహా మ్యాజిక్ రియలిజం కథ అని అనుకోవచ్చు. ఆయన స్ఫూర్తిని కాదనను. కానీ ఆలోచిస్తే నాకు ఇది ఒక ‘గోయింగ్ బ్యాక్ టు రూట్స్’ కథే అనిపిస్తుంది. మన కథాసాంప్రదాయ వృక్ష వేర్ల అంతు చూడటం అసాధ్యం. అది అనంతమే.

డీయసైడ్*

Deicide

"దేవుడుని చూద్దాం, రా," అన్నాను నేను వడివేలు తో.

​"ఏం వేళాకోళంగా ఉందా? నిన్న రాత్రి ఏదో పార్టీకి అని వెళ్లినట్లున్నావు. మత్తు ఇంకా దిగలేదా? అయినా నాకు ఛాయిస్ ఉండి ఏడ్చిందా? నువ్వెక్కడ తీసుకెళ్తే అక్కడికి పోవాల్సిందే కదా," అన్నాడు వడివేలు, మరో చెట్టు మొదలు వాసన చూస్తూ.

​"మత్తులో కాదు. నిజంగానే చెప్తున్నాను. నా దేవుని దగ్గరికి తీసుకెళ్తాను," అన్నాను నేను.

​"దేవుని దగ్గరికి తీసుకెళ్తావా? ఏమైనా సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయా కొంపదీసి. కావాలంటే నువ్వు ఆత్మహత్య చేసుకొని నీ దేవుడిని కలువు. అంతే కానీ, అదేదో ఈజిప్ట్ ఫారో చక్రవర్తుల్లాగా నన్ను కూడా చంపి నీ వెంట తీసుకొని పోకు," అన్నాడు వడివేలు.

​"ఛా, చచ్చి బ్రతికాను. నీకు తెలుసు కదా? చావు ఎందుకు కోరుకుంటాను. నిజంగానే నా దేవుడిని నువ్వు కూడా చూడవచ్చు.. నా దేవుడు సజీవి. నీతో మాట్లాడగలుగుతాడో లేదో తెలీదు కానీ, నాతో మాత్రం చక్కగా మాట్లాడతాడు" అన్నాను నేను.

​నా మాటల ప్రభావం వడివేలు మీద ఎంత ఉందో తెలీదు. వాడు వాసనలు చూడడం ఆపి తన కార్యక్రమం ముగించేసుకున్నాడు. వెంటనే పూప్ బ్యాగ్ తీసి క్లీన్ చేసి ఆ బ్యాగ్ అక్కడే చెట్టుకు దగ్గర ఉన్న డిస్పోజల్ ట్రాష్‌లో వేశాను.

​"దేవుడు! బ్రతికి ఉన్న దేవుడే? నమ్మకం కలగడం లేదు?" అన్నాడు వడివేలు. వాడి కంఠంలో కాలకృత్యం అయిపోయిన కులాసా ధ్వనిస్తున్నది. ఇదివరకు వెటకారం లేదు.

​"బ్రతికి ఉన్న దేవుడే. 'వైద్యో నారాయణో హరిః'. ఆ దేవుడి వల్లే నేను ఈ రోజు ఇలా జీవంతో ఉన్నాను," అన్నాను నేను.

​"ఓవ్, వావ్, ఓవ్… నీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావా? అలాంటి దేవుళ్లను చాలానే చూశాను.. నాకేమీ చూడాలని ఇంట్రెస్ట్  లేదు," అన్నాడు వడివేలు.

​"డాక్టర్ కాదు. నిజంగా దేవుడే. నీకు అర్థం కాదేమో అని ఆ కోట్ చెప్పాను," అన్నాను నేను.

​"ఆ చివరి వాక్యం అవసరమా? నీకు నా తెలివిపై ఎప్పుడూ చులకన చూపే," నిష్ఠూరంగా అన్నాడు వడివేలు.

​"సరే, నీకు నా దేవుడు ఎలా దేవుడు అన్న సందేహం వచ్చినట్లు ఉంది. మానవులలో మతం పుట్టింది దాదాపు 3500 ఏళ్ల క్రితం అనుకుందాం. ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న చాలా మతాల వయస్సు ఆ సంఖ్య కంటే తక్కువే. మతంతో పాటు దేవుళ్లు పుట్టుకొచ్చారు. అలా అనుకుంటే, నా దేవుని వయస్సు 3500 ఏళ్ల పైచిలుకే  ఉంటుంది. మనకు తెలిసిన దేవుళ్లు నాకు తెలిసిన దేవుని తరువాత పుట్టిన వారే," అన్నాను నేను.

​"మరి నీ దేవుడు, నీకు మాత్రమే ఎలా తెలుసు?" అన్నాడు వడివేలు.

​"ఈ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతానని భయపడిన తరువాత కానీ, నేను నా దేవుడిని గుర్తుపట్టలేదు.. ఆ దేవుడి అనుగ్రహం, సానుభూతి వల్లే నా జీవిత కాలం మరికొంత పెరిగింది," అన్నాను నేను.

​"ఎంత పెరిగిందేమిటి? ఇంకా ఎన్ని ఏళ్లు బ్రతకాలని నీ ఉద్దేశం?"

​"నిన్నో, మొన్నో పోవాల్సిన వాడిని. కనీసం మరో ఇరవై ఏళ్లైనా దక్కినట్లే కదా?" అన్నాను నేను.

​కిషోర్ కుమార్ చెట్లు పుట్లతో మాట్లాడతాడని విని తెగ నవ్వుకున్నాను లోకంతో పాటు. కానీ పోయిన సంవత్సరం నాకు క్యాన్సర్ అని తెలిసిన తరువాత, ఉన్నట్టుండి నేనూ ఓ పాటలు పాడని కిషోర్ కుమార్ అయిపోయాను. మనుషులతో నా సంభాషణలు ఆగిపోయి, కొత్త స్నేహితులతో కబుర్లు వేసుకోవడం మొదలెట్టాను. ఇదిగో మా వడివేలుతో మాట్లాడినట్లే. నేను అందరితో మాట్లాడినా, అవన్నీ విని తలలూపినా, నాకు బదులిచ్చి మాట్లాడే వారు ఇద్దరే.

​ఒకటి వడివేలు. ఐదేళ్ల క్రితం షెల్టర్ నుండి సీత పట్టుకొచ్చింది తోడు ఉంటాడని. వాడి కింది నాలుగు పళ్లు ముందుకు పొడుచుకొచ్చి, వాడు మూతి మూసినా పళ్లు బయటికే ఉంటాయి. వాడి నవ్వొచ్చే ముఖం చూసి, మేమే వడివేలు అని పేరు పెట్టాము. వాడితో మాట్లాడడం మొదలెట్టాక, వాడికి వడివేలు కామెడీ కంటే, రవితేజ వెటకారమే ఎక్కువని తెలిసింది. మంచి తెలివైన వాడే. మనుషులు ఏడేళ్లలో నేర్చే విషయం ఒక్క సంవత్సరంలో పట్టేస్తాడు.

​రెండవ వాడు మా కమ్యూనిటీకి కొద్దిగా దూరంగా కొలనుకు అటువైపు ఉన్న అడవిలో ఉంటాడు. పొడవు 160 అడుగుల పైనే ఉంటుంది. ఉన్న చోటే ఉంటాడు. ఎక్కడికీ కదలడు. తన వయస్సు ఓ 3500 ఏళ్లు పైబడేనని రుజువులున్నాయి. తనే, నా దేవుడు, పేరు ' సెనేటర్ '. అసలు నా దేవుడికి పేరు మీద పట్టింపు లేదు. తన జీవిత కాలంలో తనని కొన్ని వేల పేర్లతో పిలిచారు, పిలిచిన వారంతా వారు పెట్టిన పేర్లతో పాటు చచ్చి ఊరుకున్నారు. తను మాత్రం అలానే నిలబడి ఉన్నాడు.

​ఇదిగో ఇప్పుడు వడివేలును తీసుకొని సెనేటర్ దగ్గరకే పోవాలనే నా ప్రయత్నం. నా ఆపరేషన్ తరువాత తిరిగి మొదటిసారి సెనేటర్ ను కలవడం ఇదే. సెనేటర్‌తో మాట్లాడడం అదో గొప్ప అనుభవం. తన జీవితానుభవాలు పంచుకోవడంతో నాకు గత ప్రపంచ చరిత్ర తెలుస్తుంది, నా సమస్యలకు జవాబులు దొరుకుతాయి. అవి నాకు తెగ నచ్చుతాయి, ఊరట కలిగిస్తాయి. నన్ను అప్పుడే సగం చనిపోయిన వాడిలాగా చేసి నాతో మాట్లాడడానికి కూడా సంకోచించి, నన్ను యాక్టివ్‌గా తప్పించుకొని తిరుగుతున్న వారితో పోలిస్తే ఎంత తేడా. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. సెనేటర్ కదలలేడు, నన్ను తప్పించుకొని పారిపోలేడు కదా! అందుకే నేను, తను కనరాని దూరంలో జరిగిన విషయాలు, అక్కడి దృశ్యాలు వర్ణిస్తే ఆసక్తిగా వింటాడు. అటువైపు వచ్చే పక్షులు, చేపలు, మొసళ్లు, మరిన్ని జీవాలు కూడా సెనేటర్‌తో కబుర్లు చెప్పడం వల్ల, నేను చెప్పిన విషయాలు తనకు అదివరకే తెలుసని నా అనుమానం. కానీ గుడ్ లిజనర్స్ తెలిసిన విషయాలు వింటున్నా, మళ్లీ అదే ఆసక్తితో వింటారని విన్నాను. సెనేటర్ విషయంలో అది నిజమై ఉండాలి. మరిన్ని ఏళ్లు, ఇన్ని విషయాలు కని, విని, ఎదిగిన జీవి, భగవంతుడు కాక ఎవడై ఉంటాడు?

​"ఇరవై ఏళ్లా?" గట్టిగా నవ్వాడు వడివేలు, "అంటే ఇకమీదట నీదో కుక్క బతుకేనన్నమాట. నువ్వో? నేనో? ఎవరు ముందు పోతామో తెలియదు."

​"కుక్క బతుకా? నేనీ కొత్త జీవితంలో ఎన్నో సాధించదలచుకున్నాను. నాది కుక్క బతుకెట్లవుతుంది? మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది," అన్నాను, నాది మానవ జన్మ అన్న కొంత గర్వంతో, వడివేలును చూస్తూ.

​"అంటే నీ ఉద్దేశం ఏమిటి? నా లైఫ్‌కు తక్కువేమీ? సమయానికి తిండి వేస్తారు. అప్పుడప్పుడు ట్రీట్స్ ఇస్తారు. మంచి షాంపూతో స్నానం చేయిస్తారు. అంతెందుకు రోజుకు రెండుసార్లు నన్ను నడిపించి, నా ముడ్డి కూడా కూడా వైప్స్ తో  శుభ్రంగా తుడుస్తారు. రాజులాగా ఉంది నా బ్రతుకు," అన్నాడు వడివేలు.

​అరె ఈ యాంగిల్ నాకు తట్టలేదే అని ఆశ్చర్యపోయి, బింకంగా "అయినా బెల్ట్ నీ మెడకేసి నిన్ను లాక్కుపోతుంటాను. నీవు రాజువు అని ఎలా అనుకుంటావు? నీది మా ఇంట్లో ఓ కుక్క బతుకే కదా," అన్నాను.

​"నువ్వు గమనించలేదనుకుంటాను. నువ్వు ఆ ఫోన్లో ఏదో గెలుకుతూ నేనెటువైపు లాక్కెళ్తే అటువైపే బెల్ట్ పట్టుకొని వస్తావు. నేనే నీకు బెల్ట్ వేసి లాక్కెళ్తున్న ఫీలింగ్ నాకు. నేనే నిన్ను, నీ ఫ్యామిలీని చూసుకుంటూ, కాపాడుతున్నట్లు ఉంది. నేను హ్యాపీగా ఉన్నాను. నీవే ఏదో పోగొట్టుకొని వెతుకుతున్నట్లు ముఖం పెడతావు. భరించలేకపోతున్నా, ముఖం మార్చి నాలాగా హ్యాపీగా ఉండు," అన్నాడు వడివేలు.

​"నీకు క్యాన్సర్ అంటే తెలిసినట్లు లేదు. చనిపోవడానికి ఆస్కారం ఉంది అని డాక్టర్లే అన్నప్పుడు, నా ముఖం సంతోషంగా ఎలా పెడతాననుకున్నావు?" అన్నాను.

​"అవుతుందో, కాదో అన్న అంతులేని ప్రశ్నలతో, భవిష్యత్తులో ఎందుకు జీవిస్తావు? నీవేదో సాధించాలనుకుంటున్నావు. నీకదేంటో తెలియదు. ప్రస్తుతం లో, నాలా నివసించి చూడు. ఆనందంగా ఉంటావు. అయినా నీకు చెప్పి లాభమేముంది? కుక్క సలహాలు ఎవరింటారులే అని తోసిపుచ్చేవాడివి. నువ్వు నన్ను ఓ కుక్కలా చూస్తే, నువ్వు నాకొక మనిషివే. మనిషంటే, మాకేం పెద్ద గొప్ప అభిప్రాయం లేదు," అన్నాడు వడివేలు ముందు వేగంగా అడుగులు వేస్తూ, బెల్ట్‌తో లాగుతూ, నన్ను ఇంకొంచెం వేగంగా కదలమంటూ.

​వీడి మాట, ప్రవర్తన విపరీతమే. కానీ వాడి వెటకారం వెనుక అపరిమితమైన ప్రేమ ఉందని నాకు తెలుసు. వాడి మాటలు కొట్టిపారేస్తూ,

"సెనేటర్ దగ్గరకు పోదాం రా. తనే నాకు బోలెడంత ధైర్యం ఇచ్చింది, నాకు గమ్యం తెలిపింది. ఒకసారి కలిస్తే, నీకు అర్థమవుతుంది," అన్నాను.

​"నీవు ఆ కొలనుకు అటువైపు చూస్తూ ఏదో గొణుగుతుంటే, డిప్రెషన్‌లోకి పోయావనుకున్నాను. నీవు అవతలి గట్టు జీవాలతో మాట్లాడుతున్నావా? అయినా నేను నా సంతోషం, గమ్యం వెతికే అవసరం లేదు. ఇప్పటికే నేను సంతోషంగా ఉన్నాను. నాకు దీనికి మించి గమ్యాలేవీ లేవు" అన్నాడు వడివేలు.

​"ఓహ్ నువ్వు నాకు డిప్రెషన్ అనుకున్నావా? పొరపాటు. నేను సెనేటర్‌తో మాట్లాడేవాడిని. తన 3500 ఏళ్ల పైబడ్డ జీవితం నుంచి అంతులేని జ్ఞానం సంపాదించేశాడు. వాటి సారంతో అతను చెప్పిన మాటల వల్లే నాకు చావు అంటే భయం పోయింది. సర్జరీకి సంతోషంగా వెళ్లాను. నువ్వొక్కసారి కలిస్తే నీ జీవితం కూడా మారిపోతుంది," అన్నాను నేను.

​"నీకింకా అర్థమైనట్లు లేదు. జీవితం మార్చుకునే ఉద్దేశం నాకు లేదు. మరే కోరికలూ లేవు. కాబట్టి నాకు నీ దేవుడి అవసరం లేదు. ఇంతకీ నీ దేవుడు నీకిచ్చిన సందేశం నువ్వు సంతోషంగా ఉండడానికే కదా," అన్నాడు వడివేలు.

​"అలాంటి ఓదార్పే అనుకో. కాదంటే తనతో ఉన్నప్పుడు, నేనే ప్రపంచం, ప్రపంచమే నేనన్న గొప్ప అనుభూతి కలిగేది. అన్నట్టు తను, నేనేదో సాధించాలంటే, నీలా వెటకారంతో మాట్లాడేవాడు కాదు," అన్నాను నేను.

​"నేను వెటకారం చేస్తానని ఒకటే బాధపడిపోతావు. కానీ ఆ వెటకారం వెనుక ఎంత ఆర్ద్రత ఉందో నీకు తెలిసినట్లు లేదు. అయినా నువ్వు, సెనేటర్ ఇలా అన్యోన్యంగా, సంతోషంగా ఉండడం, నాకూ సంతోషమే," అన్నాడు వడివేలు.

​"నువ్వనుకున్నంత సఖ్యం లేదులే. రోజూ సెనేటర్ దగ్గరకు వెళ్లినప్పుడు నాకున్న చిన్న జీవిత కాలం గుర్తుకు వచ్చి వాపోయేవాడిని. ఆ సమయంలో నాకు, సెనేటర్‌కి ఉన్న వేల ఏళ్ల జీవితం పైన అసూయ తరచూ బయటపడేది," అన్నాను నేను.

​"మరి సెనేటర్ రియాక్షన్ ఏమిటి?" అన్నాడు వడివేలు ఫైర్ హైడ్రెంట్ మొదలు వాసన చూసి పాస్ పోస్తూ.

​"సెనేటర్‌కు పరిమితమైన జీవిత కాలాలు ఉన్న మానవులు, జంతువులు, పక్షులు, చెట్లు చేమలు బాగా పరిచితమే. చీమల చావు పుట్టుకలు మనం పట్టించుకోనట్లు, సెనేటర్ కూడా ఎవరి చావు, పుట్టుకలు పట్టించుకోడు. ​నేనే చొరవ చేసుకొని పలకరించకపోతే, తనూ నన్ను పట్టించుకునేవాడు కాదు. నా బాధ సెనేటర్‌తో చెప్పుకోవాలనిపించింది. 'నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, నేను మరో 20 ఏళ్లు బ్రతుకుతాననుకున్నాను, ఇలా అవాంతరం వచ్చిందే' అని బాధపడ్డాను. ఓపికగా నాతో మాట్లాడి, నాకు ఊరట కలిగించాడు," అన్నాను నేను.

​"నేనూ నీకు ఊరట కలగడానికే కదా, నీకు నవ్వు, కోపం తెప్పిస్తూ, మాటలు చెప్తుంటాను. నేను చెప్పని విషయాలు నీకు ఆ దేవుడు ఏమి చెప్పాడో?" అడిగాడు వడివేలు.

​"నీ మాటలకు, తన మాటలకు ఓ తేడా ఉంది. తను చాలా కథలు తన జీవితానుభవం నుంచే చెప్పేవాడు. అన్ని కథలలోనూ నాకు బాగా గుర్తుండిపోయిన కథలు, తన ఆత్మకథలే. తన వెయ్యేళ్ల పైబడ్డ జీవితంలో తను చూసిన ప్రకృతి ప్రళయాలు వర్ణిస్తుంటే ఒళ్లు గగుర్పాటు కలిగేది. హరికేన్‌ల వల్ల తన పక్కనున్న చెట్లు, జంతువులు చనిపోవడం, అదీ ఒకసారి కాదు మళ్లీ, మళ్లీ చూడడం అతని దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. తను చాలాసార్లు అన్నాడు, ఏదో పెద్ద అనుకోని ఉపద్రవం వస్తే, తనలాంటి వారు కూడా కుప్పకూలిపోతారు అని. జనన మరణాలు ప్రకృతి ధర్మం. అది ఒకసారి అర్థమయింది అంటే, చావంటే భయం పోతుందని చెప్పేవాడు. ఆ మాటలు విని, విని, నాకు భయం పోయింది. ఆపరేషన్‌కు సంతోషంగానే బయలుదేరాను," అన్నాను నేను.

​"ఆపరేషన్ అంటే గుర్తుకు వచ్చింది. నువ్వు పోయినసారి నన్ను వదిలిన డాగ్ కీపర్ దరిద్రంగా ఉన్నాడు. మాటలు బాగా చెప్తాడు కానీ, నాతో పాటు మరో నాలుగు కుక్కలను చూసుకున్నాడు. మా నలుగురికీ సరిపడేంత స్థలం లేదు. ఒకటే వాసన కూడా వాడి ఇంట్లో. నువ్వు మంచి రేటింగ్ ఇవ్వాలని, నీకు ప్రతి గంటకూ నాదో ఫోటో ఒకటి పంపించినా, వాడు మమ్మల్ని సరిగా చూసుకోలేదు. మరోసారి అవసరం పడితే, వాడి దగ్గర వదలకు. ఇక, నీ ఆపరేషన్ ఎలా జరిగిందో చెప్పు," అన్నాడు వడివేలు, వడివడిగా అడుగులు వేస్తూ.

​"రోవర్‌లో వాడి రేటింగ్స్ బాగానే ఉన్నాయే. సరే నువ్వు చెప్పావుగా వాడి దగ్గరకు మళ్లీ పంపించను.

​ఇక ఆపరేషన్ అంటావా, సర్జన్ మంచి పేరున్నవాడు. అన్నీ అనుకున్నట్లే సవ్యంగా జరిగాయి. ఆపరేషన్ తరువాత నా క్యాన్సర్ పూర్తిగా పోయిందని రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఆ హాస్పిటల్ నచ్చలేదు," అన్నాను.

​"ఎందుకు? పేరుందనే కదా నీవు అక్కడికి పోయింది," అడిగాడు వడివేలు.

​"పేరుండటమే సమస్య. చాలామంది నావంటి వారు అక్కడ నయం చేసుకోవడానికి పోవడంతో, డాక్టర్లను చూడడమూ, సర్జరీలు చేయించుకోవడానికి బాగా టైమ్ తీసుకుంటోంది. నాకు మొదటి అపాయింట్‌మెంట్ మూడు నెలలకు కానీ దొరకలేదు. ఆపరేషన్‌కు మరో మూడు నెలలు పట్టింది," అన్నాను నేను.

​"అవును అప్పుడు నన్ను తరచూ రోవర్ వాళ్ల దగ్గర పంపించేసేవారు. మీ కోసం ఎదురుచూపులతో నా దినాలు గడిచిపోయేవి," తీవ్ర అసంతృప్తితో అన్నాడు వడివేలు.

​"ఇక్కడి నుంచి ఓ నాలుగు గంటల పైనే ప్రయాణం. హాస్పిటల్‌లో ఆలస్యమైతే, అక్కడే హోటల్‌లో ఉండి మరుసటి రోజు బయలుదేరేవాళ్లం.

​అందుకే, మరో ఆసుపత్రి తెరిస్తే మంచిదని సలహా ఇచ్చాను. నాలాగా ఈ ఊర్లోనే ఉన్నవారు, వందల మైళ్లు ప్రయాణం చేయాల్సిన పని లేదు. అలాంటి పేరున్న స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ కూడా తెరవవచ్చు. మేయో క్లినిక్ అలా అక్కడక్కడ ఓపెన్ చేశారుగా అని ఓ ఉదాహరణ కూడా ఇచ్చాను," అని వడివేలుతో అన్నాను.

​అలా చెప్తుండగా, ఎదురుగా మా పొరుగువారు, వాళ్ల కుక్కతో ఎదురొచ్చారు. వడివేలును చూసి వాడు మొరగడం, వడివేలు వాడిని చూసి మొరగడం, రచ్చ రచ్చ అయ్యింది.

​"ఏంటి అరుపులు," అన్నాను, విసుగుతో వడివేలును దూరంగా తీసుకెళ్తూ.

​'నీ కంఠంలోని విసుగు నాకు అస్సలు పడదు… ఏదో పొరుగువాడితో మాట్లాడుతున్నాను కదా, సరిగా మాట్లాడనివ్వవు కూడా..' అంటూ వడివేలు గొణగడం విన్నాను. ​వడివేలు ఉన్నట్టుండి ముభావంగా అయిపోయాడు.

​అదిగో ఆ మలుపు తిరిగితే కొలను, కొలనుకు అటువైపు గట్టు మీద నా సన్నిహితుడు, దేవుడు సెనేటర్. చెప్పాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి. వేగంగా మలుపు వైపు అడుగులు వేశాను.

​వడివేలు ఎందుకనో నా వెనుకబడ్డాడు. కోపం వచ్చిందనుకుంటా. నేనే వాడిని నాతోపాటు వేగంగా నడవమని బెల్ట్‌తో లాగాల్సి వస్తోంది. ​మలుపు తిరిగిన వెంటనే మతి కోల్పోయాను. మెదడు మొద్దుబారిపోయింది. ​వడివేలు అంటున్న మాటలు కలలోలా లీలగా వినిపిస్తున్నాయి.

​"ఇందాక మన పొరుగువాళ్ల కుక్క చెప్తూనే ఉంది. నీ దేవుడున్న ఆవలి గట్టునంతా గత వారమే చదును చేసేశారట. ఏదో కొత్త హాస్పిటల్ కడతారట…"

***

(* డీయసైడ్(Deicide) = దేవుడి హత్య)

సెనేటర్: లాంగ్ పార్క్, ఫ్లోరిడా లో ఉన్న 3500 ఏళ్ల పై వయసున్న బాల్డ్ సైప్రస్ చెట్టు. 2012 లో ఓ మెత్ అడిక్ట్ తన మందు కోసం అంటించిన నిప్పు అదుపు తప్పడంతో కాలిపోయి, శిధిలంగా మిగిలిన దేవుడు.)

- మధురవాణి, 2023

********

Posted in October 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *