Menu Close

కదంబం - సాహిత్యకుసుమం

మగువ మనసు
- 'ఉదయశ్రీ' యు.సి.ఓబులేశు గౌడు -

కవుల కల్పనలకేం?

కన్నులు చారెడు చేసి
బుగ్గల సిగ్గులు పూసి
కురుల మేఘఛాయ పోసి
విరులు సిగలో తురిమేసి
మెడలో బంగరు నగలేసి
పట్టు రవికను కట్టేసి
చెంగావి చీరను చుట్టేసి
నడుమున ఒడ్డాణం పట్టేసి
నుదుట కుంకుమ పెట్టేసి
కాళ్లకు వెండి పట్టీలేసి
వయ్యారిలా నడిపించి
వనమయూరిని చేస్తారు
ఆ బ్రహ్మకైనా చేతగాని
అందాల పోత పోస్తారు
నా ఒంటికణువణువునా
పరిమళాల పూత పూస్తారు

అంతేగానీ.. ఎప్పుడైననూ,

నా సున్నితమైన మదిని
ఆ మదిలో భావాలనీ
ఆ భావాలలో ఆశలను
ఆ ఆశల వెనక తపనను
నా తత్వాన్ని వ్యక్తిత్వాన్ని
నా హృదయ సౌందర్యాన్ని
ఆవిష్కరించిన వారెవరు
అక్షర రూపమిచ్చిందెవరు
ఎంతైనా మగబుద్ధే కదా!
తమ కన్నుల విందుకే
తాము కోరే పసందుకే
కల్ల కవితలు అల్లుతారు
డొల్ల మమతలు చల్లుతారు

Posted in October 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *