నీలాద్రి నారాయణి దంపతులు విడాకులకు అర్జీ పెట్టుకుని ఆరోజుకి ఎనిమిది నెలలైంది. వారికి ఇద్దరు పిల్లలు, మొదట ఆడపిల్ల, మేఘన, ఆరు సంవత్సరాలు. రెండవసారి మగపిల్లవాడు, వరుణ్, నాలుగేళ్ళవాడు.
ఎంత కలిసి ఉంటున్నా, ఇదివరకటిలా అమ్మానాన్నా సరదాగా మాట్లాడుకోక పోవడం, ఏదైనా మాట్లాడుకోవలసి వచ్చినా, తననో లేదా తమ్ముడినో సంభోదిస్తూ మాటలు జరపడం గమనించింది మేఘన. అలా ఎందుకో తెలియకపోయినా ఇద్దరి మధ్యనా ఏదో జరుగుతోందని అర్థమైంది దాని పసిమనసుకి.
“నాన్న ఎందుకలా ఉంటున్నారు?” అమాయకంగా అడిగింది తల్లిని ఒకరోజు.
‘ఆడపిల్లలు చెప్పకపోయినా ఎంత త్వరగా అన్నీ గ్రహిస్తారో! వారికి చిన్నవయసులోనే మానసిక పరిపక్వత వచ్చేస్తుందేమో?’ దీర్ఘంగా నిట్టూర్చి, “ఏమీ లేదమ్మా, ఆఫీసు పనితో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది, అందుకని మూడీగా ఉంటున్నారంతే. నువ్వు పోయి ఆడుకో తమ్ముడితో. టిఫిన్ అవగానే పిలుస్తాను,” కూతురిని పంపేసింది.
“ఊ...” అని వెళుతున్న కూతురి ముఖకవళికలు చెప్పాయి నారాయణికి, ఆ సమాధానం దాన్ని తృప్తిపరచలేదని.
‘అది ఇంకా చిన్నపిల్ల. పరిస్థితులను అర్థం చేసుకునేంత వయసు దానికి లేదు. విడాకులంటే అర్థం కూడా తెలియని ఆ పసిదానికి ఏమని చెప్పాలి? మరో నాలుగు నెలల్లో అమ్మానాన్నా విడిపోబోతున్నారనీ, తనూ తమ్ముడూ, తల్లితోనో లేదా తండ్రితోనో వేరువేరుగా ఉండాల్సి వస్తుందనీ, ఎలా చెప్పాలి?’ దీర్ఘంగా నిట్టూర్చింది.
“మా ఫ్రెండ్స్ ఎంచక్కా అన్ని ఊళ్ళూ చూస్తున్నారు. మనమూ వెళదాం,” గోముగా తండ్రిని అడిగింది మేఘన, ఒకరోజు.
“నేనూ వస్తాను నాన్నా,” ముద్దుగా పలికాడు వరుణ్.
‘మరో నాలుగు నెలల తరువాత ఎవరికి ఎవరమో, ఆలోగా పిల్లల కోర్కె తీరిస్తే పోయేదేముంది?’ భార్యవైపు సాలోచనగా చూసి, “అలాగే తప్పక వెళదాం. మీరు వెళ్ళి, మరి మీకు కావలసినవన్నీ సర్దుకోండి,” ఇద్దర్నీ ముద్దుపెట్టుకుని పంపేసాడు.
“నారాయణీ, పిల్లలు అడిగింది విన్నావుగా, నువ్వేమంటావు?”
“వెళదాము,” ముక్తసరిగా బదులిచ్చింది.
అంతే, ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నట్లుగా, విశాఖపట్నం, అరకులోయ తిరిగిరావడానికి చకచకా ఏర్పాట్లు చేసేసాడు నీలాద్రి.
పదిరోజులు పిల్లలతో విహారయాత్ర ముగించుకుని ఆరోజే ఊళ్ళో దిగారు నీలాద్రి దంపతులు. ఇంటి తాళం తీస్తూ భార్యవైపు చూసాడు, పిల్లలిద్దరూ యాత్రా విశేషాలు ముచ్చటిస్తుంటే ఉత్సాహంగా వింటోంది.
------
మధ్యతరగతి కుంటుంబానికి చెందిన నీలాద్రి ముక్కోపి. కోపం వచ్చిందంటే ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఆ సమయంలో తన మాటలు ఎదుటివారి హృదయాలను గాయపరుస్తాయేమోననే విచక్షణ కోల్పోతాడు. అయితే అతని కోపం క్షణికమే, అది చల్లారగానే తన ప్రవర్తనకి ఎంతో బాధపడతాడు. అతని ఆ తత్త్వంవలన ఎందరితోనో విరోధం తెచ్చుకున్నాడు.
పెళ్ళైన కొద్దిరోజులకే భర్త స్వభావం అర్థం చేసుకున్న నారాయణి, నాటినుంచీ నలుగురిలో చాలా ఇబ్బందులని ఎదుర్కుంటూ వస్తోంది.
“ఏమండీ, చిన్నచిన్న విషయాలకి కూడా మీకసలు అంతకోపం ఎందుకు వస్తుంది? మీకు సంబంధంలేని విషయాల్లో కూడా ఎందుకు తలదూరుస్తారు? మీ స్వభావం మార్చుకోండి. కోపం తగ్గించుకునే ప్రయత్నం చేయండీ,” పిల్లలు పసివాళ్ళుగా ఉన్నప్పుడే ఎన్నో విధాల చెప్పి చూసింది.
“నువ్వేం నాకు చెప్పక్కరలేదు. ఏం చేయాలో నాకు తెలుసులే,” అంటూ కసురుకున్నాడు.
‘ఆ క్షణిక కోపం తప్ప, నీలాద్రి ఎంతో మంచివారు. నాకూ, పిల్లలకీ ఏలోటు రానీయకుండా, ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడైతే మేఘన, వరుణ్ ఇంకా చిన్నవాళ్ళు. కొంతలోకొంత అదృష్టం ఏమిటంటే ఇప్పటివరకూ తండ్రి కోపాన్ని రుచిచూడలేదు వాళ్ళు. కానీ ఏదో ఒకరోజు అది జరగక తప్పదు. ఆరోజు, నాన్న ఎందుకలా ఉంటారో అర్థం చేసుకోలేక, మథనపడతారు. భయం భయంగా పెరుగుతారు,’ అనుకుని నిట్టూర్చింది నారాయణి.
------
‘తామిద్దరూ కలిసి ఉండేది ఇంక కొన్నిరోజులే, అయినా నారాయణిలో ఇసుమంత బాధ కూడా ఉన్నట్లు లేదు. తమ మధ్య జరుగుతున్నదేది పిల్లలకి తెలియదు. అందుకే వాళ్ళు అంత సంతోషంగా ఉండగలుగుతున్నారు. ఇంట్లో వాతావరణం మేఘనకి కొంత అర్థమైనట్లే అనిపిస్తున్నది అది వేసే ప్రశ్నలతో,’ అనుకున్నాడు.
ఊరికి వెళ్ళేముందు, పేపర్ వేయొద్దని చెప్పకపోవడంవల్ల, తలుపు వెనక పేపర్లు కుప్పగా పడున్నాయి.
నారాయణి కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళింది.
“మేఘనా, ఆ పేపర్లు ప్రక్కకి నెట్టేయమ్మా,” కూతురికి చెప్పి, బయటనుంచి సామాను తేవడానికి వెళ్ళాడు.
అంతలోనే, "నాన్నా," అంటూ మేఘన అరుపు విని, చేతిలో సామానుతో వేగంగా పరుగెత్తి వచ్చాడు.
"ఏమైందమ్మా? ఎందుకలా కేక పెట్టావు? ఇంటికి రాగానే అల్లరి మొదలు పెట్టేసావా?" అన్నాడు కోపంగా.
"అదికాదు నాన్నా, ఇదిగో ఈ పేపర్లో చూడండి ఎవరున్నారో?” అంటూ పేపర్ తండ్రికి అందించింది.
“ఓ! అందుకా అంతలా అరిచావు, నేనింకా ఏమైందోనని భయపడ్డాననుకో. సరే చూస్తాలేగానీ, ముందు సామాను సర్దనీ,” అంటూ లోపలికి వెళ్లాడు.
“కాదు నాన్నా ఇప్పుడే చూడాలి. ఈ అంకుల్ మీ ఫ్రెండ్ కదా?” తండ్రి వెనకాలే వెళుతూ అడిగింది.
“నా ఫ్రెండా?” గబుక్కున పేపర్ అందుకుని చూసాడు.
అందులో తన సహోద్యోగి రాజన్ ఫొటో ఉంది. ప్రక్కనే మరో ఫొటోలో అతని భార్య, కూతురు రక్తపు మడుగులో పడున్నారు.
“అంకుల్ పక్కనే ఫొటోలో ఆంటీ, కీర్తన ఎందుకలా పడుకున్నారు? వాళ్ళ చుట్టూ అలా గీత గీసారెందుకూ?” అమాయకంగా అడిగింది మేఘన.
గబుక్కున పేపర్ వెనక్కి పెట్టేసి, “ఏమీ లేదమ్మా. వాళ్ళకి దెబ్బలు తగిలినట్లున్నాయి, అంతే. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు,” మేఘనని పంపేసి, పేపర్ తీసుకుని గబగబా చదివాడు...
బ్యాంకు ఉద్యోగి అయిన రాజన్, భార్యనీ, కూతుర్నీ దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్నాడు. రాజన్ త్రాగుడు వ్యసనం వల్ల, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి, కొద్దిరోజుల క్రితమే విడాకులు మంజూరై విడిపోయారనీ, కూతుర్ని చూడనివ్వడంలేదని భార్యపై కక్షగట్టాడనీ, ఆ ఆవేశంలో అతనే వాళ్ళని హత్య చేసుంటాడనీ పోలీసుల కథనం...
ఆ వార్త చదవగానే కరెంట్ షాక్ కొట్టినట్లై, గభాలున పేపర్ దూరంగా విసిరేసి, తలపట్టుకుని సోఫాలో కూలబడ్దాడు. అవ్యక్తమైన భయంతో నీలాద్రి ఒళ్ళు జలదరించింది.
మేఘన తల్లి దగ్గరికి వెళ్ళి, “అమ్మా, నా ఫ్రెండ్ కీర్తన ఫొటో పేపర్లో వచ్చిందమ్మా,” అంది ఉత్సాహంగా.
“ఓ! అవునా, ఇంకా ఏముంది?” అంతే ఉత్సాహం తానూ చూపించింది నారాయణి.
“కీర్తన, వాళ్ళమ్మ నేలపై పడుకుని ఉన్నారు, వాళ్ళ చుట్టూ గీత గీసారు. నాన్ననడిగితే ఏమీ చెప్పలేదు?”
మేఘన చెప్తున్నదేంటో అర్థంకాక, “ఇదిగో తమ్ముడిని కాస్త ఆడిస్తూ ఉండు, నేను వచ్చి పాలు కలిపి ఇస్తాను,” అని హాల్లోకి వెళ్ళింది.
అక్కడ భర్త తలపట్టుకుని కూర్చుని ఉండడం కనిపించింది. అటూఇటూ చూసింది. దూరంగా, విసిరేసినట్లుగా చిందరవందరగాపడున్న పేపర్ చేతిలోకి తీసుకుని, అందులో మొదటి పేజీలో, మేఘన చెప్పిన వార్త చదివి కొయ్యబారిపోయింది.
ఆరోజంతా భార్యాభర్తలిద్దరూ, పిల్లల కబుర్లు వింటూ, యాంత్రికంగా ఆ... ఊ... అంటూ బదులిస్తూ, అన్యమనస్కంగానే ఉన్నారు.
రాత్రి భోజనాలయ్యాక పిల్లలు నిద్రపోయారు. నీలాద్రి, నారాయణి ఎవరిగదుల్లో వారు పడుకున్నారన్న మాటేగానీ ఎంతకీ కునుకన్నది వారి దరికి రాలేదు. ఎవరికోసమూ ఆగనంటూ కాలచక్రం ముందుకు కదిలింది...
రోజులు గడిచినా, నారాయణిని మాత్రం ఆరోజు పేపర్లో చూసిన వార్త, నీడలా వెంటాడుతూనే ఉంది. ‘ఆ తల్లీకూతుర్ల ముఖాలే పదే పదే గుర్తుకువస్తున్నాయి. ఎంత అన్యాయం? అలా నిర్దాక్షిణ్యంగా భార్యనీ, కూతుర్నీ చంపటానికి అతనికి మనసెలా వచ్చిందో? వారి మధ్య గొడవలుంటే, వాటిని ఏదో విధంగా పరిష్కరించుకోవాలి, అంతే కానీ ఇదేం విపరీతం?’ అనుకోగానే, ‘మరి నువ్వు చేయబోతున్నదేమిటి?’ అని ఎవరో గదిమి అడిగినట్లై అటూఇటూ చూసింది...
మళ్ళీ... ‘మరి నువ్వు చేయదలుచుకున్నదేమిటి? నువ్వు కూడా నీలాద్రినుండి విడాకులు తీసుకోబోతున్నావుగా? అతనికి నువ్వన్నా పిల్లలన్నా ఎంత ప్రేమో నీకు తెలియదా? కానీ అతని కోపంవల్ల జీవితంలో ఎన్నో కష్టాలనీ అవమానాలనీ ఎదుర్కోవలసి వస్తోందనీ, అతనికి నచ్చచెప్పటానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయనీ, ఇక భరించడం నీవల్ల కాదనీ, పిల్లల సంక్షేమం కోరి అతనినుంచి విడిపోవటానికే నిశ్చయించుకున్నావు, దానికేమంటావు?’ అంటూ అదే స్వరం ప్రశ్నించింది. ఆ స్వరం తనలోంచే వస్తున్నదని, తన అంతరాత్మే తననలా ప్రశ్నిస్తున్నదని అర్థంచేసుకున్న నారాయణి ఆలోచనలో పడింది.
‘దంపతులు భార్యాభర్తలుగా విడిపోవచ్చుగాని తల్లిదండ్రులుగా విడిపోకూడదు. దాని పర్యవసానంగా అభంశుభం తెలియని పిల్లలు బలయ్యే అవకాశం ఉంది,’ అని ఎక్కడో చదివింది. అది ఎంత నిజం అనిపిస్తోంది ఆ వార్త చదివాక!
‘భవిష్యత్తులో తమ విడాకుల తరువాత, ఆ కోపంతో నీలాద్రి పిల్లలకేమైనా హాని తలపెడితే తాను భరించగలదా? పిల్లలు లేకుండా జీవించగలదా? ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే, ప్రయత్నించి నీలాద్రిని మార్చుకోవటానికి ప్రయత్నిస్తాను. అది కష్టసాధ్యమైనా అసంభవమేమీ కాదేమో? పిల్లల సంక్షేమం కోసమే విడిపోదామని అనుకుంటున్నప్పటికీ, పిల్లలకి తండ్రి కావాలి. నీలాద్రికీ పిల్లలు కావాలి. కారణమేదైనా తండ్రినుంచి పిల్లలని వేరు చేయడం భావ్యం కాదు. వాళ్ళ కోసమైనా మరొక్క అవకాశం, మా బంధానికి ఇచ్చి చూస్తాను,’ అనుకుంది.
అటు నీలాద్రి కూడా ఆ వార్త గురించే ఆలోచిస్తున్నాడు...
‘రాజన్ అంత దారుణానికి ఎలా ఒడిగట్టగలిగాడు? ఏదైనా, ఈ త్రాగుడు మహా చెడ్డవ్యసనం,’ అనుకోగానే వీపుపైన చర్నాకోలతో ఎవరో గట్టిగా కొట్టినట్లై, అప్రయత్నంగా ‘అమ్మా’ అన్నాడు. ఎవరు కొట్టారోనని, చుట్టుప్రక్కల చూడగా, ఎదురుగా అద్దంలో తన ప్రతిబింబమే కనిపించేటప్పటికి ఉలిక్కిపడ్డాడు... ‘త్రాగుడు వ్యసనమైతే మరి నాకొచ్చే పిచ్చికోపం? అది మాత్రం వ్యసనం కాదా? నా ప్రవర్తనవల్ల, పాపం నారాయణికి నలుగురిలో ఎన్నోసార్లు ఎంతో అవమానం జరిగింది. అయినా తను మాత్రం ఏమి కోరుకుంటోంది? నా కోపం తగ్గించుకోమనేగా? ఎన్నోవిధాల చెప్పింది, ఎన్నో మార్గాలు చూపింది, యోగా చేయమంది, థెరపీ తీసుకోమంది... అయినా నేను వింటేగా? మూర్ఖంగా ఆమె మాటలు కొట్టిపడేసి పెద్ద తప్పే చేసాను. నాతో వేగలేకే విడాకులు కోరుకుంది. నేనన్నా, పిల్లల్లన్నా ప్రాణం పెట్టే నారాయణి కోసం ఆ మాత్రం చేయలేనా? తల్లిదండ్రుల మధ్య గొడవల కారణంగా, పిల్లల పైన ప్రేమ, సమయం గడిచేకొద్దీ ద్వేషంగా మారుతుందనడానికి రాజన్ జీవితమే ఉదాహరణ. మా విషయంలో కూడా అలా జరిగితే? అమ్మో! ఆలోచించటానికే భయంగా ఉంది. ఎలాగైనా నారాయణితో ఇంకొకసారి మాట్లాడి చూస్తా’ ననుకున్నాడు.
------
ఆరోజు, విహారయాత్రలో, నారాయణి, నీలాద్రి పిల్లలిద్దరి చేతులూ చెరోవైపూ పట్టుకుని ఆనందంగా అరకులోయ అందాలను ఆస్వాదిస్తూ తిరుగుతున్నారు. అక్కడే ఒక పెద్ద రావిచెట్టుకి రెండు ఉయ్యాలలు వేసున్నాయి. పిల్లలు వాటిలో ఊగుతుంటే కొద్దిదూరంలో నిలబడి చూస్తున్నారు ఇద్దరూ. ఇంతలో భూప్రకంపనలు మొదలై, భూమి ఎక్కడికక్కడ పెళ్లలుగా విడిపోసాగింది. ఉయ్యాలలు కట్టి ఉన్న రావిచెట్టు, పిల్లలతో సహా ఫెళఫెళలాడుతూ లోయలోకి పడిపోతుంటే, వాళ్ళు ‘అమ్మా’, ‘నాన్నా’ అంటూ ఆక్రందనలు చేస్తున్నారు. లిప్తకాలంలో జరిగిన సంఘటన నీలాద్రి, నారాయణిల మతులు పోగొట్టింది.
పిచ్చివాళ్ళల్లాగా, “బాబూ, పాపా,” అంటూ అరుస్తున్నారు...
------
“తల్లీ మేఘనా! బాబూ వరుణ్!” అనే ఆర్తనాదాలు వినిపించి, నారాయణి ఉలిక్కిపడి లేచి, ఒక్క పరుగున భర్త గదిలోకి వచ్చి చూడగా, మంచంపైనుంచి క్రిందపడి, పిచ్చిగా నేలని తడుముతూ, పిల్లల్ని పిలుస్తూ ఏడుస్తున్న భర్త కనిపించాడు.
గబుక్కున దగ్గరకు వెళ్ళి, “ఏమండీ, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? లేవండీ,” అంది పొర్లి వస్తున్న దుఃఖాన్ని పంటిబిగువున అదిమిపెడుతూ.
భార్య స్పర్శతో తెలివిలోకి వచ్చి, గబుక్కున లేచి కూర్చుని, ఆమెను గాఢంగా కౌగలించుకుని, “నన్ను క్షమించు నారాయణి. నువ్వు చెప్పినట్టల్లా వింటాను. ఏం చేయమన్నా చేస్తాను. నా కోపం తగ్గించుకుంటాను. నా ప్రవర్తన మార్చుకుంటాను. కానీ నన్ను వదిలి మాత్రం వెళ్ళకు. పిల్లల్ని నాకు దూరం చేయకు. నాకు మీరు కావాలి. మీరు లేని జీవితం ఊహించలేను,” ఏడుస్తూ బ్రతిమిలాడాడు.
‘ఈయనకేదో పీడకల వచ్చినట్లుంది. ఇందాక నాకూ ఇలాగే భయంకరమైన పీడకల వచ్చింది. అందులో మామధ్య భూమి బ్రదలై పిల్లలు మానుంచి దూరమైపోతున్నట్లుగా కనిపించింది. హూ... కారణమేదైనా, ఎవరైనా, పిల్లల కోసమే అయినా కూడా, ఒకరితో ఒకరం సర్దుకుపోవాలనే ఆలోచన ఇద్దరికీ ఒకేసారి కలగడం ఒకవిధంగా మంచికేనేమో!’ అనుకుని భర్తని గాఢంగా అల్లుకుపోతూ, “మీరు కూడా నన్ను క్షమించాలి,” అంది ధారాపాతంగా ప్రవహిస్తున్న కన్నీళ్ళని లెక్కచేయకుండా.
తేలికైన ఇరుహృదయాలు పరస్పర గాఢపరిష్వంగంలో సేదదీరాయి.